గోదావరి వరదలు: 1986 నాటి స్థాయిలో పొంగితే ఏటి గట్లు నిలుస్తాయా, స్థానికుల ఆందోళన ఏంటి

ఫొటో సోర్స్, UGC
- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
గోదావరిలో వరద తీవ్రత పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. భద్రాచలం వద్ద గడిచిన 35 ఏళ్లలో అత్యధిక నీటిమట్టం నమోదయ్యింది. అప్పట్లో వరదల తాకిడికి గురయిన కోనసీమ, కొన్నేళ్లుగా వరదల గండం నుంచి గట్టెక్కడానికి కారణాలేంటి, అందుకు తోడ్పడిన ఏర్పాట్లు ఏమిటనే చర్చ సాగుతోంది.
ఈసారి ముప్పు ఎదురుకాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు ఎంత మేరకు ఫలిస్తాయోననే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.
1953లో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ 1986లో వరద బీభత్సం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏకంగా గోదావరికి ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలోనే కాటన్ నిర్మించిన ఆనకట్ట గోదావరి ఉధృతికి కొట్టుకుపోయింది.
1990లో మరోసారి భారీ వరదలు వచ్చాయి. కానీ 2006 వరదల్లో కోనసీమ తీవ్రంగా నష్టపోయింది. అయినవిల్లి మండలంలో ఉన్న శానపల్లిలంక, పి.గన్నవరం మండలం మొండెపులంక సమీపంలో ఏటిగట్లు దెబ్బతిన్నాయి. వందల గ్రామాలు జలమయమయ్యాయి. వేలమంది ఇళ్లు, ఊళ్లూ ఖాళీ చేయాల్సి వచ్చింది.
ఈ భారీ వరదల అనుభవాలతో ఆ తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు తదుపరి వచ్చిన భారీ వరదల నుంచి కోనసీమ గట్టెక్కడానికి తోడ్పడ్డాయన్న అభిప్రాయం ఉంది.

ఫొటో సోర్స్, UGC
ఏటేటా వరదలే..
కోనసీమ చరిత్రలో గోదావరి వరదలు 2006కి ముందూ, ఆ తర్వాత అన్నట్టుగా ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్ టి.కె. విశ్వనాథం అభిప్రాయపడ్డారు. 2006 నాటి వరదల అనుభవంతో ప్రభుత్వం తీసుకున్న చర్యలు దానికి ప్రధాన కారణమని ఆయన బీబీసీకి తెలిపారు.
"2006 వరదల తర్వాత ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించి ఏటిగట్లు పటిష్టం చేసింది. 1986 వరదల నాటి నీటిమట్టానికి అనుగుణంగా ఎత్తు పెంచింది. దాంతో 35 లక్షల క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం నుంచి డిశ్చార్జ్ చేసే ప్రమాదం వచ్చినా తట్టుకునేందుకు అనుగుణంగా మార్చారు. అది చాలా మేలు చేసింది. 2006కి ముందు ఏటేటా వరదల భయంతో కోనసీమ వణికిపోయేది. భద్రాచలం వద్ద 50 అడుగులకు చేరుతుందంటేనే భయం ఉండేది'' అన్నారు విశ్వనాథ్.
2010, 2013, 2020లో కూడా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవాహం సాగినా ఎటువంటి నష్టం జరగకుండా కోనసీమ ఊపిరిపీల్చుకుందని విశ్వనాథ్ గుర్తు చేశారు.
వందల కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన ఏటిగట్ల కారణంగానే ఇది సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, UGC
''ఆ వరదలను మరచిపోలేం..''
గోదావరి పై సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట కట్టిన తర్వాత వచ్చిన వరదల్లో, ఎక్కువ నష్టం 1986లో సంభవించినట్టు ఇరిగేషన్ రికార్డులు చెబుతున్నాయి. ఆ వరదల్లో ఏకంగా ఏడు ప్రాంతాల్లో గోదావరికి ఇరువైపులా గండ్లు పడ్డాయి. దానికి కారణంగా ఉభయ గోదావరి జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
"గోదావరి పోటెత్తడంతో గండ్లుపడ్డాయి. పి.గన్నవరం వంటి చోట్ల అక్విడక్ట్ మీద నుంచి ప్రవాహం సాగింది. ధవళేశ్వరంలో కాటన్ ఆనకట్ట ఆనవాళ్లు కూడా లేకుండా కొట్టుకుపోయింది. అపార నష్టం జరిగింది. నాటి సీఎం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ప్రధాని రాజీవ్ గాంధీ కూడా వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరదల్లో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత నష్టం గోదావరి వరదల్లో ఎన్నడూ లేదు. ఈ వరద అనుభవాలనే ప్రామాణికంగా చేసుకుని తదుపరి వరద నిర్వహణకు పూనుకున్నారు. ఇప్పటికీ 1986 స్థాయికి అనుగుణంగానే ఏటిగట్లు సహా అన్నింటినీ పరిశీలిస్తూ ఉంటారు" అని రాజమహేంద్రవరానికి చెందిన మండేల శ్రీరామ్మూర్తి అన్నారు.
