Digital Media-New Act: డిజిటల్ మీడియాపై కొత్త చట్టం...ఇందులో ఏముంది? దీనిపై ఎందుకింత చర్చ జరుగుతోంది?

డిజిటల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలో డిజిటల్ లేదా ఆన్‌లైన్ న్యూస్ మీడియాను నియంత్రించే వ్యవస్థ లేదు. అయితే, డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు ప్రభుత్వం త్వరలో ఒక చట్టం తీసుకురాబోతున్నట్టు సమాచారం.

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లును సిద్ధం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

'ప్రెస్, పత్రికల రిజిస్ట్రేషన్ బిల్లు, 2019'కి అదే సంవత్సరంలో ప్రభుత్వం కొత్త రూపాన్ని ఇచ్చింది.

ఇప్పుడు తొలిసారిగా డిజిటల్ న్యూస్ మీడియాను కూడా కలుపుకుని కొత్త బిల్లు సిద్ధం అవుతోంది.

బిల్లులో ఏముందన్న వార్త బయటకు రాలేదుగానీ, అన్ని డిజిటల్ మీడియా పోర్టల్స్, వెబ్‌సైట్లు కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆపై డిజిటల్ మీడియాను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి వస్తుంది.

దేశంలో 155 ఏళ్లుగా అమల్లో ఉన్న 'ప్రెస్ అండ్ బుక్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1867' స్థానంలో ఈ కొత్త చట్టం వస్తుందని చెబుతున్నారు. 1857 తిరుగుబాటు తరువాత బ్రిటిష్ ఇండియాలో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. తిరుగుబాటు సమయంలో పత్రికల భావ ప్రకటనా స్వేచ్ఛను అరికట్టేందుకు దీన్ని రూపొందించారు.

డిజిటల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

'ఈ బిల్లును పత్రికా స్వేచ్ఛకు పొంచి ఉన్న ముప్పు'

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో డిజిటల్ మీడియా వేగంగా విస్తరిస్తోంది. ఆన్‌లైన్ న్యూస్ అందించే సంస్థల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

వార్తలు అందించే విధానంలో పెను మార్పులు వచ్చినప్పటికీ 155 ఏళ్ల చట్టంలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఇప్పటివరకూ ఎవరికీ కనిపించలేదు.

ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త బిల్లు ఆమోదం పొందితే, 1867 చట్టం ముగుస్తుంది.

అయితే, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని కొందరు వాదిస్తున్నారు.

మోదీ ప్రభుత్వం అసమ్మతి స్వరాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

జర్నలిస్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఆకార్ పటేల్ తన కథనాలలో ఈ బిల్లును పత్రికా స్వేచ్ఛకు పొంచి ఉన్న ముప్పుగా పేర్కొన్నారు.

"ఇది భారతదేశానికి మంచి సంకేతం కాదు. కేంద్ర ప్రభుత్వం బలమైనది. ప్రధానమంత్రి ప్రజాదరణ పొందిన వ్యక్తి. ప్రతిపక్షం ప్రస్తుతం తన అడుగు నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది" అని ఆకార్ పటేల్ రాశారు.

డిజిటల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

'డిజిటల్ మీడియాకు ఓ చట్టం కావాలి'

డిజిటల్ మీడియాకు ప్రత్యేకంగా ఓ చట్టం ఉండాలని ప్రముఖ రచయిత, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రో వైస్ ఛాన్సలర్ సుధీష్ పచౌరి అభిప్రాయపడ్డారు.

"ఇప్పుడు డిజిటల్ మీడియాపై దాడులు జరగట్లేదని కాదు. ఏదైనా రచ్చ జరగగానే పోలీసులు వెళ్లి మీడియా వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి కేసులన్నీ ఇప్పటి వరకు ఐటీ చట్టం కింద నమోదవుతున్నాయి. డిజిటల్ మీడియాకు ఒక ప్రత్యేక చట్టం లేకపోవడమే ఇందుకు కారణం. ఆన్‌లైన్ న్యూస్ కోసం ఒక చట్టం కావాల్సిందే" అని సుధీష్ పచౌరి అన్నారు.

ఈరోజు కాకపోయినా రేపు ఏ ప్రభుత్వమైనా ఈ చట్టాన్ని తీసుకొస్తుందని సుధీష్ పచౌరి అభిప్రాయపడ్డారు.

"నియంతృత్వం ప్రభుత్వం నుంచే కాదు, వివిధ సమూహాల నుంచి కూడా వస్తోందని" ఆయన అన్నారు.

