ముస్లింలు ఈ స్కూలు మీద ఒత్తిడి తెచ్చారా... విద్యార్థులు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థన చేయకూడదని చెప్పారా? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
- రచయిత, ఆనంద్ దత్
- హోదా, బీబీసీ కోసం
జార్ఖండ్ గఢ్వా జిల్లాలోని ఒక పాఠశాల తాజాగా వార్తల్లో నిలిచింది. కోర్వాడీ గ్రామంలోనున్న ఈ స్కూల్ గురించి జులై 4న ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ‘‘ఇక్కడ ఉండే ప్రజల్లో 75 శాతం మంది ముస్లింలే ఉన్నారు. కాబట్టి నిబంధనలు కూడా మాకు అనుగుణంగానే ఉండాలి’’అనే శీర్షిక ఆ వార్తకు పెట్టారు.
ఈ స్కూల్‌పై స్థానిక ముస్లింలు ఒత్తిడి తీసుకొచ్చి ప్రార్థన చేసే విధానాన్ని మార్చినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఇకపై చేతులు జోడించి చేసే నమస్కారానికి బదులుగా ఇక్కడి విద్యార్థులు చేతులు కట్టుకొని ప్రార్థన చేస్తారని వివరించారు.
మరోవైపు ‘‘దయా కర్ దాన్ విద్యా కా’’అంటూ ఇదివరకు ఇక్కడి ప్రార్థన ఉండేదని, ఇప్పుడు దాన్ని ‘‘తూ హీ రామ్ హై, తూ రహీమ్ హై, తూ కరీమ్ కృష్ణా ఖుదా హువా..’’గా మార్చినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.
ఈ వార్త తర్వాత ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగర్‌నాథ్ మహతో స్పందించాలని ట్విటర్‌లో బీజేపీ ఎమ్మెల్యే భాను ప్రతాప్ షాహీ ట్వీట్ చేశారు. ఒక మతాన్ని ప్రోత్సహించే రాజకీయాలు ఎట్టి పరిస్థితిల్లోనూ సహించకూడదని భాను వ్యాఖ్యానించారు.
దీనిపై మంత్రి మహతో స్పందిస్తూ.. ‘‘ సాభ్రాతృత్వానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనూ సహించబోం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. చదువుతో రాజకీయాలు చేస్తే అసలు ఊరుకోం. జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం’’అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ ట్వీట్ల తర్వాత, స్కూలుకు గఢ్వా జిల్లా మేజిస్ట్రేట్ రమేశ్ ఘోలప్, జిల్లా విద్యా శాఖ అధికారి కుమార్ మయాంక్ భూషణ్ వచ్చారు. చేతులు కట్టుకుని కాకుండా నమస్కరిస్తూ ప్రార్థనలు చేయాలని సూచించారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
అసలేం జరిగింది?
రాంచీకి 2017 కి.మీ. దూరంలోని ఈ పాఠశాలలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి జులై 7న బీబీసీ అక్కడకు వెళ్లింది. ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడి పాఠశాలలను సిబ్బంది శుభ్రంచేస్తూ కనిపించారు. సరిగ్గా 9.30కు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు ప్రార్థనల కోసం వరుస కట్టారు.
ఎనిమిదో తరగతి విద్యార్థులు అనురాధ కుమారి, సుహానా ఖతూన్, షాహానా ఖతూన్ మొదటగా ‘‘తూ హీ రామ్ హై, తూ రహీమ్ హై, తూ కరీమ్ కృష్ణా ఖుదా హువా..’’ ప్రార్థన చెబుతుంటే.. మిగతా విద్యార్థులు కూడా నమస్కరిస్తూ ప్రార్థనను చదివారు.
ప్రార్థన పూర్తయిన తర్వాత, అందరూ ‘‘జన గణ మన’’ పాడారు. ఆ తర్వాత ‘‘భారత్ మాతా కీ జై’అని నినాదాలు చేశారు. ఆ తర్వాత ఒక్కక్కరుగా విద్యార్థులు వరుసలో తమ తరగతులకు వెళ్లిపోయారు.
ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యుగేశ్వర్ రామ్ కూడా ఇదే పాఠశాలలో ఒకప్పుడు చదువుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘చాలా మంది విద్యార్థులు ప్రార్థన చేసేటప్పుడు నమస్కరించే వారు కాదు. అలా చేయకూడదని మేం చెప్పడానికి ప్రయత్నించాం. కానీ, విద్యార్థులు వినేవారు కాదు. అందుకే మేం చెప్పడం కూడా మానేశాం. నమస్కరించి ప్రార్థన చేసినా లేదా చేతులు కట్టుకుని ప్రార్థన చేసినా దేవుడి పేరు చెబితే చాలు’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
సమస్య ఏమిటి?
