నూపుర్ శర్మ వ్యాఖ్యలపై నిరసనలు: జైలులో ముస్లింలను కొడుతున్న వీడియోను షేర్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే- బాధిత కుటుంబాలు ఏమంటున్నాయంటే

- రచయిత, రజినీ వైద్యనాథన్, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ న్యూస్
కొందరు ముస్లిం యువకులను పోలీసులు ‘దారుణంగా’ కొడుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక శాసన సభ్యుడు షేర్ చేసిన ఈ వీడియోను లక్షల మంది చూశారు. పోలీసుల క్రూరమైన దెబ్బలను బాధితులకు దక్కిన బహుమతిగా ఆయన అభివర్ణించారు.
బాధితులను దారుణంగా కొడుతున్న అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు బాధితులను విడిచిపెట్టాలని, వారికి ఏమీ తెలియని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
‘‘తను మా తమ్ముడు. బాగా కొడుతున్నారు. తను చాలా గట్టిగా అరుస్తున్నాడు’’అంటూ జెబా కన్నీటి పర్యంతమయ్యారు. తన తమ్ముడు సైఫ్‌ను చితకబాదుతున్న వీడియోను ఫోన్‌లో చూస్తున్నప్పుడు ఆమె చేతులు గజగజ వణికాయి.
‘‘అసలు ఈ వీడియోను చూడలేకపోతున్నాను. తనను బాగా కొడుతున్నారు’’అని ఆమె ఏడ్చారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆమెను కుటుంబ సభ్యులు ఓదారుస్తూ కనిపించారు.
జెబా తమ్ముడితోపాటు మరికొంత మంది ముస్లిం యువకులను ఇద్దరు పోలీసులు తీసుకెళ్తున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.
ఆ ముస్లిం యువకులను పోలీసులు రాడ్డులతో చితకబాదుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ‘‘చాలా నొప్పి వస్తోంది. చాలా నొప్పి వస్తోంది. వద్దు! వద్దు! కొట్టొద్దు!!”అంటూ కొందరు అరుస్తున్నట్లు కనిపిస్తున్నారు. అందులో పచ్చ షర్టు వేసుకున్న ఒక వ్యక్తి చేతులు జోడించి కొట్టొద్దని వేడుకుంటున్నాడు. తెల్ల షర్టు వేసుకున్న సైఫ్ చేతులు పైకెత్తి లొంగిపోతున్నానని, కొట్టొద్దని చెబుతున్నాడు.

గత వారం పోలీసులు అరెస్టు చేసిన డజన్ల మంది ముస్లిం యువకుల్లో 24ఏళ్ల సైఫ్ ఒకరు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగిన నూపుర్ శర్మ.. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో వివాదం సృష్టించారు. దీనిపై శుక్రవారం ప్రార్థనల అనంతరం వేల మంది ముస్లిం యువకులు నిరసనలు చేపట్టారు.
ఈ వ్యాఖ్యల విషయంలో ముస్లిం దేశాలు, విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో నూపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది.
సహారన్‌పుర్‌లో నిరసనలు శాంతియుతంగానే చోటుచేసుకున్నాయి. నగరంలోని ప్రధాన మసీదు దగ్గర మొదలుపెట్టి షాపింగ్ కేంద్రాల ముందు నుంచి ముస్లింలు నిరసన ప్రదర్శన చేపట్టారు.
అయితే, కొన్ని షాపింగ్ కేంద్రాల యజమానులైన హిందువులు ఈ ప్రదర్శనపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ రెండు షాపింగ్ కేంద్రాల యజమానులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ గుమిగూడిన జనాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.
అయితే, ఇక్కడ హింస, అల్లర్లు సృష్టించారనే ఆరోపణలపై సైఫ్‌తోపాటు మరో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించడం తదితర ఆరోపణలు కూడా వీరిపై మోపారు.
అయితే, నిరసనలు చేపట్టే ప్రాంతానికి అసలు సైఫ్ వెళ్లలేదని అతడి కుటుంబం చెబుతోంది. వీరు కార్డ్‌బోర్డ్ బాక్సులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.
‘‘అతడు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఓ స్నేహితుడికి బస్ టికెట్ బుక్ చేయడానికి వెళ్లాడు. అప్పుడే పోలీసులు వచ్చి అరెస్టు చేసి, కోఠ్వాలీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు’’అని సైఫ్ కుటుంబం చెబుతోంది.
సైఫ్‌ను చూడటానికి స్టేషన్‌కు అతడి అక్క జెబా వెళ్లారు. అప్పుడు సైఫ్ శరీరంపై తీవ్రమైన గాయాలు కనిపించాయని ఆమె చెప్పారు. ‘‘ఒంటి నిండా గాయాలు కనిపించాయి. అతడు సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు’’అని జెబా చెప్పారు.