కాగా, కొత్త చట్టంలో భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే అంశాలేవీ ఉండవని మరికొందరు భావిస్తున్నారు.

పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటారనే వాదన నిరాధారమని ప్రసార భారతి మాజీ చైర్మన్ సూర్య ప్రకాశ్ అభిప్రాయపడ్డారు.

"ఈ అంశంపై మీడియా కథనాలను చూశాను. భావ ప్రకటనా స్వేచ్ఛను తగ్గించే అంశాలేవి ఈ చట్టంలో ఉన్నట్టు నాకు అనిపించలేదు" అని ఆయన చెప్పారు.

పాత చట్టాలను కాలానికి అనుగుణంగా మార్చడం అభినందనీయమని కూడా సూర్య ప్రకాశ్ అన్నారు.

"మీడియాను ఆధునిక కాలంలోకి తీసుకురావడమే కొత్త బిల్లు ఉద్దేశం. భారతదేశంలో 63 శాతం యువత డిజిటల్ మీడియా వార్తలను వినియోగిస్తున్నారని రాయిటర్స్ నివేదిక తెలిపింది. అందుకే చట్టంలో మార్పులతో పాటు సాంకేతికతను కూడా కాలానికి అనుగుణంగా మార్చుకోవాలన్నది నా విశ్వాసం" అని సూర్య ప్రకాష్ బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, ఐస్‌క్రీమ్ ఇడ్లీ: సోషల్ మీడియాలో వైరల్ అయిన కొత్త స్టయిల్ ఇడ్లీ

ప్రతిపాదిత చట్టంలో ఏముంది?

ఈ చట్టం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, 2019లో రూపొందించిన చట్టాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

కేంద్ర ప్రభుత్వం 2019లో రూపొందించిన బిల్లులో డిజిటల్ మీడియా వార్తలను 'డిజిటల్ ఫార్మాట్‌లో వార్తలు'గా నిర్వచించింది.

డిజిటల్ వార్తలు అంటే ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ లేదా ఇతర పరికరాల్లో ప్రసారం చేయగల వార్తలు. ఇందులో టెక్స్ట్, ఆడియో, వీడియో, గ్రాఫిక్స్ ఉంటాయి.

కొత్త బిల్లు ప్రకారం, డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద తమ సంస్థ పేరును నమోదు చేసుకోవాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే వివిధ ప్రచురణలపై చర్యలు తీసుకునే అధికారం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు ఉంటుంది.

ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్, డిజిటల్ వార్తా సంస్థ రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేయవచ్చు లేదా పూర్తిగా రద్దు చేయవచ్చు. అలాగే, ఈ చట్టంలో శిక్షకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నట్టు సమాచారం.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌ నియామకంతో పాటు, అప్పీలేట్ బోర్డును రూపిందించే ప్రణాళిక సిద్ధం చేశారు.

డిజిటల్ మీడియా

ఫొటో సోర్స్, AFP

ఆర్ఎన్ఐ ఏర్పాటు, వార్తాపత్రికల రిజిస్ట్రేషన్

1867 చట్టం ప్రధాన లక్ష్యాలలో భారతదేశంలో ప్రచురించే వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాల రికార్డులను పొందుపరచడం కూడా ఒకటి.

1955లో ఈ చట్టాన్ని సవరిస్తూ రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ)ను స్థాపించారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆర్ఎన్ఐ ఏర్పడ్డ సమయంలో, ఆనాటి నెహ్రూ ప్రభుత్వం కూడా వార్తాపత్రికల స్వేచ్ఛ నియంత్రిస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంది.

వార్తాపత్రికల రిజిస్ట్రేషన్ అంగీకరించడానికి, తిరస్కరించడానికి, నిలిపివేయడానికి కూడా ఆర్ఎన్ఐకు హక్కులున్నాయి.

ఎమర్జెన్సీ సమయంలో తప్ప ప్రభుత్వ నియంత్రణ లేదా నిర్బంధాలను ఎప్పుడూ ఎదుర్కోలేదని సూర్య ప్రకాశ్ చెప్పారు.

