పాకిస్తాన్ ఆదాయంలో 40 శాతం వడ్డీలకే... ఈ దేశం మరో శ్రీలంక అవుతుందా?

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ డిపాల్టర్‌గా మారుతుందని కొన్నిసార్లు, దివాలా తీసే అవకాశమూ ఉందని మరికొన్నిసార్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల దర్యాప్తు సంస్థ 'ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ' మాజీ చైర్మన్ సయ్యద్ షబ్బార్ జైదీ డిసెంబర్ 2021లో దీని గురించి మాట్లాడారు. ఇటీవలి కరెంట్ అకౌంట్, ద్రవ్య లోటును పరిశీలిస్తే దేశం దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు.
పాకిస్తాన్‌లో అంతా బాగానే ఉందని, అంతా సవ్యంగా సాగుతోందని ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ అవాస్తవమని ఆయన అన్నారు.
అదే సమయంలో, చమురుపై సబ్సిడీని తగ్గించకపోతే పాకిస్తాన్ డిఫాల్టర్‌గా మారుతుందని, దాని పరిస్థితి శ్రీలంక లాగా ఉంటుందని పాకిస్తాన్ ఆర్థిక మంత్రి హెచ్చరించారు.
గ్లోబల్ మార్కెట్‌లో పెరుగుతున్న చమురు ధరల కారణంగా పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇది దేశాన్ని సంక్షోభం అంచుల్లోకి నెడుతోంది.
పాకిస్థాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 9.3 బిలియన్ డాలర్ల (రూ. 74,256 కోట్లు)కు పడిపోయాయి. ఈ నిల్వలు, అయిదు వారాల దిగుమతులకు చెల్లించడానికి కూడా సరిపోవు.
త్వరగా ఖర్చుల్ని తగ్గించుకోవాలి...
పాకిస్తానీ రూపాయి బలహీనపడి రికార్డు స్థాయికి పతనమైంది. డాలరుతో పోల్చితే పాకిస్తాన్ రూపాయి విలువ దాదాపు 210కి చేరుకుంది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇప్పుడు త్వరగా ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆదాయంలో 40 శాతాన్ని పాక్ కేవలం వడ్డీ చెల్లించడానికే ఖర్చు చేస్తోంది.
పాకిస్తాన్ పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఊహలు, కల్పిత వార్తలు, భయాందోళనల దృష్ట్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్‌బీపీ) తాత్కాలిక గవర్నర్ ముర్తుజా సయ్యద్, డిప్యూటీ గవర్నర్లు ఇనాయత్ హుస్సేన్, సీమా కామిల్ ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ స్థితి గురించి వివరంగా మాట్లాడారు.
యూట్యూబ్ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న వీరు... దేశం అప్పులు, విదేశీ నిల్వలు, పడిపోతున్న రూపాయి స్థితి గురించి వివరించారు.

ఫొటో సోర్స్, YOUTUBE/STATE BANK OF PAKISTAN
పాకిస్తాన్ ఎంత బలహీన స్థితిలో ఉంది?
రాబోయే 12 నెలలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా కష్టంగా ఉంటుందని ముర్తుజా సయ్యద్ అన్నారు.
''కోవిడ్ ప్రభావం నుంచి బయటకు వస్తున్న మనం, గ్లోబల్ ఉత్పత్తుల ధరలు పెరగడం చూస్తున్నాం. ఫెడరల్ రిజర్వ్ కుచించుకుపోతుంది. భౌగోళిక ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అప్పు ఎక్కువగా ఉన్న దేశాలు గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ, ప్రజలు అనుకుంటున్నంత దారుణ పరిస్థితులు పాకిస్తాన్‌లో లేవు. దీనికి మూడు కారణాలు ఉన్నాయి'' అని ఆయన వివరించారు.
ముందుగా పాకిస్తాన్ అప్పుల గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్‌కు ఇప్పుడు జీడీపీలో 70 శాతం అప్పు ఉంది. అయితే పాక్‌ను ఘనా, ఈజిప్ట్, జాంబియా వంటి దేశాలతో ముడిపెడుతూ మాట్లాడుతున్నారు. ఘనాకు జీడీపీలో 80శాతం, ఈజిప్ట్‌కు 90 శాతం, జాంబియాకు 100 శాతం, శ్రీలంకకు 120 శాతం అప్పులు ఉన్నాయి. పాకిస్తాన్ అప్పు స్థాయి వీటన్నింటి కంటే చాలా తక్కువగా ఉంది.
