శ్రీలంక సంక్షోభం: 'పెట్రోలు కోసం రెండు రోజుల నుంచి స్నానం కూడా చేయకుండా కారులోనే ఉన్నా'

అజీవన్ సదాశివమ్
ఫొటో క్యాప్షన్, అజీవన్ సదాశివమ్
    • రచయిత, రజిని వైద్యనాథన్
    • హోదా, బీబీసీ దక్షిణాసియా కరస్పాండెంట్, కొలంబో

ఎక్కడైనా క్యూలో ఉన్నప్పుడు మొదటి ప్లేసులో ఉంటే బాగానే ఉంటుంది. కానీ, ఈ క్యూలో మొదటి ప్లేసులోనే ఉన్న అజీవన్ సదాశివమ్ మాత్రం ఎన్ని రోజులు అలా ఉండాలో తెలియక గందరగోళంలో ఉన్నారు.

''ఇప్పటికే రెండు రోజులుగా ఈ క్యూలో ఉన్నాను'' అని ఓపిగ్గా చెప్పారు సదాశివమ్. శ్రీలంక రాజధాని కొలంబోలోని ఒక పెట్రోల్ బంక్ బయట ఆయన లైన్లో ఉన్నారు.

టాక్సీ డ్రైవరుగా పనిచేసే సదాశివమ్‌కు పెట్రోలు దొరక్కపోతే బతుకు బండి నడవదు. కానీ, శ్రీలంకలో ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. కొత్తగా ఆ దేశానికి చమురు దిగుమతి కాలేదు.

సదాశివమ్ నడిపే కారు డ్యాష్ బోర్డులో ఆయిల్ ఇండికేటర్‌ను ఆయన చూపించారు. నీడిల్ ఎర్రరంగులో అట్టడుగున ఉంది. అంటే, ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయిందని అర్థం.

'నేను ఈ కార్లోనే పడుకుంటున్నాను. భోజనం తెచ్చుకోవడానికి కొద్దిసేపు వెళ్లి వస్తున్నానంతే.. రెండు రోజులుగా స్నానం కూడా చేయకుండా పెట్రోలు బంకు దగ్గర పడిగాపులు కాస్తున్నాను'' అని చెప్పారు సదాశివమ్.

వెయిట్ చేయడం వేరే మార్గం లేదని ఆయన అంటున్నారు. ''నా భార్య, ఇద్దరు పిల్లలు నా సంపాదనపైనే ఆధారపడ్డారు. పెట్రోలు దొరికితేనే మళ్లీ క్యాబ్ నడపగలను. లేకపోతే ఆదాయం ఉండదు'' అన్నారాయన.

రెండువారాలుగా శ్రీలంకకు చమురు దిగుమతులు ఆగిపోయాయి. దేశంలోని మిగతా ప్రాంతాలలో ఉన్న పెట్రోలియం నిల్వలన్నీ రాజధాని కొలంబోకు తరలించారు. కానీ, అవీ తరిగిపోయాయి.

త్వరలోనే ట్యాంకర్ వస్తుందన్న ఆశతో పెట్రోలు బంకు దగ్గరే కాపు కాశారు సదాశివమ్. శ్రీలంకలోని అన్ని పెట్రోలు బంకుల దగ్గరా సైన్యం కూడా కాపలా ఉంది.

ఈ రోజు రాత్రికి ఒక ట్యాంకర్ రావొచ్చని సైనికులు చెబుతున్నారు అని సదాశివమ్ ఆశగా చెప్పారు.

'ఇంకో వారం అయినా ఫరవాలేదు. ఇక్కడే వెయిట్ చేస్తాను. లేదంటే మళ్లీ క్యూలో వెనుకబడిపోతాను'' అన్నారాయన.

శ్రీలంక పెట్రోలు బంకుల వద్ద క్యూ లైన్లు

ఈ క్యూలో సదాశివమ్ ఒక్కరే లేరు. పెట్రోలు, డీజిల్ కోసం క్యూ లైన్లు మెయిన్ రోడ్లలో కిలోమీటర్ల పొడవున ఉంటాయి. కార్లకు వేరేగా, బస్సులకు వేరేగా, ట్రక్‌లకు వేరేగా, టుక్‌టుక్‌లు ద్విచక్ర వాహనాలకు వేరేగా క్యూ లైన్లు ఉంటున్నాయి.

అయితే, క్యూలో ఉన్నంత మాత్రాన పెట్రోలు ఇవ్వడం లేదు బంకులు. ముందుగా టోకెన్లు జారీచేసి ఆ టోకెన్లు ఉన్నవారికే పెట్రోలు ఇస్తామంటున్నాయి. రోజుకు 150 వరకు టోకెన్లు ఇస్తున్నారు.

