శ్రీలంకలో తీవ్రంగా పెట్రోల్, కిరోసిన్ కొరత, క్యూలో నిలబడిన ఇద్దరు మృతి

శ్రీలంక ఇంధన సంక్షోభం దిశగా సాగుతోంది. దేశంలో పెట్రోల్, కిరోసిన్ కోసం ప్రజలు పొడవాటి క్యూలలో నిలబడుతున్నారు. ఆదివారం రెండు వేర్వేరు నగరాల్లో ఇలా క్యూలో నిలబడిన ఇద్దరు వృద్ధులు చనిపోయారని శ్రీలంక పోలీసులు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, ఆలమూరు సౌమ్య

  1. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన ఆందోళనకారులు రాళ్లు రువ్వుకోవడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

    శ్రీలంక ఇంధన సంక్షోభం దిశగా సాగుతోంది. దేశంలో పెట్రోల్, కిరోసిన్ కోసం ప్రజలు పొడవాటి క్యూలలో నిలబడుతున్నారు.

    ఆదివారం రెండు వేర్వేరు నగరాల్లో ఇలా క్యూలో నిలబడిన ఇద్దరు వృద్ధులు చనిపోయారని శ్రీలంక పోలీసులు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.

    యుక్రెయిన్‌లో లక్ష్యాలపై రెండవసారి హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.

    రష్యా దాడిలో యూరప్‌లోని అతిపెద్ద స్టీల్‌ ఫ్యాక్టరీలలో ఒకటైన అజోవ్‌స్టాల్ ధ్వంసమైందని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

    400 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఒక పాఠశాలపై రష్యా దళాలు శనివారంబాంబు దాడి చేసినట్లు మారియుపూల్ సిటీ కౌన్సిల్ తెలిపింది.

    యుక్రెయిన్, రష్యా తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.

  2. రష్యా కీయెవ్ ఆక్రమణకు మరోసారి సన్నాహాలు చేస్తోంది: యుక్రెయిన్ ఎంపీ

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ మీద రష్యా దాడి మొదలై 24 రోజులు అవుతోంది. ప్రపంచం కళ్లన్నీ ఇప్పుడు రష్యా వరుసగా దాడులు చేస్తున్న మరియుపూల్, జపోర్జియా, యుక్రెయిన్‌లోని మిగతా నగరాలపై ఉన్నాయి.

    రష్యా సైన్యం మరికొన్ని రోజుల్లో రాజధాని కీయెవ్ మీద మరోసారి దాడికి ప్రయత్నించవచ్చని యుక్రెయిన్ ఎంపీ కిరా రూదిక్ హెచ్చరించారు.

    రూదిక్ యుక్రెయిన్‌లో విపక్ష పార్టీ గోలోస్ నేత. కీయెవ్ మీద కొత్తగా జరిగే రష్యా దాడులను ఎదుర్కోడానికి జనం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు ఆయన బీబీసీకి చెప్పారు.

    “కీయెవ్ మీద వరుస బాంబు దాడులు జరుగుతున్నాయి. గత మూడ్రోజులుగా మేం రష్యా మిసైళ్లు నాలుగు ఇళ్లను కూల్చేయడం చూశాం. వచ్చే వారం నగరంలోకి చొరబడ్డానికి రష్యా మరో ప్రయత్నం చేస్తుందని మాకు అనిపిస్తోంది” అని ఆయన అన్నారు.

    “ఇంతకు ముందు రష్యా ఆర్మీ అందులో విఫలమైంది. నగరం బయట నుంచి వారి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, మా సైన్యం రష్యా ఆర్మీని వెనక్కు నెడుతోంది. ఇప్పటివరకూ కీయెవ్ ప్రజలు బాగానే ఉన్నారు. ప్రతి రోజూ మేమే గెలుస్తున్నాం” అన్నారు.

    మేం ముందస్తు సన్నాహాలు కూడా చేసుకుంటున్నాం. వీలైనంత ఎక్కువ ఆహారం, నీళ్లు సేకరించి పెట్టుకుంటున్నాం. మా రక్షణ సన్నాహాలు మరింత బలంగా ఉండేలా చూసుకుంటున్నాం” అన్నారు.

  3. శ్రీలంకలో పెట్రోల్, కిరోసిన్ కొరత.. క్యూలో నిలబడిన ఇద్దరు మృతి

    శ్రీలంక పెట్రోల్

    ఫొటో సోర్స్, Akila Jayawardana/NurPhoto via Getty Images

    శ్రీలంక ఇంధన సంక్షోభం దిశగా సాగుతోంది. దేశంలో పెట్రోల్, కిరోసిన్ కోసం ప్రజలు పొడవాటి క్యూలలో నిలబడుతున్నారు.

