Sri Lanka Crisis: అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు

గోటాబయ రాజపక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోటాబయ రాజపక్ష

శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష రాజీనామా చేస్తానని ప్రకటించినట్లు స్పీకర్ వెల్లడించారు. దీంతో తర్వాత ఏం జరుగుతుందోనని ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం గోటాబయ ఎక్కడున్నారో తెలియడం లేదు. అయితే, ఆయన ఒక నౌకలో వెళ్లిపోయారని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గోటాబయ ప్రజల ముందు కనిపించకపోవడంతో ఇప్పుడు అధక్షుడి పరిస్థితి ఏమిటి? ఆయన తర్వాత ఆ పదవిలో ఎవరు కొనసాగుతారు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

శ్రీలంక

రాజ్యాంగంలో ఏముంది?

పదవీ కాలం పూర్తికాకముందే, అధ్యక్షుడి పదవి ఖాళీ అయినప్పుడు ఏం చేయాల్సి ఉంటుందో శ్రీలంక రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. పార్లమెంటులో మరో సభ్యుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.

తర్వాత ఆ పదవిని చేపట్టేవారు పదవీ కాలంలో మిగిలిన కాలానికి మాత్రమే అధ్యక్షుడిగా కొనసాగుతారు.

అధ్యక్షుడు రాజీనామా చేసిన నెల రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రయక్రియలు మొదలు కావాలి.

శ్రీలంక

ఫొటో సోర్స్, REUTERS/DINUKA LIYANAWATTE

ఎలా జరుగుతుంది?

అధ్యక్షుడు రాజీనామా చేసిన మూడు రోజుల్లోగా పార్లమెంటు సమావేశం కావాల్సి ఉంటుంది. దీనిలో అధ్యక్షుడి రాజీనామాపై పార్లమెంటు సెక్రటరీ జనరల్ ప్రకటన చేస్తారు. ఆ తర్వాత సభ్యుల్లో ఒకరి కంటే ఎక్కువ మంది అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తే, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు.

అప్పటివరకు ఏం జరుగుతుంది?

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ప్రధాన మంత్రి.. ఆ పదవిలో కొనసాగొచ్చు. అయితే, ఇప్పుడు ప్రధాన మంత్రి పదవికి రణిల్ విక్రమసింఘె రాజీనామా చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రధాన మంత్రి లేనిపక్షంలో స్పీకర్.. అధక్ష పదవిలో కొనసాగొచ్చు.

ఒకవేళ అధ్యక్ష పదవికి విక్రఘసింఘె నామినేషన్ వేస్తే ఏమవుతుంది?

విక్రమసింఘె

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విక్రమసింఘె

పార్లమెంట్‌లో రణిల్ విక్రమసింఘెకు మద్దతు లభిస్తుందా?

"అవకాశం లేదు"అని శ్రీలంకకు చెందిన రాజకీయ విశ్లేషకుడు నిక్సన్ చెప్పారు. ‘‘పార్లమెంటులో విక్రమసింఘె పార్టీకి చెందిన ఏకైక సభ్యుడు విక్రమసింఘే మాత్రమే. అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యాయి. 225 మంది సభ్యులున్న పార్లమెంట్లో తమకు 113 మంది సభ్యుల మద్దతు ఉందని సాజిత్ ప్రేమదాస నేతృత్వంలోని ప్రతిపక్షాలు చెబుతున్నాయి’’అని ఆయన అన్నారు.

సాజిత్ ప్రేమదాస

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాజిత్ ప్రేమదాస

గోటాబ‌య దిగిపోవ‌డానికి నిరాక‌రిస్తే ఏం జ‌రుగుతుంది?

"రాజకీయ సంక్షోభం మరింత ముదురుతుంది. ఆయన రాజీనామా చేయడానికి నిరాకరిస్తే ఏమీ చేయలేం. అదే సమయంలో, తన ఇల్లు, కార్యాలయం నిరసనకారుల నియంత్రణలో ఉండటంతో ఆయన ఏ పనీ చేయలేరు"అని నిక్సన్ చెప్పారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సైన్యాన్ని కూడా గోటాబయ ఉపయోగించుకోవచ్చని నిక్సన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: ఆర్థిక ప్రమాణాల్లో ముందున్న శ్రీలంక ఎందుకిలా కుదేలైంది?

అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా?

ఇది కూడా ప్రతిపక్ష పార్టీల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పటికే పిలిచిన అఖిల పక్ష సమావేశాలకు ప్రతిపక్ష పార్టీలు వెళ్లలేదు. తమ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విపక్షాలు భావిస్తున్నాయి.

ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉందా?

ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు. కాబట్టి ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు.

వీడియో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్షుడి అధికారిక నివాసంలో నిరసనకారులు, స్విమ్మింగ్ పూల్లో స్నానాలు

అధ్యక్షుడు మారితే సమస్య పరిష్కారం అవుతుందా?

‘‘ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం దగ్గర నిత్యవసర సేవలకు కూడా డబ్బులు లేవు. చాలా ఆసుపత్రులు ఇప్పుడు విరాళాలు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాయి. చమురు నిల్వలు అడుగంటిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు పనిచేయడం లేదు. కాబట్టి ఎవరు అధ్యక్షుడైనప్పటికీ, ఆర్థిక పరిస్థితి వెంటనే మారే అవకాశం లేదు"అని నిక్సన్ చెప్పారు.

‘‘అదే సమయంలో రాజకీయ సంక్షోభం కొనసాగితే.. ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడం కష్టం అవుతుంది’’అని నిక్సన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)