ఫ్రాంక్ గార్డెనర్: 'మళ్లీ ఇలాగే జరిగింది' - విమానంలో వీల్ చైర్ వాళ్లని ఎందుకు వదిలేస్తారు?

ఫొటో సోర్స్, FRANK GARDNER
- రచయిత, బెత్ రోజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు ట్విట్టర్‌లో చురుకుగా ఉండేవారైతే ఫ్రాంక్ గార్డెనర్ ట్వీట్ చూసే ఉంటారు. ఆయన చాలా కోపంగా, బాధతో ట్వీట్ పెట్టారు. గత వారాంతంలో ఆయన విమాన ప్రయాణం చేసి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం చేరుకున్నారు. ఆయన వీల్ చైర్ వాడతారు. విమానం ఆగిన తరువాత, సమయానికి ఆయన వీల్ చైర్ రాలేదు. దాంతో, ఆయన్ను విమానంలోనే వదిలేశారు.
వీల్ చైర్ వాడేవాళ్లు తరచూ ఎదుర్కొనే సమస్య ఇది. ఎందుకిలా జరుగుతుంది?
"మళ్లీ ఇలాగే జరిగింది. హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో అందరూ విమానం దిగిపోయినా, నేను లోపల కూర్చునే ఉన్నాను. విమాన ద్వారం వద్దకు నా వీల్ చైర్ తీసుకురావడానికి సిబ్బంది లేరు" అని ఫ్రాంక్ విమానంలో కూర్చునే ట్వీట్ పెట్టారు.
ఆదివారం రాత్రి ఎస్టోనియా నుంచి హెల్సింకి మీదుగా లండన్ చేరుకున్నారు ఫ్రాంక్. ప్రపంచంలోని పెద్ద విమానశ్రయాలలో హీత్రూ ఒకటి.
ఆయన ట్వీట్‌కు 43,400 లైక్స్ వచ్చాయి. ఫాలోవర్లు ఆయన పరిస్థితి పట్ల జాలి చూపుతూ, ఘటన పట్ల షాక్ అవుతూ కామెంట్లు పెట్టారు.
చాలామంది వీల్‌చెయిర్ యూజర్లు, తమకూ ఇలాంటి అనుభవాలే కలిగాయని బీబీసీ యాక్సెస్ ఆల్ పాడ్‌కాస్ట్‌తో చెప్పారు.
కోవిడ్ 19 వల్లే ఇలా జరిగిందని హీత్రూ విమానాశ్రయం సంజాయిషీ ఇచ్చింది.
'ఎంతోమంది వీల్‌చెయిర్ యూజర్లు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు'
అంతకు కొన్ని వారాల ముందు మరొక బ్రిటిష్ ఎయిర్‌పోర్టులో బెన్ ఫర్నర్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన మొబిలిటీ స్కూటర్ వెతుక్కు రావడానికి సిబ్బంది వెళ్లినంత సేపు, ఆయన ఒక్కరే విమానంలో కూర్చున్నారు.
"దిగే సమయానికి విమాన ద్వారం వద్దే మొబిలిటీ స్కూటర్ రెడీగా ఉంటుందని చెప్పారు. కానీ, దాన్ని తీసుకురావడానికి ఎవరూ లేరు. విమానంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను" అని బెన్ చెప్పారు.
ఎయిర్‌పోర్ట్ వీల్ చైర్ తీసుకుని బ్యాగేజీ కౌంటర్ దగ్గరకు వెళ్లి తన స్కూటర్ తీసుకోవచ్చని ఆయనకు సిబ్బంది చెప్పారు.
కానీ, అది ఆమోదయోగ్యం కాదని బెన్ అంటారు. వీల్ చైర్ ఒక్కొక్క వ్యక్తి కోసం ప్రత్యేకంగా తయారుచేస్తారు. అన్ని వీల్ చైర్లూ అందరికీ సరిపడకపోవచ్చు. మామూలు వీల్ చైర్ సౌకర్యంగా ఉండకపోవచ్చని ఆయన అంటారు.
