కోవిడ్-19: ఆక్సిజన్ పంపిణీ కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు - News Reel

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అవసరాలను మదింపు చేసి, అన్ని ప్రాంతాలకు అవసరమైన విధంగా పంపిణీ జరిగేలా చూసేందుకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది.

టాస్క్ ఫోర్స్ తన ప్రతిపాదనలను, విధి విధానాలను ప్రకటించేంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ పంపిణీలో ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని ధర్మాసనం సూచించింది.

ఆక్సిజన్ కేటాయింపుల గురించి టాస్క్ ఫోర్స్ తన ప్రతిపాదనలను పంపిన తరువాత తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రకటించింది. టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు తన ప్రతిపాదనలను కోర్టుకు సమర్పిస్తుందని కూడా ధర్మాసనం వివరించింది. అత్యవసరంగా పరిష్కరించాల్సిన ఈ సమస్యపై టాస్క్ ఫోర్స్ వెంటనే పని ప్రారంభించాలని కూడా ఆదేశించింది.

ఆక్సిజన్ అవసరం ఉన్న ప్రతి ఆస్పత్రికి, ప్రతి వ్యక్తికి అది సక్రమంగా అందేలా చేయడమే ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు లక్ష్యమని, ఆక్సిజన్ పంపిణీలో ఎక్కడ ఆటంకాలు ఎదురవుతున్నాయో గుర్తించి, వాటిని పరిష్కరించాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

నేషనల్ టాస్క్ ఫోర్స్‌లోని 12 మంది సభ్యులు:

1. డాక్టర్ బాబాతోశ్ బిశ్వాస్, మాజీ వైస్ చాన్స్‌లర్, వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్

2. డాక్టర్ దేవేందర్ సింగ్ రాణా, చైర్ పర్సన్, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్, సర్ గంగారామ్ హాస్పిటల్, దిల్లీ

3. డాక్టర్ దేవి ప్రసాద్ షెట్టి, చైర్ పర్సన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నారాయణ హెల్త్ కేర్, బెంగళూరు

4. డాక్టర్ గగన్ దీప్ కాంగ్, ప్రొఫెసర్, క్రిస్టియన్ మెడికల్ కాలేజి, వెల్లూర్, తమిళనాడు

5. డాక్టర్ జేవీ పీటర్, డైరెక్టర్, క్రిస్టియన్ మెడికల్ కాలేజి, వెల్లూర్, తమిళనాడు

6. డాక్టర్ నరేశ్ ట్రెహాన్, చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్, మేదాంత హాస్పిటల్, గురుగ్రామ్

7. డాక్టర్ రాహుల్ పండిత్, డైరెక్టర్, క్రిటికల్ కేర్ మెడిసిన్, ఐసీయూ, ఫోర్టిస్ హాస్పిటల్, ముంబయి

8. డాక్టర్ సౌమిత్ర రావత్, చైర్మన్ & హెడ్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగం, సర్ గంగారామ్ హాస్పిటల్, దిల్లీ

9. డాక్టర్ శివకుమార్ సరీన్, సీనియర్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెపటాలజీ,ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్స్, దిల్లీ

10. డాక్టర్ జరీర్ ఎఫ్ ఉడ్వాదియా, కన్సల్టెంట్ చెస్ట్ ఫిజీషిన్, హిందూజా హాస్పిటల్, బ్రీచ్ క్యాండీ హాస్పిటల్, ముంబయి

11. కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

12. నేషనల్ టాస్క్ ఫోర్స్ కన్వీనర్‌, కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ. టాస్క్ ఫోర్స్‌లో సభ్యుడుగానూ ఉంటారు. అవసరమైనప్పుడు అడిషనల్ సెక్రటరీ స్థాయి కన్నా పైన ఉన్న అధికారిని తన తరఫున డిప్యూటీగా నియమించుకోవచ్చు.

line

కడప: ముగ్గు రాళ్ల గనిలో జిలెటిన్‌ స్టిక్స్‌ పేలి 10 మంది కూలీలు మృతి

జిలెటిన్‌ స్టిక్స్‌ పేలి కడప జిల్లాలో ఏడుగురు మృతి

ఫొటో సోర్స్, UGC

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గని దగ్గర సంభవించిన పేలుడులో 10 మంది మృతి చెందారు.

ఇక్కడున్న ముగ్గు రాళ్ల గనిలో రాళ్లను పగలగొట్టేందుకు జిలెటెన్ స్టిక్స్ వాడుతుంటారు. గనిలోని ముగ్గురాళ్లను పేల్చేందుకు బయట నుంచి గని దగ్గరకు వాహనంలో తెచ్చిన జిలెటెన్ స్టిక్స్‌ను దింపుతుండగా ప్రమాదవశాత్తు అవి బ్లాస్ట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని పోరుమామిళ్ల సీఐ మోహన్ రెడ్డి మీడియాతో చెప్పారు.

పేలుడు భారీగా జరిగిందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే పేలుడు జరిగే సమయంలో క్వారీలో 30 నుంచి 35 మంది ఉన్నారు. వీరిలో కొందరు గని రాళ్ల మధ్య చిక్కుకుని ఉండే అవకాశం ఉండొచ్చు. జిలెటెన్ స్టిక్స్ పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలైయ్యాయి. చనిపోయిన వారంతా రోజుకూలీలే. వీరంతా కలసపాడు మండలంలోని గంగాయపల్లె, పులివెందుల వాసులుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మరోవైపు భారీ పేలుడు శబ్దానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భూకంపం అనుకుని భయపడి ఇళ్లల్లోంచి పరుగులు తీశారు.

క్వారీలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు కారణాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులను ఆదుకోవాలని, ఎల్.జీ పాలిమర్స్ బాధితులకు ఎలాంటి పరిహారం ఇచ్చారో వీరికీ అలాంటి పరిహారమే అందించాలని డిమాండ్ చేశారు. కరోనా పరిస్థితుల్లో, కర్ఫ్యూ సమయంలో మైనింగ్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)