గోదావరికి వరద తాకిడి పెరుగుతున్నా ప్రజల్లో ధీమా ఉండడానికి ఏటిగట్లు బలపడడమే కారణంగా ఆయన బీబీసీకి వివరించారు. అయితే 1986 స్థాయిలో మరో వరద రాకపోవడంతో గట్ల సామర్థ్యానికి ఇప్పుడు వస్తున్న వరద ఓ పరీక్షగా భావించాలని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, UGC
'ఈ వరదల నుంచి గట్టెక్కగలమా'
1986, 2006 వరదల ప్రభావానికి గురై తేరుకున్న కోనసీమ వాసులు ఈసారి వరదల విషయంలో మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా అనేక వరదల తాకిడి నుంచి గట్టెక్కినప్పటికీ, ఇప్పుడు మాత్రం మరోసారి ఉపద్రవం ముంచుకొస్తుందేమోననే భయంతో ఉన్నారు.
కోనసీమలోని పలు లంకల వాసుల్లో ధీమా ఉన్నప్పటికీ భయం మాత్రం వెంటాడుతోందని ముమ్మిడివరం మండలానికి చెందిన బీరక రత్నమ్మ అన్నారు.
"మేం లంకల్లో ఉంటాం. ఏటా గోదావరికి వరదలు వస్తుంటాయి. రెండు, మూడు రోజులు ప్రవాహం ఉంటుంది. అన్ని సామాన్లు సర్థుకుని నీటికి తడవకుండా చూసుకుంటాం. 20, 30 ఏళ్లుగా మాకిదే అనుభవం. కానీ ఈసారి మాత్రం నాలుగు రోజులుగా వరద తగ్గడం లేదు. మళ్లీ ఈరోజు నుంచి పెరుగుతుందని అంటున్నారు. 86 నాటి వరదల స్థాయికి వస్తే మాకు ముప్పు తప్పదు" అని ఆమె బీబీసీతో అన్నారు.
గట్లు బలంగానే కనిపిస్తున్నప్పటికీ అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు చాలాచోట్ల సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదని రిటైర్డ్ ఇరిగేషన్ అధికారి కందికట్ట రామారావు అన్నారు.
"గోదావరి గట్లు వల్ల కొంత ధైర్యం వచ్చింది. కానీ కొన్ని చోట్ల వాటి బలహీనతలు బయటపడుతున్నాయి. జాగ్రత్తగా వరద నిర్వహణ సాగాలి. ఏమరపాటుతో ఉంటే అపారనష్టం సంభవిస్తుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు దిగువన 2020 నాటి వరదలకే సమస్యలు వచ్చాయి. కోనసీమలోని కె.గంగవరం వంటి ప్రాంతాల్లో కూడా ముప్పు ఉంది. అలాంటి చోట్ల సమగ్ర చర్యలు చేపట్టాలి'' అని రామారావు బీబీసీతో అన్నారు.
అవుట్ ఫాల్ స్లూయిజ్‌ల నిర్వహణ సరిగా లేదని, వాటి వల్ల వరద నీరు వెనక్కి పొంగే ప్రమాదం ఉందన్న ఆయన, ధవళేశ్వరం నుంచి 24 లక్షల క్యూసెక్కులకి దాటిపోతే ముప్పు పెరుగుతుదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, UGC
'అన్ని చర్యలు తీసుకుంటున్నాం..'
భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద తాకిడిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అవసరమైన అన్ని చర్యలకు సిద్ధమవుతున్నట్టు ఇరిగేషన్ హెడ్ వర్క్స్ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు బీబీసీకి తెలిపారు.
''వరదల నియంత్రణలో అప్రమత్తంగా ఉన్నాం. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. భారీ వరద రాబోతోందనే అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగా వస్తున్న నీటిని యధావిధిగా సముద్రంవైపు తరలిస్తున్నాం. దిగువన గట్లు కూడా బలహీనంగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఇసుక బస్తాలు సహా రక్షణ సామాగ్రి సిద్ధం చేశాం'' అని విశ్వేశ్వరరావు అన్నారు.
గడిచిన నాలుగు దశాబ్దాల కాలంతో పోలిస్తే పెరిగిన కమ్యూనికేషన్ సదుపాయాల కారణంగా వరద నియంత్రణకు కొంత అవకాశం ఉందని విశ్వేశ్వరరావు అభిప్రాయపడ్డారు.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శుక్రవారం ఉదయం 9.40 గంటల ప్రాంతంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. నీటి మట్టం 17.75 అడుగులకు చేరడంతో ఇరిగేషన్ ఎస్.ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. దాదాపు 20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- గోదావరి వరదలు: జులై నెలలో ఈ స్థాయి వరద వందేళ్లలో ఇదే తొలిసారి , ముంపు గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
- రాణి రుద్రమ దేవి వారసుడు ఈయనేనా, ఇన్నాళ్లూ ఎక్కడున్నారు
- శ్రీలంక సంక్షోభం: దివాలా తీసిన దేశంలో ప్రతిరోజూ బతుకు గండమే శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసిందనే వదంతులు భారత్‌పై ఎందుకు వస్తున్నాయి
- ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- వైసీపీ పేరు మార్చడం సాధ్యమవుతుందా, గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