ఇది బహుమతి..
పోలీసులు దారుణంగా కొడుతున్నట్లు ఆ వీడియోలోనూ కనిపిస్తోంది. దీన్ని బీజేపీకి చెందిన శలభ్ త్రిపాఠీ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘రెబల్స్‌కు బహుమతి దక్కింది’’అని చెబుతూ ఈ వీడియోను ఆయన ట్వీట్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మీడియా సలహాదారుడిగా త్రిపాఠి పనిచేశారు. ఈ వీడియోను బీజేపీ నాయకులెవరూ ఖండించలేదు.
అయితే, 2014లో బీజేపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన అసహనానికి ఇది నిదర్శనమని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటూ చేస్తున్న విద్వేష వ్యాఖ్యలు కూడా పెరుగుతున్నాయని వారు వివరించారు.
సహారన్‌పుర్ కోఠ్వాలీ పోలిస్ స్టేషన్‌లో పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలుతిన్న వారి కుటుంబ సభ్యులతో బీబీసీ మాట్లాడింది. ఆ వీడియోల్లో ఉన్నది తమ కుటుంబ సభ్యులేనని వారు చెప్పారు.
అయితే, పోలీసుల నివేదికలోనూ అరెస్టు చేసిన వారిని ఆ స్టేషన్‌కే తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే, ఆ స్టేషన్‌లో ఇలా కొట్టారనే వార్తలను ఆ స్టేషన్ సిబ్బంది తిరస్కరించారు.

‘‘ఆన్‌లైన్‌లో రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఆ ఘటనలేవీ సహారన్‌పుర్‌లో చోటుచేసుకోలేదు. మీరు ఆ వీడియోను స్లోమోషన్‌లో చూస్తే, వేరే జిల్లా పేరు దానిలో కనిపిస్తుంది’’అని సీనియర్ పోలీసు అధికారి ఆకాశ్ తోమర్ బీబీసీతో తొలుత చెప్పారు.
అయితే, ఆ వీడియోను పరిశీలిస్తున్నామని, అవసరమైతే చర్యలు తీసుకుంటామని తర్వాత ఆయన వివరించారు.
మరోవైపు అరెస్టైన వారు ఎలా ఉన్నారో చూసేందుకు వారికి చెందిన కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఆ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
ఫమీదా కుమారుడు 19ఏళ్ల సుభాన్ తన స్నేహితుడు ఆసిఫ్‌ను వెతుక్కుంటూ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, సుభాన్‌ను కూడా అరెస్టుచేసి చితకబాదారు.
పసుపు రంగు షర్టు వేసుకున్న సుభాన్ వీడియోలో నేలపై పడిపోయి కనిపిస్తున్నాడు. శుక్రవారం అసలు మసీదుకు సుభాన్ వెళ్లలేదని, ఎలాంటి నిరసనల్లోనూ పాలుపంచుకోలేదని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
‘‘కనికరం అనేదే అకుండా నా కొడుకును కొట్టారు’’అంటూ ఫమీదా ఏడ్చారు.
శుక్రవారం ప్రార్థనల తర్వాత నిరసనలకు సంబంధించి మొత్తంగా 84 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