    ఆదివారం రెండు వేర్వేరు నగరాల్లో ఇలా క్యూలో నిలబడిన ఇద్దరు వృద్ధులు చనిపోయారని శ్రీలంక పోలీసులు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. వీరిద్దరూ 70 ఏళ్లకు పైబడినవారు.

    “వీరిలో ఒక వృద్ధుడు ఆటో డ్రైవర్. ఆయన డయాబెటిస్, గుండె వ్యాధితో బాధపడుతున్నారు. మరో వృద్ధుడి వయసు 72 ఏళ్లు. ఇద్దరూ చాలాసేపటి నుంచీ క్యూలో నిలబడడంతో తట్టుకోలేకపోయారు” అని పోలీస్ అధికారి నలిన్ థాల్డువా చెప్పారు.

    శ్రీలంక విదేశీ మారక నిల్వలు బలహీనపడడంతో పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది.

    పెట్రోల్ పంపుల దగ్గర జనం పొడవాటి క్యూలలో ఉంటున్నారు. ప్రజలు గంటలపాటు విద్యుత్ కోతలు ఎదుర్కుంటున్నారు.

    శ్రీలంక ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా మారింది. పేపర్, ప్రింటింగ్ కోసం ఇంక్ కొనలేక ప్రభుత్వం విద్యార్థుల పరీక్షలు కూడా రద్దు చేయాల్సి వచ్చింది.

    కోవిడ్ వల్ల పర్యటక రంగంపై ఆధారపడిన శ్రీలంక ఆర్థికవ్యవస్థకు చాలా నష్టం జరిగిందని రాయిటర్స్ చెప్పింది.

    ఆహార ఉత్పత్తులు, మందులు, ఇతర నిత్యావసరాల కొనుగోళ్ల కోసం శ్రీలంకకు వంద కోట్ల డాలర్ల రుణం అందించాలని భారత్ నిర్ణయించింది.

    శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్ష దీనికోసం ఇటీవల భారత్ వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

    అంతర్జాతీయ వేదికలపై శ్రీలంకకు మద్దతు ఇవ్వడంతోపాటూ ఆర్థిక, సామాజిక అంశాల్లో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చినట్లు ఆయన మోదీతో సమావేశం అనంతరం చెప్పారు.

  4. బిహార్‌లో పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి.. పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టిన స్థానికులు

    బిహార్‌

    ఫొటో సోర్స్, ANI

    బిహార్‌లో శనివారం తెల్లవారుజామున పోలీసు కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి మరణించిన ఘటన చోటుచేసుకుంది. తేనెటీగలు కుట్టడంతో ఆ వ్యక్తి మరణించినట్టు పోలీసులు చెబుతున్నారు.

    దాంతో, స్థానికులు వెస్ట్ చంపారన్‌లోని బెట్టియాలో బాల్తేర్ పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘటనను పోలీసులు ధృవీకరించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.

    "మూడు పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారు మృతి చెందారు. పోలీసు కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి తేనెటీగలు కుట్టడంతో మరణించారు. ఆ తరువాత, ఈ ఘటన చోటుచేసుకుంది" అని బెట్టియా పోలీసు సూపరిండెంట్ (ఎస్పీ) ఉపేంద్ర నాథ్ వర్మ మీడియాకు వెల్లడించారు.

    హోలీ పండుగ రోజు పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టినందుకు ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ చెప్పారని ఏఎన్ఐ తెలిపింది.

  5. బోధన్‌లో శివాజీ విగ్రహ స్థాపన సందర్భంగా ఘర్షణలు

    నిజామాబాద్

    ఫొటో సోర్స్, UGC

    నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో అంబేద్కర్ చౌరాస్తా దగ్గర శివాజీ విగ్రహ స్థాపన సందర్భంగా ఘర్షణ జరిగింది.

    శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికి రాత్రే విగ్రహాన్ని ప్రతిష్టించడంతో, మైనార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు.

    ఇరుపక్షాల నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాంతో, పోలీసు బలగాలను మోహరించారు.

    ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలకూ నచ్చజెపే ప్రయత్నం చేశారు.

  6. యుక్రెయిన్‌లో రెండవసారి హైపర్‌సోనిక్ మిసైల్‌ను ప్రయోగించిన రష్యా

    యుక్రెయిన్‌

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌లో తమ లక్ష్యాలపై రెండవసారి హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.