పెట్రోలు ట్యాంకర్ వచ్చిన తరువాత ఈ టోకెన్లు ఉన్నవారికి పెట్రోలు ఇవ్వనున్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంక దక్షిణ ప్రాంతంలోనే ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి

క్యూలో వెనుకన ఉన్న జయంత అతుకోరల కొలంబో బయట ఒక ఊరిలో నివసిస్తారు.

ఆయన ఆ ఊరి నుంచి కొలంబోలోని పెట్రోల్ బంకుకు రావడానికే 12 లీటర్లు ఖర్చయ్యాయి.

కానీ, అంతకంటే ఎక్కువ పెట్రోలు దొరుకుతుందేమో అన్న ప్రయత్నంలో ఆయన అక్కడకు చేరుకుని నిరీక్షిస్తున్నారు.

కానీ జయంత దగ్గర టోకెన్ ఏమీ లేదు. కానీ... క్యూలో తాను 300వ వాడిని కావొచ్చని ఆయన చెబుతున్నారు.

శ్రీలంక పెట్రోలు బంకుల వద్ద క్యూ లైనులో తన కారులో జయంత అతుకోరల
ఫొటో క్యాప్షన్, జయంత అతుకోరల

'ఈ రోజు నాకు టోకెన్ దొరుకుతుందో లేదో తెలియదు. గ్యాస్, పెట్రోల్ లేకుండా ఉండలేం. చాలా కష్టాల్లో ఉన్నాం' అన్నారు జయంత.

కార్ల సేల్స్‌మన్‌గా పనిచేసే జయంత ఇప్పుడు తన సొంత కారులోనే పడుకుంటూ లైన్లో నిరీక్షిస్తున్నారు.

కొన్ని పెట్రోలు బంకులు అత్యవసర సర్వీసులైన హెల్త్, ప్రజా పంపిణీ, ప్రజా రవాణా వంటి విభాగాలకు చెందిన వాహనాలకే పెట్రోలు పోస్తుండగా కొన్ని బంకుల్లో మాత్రం పరిమిత లీటర్లు చొప్పున సాధారణ ప్రజలకూ ఇస్తున్నారు.

గరిష్ఠంగా 10 వేల శ్రీలంక రూపాయల(భారత కరెన్సీలో సుమారు రూ. 2,200) విలువైన పెట్రోలు మాత్రమే ఇస్తారని, దాంతో కారు సగం ట్యాంక్ కూడా నిండదని జయంత చెప్పారు.

తీవ్రమైన చమురు కొరత ఎదుర్కొంటున్న శ్రీలంకలో ప్రభుత్వం సహాయం కోసం రష్యాను ఆశ్రయిస్తోంది. శ్రీలంక ప్రతినిధి బృందం ఒకటి మాస్కో వెళ్లనుంది. శ్రీలంక అధ్యక్షుడు కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చమురు కోరుతూ లేఖ రాశారు.

Jagannathan
ఫొటో క్యాప్షన్, జగన్నాథన్

పెట్రోలు స్టేషన్ నుంచి కొంచెం దూరం వెళ్లగానే నాకు అక్కడ జగన్నాథన్ అనే వ్యక్తి కలిశారు. ఆయన ఈ పెట్రోలు సమస్య నుంచి బయటపడడానికి వేరే మార్గం ఎంచుకున్నారు.

పెట్రోలు అవసరం లేకుండా కొత్త సైకిల్ కొన్నానని ఆయన నవ్వుతూ చెప్పారు.

జగన్నాథన్ డ్రైవరుగానే పనిచేసేవారు. పెట్రోలు, డీజిల్ లేకపోవడంతో ఆయన పని ఆగిపోయింది. తన సేవింగ్స్ నుంచి కొంత మొత్తం తీసి సైకిల్ కొనుక్కున్నారు.

సిరి siri
ఫొటో క్యాప్షన్, సిరి

టుక్‌టుక్‌లు ఉన్న లైన్ కొంచెం చిన్నగా ఉంది. అక్కడ ఒక అర డజను మంది లాటరీ టికెట్లు కొంటున్నారు.

అలా అమ్మగా మిగిలిపోయిన టికెట్లన్నీ సిరి అనే వ్యక్తి ఒక్కరే కొనుగోలు చేశారు. తనకు ఆదాయమార్గం ఏమీ లేదని.. ప్రస్తుతం కష్టంగా ఉంది కానీ కొన్నాళ్లు ఓపిక పట్టక తప్పదని ఆయన అన్నారు.

26 లాటరీ టికెట్లు కొన్నానని.. అదృష్టం బాగుంటే అందులో ఏదో ఒకటి తనకు పనికొస్తుందని ఆయన ఆశగా చెప్పారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంకలో హింసాత్మక ఆందోళనలు.. ప్రధాని రాజీనామా, ఎంపీ ఆత్మహత్య

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)