శబరిమల వివాదం: రగులుతున్న కేరళ.. సీఎం విజయన్‌పై విరుచుకుపడుతున్న బీజేపీ, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వివాదం హింసాత్మకంగా మలుపు తిరగడంతో కేరళ స్తంభించిపోయింది.
శబరిమల కర్మ సమితి, పాలక సీపీఎం మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో 54 ఏళ్ల వ్యక్తి చనిపోయిన కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
బుధవారం బిందు అమ్మిని(40), కనకదుర్గ(39) అనే ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత పండలంలో రెండు పక్షాల మద్దతుదారుల మధ్య జరిగిన రాళ్ల దాడిలో చంద్రన్ ఉన్నిథాన్ గాయపడ్డారు. ఆయన బుధవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
అదుపులోకి తీసుకొన్న వ్యక్తులను దర్యాప్తు పూర్తయిన తర్వాత అరెస్టు చేస్తామని పథనంతిట్ట జిల్లా పోలీసు ఉన్నతాధికారి టి.నారాయణన్ బీబీసీతో చెప్పారు.
మృతుడు శబరిమల కర్మ సమితి మద్దతుదారేనా, కాదా అన్నది తాము ఇంకా నిర్ధరించాల్సి ఉందని ఆయన తెలిపారు.
ఆ ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లిన తర్వాత కేరళలోని వివిధ హిందూ సంస్థలతో కూడిన శబరిమల కర్మ సమితి మద్దతుదారులు వేల మంది రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఇవి హింసాత్మకంగా మారాయి.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ జనతా పార్టీ మద్దతున్న శబరిమల కర్మ సమితి గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. ఈ రోజును కాంగ్రెస్ పార్టీ 'బ్లాక్ డే'గా పాటిస్తోంది.
ఆరోగ్య సేవలు, పాల సరఫరా వంటి అత్యవసరమైనవి తప్ప కేరళవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. బంద్ నుంచి శబరిమల యాత్రికులకు కూడా మినహాయింపు ఇచ్చారు.
హింస, తీవ్రస్థాయి ఆందోళనలు జరుగుతాయోమోననే ఆందోళనతో కేరళ, తమిళనాడు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నిలిపివేశాయి.
తమిళనాడు ప్రభుత్వ బస్సులను కేరళ సరిహద్దు వద్ద శబరిమల కర్మ సమితి మద్దతుదారులు అడ్డుకొన్నారు.
బుధవారం నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించి ఎంత మందిని అరెస్టు చేశామనేది ఇంకా తేలాల్సి ఉందని రాజధాని తిరువనంతపురంలోని పోలీసు ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి చెప్పారు.

ఫొటో సోర్స్, CV LENIN
జర్నలిస్టులపై దాడులు
బంద్ సందర్భంగా జర్నలిస్టులపై దాడులు జరిగాయన్న వార్తల నేపథ్యంలో కేరళ డీజీపీ లోక్‌నాథ్ బెహరా .. దాడులకు పాల్పడిన వారెవరో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
''జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ దాడుల వెనుక కుట్ర కోణం ఉందా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తాం'' అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
మరోవైపు.. త్రిసూర్ రూరల్ పోలీస్ పరిధిలో ఒక ఫుడ్‌కోర్టు వద్ద బీజేపీ, ఎస్‌డీపీఐ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. అయితే వారికేమీ ప్రమాదం లేదని త్రిసూర్ రూరల్ ఎస్పీ ఎంకే పుష్కరన్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, A.S Satish/BBC
ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంలో సహకరించినందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
''ఆ ఇద్దరు మహిళలు భక్తులుగానే ఆలయంలోకి వెళ్లారు. వాళ్లేం ప్రభుత్వ అధికారులుగా లోపలకు ప్రవేశించలేదు. ఆలయంలో ప్రార్థన చేసుకొనేందుకు భక్తులందరికీ అవకాశం కల్పించడం ప్రభుత్వం బాధ్యత'' అని విజయన్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళ ప్రభుత్వం సమర్థిస్తూ వస్తోంది. తీర్పు అమలుకు కావాల్సిన భద్రతను కల్పిస్తామని సీఎం విజయన్ చెబుతూ వస్తున్నారు.
అయితే, సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ హిందూ విలువలపై దాడిగా ఆరోపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శబరిమల వివాదం అంతకంతకూ రాజుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
- ‘సుప్రీంకోర్టు చెప్పినా సరే... 50 ఏళ్లు దాటాకే శబరిమలలో అడుగుపెడతాం’
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- చైనా - తైవాన్: ఎందుకు విడిపోయాయి.. వివాదం ఎప్పుడు మొదలైంది?
- ‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
- మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- శబరిమల: వందల మంది పోలీసులు.. ఇద్దరు మహిళలు.. ఆలయంలోకి ప్రవేశించకుండానే వెనక్కి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








