ఏ మేఘాల వల్ల వాన కురుస్తుంది... ఏవి ప్రమాదకరం?

మేఘం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

వర్షాకాలంలో ఆకాశం వైపు చూస్తే- గుర్రపు తోకల్లా, డీప్ ఫ్రిడ్జ్‌లోని చిన్న చిన్న ఐస్ క్రిస్టల్స్‌లా, పాలు పొంగినప్పుడు గిన్నెపై ఏర్పడే నురగలా రకరకాల ఆకారాల్లో మేఘాలు కనిపిస్తుంటాయి.

అయితే, ఈ మేఘం అంత తొందరగా వర్షించేలా లేదు... ఈ లోపు ఆఫీసుకు వెళ్లిపోవచ్చేమో? నల్ల మబ్బులు కమ్ముకున్నాయి.. పొలానికి పొవాలా వద్దా? అదేదో తేలిపోయే రకం మబ్బులా ఉందే? ఇలాంటి సందేహాలు చాలా మందికే వస్తుంటాయి.

ఈ ప్రశ్నలకు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వాతావరణ, సముద్ర గర్భ అధ్యయన విభాగం ప్రొఫెసర్ పి. సునీత సమాధానాలు ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే...

ప్రొఫెసర్ పి. సునీత
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ పి. సునీత

మేఘాలు ఎలా ఏర్పడతాయి?

గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు నీటి ఆవిరితో ఉన్న గాలి పరమాణువుల బరువు తగ్గి అంటే తేలికై... అది పైకి వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్లి...అక్కడ అది చల్లబడుతుంది. అప్పుడు దానిలో నిల్వ అయిన నీరు క్రమంగా ఘన స్థితిలోకి మారుతుంది. అవే మనకి నీటి బిందువులు లేదా క్రిస్టల్స్ ఆకారంలో కనిపిస్తాయి. ఇలాంటి బిందువులు అనేకం ఒకదానికొకటి కలిసి ఏర్పడేవే మేఘాలు.

ఇలా ఏర్పడే మేఘాలపై అనేక అంశాల ప్రభావం ఉంటుంది. వీటి రంగు, ఎత్తు, ఆకారం, పరిమాణం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని వీటిని కొన్ని రకాలుగా వర్గీకరిస్తాం. ఇందులో మేఘం ఎలా కనిపిస్తుంది? వర్టికల్‌గా ఎలా డెవలప్ అవుతుంది? అనే అంశాలను ప్రధానంగా తీసుకుని లో లెవెల్ క్లౌడ్స్, మీడియం లెవెల్ క్లౌడ్స్, హై లెవెల్ క్లౌడ్స్ అని అంటాం.

భూమి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల వద్ద (లో లెవెల్) వద్ద ఏర్పడే మేఘాలను స్ట్రాటస్ క్లౌడ్స్ అని అంటాం. వీటిలో నింబోస్ట్రాటస్, స్ట్రాటోక్యుములస్, స్ట్రాటా అనే రకాల మేఘాలుంటాయి.

అక్కడి నుంచి 6 కిలోమీటర్ల మధ్య (మీడియం లెవెల్) ఏర్పడే వాటిని ఆల్టో క్లౌడ్స్ అని పిలుస్తాం. ఇందులో హై స్ట్రాటస్, ఆల్టోక్యుములస్ మేఘాలు ఉంటాయి. అక్కడ నుంచి దాదాపు 12 కిలోమీటర్ల వరకు (హై లెవెల్) ఏర్పడే వాటిని సిర్రస్ క్లౌడ్స్ అని అంటాం. వీటిలో సిరస్, సిర్రోక్యుములస్, సిరో స్ట్రాటస్ మేఘాలుంటాయి. అలాగే ఆకాశంలో అకస్మాత్తుగా నిలువుగా కూడా మేఘాలు ఏర్పడతాయి. వీటిని టవరింగ్ క్లౌడ్స్ లేదా క్యుములోనింబస్ క్లౌడ్స్ అంటారు.

మేఘాలు

ఫొటో సోర్స్, GARY MCARTHUR

డీప్ ఫ్రిజ్‌లో ఉండే క్రిస్టల్స్‌లా ఉంటే...

భూమి పై నుంచి 6,500 అడుగుల ఎత్తు అంటే 2 కిలోమీటర్ల ఎత్తులో ఉంటే వాటిని స్ట్రాటస్ క్లౌడ్స్ అంటాం. ఇందులో వాటర్ డ్రాప్‌లెట్స్ మాత్రమే ఉంటాయి. సాధారణంగా స్ట్రాటస్ క్లౌడ్స్ బూడిద రంగులో ఉంటాయి. ఇవి ఆకాశం వైపు చూసినప్పుడు పొరలుగా కనిపిస్తాయి. ఇవి కొద్ది పాటి జల్లులను ఇస్తాయి.

ఆ తర్వాత 6500 నుంచి 20 వేల అడుగుల మధ్యలో అంటే భూమి నుంచి 2 నుంచి 6 కిలోమీటర్ల మధ్య ఉండే వాటిని ఆల్టో క్లౌడ్స్ అంటారు. వీటిలో వాటర్ డ్రాప్‌లెట్స్‌తోపాటు ఐస్ క్రిస్టల్స్ ఉంటాయి. అంటే డీప్ ఫ్రిజ్ తెరవగానే కనిపించే ఐస్ క్రిస్టల్స్ లాంటివి.

