Hindu Marriage Act: ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
"భాగస్వామి వ్యక్తిత్వాన్ని అనుమానించడం, ఆఫీసుకు వెళ్లి గొడవ చేయడం, సహోద్యోగులతో శారీరక సంబంధాలున్నాయని ఆరోపించడం క్రూరత్వం కింద పరిగణించవచ్చు" అని ఒక విడాకుల కేసులో మద్రాస్ హై కోర్టు జూలై 05న తీర్పు వెలువరించింది.
ఇదే తీర్పులో భార్య మంగళ సూత్రాన్ని తొలగించడం అనే ఒక్క అంశమే భర్తను మనోవేదనకు గురి చేయడంగా చెప్పలేమని, అయితే తాళిని తొలగించడం వైవాహిక బంధాన్ని కొనసాగించేందుకు ఆసక్తి లేదనే ఉద్దేశ్యాన్ని ప్రదర్శించడమవుతుందని స్పష్టం చేసింది.
ఈ తీర్పును జస్టిస్ వి.ఎం వేలుమణి, జస్టిస్ ఎస్. సౌందర్‌లతో కూడిన బెంచ్ వెలువరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసు పూర్వాపరాలు ఏంటి?
సి. శివకుమార్, శ్రీ విద్యలకు 2008లో వివాహం జరిగింది. అయితే, ఒక పాప పుట్టిన తర్వాత 2011 నుంచి ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు.
భార్య తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడంతో పాటు మంగళ సూత్రాన్ని కూడా తొలగించినట్లు చెబుతూ సి. శివకుమార్ 2014లో ఈరోడ్ ఫ్యామిలీ కోర్టులో కేసును నమోదు చేశారు. అయితే, ఈ కేసులో విడాకులు మంజూరు చేసేందుకు తగిన ఆధారాలు చూపించలేదని చెబుతూ ఫ్యామిలీ కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది.
అయితే, మద్రాస్ హైకోర్టు ఈ కేసును తిరిగి స్వీకరించింది.
వైవాహిక బంధాన్ని కొనసాగించాలనే ప్రయత్నాలు విఫలం కావడంతో విడాకులు కోరుతూ శివకుమార్ పిటిషన్ వేశారు. భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు భార్యా భర్తల బంధానికి ప్రతీకగా భావించే మంగళ సూత్రాన్ని తొలగించినట్లు ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
భర్తకు వేరే మహిళలతో సంబంధాలున్నాయని, వారితో అర్ధరాత్రి వరకూ మాట్లాడుతూ ఉంటారని స్థానిక పోలీసు స్టేషన్‌లో నమోదు చేసిన ఫిర్యాదులో శ్రీ విద్య పేర్కొన్నారు. అయితే, తమ కూతురి భవిష్యత్తు కోసం భర్తతో కలిసి జీవించాలని అనుకుంటున్నట్లు ఇదే ఫిర్యాదులో తెలిపారు.
ఈ కేసును విచారించిన మద్రాస్ హై కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు తీర్పులో ఏముంది?
భర్త వ్యక్తిత్వాన్ని అనుమానించి, పని చేస్తున్న ఆఫీసుకు వెళ్లి ఆయన పరువును తీయడం క్రూరత్వం కిందకే వస్తుందని పేర్కొంటూ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య చేసిన ఈ చర్య హిందూ వివాహ చట్టం లోని సెక్షన్ 13(1) (ia) ప్రకారం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు తెలిపింది.
ఈ చర్య భర్త ప్రతిష్టకు తీవ్రమైన భంగం కలిగిస్తుందని చెప్పింది.
దీంతో పాటు, భార్య తాళిని తొలగించడం కూడా వైవాహిక బంధాన్ని కొనసాగించేందుకు ఆసక్తి లేదని తెలియచేయడమేనని కోర్టు చెప్పింది. అయితే, ఈ ఒక్క చర్యే మానసిక వేదనకు కారణమవుతుందని చెప్పలేమని, ఈ పిటిషన్ వెనక మొత్తంగా ఆమె చర్యలను క్రూరత్వంగా చెప్పవచ్చని పేర్కొంది.
"హిందూ వివాహ సంప్రదాయంలో అమ్మాయి మెడలో తాళి కట్టడం ఒక తప్పనిసరి క్రతువుగా ఉండటం అందరికీ తెలిసిన విషయమే. తాళిని తొలగించడం సంప్రదాయానికి వ్యతిరేక చర్యగా పిటిషనర్ చూడవచ్చు. తాళిని ఒకసారి తొలగించడం వైవాహిక బంధాన్ని అంతం చేసుకునేందుకు కారణం కాకపోవచ్చు. అయితే, ఈ కేసులో తాళిని తొలగించడం వెనుక ఆమెకున్న ఉద్దేశ్యాన్ని తెలుపుతోంది. ఈ కేసులో లభించిన ఇతర ఆధారాలతో పాటు, తాళిని తొలగించడం కూడా ఆమెకు వైవాహిక బంధాన్ని కొనసాగించే ఉద్దేశ్యం లేనట్లుగా కనిపిస్తోంది" అని కోర్టు పేర్కొంది.
