Sri Lanka: సంక్షోభంలో శ్రీలంకకు ఎక్కువ సాయం చేసిందెవరు, చైనానా, భారతదేశమా?

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎనర్బన్ ఎథిరాజన్
    • హోదా, బీబీసీ న్యూస్, కొలంబో

శ్రీలంకలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నిరసనకారులు నినాదాలు చేశారు.

అలాగే, వారు భారత్‌కు వ్యతిరేకంగా కూడా నినదించారు.

'భారత్‌, అమెరికాలకు దేశాన్ని అమ్మకండి', 'భారత్‌లో శ్రీలంక మరో రాష్ట్రం కాదు', 'శ్రీలంక పరిస్థితిని దయచేసి భారత్ ఉపయోగించుకోవద్దు' వంటి నినాదాలు ప్రదర్శనల సమయంలో బాగా వినిపించాయి.

శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ కొన్ని నెలలుగా భారీగా నిరసనలు జరుగుతున్నాయి. దేశాన్ని వదిలి పారిపోయిన గొటాబయ రాజపక్ష రాజీనామా చేయాల్సి వచ్చింది.

కొన్నేళ్లుగా శ్రీలంక, భారీగా అప్పుల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం అత్యవసర వస్తువులైన ఆహారం, చమురు, ఔషధాలను కొనేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

గత వారం సింగపూర్‌కు పారిపోయిన మాజీ అధ్యక్షుడు రాజపక్ష, ఆయన కుటుంబమే దేశంలో ఈ పరిస్థితి తలెత్తడానికి కారణమంటూ నిరసనకారులు నిందిస్తున్నారు.

శ్రీలంక రాజకీయాల్లోని కొన్ని వర్గాలు ఎల్లప్పుడూ భారత్‌ను అనుమానంగా చూస్తాయి. మెజారిటీ సింహళ జాతీయులు, వామపక్ష పార్టీలు చాలా ఏళ్లుగా భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయడం నేను చూశాను.

కానీ, కొన్ని నెలల క్రితం శ్రీలంకలో అకస్మాత్తుగా తీవ్రమైన ఆర్థిక గందరగోళం ఏర్పడినప్పుడు సహాయం కోసం భారత్ వైపు చూసింది. అధికార బీజేపీ, శ్రీలంకను ఆర్థిక సహాయంతో ఆదుకుంది.

నిజానికి భారత్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సర కాలంగా భారత్ చేసినంత సహాయం ఏ దేశం కూడా శ్రీలంకకు చేయలేదు.

గత 15 ఏళ్లుగా ప్రాజెక్టుల కోసం రుణాలు అందిస్తూ, ఇతర రకాలుగా ఆర్థిక సహాయం చేస్తూ శ్రీలంకలోకి చైనా ప్రవేశించింది. అయితే, శ్రీలంకకు ఏర్పడిన ఆర్థిక అవసరం, మళ్లీ ఆ ద్వీపదేశంపై భారత్ ప్రభావం చూపించేందుకు ఒక రకంగా ఉపయోగపడిందని నిపుణులు అంటున్నారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

''ప్రత్యేకించి ఈ క్లిష్ట సమయంలో భారత్ చాలా కీలక పాత్ర పోషించింది. ఒక దేశంగా మేం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. భారత్ ముందుకు వచ్చి మాకు మద్దతుగా నిలిచింది''అని బీబీసీతో శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస అన్నారు.

భారత్, శ్రీలంక దేశాల మధ్య వందల ఏళ్లుగా సన్నిహిత సాంస్కృతిక, మతపరమైన, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి.

శ్రీలంకకు భారత్ ప్రధాన వాణిజ్య భాగస్వామి. భారత్ నుంచి ఆహార పదార్థాలతో పాటు చాలా ఉత్పత్తులను శ్రీలంక దిగుమతి చేసుకుంటుంది. శ్రీలంకలో తమిళులకు, భారత్‌లోని తమిళులకు మధ్య సన్నిహిత సాంస్కృతిక సంబంధాలు ఉంటాయి.

2005లో అధ్యక్షుడిగా మహింద రాజపక్ష ఎన్నికైన తర్వాత నుంచి శ్రీలంక, భారత్‌కు కాస్త దూరమైంది. ఆయన రెండో పర్యాయం అధ్యక్షుడిగా అయ్యాక ఈ దూరం మరింత పెరిగింది. అదే సమయంలో మౌలిక ప్రాజెక్టుల కోసం చైనాతో శ్రీలంక పలు ఒప్పందాలు చేసుకుంది.

చైనా ఇప్పటివరకు శ్రీలంకకు 5 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు ఇచ్చినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. శ్రీలంక తీసుకున్న మొత్తం రుణాల్లో ఇది 10 శాతం ఉంటుంది.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

అయితే చమురు కొరత, ఆహార ధరల పెరుగుదల వంటి సమస్యల పరిష్కారం కోసం శ్రీలంక అదనపు రుణాలు కోరుతున్నప్పటికీ, చైనా ఇంకా స్పందించలేదు.

మరోవైపు భారత్ సుమారు 3.5 బిలియన్ డాలర్లను క్రెడిట్, కరెన్సీ మార్పిడి విధానం ద్వారా అందించింది. అంతేకాకుండా శ్రీలంకకు అత్యవసరమైన చమురు, ఆహారం, ఎరువులను కూడా పంపించింది.

