Sri Lanka Economic Crisis - శ్రీలంకలో ఒక తల్లి ఆవేదన: ‘పిల్లల ఆకలి తీర్చడానికి బిస్కెట్ కొనలేకపోతున్నా.. పాలు కూడా ఇవ్వలేకపోతున్నా’

శ్రీలంకలో వంట చేస్తున్న వలంటీర్లు
    • రచయిత, రజినీ వైద్యనాథన్
    • హోదా, బీబీసీ న్యూస్, కొలంబో

ఒక్క పూట తిండి కూడా శ్రీలంక ప్రజలకు కష్టంగా మారుతోంది. స్వచ్ఛంద సంస్థలు, చర్చిలు ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాల వద్ద చాలా మంది ప్రజలు బారులు తీరుతున్నారు.

చంకలో చంటి పిల్లలు, మరొక చేతిలో భోజనం కోసం ప్లేట్లు పట్టుకుని తల్లులు అన్నం కోసం ఎదురు చూస్తున్నారు. 'తినడానికి మాకేమీ లేదు. అందుకే ఇక్కడకు వచ్చాం.' అని నలుగురు పిల్లల తల్లి అయిన చంద్రిక మనేల్ అన్నారు.

ప్లేటులోని అన్నాన్ని ముద్దలుగా కలిపి పిల్లలకు తినిపిస్తోంది చంద్రిక.

'బ్రెడ్ కొనడానికి కూడా డబ్బులు లేవు. పిల్లలకు అప్పుడప్పుడు పాలు, అన్నం దొరుకుతాయి. కానీ కూరగాయలు కొనడం మాత్రం మా వల్ల కాదు' అని ఆమె చెప్పుకొచ్చారు.

ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఆయిల్ కోసం బారులు తీరిన ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

'శ్రీలంకలో మానవీయ సంక్షోభం'

అప్పులు, అధిక ధరలు, అడుగంటిపోయిన విదేశీ మారకపు నిల్వలతో శ్రీలంక ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. పెట్రోలు, డీజిల్ నిల్వలు దాదాపుగా అయిపోయాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేయడానికి శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష, చైనా నుంచి భారీగా అప్పులు చేయడమే నేటి సంక్షోభానికి కారణమని చాలా మంది ఆరోపిస్తున్నారు.

కరోనా సంక్షోభంతో పర్యాటకుల సంఖ్య బాగా తగ్గి, టూరిజం ఆదాయాన్ని శ్రీలంక బాగా నష్టపోయింది. యుక్రెయిన్-రష్యా యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం కూడా శ్రీలంక ఆర్థికవ్యవస్థను మరింత దెబ్బతీశాయి.

ఇప్పుడు శ్రీలంక మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉందని బీబీసీతో చెప్పింది యూనిసెఫ్. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే 70శాతం శ్రీలంక ప్రజలు తీసుకునే తిండి భారీగా తగ్గిపోయింది. పెట్రోలు, డీజిల్, అత్యవసర మందుల నిల్వలు వేగంగా అయిపోతున్నాయి.

రోజుకు వందల మంది శ్రీలంక ప్రజలు అన్నదాన శిబిరాలకు తిండి కోసం పోతున్నారు.
ఫొటో క్యాప్షన్, గర్భవతిగా ఉన్న సాహ్నా పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు గురించి భయపడుతున్నారు.

'పిల్లలకు బిస్కెట్ కూడా కొనలేకపోతున్నా'

ఇంతకు ముందు చెప్పిన చంద్రిక మనేల్, ఇంత వరకు ఎన్నడూ తిండి కోసం అన్నదాన శిబిరాలకు వెళ్లలేదు. ఇప్పుడు ఆమె తొలిసారి వెళ్లారు.

'జీవితం చాలా కష్టంగా సాగుతోంది. అప్పులు చేసి బతకాల్సి వస్తోంది.' అని చంద్రిక చెబుతున్నారు.

చంద్రిక వెళ్లిన అన్నదాన శిబిరాన్ని నెల కిందటే ప్రారంభించారు. కొలంబోలోని ఒక చర్చి ప్రాంగణంలో పాస్టర్ మోసెస్ ఆకాశ్ ఈ అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు మూడు రోజులుగా పనసకాయ మాత్రమే తిని బతుకుతున్న ఒక సింగిల్ మదర్‌ దుస్థితి చూసిన తరువాత, ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

'నాలుగు నెలలుగా ఒక్క పూట మాత్రమే తింటున్న ఎందరో ఇక్కడకు వస్తున్నారు. తొలుత రోజుకు 50 మంది వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 250కి చేరింది. ఇదేమీ మాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఒక్క జూన్‌లోనే నిత్యావసర ధరలు 80శాతం పెరిగాయి. పోషకాహార లోపంతో బాధపడుతున్న అనేక మంది పిల్లలను నేను చూశా.' అని పాస్టర్ మోసెస్ తెలిపారు.

