SpiceJet: ఈ విమానయాన సంస్థను మూసేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి?

స్పైస్‌జెట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోయా మతీన్
    • హోదా, బీబీసీ న్యూస్

దిల్లీ విమానాశ్రయంలోని రన్‌వే పైనుంచి విమానం గాల్లోకి ఎగిరిన వెంటనే సురభి శర్మలో ఉత్సాహం రెట్టింపైంది.

దుబాయిలోని తన కుటుంబ సభ్యులను కలిసి, వారితో సంతోషంగా గడపాలని భావించినట్లు దిల్లీలో టీచర్‌గా పనిచేస్తున్న సురభి చెప్పారు.

అయితే, ప్రయాణం మొదలైన అరగంటకే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విమానంలోని ఇంధన వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో పొరుగునున్న పాకిస్తాన్‌లోని కరాచీలో అత్యవసరంగా ఆ స్పైస్‌జెట్ విమానాన్ని దించాల్సి వచ్చింది.

‘‘మేం అదే విమానంలో ఐదు గంటలు కూర్చోవాల్సి వచ్చింది. నెట్‌వర్క్‌ అసలు రాలేదు. మా కుటుంబ సభ్యులతోనూ మాట్లాడలేకపోయాం’’అని ఆమె వివరించారు.

ఎట్టకేలకు ప్రయాణికుల దగ్గరకు ఆఫీసర్లు వచ్చారు. అందరినీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆందోళనతో మరో ఆరు గంటలు ఎదురుచూడాల్సి వచ్చిందని సురభి చెప్పారు.

‘‘నేను దుబాయి వెళ్లేసరికి 12 గంటలు ఆలస్యమైంది. అప్పటికీ బాగా అలసిపోయాను. అసలు ఏ పని చేయడానికీ శక్తి లేదు. దీంతో రిటర్ను టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది’’అని ఆమె చెప్పారు.

స్పైస్‌జెట్

ఫొటో సోర్స్, Getty Images

వరుసగా సాంకేతిక లోపాలు..

అదే రోజు మరో రెండు స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఒక విమానం విండ్‌షీల్డ్‌ బీటలు వారింది. అదృష్టవశాత్తు దీనికి ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. మరో విమానం వాతావరణ రాడార్‌లో సాంకేతిక లోపతం తలెత్తడంతో వెనుదిరగాల్సి వచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

వరుసగా సాంకేతిక లోపాలు బయటపడటంతో స్పైస్‌జెట్ విశ్వనీయతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ‘‘లోపాలను ముందే పసిగట్టడంలో విఫలం కావడం, మెయింటెనెన్స్‌కు తగిన చర్యలు తీసుకోకపోవడం’’లాంటి విషయాలపై భారత విమానయాన ప్రాధికార సంస్థ నోటీసులు కూడా పంపించింది.

అయితే, ఈ ఆరోపణలను స్పైస్‌జెట్ ఖండించింది. ప్రయాణికుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, ఇలాంటి లోపాలు ఇతర దేశీయ విమానయాన సంస్థల్లోనూ కనిపిస్తున్నాయని సంస్థ చెబుతోంది.

‘‘మేం నెల రోజుల క్రితమే అన్ని విమానాల్లోనూ తనిఖీలు చేపట్టాం. ఇవన్నీ సురక్షితమైనవి’’అని సంస్థ అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

స్పైస్‌జెట్

ఫొటో సోర్స్, Press Trust of India

ప్రధాన సంస్థల్లో ఒకటి..

భారత్‌లోని ఐదు ప్రధాన దేశీయ విమానయాన సంస్థల్లో స్పైస్‌జెట్ కూడా ఒకటి. అయితే, ఇటీవల కాలంలో ఇతర విమానయాన సంస్థలతో పోల్చినప్పుడు స్పైస్‌జెట్‌లో ఎక్కువ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. గత 18 రోజుల్లో ఎనిమిది సాంకేతిక లోపాలు బయటపడ్డాయి.

వీటిని జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత విమానయాన ప్రాధికార సంస్థ చెబుతోంది. కొన్నిసార్లు మొదలైన చోటుకే ఈ విమానాలను తిప్పి పంపిస్తున్నామని, మరికొన్నిసార్లు గమ్యస్థానాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నామని వివరిస్తోంది.

