నుస్రత్ మీర్జా మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని ఎలా కలిశారు, బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు?

నుస్రత్ మీర్జా

ఫొటో సోర్స్, MIRZANUSRATBAIG

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ న్యూస్

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ కాలమిస్ట్ నుస్రత్ మీర్జా గురించి భారతదేశంలో చర్చ జరుగుతోంది. ఆయన భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీని కలిశారనే వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే, తాను హమీద్ అన్సారీని నేరుగా ఎప్పుడూ కలవలేదని ఆయన చెప్పారు.

"మా ఇద్దరి మధ్య ఎటువంటి సమావేశం జరగలేదు" అని ఆయన బీబీసీకి చెప్పారు.

పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరికి ఇచ్చిన పత్రాలకు భారత్ కు ఎటువంటి సంబంధం లేదని కూడా నుస్రత్ మీర్జా స్పష్టం చేశారు. ఆ పత్రాలు రష్యాకు సంబంధించినవని అన్నారు. ఆ పత్రాల్లో పాకిస్తాన్ యూఎస్‌ఎస్‌ఆర్‌ ను కూలగొట్టిందనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఆ పత్రాలు 2005లో జరిగిన ఒక సదస్సుకు సంబంధించినవని చెప్పారు.

నుస్రత్ మీర్జాను కలవలేదని హమీద్ అన్సారీ కూడా ప్రకటించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం వివరణ కూడా ఇచ్చింది.

హమీద్ అన్సారీ భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో భారతదేశంలో జరగనున్న ఒక సమావేశానికి ఆయనకు ఆహ్వానం అందినట్లు పాకిస్తాన్ విలేఖరి షకీల్ చౌదరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నుస్రత్ మీర్జా చెప్పారు. ఈ పర్యటనలో సేకరించిన సమాచారాన్ని ఆయన ఐఎస్‌ఐ తో పంచుకున్నట్లు చెప్పారు.

ఇదే ఇంటర్వ్యూలో ఆయన భారత్‌కు ఐదు సార్లు వచ్చినట్లు చెప్పారు. బెంగళూరు, చెన్నై, చండీగఢ్, కోల్‌కతా, పాట్నా, లఖ్‌నవూ నగరాలను కూడా సందర్శించినట్లు చెప్పారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుస్రత్ మీర్జా ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఆధారంగా చేసుకుని హమీద్ అన్సారీ, కాంగ్రెస్ పార్టీ పై దాడి చేస్తోంది. ఈ ఇంటర్వ్యూ చుట్టూ అలుముకున్న వివాదం గురించి బీబీసీ నుస్రత్ మీర్జాతో మాట్లాడింది.

నుస్రత్ మీర్జా

ఫొటో సోర్స్, YOUTUBE SCREENSHOT

ఈ ఇంటర్వ్యూలో వివాదాస్పద ప్రశ్నలేంటి?

హమీద్ అన్సారీని కలవడం గురించి చెబుతూ, "హమీద్ అన్సారీ సదస్సుకు ఒక ముఖ్య అతిధిగా వచ్చి వెళ్లిపోయారు. అనవసరంగా ఆయన చిక్కుకుపోయారు" అని అన్నారు.

"వాళ్ళవి రెండు తప్పులున్నాయి. ముస్లిం, కాంగ్రెస్ పార్టీకి చెందిన కావడమే వారి తప్పు. ఈ రాజకీయ చెలగాటంలో బీజేపీకి కాంగ్రెస్‌కు మధ్య జరుగుతున్న పోరులో ఆయన చిక్కుకుపోయారు.

"ఆ సదస్సులో వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూడా ఉన్నారు. అక్కడ ఎంత మంది రాయబారులున్నారో చూడొచ్చు. అందులో హై కమీషనర్లు కూడా ఉన్నారు. పాకిస్తాన్ హై కమీషనర్ కూడా ఉన్నారు".

నన్నెప్పుడూ కలవలేదని హమీద్ అన్సారీ స్వయంగా చెప్పారు. ఆయనకు గుర్తుండి కూడా ఉండదు. ఆయన కేవలం షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ విధంగా చండీగఢ్‌లో 2005లో మన్‌మోహన్ సింగ్‌ని కూడా కలిసాను.

"సదస్సులో షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన ఆ వ్యక్తిని కలిసినట్లు చెబితే, నేను ఆయనను కలిసినట్లే. ఇలా అయితే, నేను భారత మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్‌ని కూడా కలిసాను. హెలో చెప్పాను".

వీడియో క్యాప్షన్, 75 ఏళ్లలో ఒక్క పాకిస్తాన్‌ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు, ఎందుకు?

మీరే పత్రాలు షేర్ చేశారు?

పాకిస్తాన్‌లో షేర్ చేసిన పత్రాల గురించి చెబుతూ, భారతదేశంలో సేకరించిన సమాచారాన్ని పాకిస్తాన్‌లో ఇచ్చానని ఇంటర్వ్యూలో చెప్పినట్లు సాంకేతికంగా తారుమారు చేశారని ఆరోపించారు.

"ఈ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అదనంగా చేర్చారు. విషయం పూర్తిగా వేరు. ఈ ఇంటర్వ్యూను చేసిన వ్యక్తి ఆఖరున ఇది చేర్చారు. ఇదెక్కడి నుంచో తీసి ఈ ఇంటర్వ్యూలో చేర్చారు".

"ఆ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన వారు కూడా హాజరయ్యారు. నేను 2005లో జరిగిన సదస్సు గురించి మాట్లాడుతున్నాను".