34 ఏళ్ల సాహ్నా గర్భవతి. ఇప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఆమెకు డెలివరీ కానుంది. తన భవిష్యత్తును తలచుకుని భయపడుతున్నారు సాహ్నా.

'నా పిల్లలు ఆకలికి తట్టుకోలేక పోతున్నారు. వాళ్లకు పాలు ఇవ్వలేక పోతున్నా. కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనలేకపోతున్నా.' అని సాహ్నా చెప్పుకొచ్చారు.

సాహ్నా భర్త రోజూ కూలీ పనులకు వెళ్తుంటారు. వారానికి ఆయన సంపదాన 10 డాలర్లు మాత్రమే.

'మా నాయకులు బాగానే జీవిస్తున్నారు. వారి పిల్లలు సంతోషంగానే బతుకుతున్నప్పుడు మా పిల్లలకు ఈ దుస్థితి ఎందుకు?' అని సాహ్నా ప్రశ్నిస్తున్నారు.

శ్రీలంకలో పెట్రోలు కోసం బారులు తీరిన వాహనాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంకలో పెట్రోలు, డీజిల్ కోసం బారులు తీరిన వాహనాలు.

'సెప్టెంబరు నాటికి పరిస్థితి మరింత దారుణం'

గర్భవతిగా ఉన్న సాహ్నాకు బిడ్డ పుట్టే నాటికి శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారిపోతాయని భావిస్తున్నారు. రాజధాని కొలంబోలో ఆహారం నిల్వలు సెప్టెంబరు వరకు మాత్రమే ఉన్నాయని ఆ నగర మేయర్ చెబుతున్నారు.

విద్యుత్ కోతలు, వంట గ్యాసు కొరత, అడుగంటుతున్న పెట్రోలు వంటి సమస్యలతో ప్రజలు ఎక్కడికి వెళ్లలేక పోతున్నారు.

'ప్రజలు డబ్బులు లేక సరుకులు, కూరగాయలు కొనలేకపోతున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తింటున్నారు. పోషకాలు బాగా ఉండే మాంసం వంటి వాటిని తీసుకోవడం మానేశారు. అందువల్ల పోషకాహార లోపం తలెత్తి అదొక పెద్ద సమస్యగా మారనుంది.' అని శ్రీలంకలోని యూనిసెఫ్ ప్రతినిధి క్రిస్టియన్ స్కూగ్ తెలిపారు.

'మానవీయ సంక్షోభం రాకుండా చూసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఇంకా చిన్న పిల్లల మరణాలు జరగడం లేదు. అది చాలా మంచి విషయం. కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే పిల్లలకు మంచి తిండి అందేలా చూడాలి.' అని స్కూగ్ వివరించారు.

పోషకాహార లోపంతో తీవ్రంగా బాధపడుతున్న వేల మంది చిన్నారుల కోసం విదేశీ సాయాన్ని యూనిసెఫ్ కోరుతోంది. 'పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 13శాతం నుంచి 20శాతానికి పెరగొచ్చు. ప్రస్తుతం 35 వేల మంది పిల్లలు సరైన తిండి లేక ఇబ్బందిపడుతున్నారు.' అని శ్రీలంక మెడికల్ న్యూట్రిషియన్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ రేణుక జయతీస్సా అన్నారు.

విరాళాల మీదనే నడుస్తున్న ఆసుపత్రులు

విరాళాల మీదనే నడుస్తున్న ఆసుపత్రులు

ప్రస్తుత సంక్షోభం కొందరిలో జాలి, దయను మరింత పెంచుతోంది. కానీ ఇక్కడ జాలి అనేది కూడా ఖరీదుగా మారిపోయింది.

దాతలు ముందుకు రాకపోతే తమ ఆసుపత్రిలో పుట్టే చిన్నారులు బతకలేరని కాజిల్ స్ట్రీట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సమాన్ కుమార అంటున్నారు. ఇప్పుడు తమ ఆసుపత్రి పూర్తిగా విరాళాల మీదనే ఆధారపడి నడుస్తోందని ఆయన చెబుతున్నారు. అత్యవసర మందులు, వైద్య పరికరాలు వంటి వాటికి తీవ్రంగా కొరత ఉంది కాబట్టి మరింత మంది దాతలు ముందుకు రావాలని సమాన్ విజ్ఞప్తి చేస్తున్నారు.

మళ్లీ అన్నదాన శిబిరం వద్దకు వెళితే, కంచంలోని చివరి ముద్దను కొడుక్కి తినిపించింది చంద్రిక. 'నా జీవితంలో నేను ఎన్నో మంచి రోజులు చూశాను. కానీ నా పిల్లలకు ఎంతో భవిష్యత్తు ఉంది. రేపు వాళ్లకు ఏమవుతుందో నాకు తెలియదు.' అని చంద్రిక బాధగా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)