విమానం మళ్లీ ఎగరడానికి సిద్ధమైపోయింది. కొత్త సిబ్బంది ఎక్కారు. కానీ బెన్ ఇంకా అక్కడే కూర్చున్నారు. ఆయన్ను కిందకు దింపలేదు. వెంటనే కెప్టెన్ జోక్యం చేసుకుని, బెన్ స్కూటర్ విమాన ద్వారం దగ్గరకు వచ్చేలా ఏర్పాటు చేశారు.
"కెప్టెన్ ప్రత్యేకంగా శ్రద్ధపెట్టారు కాబట్టి నేను అదృష్టవంతుడిని. ఆయనకు ఆ అవసరం లేదు, కానీ చేశారు" అని బెన్ చెప్పారు.
ఒకటి, రెండుసార్లు కాదు..
బ్రిటన్ రెగ్యులేటర్ 'సివిల్ ఏవియేషన్ అథారిటీ' ప్రకారం, విమానం దిగిన తరువాత ప్రయాణికులకు సహాయం అందించే బాధ్యత విమానాశ్రయానిదే. వీల్ చైర్ తీసుకొచ్చి ప్రయాణికులకు ఇవ్వడం అందులో భాగమే.
కానీ, అలా జరగకపోతే, ఎంతసేపైనా విమానంలోనే కూర్చోవాల్సి వస్తే కోపం వస్తుంది. పోనీ, ఒకసారి, రెండుసార్లు కాదు. పలుమార్లు అలాగే జరిగితే చాలా విసుగ్గా ఉంటుందని వీల్ చైర్ యూజర్లు అంటున్నారు.
"గత నాలుగేళ్లల్లో నాకిలా జరగడం నాలుగోసారి" అని ఫ్రాంక్ చెప్పారు.
తమ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే తమ లక్ష్యమని, ఫ్రాంక్‌కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని హీత్రో ఎయిర్‌పోర్ట్ చెప్పింది.
"దీనికి మేం క్షమాపణలు కోరుతున్నాం" అంటూ కోవిడ్ 19, తదుపరి పరిస్థితుల కారణంగా ఇలా జరిగిందని తెలిపింది.
"మహమ్మారి తరువాత, విమానాశ్రయంలో వనరులు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. వీలైనంత త్వరగా అన్నీ సజావుగా జరిగేలా చూస్తాం. సిబ్బంది కొరత వల్ల ఫ్రాంక్ గార్డెనర్ ఇబ్బంది పడాల్సి వచ్చింది" అని వివరించింది.
బ్రిటన్‌లో 2018లో ఏవియేషన్ 2050 ప్రారంభమైనప్పుడే ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించారు. కానీ, కోవిడ్ 19 మహమ్మారి వ్యాప్తితో అభివృద్ధి కుంటుపడింది. అయితే, దీని గురించి ప్రాథమిక వివరణతో ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు.
కాగా, దీని పట్ల చాలామంది వికలాంగులు అసంతృప్తి వ్యక్తపరిచారు.
2017లో బ్రిటన్‌లో స్పెషల్ అసిస్టెన్స్ కోసం 30 లక్షల కన్నా ఎక్కువ అభ్యర్థనలు వచ్చాయని ఆ డాక్యుమెంట్‌లో తెలిపారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గింది లేదు.
వారిలో 25 శాతం ప్రయాణికులు వికలాంగులు లేదా అనారోగ్యంతో బాధపడుతున్నవారని, వారిలో 60 శాతానికి విమనాశ్రయాలను సొంతంగా ఉపయోగించే పరిస్థితుల్లో లేరని డాక్యుమెంట్ చెబుతోంది.
"ఇందులో చాలా సవాళ్లు ఉన్నాయి. ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్, ఎయిర్‌సైడ్ సర్వీసుల పాత్ర, బాధ్యతల్లో స్పష్టత లేకపోవడం కూడా ఒక సమస్య" అని అందులో తెలిపారు.
వచ్చే పదేళ్లపై దృష్టి సారించే వ్యూహాలతో మరొక డాక్యుమెంట్ పబ్లిష్ చేస్తామని బ్రిటన్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్టుమెంటు తెలిపింది.