వీటి తర్వాత అంటే 20 వేల అడుగుల పై నున్నవన్నీ సిర్రస్ క్లౌడ్స్ అంటాం. ఇవి సాధారణంగా 7 నుంచి 12 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఉంటాయి. ఈ మేఘాలలో అన్నీ ఐస్ క్రిస్టల్సే ఉంటాయి. ఇవి వీటి చుట్టుపక్కల ఉన్న డ్రాప్‌లెట్స్, క్రిస్టల్స్ అన్నింటిని ఆకర్షిస్తూ పెద్ద హెక్సాగోనల్ (ఆరు కోణాలుండే ఆకారం) ఆకారంలోకి మారుతూ ఉంటాయి.

హై లెవెల్ క్లాడ్‌గా మారిన ఏ మేఘామైనా సరే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాన్ని ఇస్తుంది. ఒక గంటలో 10 సెం.మీ. వర్షపాతాన్ని ఇచ్చే మేఘాలు ఇవే. ఈ మేఘాలకు అంతటి సామర్థ్యం ఉంటుంది. ఇవి పొడవుగా ఏర్పడి...ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండటంతో వీటిని టవరింగ్ క్లౌడ్స్ అని అంటారు. వీటినే క్యుములోనింబస్ క్లౌడ్స్ అని కూడా పిలుస్తాం.

మేఘాలు

డేంజరస్ క్లౌడ్స్

క్యుములోనింబస్ మేఘాలు వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల రెండు, మూడు గంటల్లోనే ఏర్పడతాయి. ఈ మేఘాలు ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లు, పిడుగులతో కూడిన వర్షాలను ఇస్తాయి. ఇవి అకస్మాత్తుగా మొదలై 2-3 గంటల పాటు 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో భారీ వర్షాలను ఇస్తాయి.

క్యుములోనింబస్ క్లౌడ్స్ నిలువుగా పెరుగుతూ ఏర్పడే మేఘాలు. ఈ మేఘాలు వాతావరణంలో ఉండే అనిశ్చితి (ఇన్ స్టెబిలిటీ) వల్ల ఏర్పడతాయి. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో ఉండే వాతావరణంలోని వ్యత్యాసం కారణంగా తయారవుతాయి. సాధారణంగా ఈ మేఘాలు వేసవి కాలంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఈ మేఘాల వల్ల ఒక్కసారే వర్షం వచ్చేస్తుంది. ఉరుములు, మెరుపులు రావడం, కరెంట్ పోల్స్, హోర్డింగ్స్, చెట్లు పడిపోవడం జరుగుతుంది. అందుకే ఈ మేఘాలను డేంజరస్ క్లౌడ్స్ అని కూడా అంటారు.

మేఘాలు

ఏ మేఘాలు ఎక్కువ వర్షాల్ని ఇస్తాయంటే...

నింబస్ స్ట్రాటస్ క్లౌడ్స్ ఎక్కువ వర్షపాతాన్ని ఇస్తాయి. నింబస్ స్ట్రాటస్ క్లౌడ్స్ మిడియం క్లౌడ్స్, లో లెవెల్ క్లౌడ్స్ రెండు కలిసి ఏర్పడతాయి. అది కూడా రుతువపన సీజన్‌లో ఏర్పడతాయి. 2 నుంచి 7 కిలోమీటర్ల మధ్యలో ఉండే స్ట్రాటస్, ఆల్టో క్లౌడ్స్ ప్రశాంతమైన వాతావరణ పరిస్థితుల్లో ఒకదానితో ఒకటి కలిసి ఏర్పడే మేఘాలే నింబస్ స్ట్రాటస్ క్లౌడ్స్.

సాధారణంగా మేఘాలు సూర్యకాంతిని గ్రహిస్తాయి, విడుదల చేస్తాయి. కానీ, రుతుపవనాల సీజన్‌లో రేడియేషన్ తక్కువగా ఉండటంతో నింబస్ స్ట్రాటస్ క్లాడ్స్ సూర్యకాంతిని పూర్తిగా గ్రహిస్తాయి. కానీ విడుదల చేయవు. దాంతో ఈ మేఘాలు బూడిద పొరగా కనిపిస్తాయి. వీటినే నింబో స్ట్రాటస్ క్లాడ్స్ అని కూడా అంటారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ వరదల్లో బాహుబలి సీన్

నింబో స్టాటస్ క్లౌడ్స్ వారం రోజుల పాటు ఆగకుండా వర్షాన్ని ఇస్తుంటాయి. కాస్త తెరిపి ఇచ్చినా కూడా మళ్లీ జోరు వర్షాలను ఇస్తుంటాయి. వీటిని యాక్టివ్ బ్రేక్ స్పెల్ రెయిన్స్ అంటారు. మనకున్న మేఘాల్లో అకస్మాత్తుగా ఏర్పడి భారీ వర్షాలను ఇచ్చే క్యుములోనింబస్ మేఘాలు కాకుండా ఎక్కువ వర్షపాతాల్ని ఇచ్చే మేఘాలు నింబోస్ట్రాటస్ మేఘాలే.

వీడియో క్యాప్షన్, ఉప్పొంగిన గోదావరి.. ‘వందేళ్లలో ఎప్పుడూ చూడనంత వరద’

మేఘానికి బరువు ఉంటుందా?

దూదిపింజలా తేలిపోతున్న మేఘంలా...ఈ మాట అనేక సార్లు వినే ఉంటాం. దీని బట్టి చూస్తే మేఘానికి బరువు ఉండదేమో అని అర్థమవుతుంది. కానీ, మనకు మేఘం గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ... మేఘానికి బరువు ఉంటుంది. అలాగే గాలికి కూడా బరువు ఉంటుంది.

అయితే, గాలి కంటే తక్కువ బరువున్న మేఘాలు ఆకాశంలో ఎరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఇలాంటి మేఘాలను వాటి నీడల ద్వారా కొలుస్తారు. ఈ నీడలను కొలవడానికి లెమోన్ ఓడో మీటర్‌ను ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)