Rishi Sunak: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులోకి ప్రవేశించిన రిషి సునక్

ఫొటో సోర్స్, Getty Images
బోరిస్ జాన్సన్ మంత్రి వర్గం నుంచి వైదొలిగిన తొలి ఇద్దరు మంత్రులలో రిషి సునక్ మొదటివారు. బోరిస్ జాన్సన్ రాజీనామాతో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి, బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్ధిత్వానికి ఆయన పోటీలోకి దిగారు.
మంగళవారం నాడు జాన్సన్ క్యాబినెట్‌కు సునక్ రాజీనామా చేసిన తర్వాత మిగిలిన మంత్రులు కూడా ఒక్కరొక్కరుగా రాజీనామాలు చేయడం ప్రారంభించారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు జాన్సన్ ప్రధానమంత్రిగా కొనసాగుతారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ పదవికి ఇంకా టామ్ టుగెన్‌ధాట్, అటార్నీ జనరల్ సుయెల్లా బ్రవర్‌మాన్, మాజీ మంత్రి కెమీ బాడెనోచ్, మాజీ విదేశాంగ కార్యదర్శి జెరెమీ హంట్, రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్, మాజీ ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ లు కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు తాము పోటీలో ఉన్నట్లు చెప్పినా, తర్వాత తప్పుకున్నారు.
నాయకత్వం కోసం పోటీకి సంబంధించిన టైమ్ టేబుల్‌ను వచ్చే వారం నిర్ధరిస్తారు. సెప్టెంబర్ నాటికి కొత్త ప్రధాన మంత్రి పదవిని చేపడతారని భావిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించడం, ఆర్ధిక వ్యవస్థను బాగు చేయడం, దేశాన్ని ఏకం చేయడం కోసం తాను ప్రధాని మంత్రి రేసులోకి ప్రవేశించినట్లు సునక్ సోషల్ మీడియా వీడియోలో ప్రకటించారు.
''ఇది సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం'' అని ఆయన అన్నారు.
"ఇప్పుడున్న పరిస్థితులపై పోరాడదామా, లేక ఓదార్పునిచ్చే అద్భుతమైన కథలు చెప్పుకుని ప్రస్తుతానికి ఆనందపడి, భవిష్యత్తు తరాలను ప్రమాదంలోకి నెడదామా'' అని ఆయన ప్రశ్నించారు.
" దేశాభిమానం, న్యాయబద్ధత, కృషి అనే విలువల ఆధారంగా దేశాన్ని సరైన దిశలో నడిపిస్తానని సునక్ వాగ్దానం చేశారు.

ఫొటో సోర్స్, Reuters
సహచరుల మద్ధతు
దేశం పెద్ద సవాళ్లను ఎదుర్కొందని, ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తర్వాతి తరానికి మెరుగైన భవిష్యత్తుకు అవకాశం కల్పిస్తాయో లేదో చెబుతాయని ఆయన అన్నారు.
నాయకుడిగా ఉండటానికి తనకున్న అర్హతల గురించి చెబుతూ...దేశం కోవిడ్ పీడకలని ఎదుర్కొంటున్న కష్టకాలంలో ప్రభుత్వంలో అత్యంత కష్టమైన బాధ్యతలను, విభాగాలను నిర్వహించానని సునక్ అన్నారు.
మరోవైపు అనేక మంది సీనియర్ టోరీ ఎంపీలు సునక్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించారు. మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. "రెడీ ఫర్ రిషి" అనే నినాదంతో సునక్ ప్రారంభించిన ప్రచారానికి వారు మద్ధతు తెలుపుతున్నారు.
"రిషి మన దేశానికి నాయకత్వం వహించే అత్యుత్తమ వ్యక్తి. నిస్సందేహంగా లేబర్ పార్టీని ఎదుర్కోగలడు" అని గత నెలలో పార్టీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఒలివర్ డౌడెన్ అన్నారు
"రిషి పార్టీని ఏకం చేయగల నాయకుడు, దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలడు. జనరల్ ఎలక్షన్లలో మనకు ఐదో విజయాన్ని అందించగలడు" అని కామన్స్ లీడర్ మార్క్ స్పెన్సర్ అన్నారు.
తన ప్రచారం ప్రారంభం కోసం విడుదల చేసిన వీడియోలో, 1960లలో తూర్పు ఆఫ్రికా నుంచి యూకే కి వలస వచ్చిన తన తల్లి కథను వివరించారు. తన తల్లి ఆఫ్రికాలో ఫార్మసీని ఎలా నిర్వహించారో, సౌంతాంప్టన్‌లో తన తండ్రిని ఎలా కలిశారో కూడా వివరించారు.
"నా కుటుంబంలోని వారు నాకు కలలు కనే అవకాశాలను కల్పించారు" అని సునక్ అన్నారు.

