పాకిస్తాన్ గూఢచారుల వాట్సాప్ గ్రూప్‌లో భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు... ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

వాట్సాప్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ గూఢచారులున్న వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నారంటూ నలుగురు ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. వారిపై ఆర్మీ చర్యలు కూడా తీసుకుంది. దీనిపై వారు సుప్రీంకోర్టు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తమ గోప్యత హక్కును కాపాడాలంటూ ఈ నలుగురు అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై త్వరలో రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు అధికారుల తరపు న్యాయవాది తెలిపారు.

ఈ కేసుపై జరిపిన విచారణలో, ఈ నలుగురు మిలిటరీ అధికారులు గుర్తు తెలియని విదేశీ వ్యక్తులు ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ వాట్సాప్ గ్రూప్‌లో అనైతిక ప్రవర్తన (లైంగిక దుష్ప్రవర్తన) జరిగినట్లు కూడా తేలింది. దీంతో వారిని ఆర్మీ నుంచి సస్పెండ్ చేశారు.

ఆర్మీ

ఫొటో సోర్స్, Getty Images

కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారులు

ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఈ నలుగురు అధికారులలో ముగ్గురు కల్నల్ స్థాయి వారు కాగా, ఒకరు లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి.

మాజీ కల్నల్ అమిత్ కుమార్ వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన ఈ కేసులో సస్పెండ్ అయిన అధికారుల తరపున వాదిస్తున్నారు. తన క్లయింట్‌ల గోప్యత, విధి విధానాలు పాటించలేదంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆయన ఆరోపణలు చేశారు.

"జులై 14 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలపై నేను త్వరలో రివ్యూ పిటిషన్ వేయబోతున్నాను" అని అమిత్ కుమార్ అన్నారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, REUTERS/ADNAN ABIDI

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు

అప్పీల్‌కు దరఖాస్తు

భారత రాజ్యాంగం ప్రకారం భారత దేశంలోని ఇతర పౌరులు అనుభవిస్తున్న ప్రాథమిక హక్కులు తమకు కూడా ఉన్నాయని సస్పెన్షన్‌కు గురైన ఆర్మీ అధికారులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వాదించారు.

"ఆర్మీ చట్టంలోని సెక్షన్ 50 (బి)పై వివరణకు సంబంధించి ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాం. ఈ కేసులో అన్ని రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉంది'' అని న్యాయవాది అమిత్ కుమార్ అన్నారు.

సైనిక విచారణలో తమ గోప్యత హక్కును ఉల్లంఘించారని అధికారులు తమ పిటిషన్‌లో ఆరోపించారు.

విచారణలో ఉండగానే, ఈ నలుగురు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే, తమ నలుగురిలో ఎవరూ పాకిస్తాన్ గూఢచారితో సంభాషణలు జరిపినట్లుగా ఆధారాలు లేవని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్టు ఏం చెప్పింది

ఆ వాట్సాప్ గ్రూప్‌లో పాకిస్తాన్ గూఢచారి ఎవరైనా ఉన్నారా లేదా అనేది తమకు తెలియదని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో..''సస్పెండ్‌కు గురైన ఆర్మీ అధికారులు సమర్పించిన పిటిషన్లను మేం స్వీకరించడం లేదు. కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ కొనసాగుతున్నప్పుడు, వారిని సస్పెండ్ చేయడానికి ముందే వారి వాదనలను వినాల్సి ఉంటుంది. అయితే, 349 నిబంధన ప్రకారం ఆ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ పూర్తయ్యేలోపు కూడా పిటిషనర్లను సస్పెండ్ చేయవచ్చు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పినట్లుగా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు జరిగింది. విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో పిటిషనర్‌లు ఎలాంటి ఉపశమనానికి అర్హులు కాదు" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

"పిటిషనర్లపై కేసును చట్టం ప్రకారం, ఆర్మీ చట్టం విధివిధానాల ప్రకారం పరిష్కరించాల్సి ఉంది. అందువల్ల ఈ పిటిషన్ ప్రస్తుతానికి కొట్టివేస్తున్నాం" అని కోర్టు పేర్కొంది.

వీడియో క్యాప్షన్, ఆర్మీలో చేరకపోతే ఈ దేశాల్లో జైల్లో పెడతారు

కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ

అయితే, ''కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ప్రారంభానికి ముందే, బోర్డు సేకరించినట్లుగా చెబుతున్న సాక్ష్యాల ఆధారంగా అధికారులను అక్రమంగా సస్పెండ్ చేశారు'' అని న్యాయవాది అమిత్ కుమార్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

ఈ నలుగురు అధికారుల మొబైల్ ఫోన్లు, డేటాను ఆర్మీ అధికారులు అనధికారికంగా స్వాధీనం చేసుకున్నారని, వారి వ్యక్తిగత సంభాషణలను వారి ఇమేజ్ దెబ్బతీసేందుకు ఉపయోగించారని అమిత్ కుమార్ అన్నారు. ఈ అధికారులు రెండు దశాబ్దాలకు పైగా దేశానికి సేవ చేశారని అన్నారు. ''వారు నిజంగా దోషులని తేలితే ఉరితీయాలి'' అన్నారు అమిత్ కుమార్.

ఇండియన్ ఆర్మీ-ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండియన్ ఆర్మీ-ప్రతీకాత్మక చిత్రం

అరెస్ట్ లేదా నిర్బంధం?

అదే సమయంలో, ఈ నలుగురు అధికారులను ఇంకా అరెస్టు చేయలేదని, ఆర్మీ చట్టం, ఇతర చట్టాల ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు.

ఈ నలుగురు అధికారుల ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి లభించిన ప్రైవేట్ సంభాషణలు, ఇతర డేటాను బహిర్గతం చేయరాదని అమిత్ కుమార్ సుప్రీంకోర్టును కోరారు.

తమను 65 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారని, అలాంటి కేసుల్లో నిర్బంధించిన 48 గంటల్లోగా ఛార్జిషీట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అధికారులు పేర్కొన్నారు.

ఎలాంటి విచారణ, కేసులు లేకుండానే ఇలా సస్పెండ్ చేయడం భారత ఆర్మీ చరిత్రలో ఇదే తొలిసారని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, సికింద్రాబాద్ స్టేషన్‌లో ‘అగ్నిపథ్’ విధ్వంసం.. రైళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)