"ఈ సదస్సులో కేజీబికి చెందిన 40 మంది పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌లోని మొస్సాద్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. మా ప్రసంగం పూర్తైన తర్వాత ఇజ్రాయెల్ వారు కూడా మాట్లాడారు. ఆ తర్వాత రష్యన్లు కూడా ప్రసంగించారు".

"అందులో రష్యాకు చెందిన ఒక మహిళ మాట్లాడుతూ, పాకిస్తాన్ యూఎస్‌ఎస్‌ఆర్‌ ను కూల్చేసిందని అన్నారు. ఆమె ఆ పత్రాన్ని చదివారు. ఆ పత్రం నా దగ్గర ఉంది" అని అన్నారు.

"నేను ఆ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు నాయకత్వం వహించాను. ఇది తప్పని అధ్యక్షునితో చెప్పాను. పాకిస్తాన్‌కు అటువంటి ప్రణాళికలు లేవని చెప్పాను. ఇది నిజం, మీరు నమ్మండి" అని అన్నాను.

"నేనవే పత్రాలను తీసుకొచ్చాను. నేను ఆ పత్రాలనే పాకిస్తాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి ఖుర్షీద్ కసూరీకి ఇచ్చాను. ఇది 2005 నాటి సంగతి. ఆ పత్రాలను అప్పటి ఇంటెలిజెన్స్ అధికారి కయానీకి ఇమ్మని చెప్పారు. నాకు ఆయనెవరో తెలియదని చెప్పాను".

"మనం రష్యాను కూలగొట్టామని ఆరోపిస్తున్నారు" అని ఆయనతో చెప్పాను.

"ఈ పత్రాల్లో రష్యన్ల మధ్య జరిగిన వివాదాల గురించి సమాచారం ఉంది. కొన్ని పరిశోధన పత్రాలున్నాయి. ఆయన ఒక ఎర్రని పుస్తకాన్ని తీసుకొచ్చారు. అది నేను చదవలేదు. నేనా పుస్తకాన్ని చదవకుండానే వెనక్కి ఇచ్చాను".

"ఐఎస్‍ఐతో భారత్‌లో సేకరించిన సమాచారం పంచుకోవడం గురించి ఇంటర్వ్యూలో చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఇది తప్పు. నేనలా చెప్పలేదు" అని అన్నారు.

"పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం వల్లే పత్రాలను షేర్ చేశాను".

నుస్రత్ మీర్జాకు ఎవరో ఫోన్ చేసి ఆయన షేర్ చేసిన సమాచారం లాంటిది మరింత లభిస్తే బాగుంటుందని అన్నట్లు పాకిస్తాన్ విలేఖరి షకీల్ చౌదరికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పినట్లు చెప్పారు. అటువంటి సమాచారాన్ని మరింత సేకరించడం మంచిదని ఆ కాల్‌లో చెప్పినట్లు తెలిపారు.

వీడియో క్యాప్షన్, గల్ఫ్ ప్రభుత్వాల ఆగ్రహం వెనుక అక్కడి ప్రజల ఆక్రోశం ఉందన్న హామిద్ అన్సారీ

భారత్ నుంచి వెళ్లిన తర్వాత ఆయన ఇలా అన్నారా అని బీబీసీ ఆయనను ప్రశ్నించింది.

ఇందుకు సమాధానమిస్తూ 2005లో ఆయన మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరీకి పత్రాలను ఇచ్చినట్లు చెప్పారు. అందులో పాకిస్తాన్ పై ఆరోపణలు ఉండటంతో వాటిని ఇచ్చినట్లు చెప్పారు. కానీ, ఆ తర్వాత ఆయన ఎవరికీ ఎటువంటి పత్రాలు ఇవ్వలేదని చెప్పారు.

పత్రాలను 2005లో ఇవ్వడానికి, తర్వాత ఇవ్వడానికి తేడా ఏముంటుందని అడిగాం. "2005 తర్వాత ఆయన ఎవరికీ ఎటువంటి పత్రాలు ఇవ్వకపోవడమే తేడా" అని సమాధానమిచ్చారు.

కసూరీతో ఆయనకున్న సాన్నిహిత్యం గురించి అడిగినప్పుడు, "నాకు కసూరీ తండ్రి కూడా తెలుసు. నేను విద్యార్థి నాయకునిగా ఉండేటప్పుడు ఆయన జుల్ఫికర్ భుట్టో ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఆయనను కలుస్తూ ఉండేవాడిని" అని చెప్పారు.

పాకిస్తాన్‌లో భూకంపానికి, జపాన్‌లో సునామీకి అమెరికా కారణమని నుస్రత్ మీర్జా తన వ్యాసాల్లో రాసినట్లు షకీల్ చౌదరి పేర్కొన్నారు.

నుస్రత్ మీర్జా కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలకు సమాధానమిస్తూ, "మీరే చదవండి. నేను రాసిన 18 పుస్తకాలున్నాయి. మీరు చదవండి" అని అన్నారు.

ఐఎస్‌ఐ లేదా ఇతర ఇంటెలిజెన్స్ సంస్థలతో ఆయన సమాచారాన్ని పంచుకుంటున్నారా అని అడిగినప్పుడు, "అసలు లేదు. ఇది పూర్తిగా అబద్ధం. నేను ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాను. భారత్ నా జన్మస్థలం. నేనక్కడే పుట్టాను. నేనా దేశాన్ని చూడాలని అనుకున్నాను. కానీ, ఇలా జరిగింది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)