ఫొటో సోర్స్, ELLIS PALMER
'చివరికి ఒక్కరే ఉండిపోయామని బెంగపడడంలో అర్థం లేదు'
ఎలిస్ పాల్మర్ వీల్ చైర్ వాడే జర్నలిస్ట్. విమాన ప్రయాణం తనకు "ఆందోళన కలిగిస్తుంది", కానీ తాను పాజిటివ్‌గా ఉంటానని పాల్మర్ చెప్పారు.
"విమానంలో చివరికి ఒక్కరే ఉండిపోయామని బెంగపడడంలో అర్థం లేదు. ఎప్పటికైనా వాళ్లు వీల్ చైర్ తెచ్చి ఇస్తారు" అని ఆయన అన్నారు.
చిన్నచిన్న ప్రాంతీయ విమానాశ్రయాల్లో వీల్ చైర్ యూజర్లకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, పెద్ద పెద్ద విమానాశ్రయాల్లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తన అనుభవంలో కనుగొన్నట్టు పాల్మర్ చెప్పారు.
ముఖ్యంగా స్పానిష్ విమానాశ్రయాలు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని, వీల్ చైర్ యూజర్లకు సహాయం చేసే వర్కర్లు పసుపు రంగు టీ-షర్టులు వేసుకోవడంతో వారిని పోల్చడం సులువుగా ఉంటుందని వివరించారు.
ఫ్రాంక్ గార్డెనర్ చేసిన ట్వీట్లు ఆయన నిరుత్సాహాన్ని వ్యక్తం చేయడానికి సహకరించినట్టుగానే అనిపించినా, మార్పు తీసుకురావడంలోనూ తమ వంతు పాత్ర పోషించగలవు.
2018లో ఎలిస్ పాల్మర్ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. విమానంలో ఒంటరిగా మిగిలిపోయారు. దాని గురించి ఆయన ట్వీట్ చేశారు. దాంతో, హీత్రో పాలసీ విధానంలో మార్పు చోటుచేసుకుంది. అప్పటినుంచి విమాన ద్వారం వద్దకే వీల్ చైర్ తీసుకొస్తున్నారు. అంతకుముందు, టెర్మినల్ ద్వారం వరకే తీసుకొచ్చేవారు.
"వనరులను అవసరమైన చోట వినియోగించడం ముఖ్యం" అని ఆయన అంటారు.
విమానం బయలుదేరే చోట సిబ్బంది వీల్ చైర్ ప్రయాణికుల గురించి గమ్య స్థానంలోని సిబ్బందికి సమాచారం అందించవచ్చని, తద్వారా ముందే ఏర్పాట్లు చేసుకోగలుగుతారని పాల్మర్ సూచిస్తున్నారు.
"అంటే సిబ్బంది పట్టించుకోరని కారు. ఇలా చేస్తే, మరొక్కసారి వాళ్లకు గుర్తు చేసినట్టు అవుతుంది. ఇది పెద్ద ఎయిర్‌పోర్ట్, బాగా రద్దీగా ఉంటుంది. వికలాంగులకు సేవలు అందించే సౌకర్యాలు ఇప్పటికీ లేవు" అని పాల్మర్ అన్నారు.
హీత్రూ నుంచి క్షమాపణలు అందుకున్న తరువాత, ఫ్రాంక్ గార్డెనర్ మరొక ట్వీట్ చేశారు.
"ఇది జరగకుండా ఆపేందుకు ఇంకా చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నేనే కాదు, బ్రిటన్‌లో చాలామంది ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు" అని ఆయన రాశారు.
ఇవి కూడా చదవండి:
- ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారా, బౌద్ధ ఆరామాలను కూల్చి గుడులు కట్టారా? చరిత్ర ఏం చెబుతోంది
- ఉప్పు నీరు, అల్లం, హెర్బల్ టీ.. ఉత్తర కొరియాలో కోవిడ్ రోగులకు ఇవే మందులు
- శ్రీకృష్ణ జన్మభూమి: మథురలో షాహీ ఈద్గా మసీదు వివాదం ఏమిటి
- ఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఇంతకీ ఏం జరిగింది
- వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై హత్య ఆరోపణలు ఎందుకొచ్చాయి? డ్రైవర్ డెడ్ బాడీని ఆయన తన కారులోనే ఎందుకు తీసుకెళ్లారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