ఈ ప్రశ్నపై యుగేశ్వర్ స్పందిస్తూ.. ‘‘ఇక్కడ సమస్య ఏమిటంటే విద్యార్థులు నమస్కరించడం లేదు. మొదట్లో ముస్లిం విద్యార్థులు అలా చేసేవారు. ఆ తర్వాత హిందూ విద్యార్థులు కూడా చేతులు కట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు మాకు అసమానత కనిపించింది. దాన్ని తొలగించేందుకు మేం ప్రయత్నించాం’’అని ఆయన అన్నారు.
అయితే, పాఠశాల ప్రార్థన విషయంలో గ్రామస్థుల జోక్యం ఏమీలేదని స్పష్టంగా చెప్పగలనని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ప్రార్థనచేసే విధానం ఏమైనా మారిందా? అనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘‘మీడియాలో పాఠశాల గురించి వార్తలు వచ్చిన తర్వాత విద్యా శాఖ అధికారులు ఇక్కడకు వచ్చారు. నమస్కరించే ప్రార్థన చేయాలని వారు స్పష్టంచేశారు. అప్పుడు అందరూ నమస్కరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏ విద్యార్థి కూడా అప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు’’అని ఆయన తెలిపారు.
ఈ విషయంలో జిల్లా విద్యా శాఖ అధికారి కుమార్ మయాంక్ భూషణ్ మాట్లాడుతూ.. ‘‘ప్రార్థనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను జారీచేయలేదు. అయితే, శతాబ్దాలుగా నమస్కరించే ప్రార్థనలు చేస్తున్నాం. మేం ఆ పాఠశాలకు వెళ్లి కూడా పిల్లలు, టీచర్లు, గ్రామస్థులతో అదే చెప్పాం’’అని అన్నారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
పిల్లలు ఏమంటున్నారు?
‘‘ఇక్కడి విద్యార్థులు రెండు విధాలుగానూ ప్రార్థనలు చేస్తుంటారు. షాహానా ఖతూన్ నా స్నేహితురాలు. ఆమె మొదట్లో చేతులు కట్టుకొని ప్రార్థన చేసేది. నేను నమస్కరించేదాన్ని. మాకు ఇలా చేయమని ఎవరూ చెప్పలేదు. ఇందులో టీచర్లు లేదా తల్లిదండ్రులు.. ఎవరి ప్రమేయమూ లేదు’’అని ఎనిమిదో తరగతికి చదువుతున్న అనురాధా కుమారి చెప్పింది.
మరోవైపు సుహానా ఖతూన్ కూడా అదే విషయాన్ని మరోసారి చెప్పింది. ‘‘ప్రార్థనలో మేం రామ్, రహీమ్ ఇద్దరి పేర్లనూ తలచుకుంటాం. ఇందులో టీచర్లు లేదా ఉపాధ్యాయుల ప్రమేయం లేదు’’అని తను వివరించింది.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
ఇదే తరగతికి చెందిన ఔరంగజేబు కూడా బీబీసీతో మాట్లాడాడు. ‘‘ఇదివరకు హిందూ విద్యార్థులు నమస్కరించి ప్రార్థనలు చేసేవారు. మిగతావారు చేతులు కట్టుకునేవారు. లాక్‌డౌన్ తర్వాత అందరూ చేతులు కట్టుకొని ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతమంది అధికారులు స్కూలుకు వచ్చారు. ఇకపై అందరూ నమస్కరించి ప్రార్థనలు చేయాలని సూచించారు’’అని చెప్పాడు.
అయితే, ఇక్కడ పిల్లల్లో 75 శాతం మంది ముస్లింలే, అందుకే ప్రార్థనలు కూడా నమస్కరించి చేయకూడదని కొందరు గ్రామస్థులు వచ్చి సూచించారనేది అబద్ధమని ఔరంగజేబు చెప్పాడు.
కోర్వాడీ పంచాయతీ మొత్తం జనాభా 8,000 వరకు ఉంటుంది. దీనిలో కోర్వాడీ గ్రామంలో ఉండే వారు 5,000 వరకు ఉంటారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
ఈ గ్రామంలో 55 శాతం మంది ముస్లింలు, మిగవారు హిందువులని పంచాయతీ సర్పంచ్ షఫీక్ అన్సారీ చెప్పారు. ఈ గ్రామంలో ఒక మసీదు, రెండు దేవాలయాలు ఉన్నాయని ఆయన వివరించారు. మసీదు, శివాలయంల మధ్య దూరం 150 మీటర్ల కంటే తక్కువే ఉంటుందని తెలిపారు.