"ఆ సమయంలో ప్రభుత్వం లేదా అధికారంలో ఉన్న పార్టీ ఒక వార్తాపత్రికపై ఒత్తిడి తెచ్చేందుకు రిజిస్ట్రేషన్ చట్టం అధికారాన్ని వినియోగించిన సందర్భం నాకు గుర్తులేదు. రిజిస్ట్రేషన్ చట్టాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే న్యాయవ్యవస్థ కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని నా నమ్మకం. దేశంలోని సంస్థలపై ప్రజలకు విశ్వాసం ఉండాలి. ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయాలని చూస్తే, మన హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు లాంటి సంస్థలు ఉన్నాయి. మనది ప్రజాస్వామ్య దేశం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఆయన అన్నారు.

ఈ విషయంలో సుధీష్ పచౌరీ కూడా సూర్య ప్రకాశ్‌తో ఏకీభవిస్తున్నారు.

"కాంగ్రెస్ హయాంలో కానీ, మోదీ ప్రభుత్వ హయాంలో కానీ ఏ పెద్ద వార్తాపత్రికపై దాడి జరగలేదు. కొత్త చట్టం వస్తే, ప్రభుత్వం దృష్టిలో న్యూస్ పోర్టల్స్ ఒక విధంగా చట్టపరంగా జవాబుదారీగా ఉంటాయి. అయితే, వార్తాపత్రికలపై చౌకీదారీ నిన్నా ఉంది, నేటికీ ఉంది" అని సూర్య ప్రకాశ్ అన్నారు.

సంప్రదాయ మీడియా

డిజిటల్ మీడియా vs సంప్రదాయ మీడియా

గత రెండు దశాబ్దాల్లో డిజిటల్ మీడియా గణనీయంగా విస్తరించింది. న్యూస్‌క్లిక్, ది న్యూస్ మినిట్, వైర్, స్క్రోల్, ఆల్ట్ న్యూస్ వంటి సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. ఇవి స్వతంత్ర సంస్థలు. వీటిలో ప్రభుత్వ ప్రకటనలు రావు. విరాళాలపై నడుస్తాయి. ఈ పోర్టల్స్ చాలా వరకు జర్నలిస్టులు ఏర్పాటు చేసినవే.

సంప్రదాయ మీడియా అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని ఆకార్ పటేల్ అన్నారు.

ఉదాహరణకు మోదీ ప్రభుత్వం ప్రకటనల కోసం సంవత్సరానికి రూ.1200 కోట్లు (నెలకు రూ. 100 కోట్లు) ఖర్చు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ యూనిట్లు రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తాయి.

అలా ప్రతినెలా దాదాపు రూ.200 కోట్లు మీడియాకు ఇస్తారు. ఇది భారీ మొత్తం. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనల బడ్జెట్ దీనికి కొంత భిన్నంగా ఉంటుంది.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, PALLAVA BAGLA/GETTY IMAGES

సోషల్ మీడియా సంగతేంటి?

కొత్త చట్టంలో డిజిటల్ వార్తలను చేర్చాలనే చర్చ జరుగుతోంది. కానీ సోషల్ మీడియా వేదికలు కూడా వార్తలను ప్రచురిస్తున్నాయి. మరి వారి సంగతి ఏంటి?

ఎలాంటి కొత్త చట్టం చేయకుండా ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికలను నియంత్రించడానికి మోదీ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియట్ గైడ్‌లైన్స్ మరియు డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ కండక్ట్) రూల్స్, 2021ని అమలు చేసింది.

డిజిటల్ న్యూస్ పోర్టల్ అయినా, సోషల్ మీడియా వేదిక అయినా సమాజం పట్ల అందరికీ బాధ్యత ఉంటుందని, అయితే, ఈ బాధ్యత నుంచి సమాజం దూరంగా పారిపోతోందని సూర్య ప్రకాశ్ అభిప్రాయపడ్డారు.

"గత అయిదారేళ్లలో సోషల్ మీడియాలో ఏం జరిగిందో చూడండి. మన దేశంలో జరుగుతున్న చాలా హింసకు సోషల్ మీడియా వేదికలే కారణమని నేను భావిస్తున్నాను. వాట్సాప్ మొదలైనవి సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తూ, హింసను ప్రేరేపిస్తున్నాయంటే ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు. కానీ, అదే జరుగుతోంది. 2021లో సోషల్ మీడియాకు సంబంధించిన నిబంధనలను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, దానిని మనస్పూర్తిగా సమర్థించిన వారిలో నేను ఒకడిని" అని సూర్య ప్రకాశ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఇంటర్నెట్ ఎలా పుట్టింది? రెండు కంప్యూటర్ల మధ్య బదిలీ అయిన తొలి పదం ఏంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)