శ్రీలంక సంక్షోభం: తినడానికి ఏమీ లేక సముద్రం నీటిని తాగి స్పృహ తప్పి పడిపోయిన వృద్ధ జంట

- రచయిత, ప్రభుపాద ఆనందన్
- హోదా, బీబీసీ కోసం
శ్రీలంక నుంచి అక్రమంగా పడవలో ధనుష్కోటి బీచ్‌కు వచ్చి స్పృహతప్పి పడిపోయిన వృద్ధ దంపతులను తమిళనాడు మెరైన్ పోలీసులు రక్షించారు.
తమ దేశంలో నివసించే పరిస్థితులు లేకపోవడంతో భారత్‌లో శరణార్థులుగా ఆశ్రయం పొందేందుకు ఇక్కడికి వచ్చినట్లు వారు చెప్పారు.
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఆహార కొరత తీవ్రంగా ఉంది. ఫలితంగా చాలామంది శ్రీలంక ప్రజలు మార్చి 22 నుంచి భారత్‌లోని తమిళనాడుకు రావడం మొదలుపెట్టారు. భారత్‌కు వచ్చే క్రమంలో ఇరు దేశాల సముద్రతీర ప్రాంతాల భద్రత నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. స్వదేశంలో బతికేందుకు మార్గం లేకపోవడంతో శ్రీలంకవాసులు ఇలా అక్రమంగా భారత్‌లోకి వస్తున్నారు.
అయితే, శ్రీలంక నుంచి ఇలా వచ్చే ప్రజలను శరణార్థులుగా పరిగణించేందుకు అనుమతించాలంటూ తమిళనాడు ప్రభుత్వం, భారత ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఆశ్రయం కోసం వస్తోన్న శ్రీలంక ప్రజలను అక్రమ వలసదారులుగా పరిగణించకుండా వారిని శిబిరాల్లో ఉంచాలని అధికారులను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు.
ఈరోజు ఉదయం ధనుష్కోడి పక్కనే ఉన్న గోథండ్రమర్ బీచ్ ఒడ్డున ఒక వృద్ధ జంట అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారని ఆ ప్రాంతంలోని మత్స్యకారులు, రామేశ్వరం మరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రామేశ్వరం మెరైన్ పోలీస్ ప్రో ఇన్వెస్టిగేటర్ కాళిదాస్, స్పృహతప్పి పడిపోయి ఉన్న వారిద్దరిని కాపాడారు. ప్రథమ చికిత్స కోసం అంబులెన్స్‌ను పిలిపించారు. అయితే వారిద్దరూ బీచ్‌కు దగ్గరగా ఉండటంతో అంబులెన్స్ అక్కడివరకు వెళ్లలేకపోయింది.

హోవర్ బోట్‌లో తరలింపు
అంబులెన్స్ వెళ్లలేకపోవడంతో మరైన్ ఇన్‌స్పెక్టర్ కనగరాజ్, భారత కోస్ట్ గార్గ్ సహాయాన్ని కోరారు. కోస్ట్ గార్డ్‌కు చెందిన హోవర్‌క్రాఫ్ట్ పెట్రోల్ బోట్‌ను గోథండ్రమర్ బీచ్‌కు పిలిపించారు.
ఆ దంపతులను కాపాడిన కోస్ట్ గార్డ్ సైనికులు వారిని రామేశ్వరం సమీపంలోని డబుల్ షీట్ బీచ్ మెరైన్ పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి వారిని రామేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
తదుపరి విచారణలో వారిని శ్రీలంకలోని మన్నార్ జిల్లా మురుంగన్‌పటియాకు చెందిన శివన్ (82), ఆయన భార్య పరమేశ్వరి (75)గా గుర్తించారు.
తనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని శివన్ చెప్పారు. మన్నార్‌లో తన కుమారుడు కూలీగా పనిచేసేవాడని తెలిపారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా తన కుమారుడు, తమిళనాడులోని ఒక శరణార్థి శిబిరంలో తల దాచుకుంటున్నాడని ఆ దంపతులు చెప్పారు. తమ దేశంలో ఉండలేకపోతున్నామని, వృద్ధాప్యం కారణంగా తమ కుమారుని వద్దే బతకాలని కోరుకుంటున్నట్లు వారు అన్నారు.
ఆదివారం సాయంత్రం వారు మన్నార్ నుంచి బోట్‌లో బయల్దేరి ధనుష్కోడి చేరుకున్నారు.

సముద్రపు నీరు తాగిన జంట
సముద్రంలో తమ ప్రయాణం గురించి బీబీసీ తమిళ్‌తో శివన్ చెప్పారు. ''మాతో పడవలో వచ్చినవారు అర్ధరాత్రే వెళ్లిపోయారు. చీకట్లో ఎక్కడికి వెళ్లాలో తెలియక మేం ఇసుకతిన్నెలపైనే కూర్చొని ఎదురుచూశాం. ఆహారం లేకపోవడంతో సముద్రపు నీటినే తాగాం. రాత్రంతా బాగా చలిగా ఉంది. ఉదయం పూట ఎండతో సతమతమయ్యాం. అలసిపోవడంతో పాటు బీపీ ఎక్కువ కావడంతో స్పృహతప్పి పడిపోయాం. మేం చనిపోతామనే అనుకున్నాం. కానీ, మెరైన్ పోలీసులు ప్రథమ చికిత్స అందించి అతికష్టమ్మీద ఆసుపత్రికి తీసకెళ్లి మమ్మల్ని బతికించారు'' అని ఆయన వివరించారు.
3 నెలల్లో 92 మంది
ఇంకా విషమ పరిస్థితుల్లోనే ఉన్న ఈ ఇద్దరినీ రాష్ట్ర, కేంద్ర భద్రతా అధికారులు విచారిస్తున్నారు. చికిత్స అనంతరం వారిని మండపం శరణార్థి శిబిరంలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
శ్రీలంకలో దుర్భర పరిస్థితులు కారణంగా మార్చి 22 నుంచి ఇప్పటివరకు 26 శ్రీలంక తమిళ కుటుంబాలకు చెందిన 92 మంది ప్రజలు భారత్‌కు వచ్చారు. వారిని మండపం శరణార్థి శిబిరంలో ఉంచారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: రెండు వారాల్లో 10 భూకంపాలు... ఈ ప్రాంతంలోనే ఎందుకిలా?
- కండోమ్ వాడకంపై ఏపీ, తెలంగాణ పురుషులు ఏమంటున్నారు?
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