విమానయాన ఆర్థిక సంక్షోభం నడుమ ఎలాగోలా స్పైస్‌జెట్ మనుగడ సాగిస్తోంది. మిగతా సంస్థలతో పోల్చినప్పుడు చవకైన ధరలకు టిక్కెట్లు అందిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ సాంకేతిక లోపాల వల్ల సంస్థ ప్రతిష్ఠపై పెద్దగా ఎలాంటి ప్రభావమూ పడలేదు.

కానీ, గత మంగళవారం పరిస్థితులు ఒక్కసారిగా మారినట్లు అనిపించాయి. ఆ రోజు దాదాపు 7 శాతం కంపెనీ షేర్లు పతనం అయ్యాయి. గత ఏడాది కాలంలో ఇదే కనిష్ఠం. భయంతో చాలా మంది ప్రయాణికులు స్పైస్‌జెట్ ఎక్కేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. మరికొందరు టికెట్లను రద్దు చేసుకుంటారు.

భారీ ప్రమాదం చోటుచేసుకోకముందే ఈ విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తక్కువ ధరకు వస్తున్నాయని ఈ టికెట్లు కొనుగోలు చేయొద్దని సూచిస్తున్నారు.

అయితే, ప్రతి సాంకేతిక లోపంపై వచ్చే ఫిర్యాదునూ జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, ప్రయాణికుల భద్రతకు తాము పెద్దపీట వేస్తామని స్పైస్‌జెట్ చెబుతోంది.

స్పైస్‌జెట్

ఫొటో సోర్స్, Getty Images

వేగంగా..

భారత్‌లో వేగంగా పెరుగుతున్న విమానయాన రంగంపై పర్యవేక్షణ కరవైందని, తాజా ఘటనలు పరిస్థితికి అద్దం పడుతున్నాయని నిపుణులు అంటున్నారు.

‘‘ప్రయాణీకుల భద్రత విషయంలో రాజీ పడకుండా తాము చేయాల్సిందంతా చేస్తున్నాం’’అని డైరెక్టన్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అరుణ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

‘‘ప్రపంచంలోని ప్రతి విమానయాన సంస్థలోనూ మెయింటెనెన్స్ సమస్యలు వస్తాయి. అయితే, స్పైస్‌జెట్ విషయంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపించడం ఆందోళనకరం. మేం వీటిపై దృష్టిపెట్టాం. దీని గురించి సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నాం’’అని ఆయన చెప్పారు. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని స్పైస్‌జెట్‌కు మూడు వారాల గడువు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

స్పైస్‌జెట్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఈ చర్యలతో విమానయాన నిపుణులు సంతృప్తి చెందడం లేదు. ‘‘ఇలాంటి సాంకేతిక లోపాలు సకాలంలో తనిఖీలు చేపట్టకపోవడం వల్లే వస్తాయి. భారీ ప్రమాదాలు జరగడంలేదని చెబుతున్న మాట వాస్తవమే. కానీ సాంకేతిక లోపాలు భారత్‌లో చాలా ఎక్కువయ్యాయి’’అని వారు చెబుతున్నారు.

‘‘ఒకవేళ ప్రయాణికుల భద్రతకు అంత ప్రాధాన్యం ఇస్తే, మొదట ఆ ఎయిర్‌లైన్‌ను మూసివేయాలి. ఎందుకు అలా చేయడం లేదు’’అని విమాన రంగ నిపుణుడు మోహన్ రంగనాథన్ ప్రశ్నించారు.

‘‘స్పైస్‌జెట్‌కు చాలా సమయం ఇస్తున్నారు. ఆరు నెలల క్రితం కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే భద్రతా ప్రమాణాలపై స్పైస్‌జెట్ రాజీపడుతుందనే విషయం డీజీసీఏకు కూడా తెలుసు. అలాంటప్పుడు ఎందుకు అంత సమయం ఇస్తున్నారు’’అని రంగనాథన్ వ్యాఖ్యానించారు.

