రిషి సునాక్: అవును..నిజమే. నేను వెనకబడ్డా...

రిషి సునాక్

ఫొటో సోర్స్, Reuters

బ్రిటన్ ప్రధాని రేసులో తాను వెనకబడ్డానని, తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ తదుపరి ప్రధాని కావాలని పార్టీలో కొన్ని శక్తులు కోరుకుంటున్నాయని ఉన్న రిషి సునాక్ అన్నారు.

శనివారం గ్రాంథాం నగరంలో ప్రసంగించిన సునాక్, ''నేను వెనబడ్డాననడంలో సందేహం లేదు. కన్జర్వేటివ్ పార్టీలో కొందరు ఈ ఎన్నికల్లో లిజ్ ట్రస్‌ను ప్రధానమంత్రిని చేయాలని చూస్తున్నారు'' అని అన్నారు.

"నాకు కాకుండా మరొక వ్యక్తికి ఈ పదవిని కట్టబెట్టాలని కొందరు కోరుకుంటున్నారు. కానీ, పార్టీ సభ్యులు కొందరు ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నారని నేను భావిస్తున్నాను. నేను చెప్పేది వినడానికి వారు సిద్ధంగా ఉన్నారు'' అన్నారాయన.

అయితే, పార్టీలో ఎవరు తనను వ్యతిరేకిస్తున్నారు అన్న విషయం మాత్రం రిషి సునాక్ వెల్లడించ లేదు. ''ఈ పోటీలో నేను తక్కువ స్థాయిలో ఉన్న మాట వాస్తవం'' అని ఆయన విలేఖరులతో అన్నారు.

తన ప్రసంగంలో సునాక్, నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్)లో బ్యాక్‌లాగ్ సమస్యను ప్రస్తావిస్తూ , తాను అధికారంలోకి వస్తే ఎన్‌హెచ్‌ఎస్ సురక్షితంగా ఉంటుందని అన్నారు.

ఎన్‌హెచ్‌ఎస్‌లో బ్యాక్ లాగ్ అంటే చికిత్స కోసం ఎదురు చూస్తున్న రోగుల సంఖ్య. కరోనా మహమ్మారి కారణంగా, బ్రిటన్‌లో దాని సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య 66 లక్షలు దాటింది.

బ్యాక్‌లాగ్‌ను ఎదుర్కోవడానికి "వ్యాక్సిన్-స్టైల్ కీ" టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని రిషి సునాక్ హామీ ఇచ్చారు.

లిజ్ ట్రస్

ఫొటో సోర్స్, PA Media

లిజ్ ట్రస్ ఏమంటున్నారు?

అదే సమయంలో, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ తన ప్రసంగంలో, తాను ప్రధానమంత్రి అయితే, వచ్చే ఏడాది చివరి నాటికి బ్రెగ్జిట్ తర్వాత ఉన్న అన్ని యూరోపియన్ చట్టాలను సమీక్షిస్తానని వాగ్దానం చేశారు.

2023 చివరి నాటికి అభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ చట్టాలను రద్దు చేస్తానని లేదా వాటి స్థానంలో కొత్తవి తీసుకొస్తానని ఆమె హామీ ఇచ్చారు.

ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకోవడానికి "కఠినమైన నిర్ణయాలు" తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కెంట్ కౌంటీలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యులతో జరిగిన సమావేశంలో లిజ్ ట్రస్ అన్నారు.

వీడియో క్యాప్షన్, నెలల తరబడి సాగిన రష్యన్ల దాడుల తర్వాత, యుక్రెయిన్ రాజధానికి ప్రజలు తిరిగి వస్తున్నారు.

"కష్టపడి పనిచేసే వారికి ప్రతిఫలం అందేలా చూస్తాను. బ్రిటన్‌కు పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నిస్తాను. తద్వారా ఉద్యోగాలు, వృద్ధి పెరిగి, వచ్చే ఎన్నికల్లో మళ్లీ మేమే గెలిచి బ్రిటన్‌ను ముందుకు తీసుకెళ్లగలం" అన్నారు.