రాజకీయాలలో సునక్ స్థానం
42 సంవత్సరాల సునక్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాచ్స్‌కు విశ్లేషకుడు. 2015లో నార్త్ యార్క్‌షైర్ నియోజకవర్గం రిచ్‌మండ్‌కు ఎంపీ కావడానికి ముందు రెండు హెడ్జ్ ఫండ్స్‌లో పార్ట్‌నర్‌గా ఉన్నారు.
ఒకప్పుడు జాన్సన్ తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, ప్రధాన మంత్రి పదవకి ప్రధాన పోటీదారుగా కనిపించారాయన.
2020 ఫిబ్రవరి లో ఛాన్సలర్‌గా నియమితులైన సునక్ కోవిడ్-19 మహమ్మారి పరిణామాలతో పోరాడవలసి వచ్చింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి చాలా కృషి చేశారని చెబుతారు.
ఆయన భార్య పన్ను వ్యవహారాలు వివాదం కావడం, కోవిడ్ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా పడటంతో ఆయన ప్రతిష్ట దెబ్బతింది.
జూన్ 2020లో ప్రధాని పుట్టినరోజు వేడుకకు హాజరై కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రధాని జాన్సన్,ఆయన భార్య క్యారీలతోపాటు సునక్‌కు మెట్రోపాలిటన్ పోలీసులు జరిమానా విధించారు.
జాన్సన్‌కు విధేయుడిగా పేరున్న తన సహచరుడు జావిద్‌తో కలిసి రాజీనామా చేయడంతో వారి మధ్య సంబంధాలు చెడిపోయాయి.
సునక్, జావిద్ రాజీనామాల తర్వాత ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేయడం ప్రారంభించారు. దీంతో జాన్సన్ ప్రధానమంత్రిగా దిగిపోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, NO 10
రిషి సునక్ ఎవరు?
రిషి సునక్ పూర్వీకులు భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. భారత మూలాలున్న ఆయన తల్లిదండ్రులు 1960లో తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు వెళ్లారు.
ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో 1980లో రిషి జన్మించారు. అక్కడే ఆయన తండ్రి వైద్యుడిగా పని చేశారు. తల్లి సొంతంగా ఫార్మసీ నడిపేవారు. వారికి కలిగిన ముగ్గురు సంతానంలో రిషి పెద్దవాడు.
2005లో కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఐ చదువుతోన్న సమయంలో ఆయన అక్షతా మూర్తిని కలిశారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత రిషి, గోల్డ్‌మన్ శాక్స్‌లో పనిచేశారు.

ఆ తర్వాత 'ద చిల్డ్రన్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజ్‌మెంట్, థెలెమ్ పార్ట్‌నర్స్‌లో భాగస్వామిగా పనిచేశారు.
స్థానిక కమ్యూనిటీకి తన తల్లిదండ్రులు చేసిన సేవ, సహాయం నుంచి ప్రేరణ పొందానని రిషి సునక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వారి తరహాలోనే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
2015లో జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి రిషి సునక్ ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి:
- SpiceJet: ఈ విమానయాన సంస్థను మూసేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి?
- వైసీపీ నుంచి విజయమ్మ తప్పుకున్నారా, తప్పించారా? ప్లీనరీ వేదిక మీదే ఎందుకు రాజీనామా ప్రకటన చేయాల్సి వచ్చింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలను ఈ మొక్క ఎందుకు కలవరపెడుతోంది?
- ఏక్నాథ్ శిందే: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తుల విలువ ఎంత? ఆయన దగ్గర ఎన్ని కార్లున్నాయి?
- బోరిస్ జాన్సన్: ప్రధాన మంత్రి స్థాయికి చేరిన జర్నలిస్టు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