ఈ అప్పుల్లో బయట నుంచి తీసుకున్నవి ఎంతో చూడాలి. పాకిస్తాన్ విషయానికొస్తే జీడీపీలో 40 శాతం బాహ్య రుణాలు ఉన్నాయి. ట్యూనీషియాకు 90 శాతం కంటే ఎక్కువ, అంగోలాకు 120 శాతం కంటే ఎక్కువ, జాంబియాకు 150 శాతం కంటే ఎక్కువగా విదేశీ రుణాలు ఉన్నాయి. పాకిస్తాన్‌పై ఎక్కువగా దేశీయ అప్పులు ఉన్నాయి. వీటి నుంచి సులభంగా బయటపడొచ్చు. ఎందుకంటే, అవి సొంత కరెన్సీలోనే చెల్లించాల్సి ఉంటుంది.
రెండోది, బయట నుంచి తీసుకున్న అప్పుల్లో స్వల్పకాలిక రుణాల గురించి మాట్లాడుకుంటే, పాక్‌కు ఇలాంటి అప్పులు 7 శాతమే ఉన్నాయి. టర్కీ లాంటి మిగతా దేశాలకు ఇది 30 శాతంగా ఉంది.
ఇక మూడోది, ఎలాంటి నిబంధనలపై మీరు బాహ్య రుణాలు పొందారో చూడాలి. మా అప్పుల్లో 20 శాతం మాత్రమే వాణిజ్య నిబంధనల ఆధారంగా తీసుకున్నాం. మిగతావి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు నుంచి, మిత్ర దేశాల నుంచి తీసుకున్నాం. వీటిని చెల్లించడం మాకు చాలా సులభం.

ఫొటో సోర్స్, Getty Images
సంజీవని లాంటి ఐఎంఎఫ్ ప్రోగ్రాం
తమ విధానాలు, ఆర్థిక వ్యవస్థను కాస్త నెమ్మదించేలా చేస్తాయని ముర్తుజా అన్నారు. ''కోవిడ్ నుంచి బయటపడ్డాం. నిజమే, ఈ ఏడాది బడ్జెట్ పరంగా ఇబ్బంది ఉంటుంది. కానీ, దానిపై కూడా మేం దృష్టి పెట్టాం. రాబోయే 12 నెలల్లో, ఐఎంఎఫ్ ప్రోగ్రామ్‌లో ఉన్న దేశాలు మనుగడ సాగిస్తాయి. ఈ ప్రోగ్రామ్‌లో లేని దేశాలపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఘనా, జాంబియా, ట్యూనీషియా, అంగోలా దేశాలు ఈ ప్రోగ్రామ్‌లో లేవు. పాకిస్తాన్‌కు ఉన్న బాహ్య రుణాలు, దేశ విధానాలు, ఐఎంఎఫ్ అందిస్తోన్న సహాయాన్ని పరిగణలోకి తీసుకుంటే, అందరూ అనుకుంటున్నంత దారుణ పరిస్థితులు పాక్‌లో లేవని మీకు తెలుస్తుంది'' అని ఆయన వివరించారు.
ఐఎంఎఫ్ సిబ్బంది స్థాయిలో పాక్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ, బోర్డు స్థాయిలో ఇది ఇంకా మిగిలి ఉంది. దీనికోసం పాకిస్తాన్ కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది.
ఇందులో తలెత్తే ఇబ్బందుల గురించి ముర్తుజా సయ్యద్ వివరించారు. ''ఐఎంఎఫ్‌తో సిబ్బంది స్థాయిలో ఒప్పందం కుదరడం చిన్న విషయం కాదు. ఇది ఒక పెద్ద ఘనత. మిగిలిన షరతులను పూర్తి చేస్తే బోర్డు స్థాయిలో ఒప్పందానికి వెళ్లడం కూడా సులభం అవుతుంది. ఆ తర్వాత మాకు డబ్బు లభిస్తుంది. మేం కూడా సరైన దిశలోనే ఉన్నామని ప్రపంచం గుర్తిస్తుంది'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, YOUTUBE/STATE BANK OF PAKISTAN
విదేశీ నిల్వల పరిస్థితి
పాకిస్తాన్ విదేశీ నిల్వలు 9.3 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉంటాయని డిప్యూటీ గవర్నర్ ఇనాయత్ హుస్సేన్ అన్నారు. ''ఇవి సంతోషించదగిన స్థాయి నిల్వలు కాదు. వీటిని మెరుగుపరచాలని అనుకుంటున్నాం. మూడు నెలల దిగుమతులకు సరిపోయే స్థాయికి వీటిని పెంచాలని అనుకుంటున్నాం. అయితే, మరీ ఆందోళన పడాల్సినంత అట్టడుగులో కూడా ఇవి లేవు. సోషల్ మీడియాలో వీటి గురించి తప్పుడు వార్తలు చెలామణి అవుతున్నాయి'' అని వ్యాఖ్యానించారు.