ఈ ఆరోపణలను అరుణ్ కుమార్ ఖండించారు. ‘‘ఎలాంటి నిబంధనలూ అనుసరించకుండా రాత్రికి రాత్రే సంస్థను మూసివేయాలని చెప్పేస్థాయిలో పరిస్థితులు దిగజారలేదు’’అని ఆయన అన్నారు.

‘‘మూసివేయాలని చెప్పడం చాలా తేలిక. నిజానికి మనం అలా చేయమని చెప్పగలమా? మీరు చెప్పండి’’అని ఆయన ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, ‘ఇంత చిన్నమ్మాయి హెలీకాప్టర్ నడిపిస్తుందా అని అంతా ఆశ్చర్యపోయారు’

2014లో సొంత గూటికి

2014లో దివాలా తీసే పరిస్థితిలోనున్న స్పైస్‌జెట్‌ను సంస్థ కో-ఫౌండర్ అజయ్ సింగ్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఇది బాగానే నడిచింది. అయితే, సంస్థ మళ్లీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని 2017లో ఒక ప్రముఖ వార్తా పత్రిక ఒక కథనం ప్రచురించింది.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, ఇతర బిల్లులు ఇవ్వడం కూడా కష్టమైంది. సంస్థ భవిష్యత్‌పై అప్పట్లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.

ఆర్థిక కష్టాల నడుమ భద్రతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారని రంగనాథన్ వ్యాఖ్యానించారు.

‘‘ఆర్థిక కష్టాలు ఎక్కువైనప్పుడు సరిగా మెయింటెనెన్స్ చేయించరు. మరోవైపు సాంకేతిక సమస్యలను రిపోర్టు చేయొద్దని పైలట్‌లకు సూచిస్తున్నారు. వారు జీతాలు ఇచ్చే వారి మాటే కదా వింటారు’’అని ఆయన అన్నారు.

తమ సప్లయిర్ సంస్థలకు బిల్లుకు ఇవ్వడంలో స్పైస్‌జెట్ జాప్యం చేస్తోందని, దీని వల్ల కొన్ని పరికరాల కొరత ఉందని డీజీసీఏ గత సెప్టెంబరులో వెల్లడించింది.

అయితే, ఆ ఆరోపణల్లో నిజంలేదని, అవి తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి ఖండించారు. ప్రయాణికుల భద్రత తమకు తొలి ప్రాధాన్యమని ఆయన నొక్కిచెప్పారు.

వీడియో క్యాప్షన్, విమానాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతే ఏం జరుగుతుంది? మరో దేశానికి వెళ్లడం ఎలా?

‘‘అవసరమైన పరికరాలను థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర నుంచి వేర్వేరు కాంట్రాక్టుల ద్వారా తీసుకుంటున్నాం. దీనికి సరిపడా నిధులు మా దగ్గర ఉన్నాయి. సప్లయిర్లందరికీ మేం సరైన సమయంలోనే చెల్లింపులు చేస్తున్నాం’’అని ఆయన బీబీసీతో చెప్పారు.

తాము ఒక్క పైలట్‌ను కూడా భయపెట్టడం లేదా బెదిరించడం లాంటివి చేయలేదని, సాంకేతిక లోపాలను తమ ఉద్యోగులు వెంటనే రిపోర్టు చేస్తారని వివరించారు.

ఇటీవల కాలంలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్న దేశీయ విమానయాన సంస్థల్లో స్పైస్‌జెట్ కూడా ఒకటి. మరో రెండు విమానయాన సంస్థల్లోనూ ఇలాంటి లోపాలు కనిపించాయి.

ఇలాంటి సాంకేతిక లోపాలపై వెంటనే విచారణ చేపట్టాల్సిన బాధ్యత డీజీసీఏపైనే ఉంటుందని రంగనాథన్ చెబుతున్నారు. అయితే, ఈ విషయంలో అవసరమైన చర్యలన్నీ తాము తీసుకుంటున్నామని అరుణ్ కుమార్ అంటున్నారు.

అయితే, ఈ విషయంలో విమానయాన సంస్థే బాధ్యత వహించాలని సురభి లాంటి ప్రయాణికులు చెబుతున్నారు. ‘‘మేం భద్రంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాం’’అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)