‘‘నేరస్థులను మాత్రమే అరెస్టు చేశాం’’
అయితే, నేరస్థులను మాత్రమే అరెస్టు చేశామని ఎస్పీ కుమార్ బీబీసీతో చెప్పారు. ‘‘మొదట నిరసన వీడియోలను వారికి చూపిస్తున్నాం. అందులో వారున్నారని గుర్తుపట్టిన తర్వాతే వారిని అరెస్టు చేస్తున్నాం’’అని ఆయన అన్నారు.
అయితే, ఆయన చెబుతున్న మాటలకు, బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్న మాటలకు పొంతన కుదరడం లేదు.
సహారన్‌పుర్‌లో ఇలాంటి నిరసనలకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో అధికారులు కూలదోయించారు.
భారత్‌లో లక్షల మంది తాత్కాలిక ఆవాసాలలో జీవిస్తుంటారు. చాలాచోట్ల వీటికి ఎలాంటి అనుమతులూ ఉండవు. నేరాలు జరిగేటప్పుడు శిక్షల పేరుతో ఇలాంటి ఇళ్లను కూలదోయడాన్ని వ్యూహంగా బీజేపీ అనుసరిస్తోంది.
తాజా నిరసనల్లో నిందితులుగా చెబుతున్న వారి ఇళ్లను కూలదోయడానికి బీజేపీ అగ్ర నాయకులు సమర్థిస్తున్నారు కూడా.
చట్టాలను ఉల్లంఘించే వారి ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తామని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ట్వీట్ చేశారు.

మరోవైపు యోగి మీడియా సలహాదారుడు మృత్యుంజయ్ కుమార్ కూడా ట్విటర్‌లో ఒక బుల్డోజర్ ఫోటో ట్వీట్ చేశారు. ‘‘శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
గత శనివారం మధ్యాహ్నం ముస్కాన్ ఇంటిని బుల్డోజర్‌తో అధికారులు కూలదోయించారు.
తన సోదరుడు ఇక్కడే ఉండేవాడా? అని అడుగుతూ ముస్కాన్ ఇంటికి పోలీసులు వచ్చారు. 17ఏళ్ల ముస్కాన్ సోదరుడిని పోలీసులు ఆ ముందు రోజే అరెస్టు చేశారు.
‘‘తను మా అబ్బాయేనని మా నాన్న చెప్పారు. ఏమైనా జరిగిందా అని అడిగారు’’అని ముస్కాన్ చెప్పారు.
‘‘వారేమీ చెప్పలేదు. కానీ, ఒక్కసారిగా బుల్డోజర్‌తో ఇంటిని కూలదోయడం మొదలుపెట్టారు’’అని ఆమె వివరించారు.
శుక్రవారం నాటి నిరసనల్లో ముస్కాన్ సోదరుడు కూడా నిందితుడని అధికారులు చెబుతున్నారు. అతడు కొంతమందిని రెచ్చగొడుతున్నట్లు చెబుతున్న దృశ్యాలను ఓ అధికారి బీబీసీకి చూపించారు.