ఒక దేశం ఎగుమతులు, దిగుమతులు చేసుకోవడానికి విదేశీ నిల్వలు అవసరం. ఏదైనా దేశం వద్ద ఈ విదేశీ నిల్వలు లేకపోతే, ఆ దేశం దిగుమతులు చేసుకోలేదు. దేశాలు చేసుకునే ఎగుమతులు, దిగుమతులపై విదేశీ నిల్వలు ప్రభావం చూపుతాయి.
''మా వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి. రాబోయే కొన్ని నెలల పాటు ఇవి మమ్మల్ని నడిపించగలవు. ఐఎంఎఫ్ ప్రోగ్రామ్‌కు అనుమతి లభిస్తే, ఆ తర్వాత డబ్బు ప్రవాహం మొదలవుతుంది. కొన్ని ఏజెన్సీల నుంచి కూడా డబ్బు వస్తుంది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక అవసరాలను సులభంగా తీర్చగలమని మా అంచనా. దీని తర్వాత బడ్జెట్ కూడా పెరుగుతుంది'' అని ఆయన అన్నారు.
ఇప్పుడున్న విదేశీ నిల్వలకు అదనంగా పాకిస్తాన్ దగ్గర 3.8 బిలియన్ డాలర్ల బంగారం నిల్వలు ఉన్నాయని ఆయన చెప్పారు. విదేశీ నిల్వలు పెంచుకోవడానికి బంగారంపై అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి లేదని అన్నారు.
పాకిస్తాన్ రూపాయి పతనానికి కారణాలను కూడా ఆయన చెప్పారు.
డిసెంబరు నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ రూపాయి విలువ 18 శాతం పడిపోయిందని అన్నారు. అమెరికా డాలర్ విలువ పెరగడం కూడా దీనిపై ప్రభావం చూపిందని చెప్పారు. పాకిస్తాన్‌లో డాలర్ సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటం మరో కారణమన్నారు. ఇటీవలి నెలల్లో పాకిస్తాన్ దిగుమతులు బాగా పెరిగాయి. దిగుమతులు తగ్గి రూపాయి బలపడుతుందని అంచనా వేస్తున్నాం. అదే సమయంలో, మార్కెట్ సెంటిమెంట్ కూడా రూపాయిపై ప్రభావం చూపుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- గోవాలో చట్ట వ్యతిరేకంగా కేంద్ర మంత్రి సృతి ఇరానీ కూతురు బార్ నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపణ
- కియారా అద్వానీ: ‘మొదట్లో నన్ను కలవడానికి కూడా భయపడ్డారు.. ఇప్పుడు వాళ్లే ఆఫర్లిస్తున్నారు’
- నీరజ్ చోప్రా: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు
- మంకీపాక్స్:75 దేశాలు, 16 వేల కేసులు, 5 మరణాలు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- రిషి సునాక్: అవును..నిజమే. నేను వెనకబడ్డా...
- ‘‘నేనే ఆ అమ్మాయిని సజీవ దహనం చేశాను. ఆమె అరుపులు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి’’
- ఒకపరి కొకపరి వీడియో తొలగించిన శ్రావణ భార్గవి.. ‘అన్నమయ్యపై అభిమానంతోనే వీడియోను తొలగిస్తున్నా’
- ‘ఇస్లాం పవిత్ర నగరం’ మక్కాలో ప్రవేశించి వీడియో తీసిన ముస్లిమేతర జర్నలిస్ట్.. ఈయన ఎవరు? ఎందుకు వెళ్లారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