కేంద్ర ఇచ్చిన రుణాలే కాకుండా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా శ్రీలంకకు ఆహారం, ఔషధాలను పంపించారు.

పొరుగు దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు దిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు రాజకీయ పార్టీలు మంగళవారం కోరాయి.

భారత్ అందించిన బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం, శ్రీలంక ప్రజల దృక్పథంలో మార్పును తీసుకొచ్చిందని నిపుణులు అంటున్నారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

''ఇంధనం, ఆహారాన్ని సకాలంలో పంపి భారత్ మాకు సహాయపడింది. భారత్ సహాయం లేకపోతే శ్రీలంకకు చాలా కష్టమైపోయేది'' అని ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగి టైరానీ సెబాస్టియన్ అన్నారు.

''వారు చూపించిన సంఘీభావానికి, అందించిన మద్దతుకు భారత ప్రజలకు రుణపడి ఉంటాం'' అని సామాజిక కార్యకర్త మెలానీ గుణతిలకే వ్యాఖ్యానించారు.

శ్రీలంకకు సహాయం చేయడానికి భారత్ తీసుకున్న నిర్ణయం, వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తొలి క్రెడిట్ లైన్ ప్రకటించిన తర్వాత, ట్రింకోమలీ హార్బర్‌లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నిర్మించిన 61 భారీ ఆయిల్ ట్యాంకులను సంయుక్తంగా నిర్వహించేందుకు జనవరిలో భారత్, శ్రీలంక దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

30 ఏళ్లుగా భారత్ దీనిపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. వ్యూహాత్మక చమురు నిల్వలు అట్టిపెట్టుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

అలాగే, కొలంబో పోర్ట్‌లోని పశ్చిమ కంటైనర్ టర్మినల్‌ నిర్మాణ, నిర్వహణ కాంట్రాక్టు భారత్‌కు చెందిన అదానీ గ్రూపుకు సెప్టెంబర్‌లో దక్కింది.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

''ఏ దేశం కూడా ప్రతిఫలం ఆశించకుండా మాకు సహాయం చేస్తుందని నేను అనుకోను. భారత్ తప్పకుండా తమ ప్రయోజనాలను చూసుకుంటుంది'' అని వామపక్ష జాతీయ పీపుల్స్ వార్ అలయన్స్‌కు చెందిన ఎంపీ హరిణి అమరసూరియా బీబీసీతో అన్నారు.

భారత్ తరహాలోనే శ్రీలంక కూడా తన ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

శ్రీలంకలోని తమిళ మైనార్టీలు, హక్కుల కోసం వారి డిమాండ్లు కూడా భారత్‌తో దౌత్య చర్యలపై ప్రభావితం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు.

1980లలో అనేక శ్రీలంక తమిళ తిరుగుబాటు గ్రూపులు, భారత్‌లో ఆశ్రయం పొందిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.

శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక మాతృభూమి కోసం పోరాడుతున్న సాయుధులకు భారత్ ఆయుధాలు, శిక్షణను అందించిందని శ్రీలంక ఆరోపించింది.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: ‘పెట్రోల్ దొరక్క సైకిల్ కొందామంటే.. సైకిల్ ధర రూ. 70,000 అయింది’

2009 మే నెలలో తమిళ వేర్పాటువాదులపై పైచేయి సాధించడంతో శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసింది. ఈ పోరాటంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత్ సాయం అందించింది.

అయితే, 1987 నాటి భారత్-శ్రీలంక శాంతి ఒప్పందాన్ని శ్రీలంక పూర్తిగా అమలు చేయలేదు. ఈ ఒప్పందంలో భాగంగా తమిళుల ఆధిక్యంగానున్న ప్రాంతాలతోపాటు ఇతర ప్రావిన్సులకు అధికారాల బదిలీ కూడా భాగంగా ఉంది.

''గతంలోనూ శ్రీలంక రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందేమోననే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి''అని అమరసూరియా చెప్పారు.

వీడియో క్యాప్షన్, గొటబయ రాజీనామాతో ప్రస్తుత శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుందా?

తమిళులు ఆధిక్యంగానుండే ఉత్తర శ్రీలంకకు చెందిన చాలా మంది శ్రీలంక పౌరులు ఇప్పటికే తమిళనాడులో ఆశ్రయం కోరుతున్నారు. ఈ సంక్షోభం ఇలానే కొనసాగితే ఈ శరణార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

శ్రీలంకలోని మైనారిటీలైన తమిళ, ముస్లింలు ఎప్పుడూ భారత్ సాయం కోరుతుంటారు. ముఖ్యంగా సమస్యలు చుట్టుముట్టినప్పుడు, హక్కుల కోసం వారు భారత్‌ సాయం చేయాలని అభ్యర్థిస్తుంటారు.

గతంలో కొన్ని తప్పిదాలు జరిగినప్పటికీ, భారత్ సాయాన్ని శ్రీలంకలోని సింహళ ప్రజలు ప్రశంసిస్తుంటారు.

''ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పటికీ శ్రీలంకలో సంస్థలకు చమురు సరఫరా చేస్తోంది''అని ఐటీ నిపుణుడు మొహమ్మద్ సూఫియాన్ అన్నారు.

''ఒకవేళ భారత్ లేకపోయుంటే మా బంకులు పూర్తిగా మూతపడి ఉండేవి''అని సూఫియాన్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)