సర్పంచ్ కాకముందు, ఈ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీకి ఛైర్మన్‌గా షఫీక్ 14ఏళ్లు పనిచేశారు. ఈ వివాదంపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘ఈ స్కూలులో పిల్లల ప్రార్థనలపై ఎలాంటి అభ్యంతరాలూ లేవు. మతం లేదా కులం ఎలాంటి ప్రస్తావనా దీనిలో లేదు’’అని ఆయన అన్నారు.
‘‘మేం పిల్లలను స్కూలుకు పంపిస్తాం. మా బాధ్యత గేటుకు ఇవతలి వరకే ఉంటుంది. అక్కడ ఎలాంటి పాఠాలు చెబుతారు? ఎలా ప్రార్థనలు చేస్తారు? లాంటి విషయాలు టీచర్లే చూసుకుంటారు. పిల్లలు ప్రార్థనలో రామ్, రహీమ్, కృష్ణ పేర్లు చెబుతున్నారు. దీనిలో మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు’’అని ఆయన చెప్పారు.
మరి ఈ వివాదం ఎలా మొదలైంది? ఈ ప్రశ్నపై స్పందిస్తూ.. ‘‘ఇదంతా మీడియా వల్లే. మేం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక్కడ హిందూ-ముస్లింల మధ్య దృఢమైన సంబంధాలున్నాయి’’అని ఆయన వివరించారు.
‘‘ఒత్తిడి చేయడం ద్వారా ప్రార్థన చేసే విధానాన్ని మార్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదేమైనా షరియాతో సంబంధమున్న వివాదమా? ఇలాంటి రాజకీయాలను మానుకోవాలి. ఇది విద్యాలయం. దీన్ని విద్యాలయంగానే ఉంచాలి. ఇక్కడకు అన్ని మతాలకు చెందిన పిల్లలు వస్తుంటారు. ఇది ప్రభుత్వ పాఠశాల. మాకు రాజ్యాంగం, ప్రభుత్వ విధానాలపై నమ్మకం ఉంది. మేం వాటిని అనుసరిస్తాం’’అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
మరోవైపు, ఈ విషయంపై గ్రామస్థుడు రామేశ్వర్ చౌధరి కూడా మాతో మాట్లాడారు. ‘‘చూడండి నమస్కరించి ప్రార్థించినా లేదా చేతులు కట్టుకొని ప్రార్థించినా మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. స్కూలుపై ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన వార్తలో నిజం లేదు. ప్రార్థనలు ఎలా చేయాలని అనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. దీనిలో ఎవరి హక్కులు వారికి ఉంటాయి. అంతేకానీ, ఇక్కడ ఎవరూ ఒత్తిడి చేయలేదు’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
మరో గ్రామస్థుడు మఖ్సూద్ అన్సారీ మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసినంత వరకు రెండు విధానాలూ సరైనవే. నేను చదువుకునేటప్పుడు పిల్లలు రెండు విధాలుగానూ ప్రార్థనలు చేసేవారు. ఇలా చేయాలని వారికి ఎవరూ చెప్పలేదు’’అని ఆయన తెలిపారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఈ ప్రశ్నపై జార్ఖండ్ హైకోర్టు న్యాయవాది సొనాల్ తివారీ మాట్లాడుతూ.. ‘‘2013, అక్టోబరు 28న బాంబే హైకోర్టులోని జస్టిస్ అభయ్ శ్రీనివాస్, జస్టిస్ రేవతీ మోహితేలతో కూడిన ధర్మాసనం ఈ విషయంపై ఒక తీర్పును ఇచ్చింది’’అని చెప్పారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
‘‘ఆ తీర్పు ప్రకారం, నమస్కరించి ప్రార్థనలు చేయాలని విద్యార్థులపై ఒత్తిడి చేయకూడదు’’అని ఆయన అన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం జార్ఖండ్‌లో ముస్లింల జనాభా 48 లక్షల వరకు ఉంటుంది. ఇది రాష్ట్ర మొత్తం జనాభాలో 14.60 శాతం. గఢ్వా జిల్లాలోనూ ముస్లింల జనాభా 14.7 శాతం వరకు ఉంటుంది. ఇవి రెండు జాతీయ ముస్లిం జనాభా కంటే అర శాతం ఎక్కువ.
ఇవి కూడా చదవండి:
- పండర్‌పుర్ వారీ: ‘పీరియడ్స్ అనేవి పాండురంగడు ఇచ్చినవే. అవన్నీ ఆయనకే చెందుతాయి’
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- సీఐ నాగేశ్వర రావు అరెస్ట్, వివాహితను బెదిరించి, అత్యాచారం చేసిన ఆరోపణల కేసులో విచారిస్తున్న పోలీసులు
- వైసీపీ పేరు మార్పు..జీవితకాల అధ్యక్షుడిగా జగన్ అన్న పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