ఇరువురు నేతలు కూడా తమ ప్రసంగాల్లో వలసల అంశాన్ని లేవనెత్తారు. లిజ్ ట్రస్, రిషి సునాక్ ఇద్దరూ బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్ నియంత్రణలను కఠినతరం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. శరణార్థుల సంఖ్యపై కూడా పరిమితిని నిర్దేశిస్తామని రిషి సునాక్ తెలిపారు.

రిషి సునాక్ , లిజ్ ట్రస్

ఫొటో సోర్స్, PA Media

ఎవరు ముందు, ఎవరు వెనుక

కన్జర్వేటివ్ పార్టీ అధినేత, బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి పదవికి ఇప్పుడు రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొని ఉంది.

కన్జర్వేటివ్ ఎంపీల మధ్య జరిగిన చివరి రౌండ్ ఓటింగ్‌లో, రిషి సునక్‌కు అత్యధికంగా 137 ఓట్లు రాగా, లిజ్ ట్రస్‌కు 113 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న పెన్నీ మోర్డెంట్‌కు 105 ఓట్లు వచ్చాయి. దీంతో మార్డోంట్ ఈ రేసు నుంచి వైదొలిగినట్లే.

అంతకు ముందు మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ ఓటింగ్‌లో సునక్‌కు 118 ఓట్లు రాగా, లిజ్ ట్రస్‌కు 86 ఓట్లు వచ్చాయి.

ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు జూలై 25న బీబీసీలో జరిగే చర్చలో పాల్గొంటారు. దీనితో పాటు, దేశవ్యాప్తంగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 1.6 లక్షల మంది సభ్యులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5 న కొత్త ప్రధానమంత్రిని ప్రకటిస్తారు.

కానీ, ఈ ఎన్నికల్లో రిషి సునాక్ వెనుకబడినట్లు కనిపిస్తోంది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 730 మంది సభ్యులపై YouGov సర్వేలో, 62 శాతం మంది లిజ్ ట్రస్‌కు, 38 శాతం మంది రిషి సునాక్‌ కు ఓటు వేశారు. చాలా మంది సభ్యులు ఓటు వేయడానికి నిరాకరించారు.

ఈ విధంగా, ఈ ఎన్నికల్లో లిజ్ ట్రస్ 24 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. అదే సమయంలో, ఈ వారం ప్రారంభంలో నిర్వహించిన సర్వేలో ట్రస్ 19 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు.

రిషి సునాక్

రిషి సునక్ ఎవరు?

రిషి సునక్ పూర్వీకులు భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. భారత మూలాలున్న ఆయన తల్లిదండ్రులు 1960లో తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు వెళ్లారు.

ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో 1980లో రిషి జన్మించారు. అక్కడే ఆయన తండ్రి వైద్యుడిగా పని చేశారు. తల్లి సొంతంగా ఫార్మసీ నడిపేవారు. వారికి కలిగిన ముగ్గురు సంతానంలో రిషి పెద్దవాడు.

2005లో కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఐ చదువుతోన్న సమయంలో ఆయన అక్షతా మూర్తిని కలిశారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత రిషి, గోల్డ్‌మన్ శాక్స్‌లో పనిచేశారు.

ఆ తర్వాత 'ద చిల్డ్రన్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజ్‌మెంట్, థెలెమ్ పార్ట్‌నర్స్‌లో భాగస్వామిగా పనిచేశారు.

స్థానిక కమ్యూనిటీకి తన తల్లిదండ్రులు చేసిన సేవ, సహాయం నుంచి ప్రేరణ పొందానని రిషి సునక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వారి తరహాలోనే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

2015లో జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి రిషి సునక్ ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు.

వీడియో క్యాప్షన్, కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పదవికీ, బ్రిటిష్ ప్రధాని పదవి పోటీలో రిషి సునక్,లిజ్ ట్రస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)