వైవాహిక బంధానికి ముగింపు పలికే ఉద్దేశ్యంతో తాళిని తొలగించి విసిరి కొట్టినట్లు భార్య స్వయంగా అంగీకరించినట్లు తీర్పులో పేర్కొన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
చట్టం ఏం చెబుతోంది?
"భాగస్వామిని మానసికంగా, శారీరకంగా వేధించడం, భాగస్వామి ప్రతిష్టను భంగపరిచే విధంగా ప్రవర్తించడం క్రూరత్వం కిందకే వస్తుంది" అని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది శ్రీ కాంత్ చింతల చెప్పారు.
"భాగస్వామి వ్యక్తిత్వాన్ని బహిరంగంగా కించపరిచే అధికారం ఎవరికీ ఉండదు. చాలా సార్లు గృహ హింస కేసుల్లో తమ హక్కులను కాపాడుకోవడం కంటే, అవతలి వ్యక్తి పై పగ తీర్చుకోవడమే ఎక్కువగా కనిపిస్తోంది" అని అన్నారు.
"తాళి లేదా మంగళ సూత్రం మత సంప్రదాయానికి సంబంధించిన వ్యవహారం. పరస్పర అంగీకారంతో తాళి తొలగించడం, లేదా ఫ్యాషన్ కోసం తీసి పక్కన పెట్టడం వేరు. తాళి తొలగించిన ఉద్దేశ్యం, పరిస్థితులను కూడా కోర్టులు పరిగణిస్తాయి. కేవలం తాళిని తొలగించడం క్రూరత్వం కాదు. ఈ ఒక్క విషయమే విడాకుల మంజూరుకు కారణం కాదు" అని అన్నారు.
"ఈ కేసులో లభించిన ఇతర ఆధారాల ఆధారంగా ఈ తీర్పును ప్రకటించారు కానీ, కేవలం తాళిని తొలగించడం మనోవేదనకు గురి చేసినట్లుగా కోర్టులు పరిగణించలేదు" అని శ్రీకాంత్ అన్నారు.

"తాళిని తొలగించడం మానసిక వేదనే"
ఈ తీర్పులో భాగంగా మద్రాస్ హై కోర్టు 2016లో వల్లభి వెర్సస్ ఆర్ రాజా సబాహి కేసులో ఇచ్చిన తీర్పును ఉదహరించారు.
ఈ కేసులో తాళికి సంబంధించి న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యానం ఇలా ఉంది.
"భార్య తాళిని తొలగించి బ్యాంకు లాకర్‌లో పెట్టినట్లు స్వయంగా అంగీకరించారు. భర్త బ్రతికి ఉండగా హిందూ మహిళలు తాళిని తొలగించరనేది అందరికీ తెలిసిన విషయమే. భార్య మెడలో తాళి వైవాహిక బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. భర్త మరణించిన తర్వాత మాత్రమే తాళిని తొలగిస్తారు. తాళిని తొలగించడం భర్తను మానసిక వేదనకు గురి చేయడం కిందకే వస్తుంది. ఇది భర్తకు తీవ్రమైన మానసిక వేదన కలిగించి ఉంటుంది" అని ఆ కేసులో కోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
ఉద్దేశ్యమే ప్రధానం
వివాహంలో పాటించాల్సిన కొన్ని ఆచార వ్యవహారాలను ఉద్దేశ్యపూర్వకంగా పాటించకపోవడం వైవాహిక బంధాన్ని నిర్లక్ష్యం చేయడమే అవుతుందని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది చిత్రలేఖ అన్నారు.
"ప్రాచీన కాలంలో వివాహితులకు, అవివాహితులకు మధ్య ఉన్న తేడాను గుర్తించేందుకు తాళి అనే విధానాన్ని సృష్టించి ఉండవచ్చు".
"ఆధునిక కాలంలో తాళి ధరించడం ఎంత వరకు ప్రాముఖ్యత వహిస్తుందో కూడా ఆలోచించాలి. తాళి ధరించకుండా కూడా భార్యగా వ్యవహరించవచ్చు. తాళి ధరించడం వల్ల భార్య పై భర్తకు యాజమాన్య హక్కులను ఇస్తుందా?" అని చిత్ర ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
పితృస్వామ్య చిహ్నాలు
"మంగళ సూత్రం ధరించడం, సింధూరం, మెట్టెలు పెట్టుకోవడం వైవాహిక బంధంలో చిహ్నాలు మాత్రమే. కానీ, అవి ధరించలేనంత మాత్రాన భర్త పై ఇష్టం లేకపోవడం అని మాత్రం చెప్పలేం" అని పాపులేషన్ ఫస్ట్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ శారద అన్నారు.
"ఈ చిహ్నాలు మహిళకు మాత్రమే ఎందుకుంటాయని ప్రశ్నించారు. ఇవన్నీ పితృస్వామ్య చిహ్నాలు. ఇవి ధరించడం, ధరించకపోవడం బంధంలో ఉన్న పటిష్టతను నిర్ణయించలేవు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ పార్లమెంటు ఇవి కొత్త భవనంపై మూడు సింహాల విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజ్యాంగ విరుద్ధమా?
- అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు
- Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
- గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి డా చదవండి: • మోదీ పార్ల ముందే పసిగట్టలేమా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