ఫొటో సోర్స్, Getty Images
కొంతమందిని ఉద్దేశించి ముస్కాన్ సోదరుడు మాట్లాడుతూ ఆ వీడియోలో కనిపించారు. ‘‘ఈ దేశంలో ముస్లింలు నిద్రపోతున్నారు. నేడు వారు మేల్కోవాల్సిన సమయం వచ్చింది’’అని అతడు చెబుతున్నాడు.
అయితే, తన తమ్ముడిపై వస్తున్న ఆరోపణలను ముస్కాన్ ఖండించారు. ‘‘ఈ విధ్వంసానికి అతడు కారణం కాదు. అతడు ఇలాంటి పనులు చేసేవాడు కాదు. ఇవన్నీ అబద్ధాలు’’అని ఆమె అన్నారు.
అరెస్టైన వారి కుటుంబాల ఇళ్లు అనుమతులు లేకుండా నిర్మిస్తే వారికి నోటీసులు పంపించామని అధికారులు బీబీసీకి తెలిపారు.
‘‘ఈ కేసుపై విచారణ చేపడుతున్నప్పుడు ఆ కుటుంబం అక్రమంగా నిర్మించిన బంధువుల ఇంటిలో ఉంటున్నట్లు తెలిసింది’’అని సీనియర్ పోలీసు అధికారి రాజేశ్ కుమార్ బీబీసీతో చెప్పారు.
‘‘పోలీసుల బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది వారి ఇంటికి వెళ్లారు. తగిన చర్యలు తీసుకున్నారు’’అని కుమార్ అన్నారు. అరెస్టైన వారిలో మరికొందరి ఇళ్లు కూడా బుల్డోజరుతో కూలదోయించే అవకాశముందని ఆయన హెచ్చరించారు.

‘‘చట్టాలకు అనుగుణంగానే చర్యలు’’
‘‘బుల్డోజరు చర్యలను చట్టాలకు అనుగుణంగానే తీసుకున్నాం. ఇందులో చట్టాలను ఉల్లంఘించడం ఎక్కడా లేదు’’అని యోగి ఆదిత్యనాథ్ సలహాదారు నవనీత్ సెహగల్ చెప్పారు.
నిరసనల తర్వాత, పోలీసులు చిదకబాదడం, పెద్దయెత్తున అరెస్టులు, బుల్డోజర్లతో ఇళ్లు కూలదోయించడం తదితర చర్యలపై కొందరు మాజీ జడ్జిలు, ప్రముఖ న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేశారు.
మరోవైపు అసమ్మతిపై ఉక్కుపాదం మోపుతున్నారని హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా వ్యాఖ్యానించింది.
‘‘ధైర్యంతో ముందుకు వచ్చి మాట్లాడుతున్న, విపక్షపై గళం ఎత్తుతున్న ముస్లింలను భారత ప్రభుత్వం అణచివేస్తోంది’’అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన ఆకర్ పటేల్ వ్యాఖ్యానించారు.
మరోవైపు సహారన్‌పుర్‌లో మున్ని బేగం చాలా ఆందోళనలో ఉన్నారు. తన కుమారుడు, భర్తలను కూడా పోలీసులు చిదకబాదారు.
వారు ఎప్పుడు ఇంటికి వస్తారో కూడా ఆమెకు తెలియదు. ‘‘అమాయకులైన నా కొడుకు, భర్తను జైలులో పెట్టారు. ఇప్పుడు నా కుమార్తెలతో నేను ఒక్క దాన్నే ఉంటున్నాను. ఇది కొత్తగా కట్టించిన ఇల్లు. దీన్ని కూలదోయించేస్తారేమోనని భయమేస్తోంది. రాత్రి అసలు నిద్ర కూడా పట్టడం లేదు’’అని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- 'అగ్నిపథ్' పథకంతో ప్రయోజనం ఎవరికి? ఇండియన్ ఆర్మీకి మేలు ఎంత? అగ్నివీర్లకు మేలు ఎంత?
- సాద్ అన్సారీ ఎవరు? నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదంలో ఈ ముస్లిం యువకుడిని ఎందుకు అరెస్టు చేశారు?
- బిట్ కాయిన్ ఎందుకు ఇంత వేగంగా కుప్పకూలుతోంది?
- అచ్చం మీలాగే ఉండే, మీలాగే ఆలోచించే డిజిటల్ ట్విన్ రూపొందిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- 68 అడుగుల లోతులో 5 రోజులు నరకయాతన.. పదేళ్ల మూగ బాలుడిని ఎలా రక్షించారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