    రష్యాకు చెందిన కొత్త కింజాల్ క్షిపణి వ్యవస్థ ద్వారా జరిపిన ఈ దాడిలో దక్షిణ యుక్రెయిన్‌లోని ఒక ఇంధన నిల్వ స్థలాన్ని ధ్వంసం చేసినట్లు రష్యన్ అధికారులు తెలిపారు.

    "కింజాల్.. హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్, మైకోలైవ్ ప్రాంతంలోని కోస్ట్యాంటినివ్కా సెటిల్మెంట్ సమీపంలో యుక్రెయినియన్ సాయుధ దళాలకు చెందిన ఇంధన నిల్వ స్థలాన్ని నాశనం చేశాయి" అని రష్యన్ అధికారులు వెల్లడించారు.

    ఈ వాదనను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు. రష్యా వాదనలు నిజమైతే యుక్రెయిన్‌పై రష్యా జరిపిన రెండవ హైపర్‌సోనిక్ క్షిపణి దాడి ఇది.

  7. యుక్రెయిన్‌ యుద్ధం: రష్యా తొలి హైపర్‌సోనిక్ మిసైల్‌ కింజాల్ 'గేమ్ చేంజర్’ కాదా?

    రష్యా మిలిటరీ ఒక హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించి పశ్చిమ యుక్రెయిన్‌లోని పెద్ద భూగర్భ ఆయుధ డిపోను ద్వంసం చేసినట్లు మాస్కో వేదికగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ఒకవేళ ధ్రువీకరణ అయితే ఈ యుద్ధంలో రష్యా వాడిన తొలి హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ఇదే అవుతుంది. కింజాల్ లేదా డాగర్ అనే బాలిస్టిక్ మిసైల్స్‌ను గగనతలం నుంచి ఎక్కువగా మిగ్-31 యుద్ధ విమానాల ద్వారా ప్రయోగిస్తారు.

    ఇంతకీ హైపర్‌సోనిక్ మిసైల్స్ అంటే ఏమిటి?

    రష్యా, హైపర్‌సోనిక్ మిసైల్స్

    ఫొటో సోర్స్, RUSSIAN DEFENCE MINISTRY

    ఫొటో క్యాప్షన్, రష్యా మిగ్-31 కె యుద్ధ విమానాల్లో కింజాల్ క్షిపణులను అమర్చారు
  8. యూరప్‌లోని అతిపెద్ద స్టీల్‌ ఫ్యాక్టరీలలో ఒకటైన అజోవ్‌స్టాల్ ధ్వంసమైంది - యుక్రెయిన్ అధికారులు

    మరియుపూల్‌లో అజోవ్‌స్టాల్ ఫ్యాక్టరీ అని పిలిచే ఇనుము, ఉక్కు కర్మాగారంలో పేలుళ్లు సంభవించినట్లు అంతకుముందు రిపోర్టులు వచ్చాయి.

    రష్యా బాంబు దాడిలో ఈ ఫ్యాక్టరీ "ధ్వంసమైందని" తాజాగా యుక్రెయినియన్ అధికారులు వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఫ్యాక్టరీ దెబ్బతిందని అజోవ్‌స్టాల్ డైరెక్టర్ జనరల్ టెలిగ్రాంలో వెల్లడించారు. అయితే, ఎంత నష్టం వాటిల్లిందో చెప్పలేదు.

    యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఫ్యాక్టరీ కార్మికులు భద్రతా చర్యలు తీసుకుంటున్నారని, ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసించే ప్రజలకు ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన తెలిపారు.

    ఈ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకునేందుకు రష్యా రెండు వారాలుగా ప్రయత్నిస్తోంది. మరియుపూల్‌లో ఇది కీలకమైన ఆస్తి.

  9. శ్రీలంక: కేజీ చికెన్ 1000, ఒక్కో గుడ్డు 35.. కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 - ఈ పరిస్థితికి సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే కారణమా?

    శ్రీలంక

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    2020 మార్చిలో చాలా దేశాలతో పాటు శ్రీలంక కూడా కోవిడ్ లాక్ డౌన్ లోకి వెళ్ళింది. దీంతో, దేశంలో ప్రధాన పరిశ్రమలైన టీ, వస్త్రాలు, పర్యటకం తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

    స్థిరమైన ఆదాయం లేక, దేశ ఆర్ధిక పరిస్థితి బాగా క్షీణించింది. సెంట్రల్ బ్యాంక్ చేతిలో ఉన్న విదేశీ మారక ద్రవ్య విలువలు కూడా బాగా పడిపోయాయి.

    ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారడంతో, అమెరికన్ డాలర్లకు సరళమైన విదేశీ మారక రేటును ప్రవేశపెట్టాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. దేశంలో ఏర్పడిన డాలర్ కొరతను సర్దుబాటు చేసేందుకు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొరత దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరింది.

  10. అమరావతి అభివృద్ది పనులు మొదలయ్యాయా, ఇప్పుడు అక్కడి పరిస్థితి ఏమిటి?

    ఆంధ్రప్రదేశ్, అమరావతి

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో ఏర్పడిన సందిగ్ధతకు ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు తర్వాత ముగింపు దక్కుతుందనే ఆశాభావం చాలామందిలో వ్యక్తమయ్యింది.

    అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో సుమారు మూడేళ్లుగా నిలిచిన పనులకు మళ్లీ మోక్షం కలుగుతుందనే ఆశాభావం ఆ ప్రాంత వాసులు వ్యక్తం చేశారు.

    అసలింతకీ అమరావతిలో పరిస్థితి ఏంటి?

  11. ‘నాకు కరోనా వచ్చింది.. నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు’

    వీడియో క్యాప్షన్, ‘నాకు కరోనా వచ్చింది.. నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు’
  12. బ్రేకింగ్ న్యూస్, మరియుపూల్‌లో 400 మంది ఆశ్రయం పొందుతున్న పాఠశాలపై రష్యా దాడి చేసింది - సిటీ కౌన్సిల్

    శనివారం, 400 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఒక పాఠశాలపై రష్యా దళాలు బాంబు దాడి చేసినట్లు మారియుపూల్ సిటీ కౌన్సిల్ తెలిపింది.

    భవనం ధ్వంసమైందని, ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారని టెలిగ్రాంలో వెల్లడించింది. పాఠశాలలో తలదాచుకున్నవారిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.

    అయితే, ఈ దాడిలో ఎంతమంది మృతి చెందారన్నది స్పష్టంగా తెలీదు.

    ప్రస్తుత పరిస్థితుల్లో మారియుపూల్‌ నగరం నుంచి సమాచారం సేకరించడం అత్యంత కష్టంగా మారింది. పాఠశాల దాడిని వెంటనే ధ్రువీకరించడం బీబీసీకి సాధ్యపడలేదు.

  13. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2022 ఫైనల్స్‌లో భారత ఆటగాడు లక్ష్య సేన్

    లక్ష్య సేన్, ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2022

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, లక్ష్య సేన్

    భారత ఆటగాడు లక్ష్య సేన్, ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2022 పురుషుల సింగిల్స్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నాడు.

    సెమీ ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, మలేషియా ఆటగాడు లీ జీ జియాను 21-13 12-21 21-19తో ఓడించి లక్ష్య సేన్ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు.

    సెమీ ఫైనల్‌లో లక్ష్య.. గంట 16 నిమిషాల్లో ఈ విజయాన్ని సాధించాడు.

    అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం లీ జీ జియా 7వ స్థానంలో ఉండగా, లక్ష్య 11వ స్థానంలో ఉన్నాడు. తన కన్నా ఎక్కువ ర్యాంకు ప్లేయర్‌ను ఓడించి లక్ష్య ఈ విజయాన్ని అందుకున్నాడు.

    ఈ మ్యాచ్‌కు ముందు ఇదే ఛాంపియన్‌షిప్‌లో లక్ష్య.. మూడో ర్యాంక్ ఆటగాడు అండర్స్ ఆంటోన్‌సెన్, అయిదవ ర్యాంక్ ఆంథోనీ గింటింగ్‌లను కూడా ఓడించాడు.

    ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన అయిదవ భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాడిగా లక్ష్య సేన్ రికార్డు సృష్టించాడు.

    అంతకు ముందు, ప్రకాష్ నాథ్ (1947), ప్రకాష్ పదుకొనే (1980, 1981), పుల్లెల గోపీచంద్ (2001) ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. 2015లో ఈ ఛాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ ఫైనల్‌కు చేరుకుంది.

    వీరిలో, 1980లో ప్రకాష్ పదుకొనే, 2001లో పుల్లెల గోపీచంద్ ఫైనల్స్ గెలిచి ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు.

    ఆదివారం బర్మింగ్‌హామ్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్య ఆడనున్నాడు.

  14. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో భగవద్గీతను బోధించే ఆలోచన చేయాలి - ప్రల్హాద్ జోషి

    గుజరాత్‌, భగవద్గీత

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రల్హాద్ జోషి

    గుజరాత్‌ తరహాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో భగవద్గీత బోధించే ఆలోచన చేయాలని కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి సూచించారు.

    "భగవద్గీత మనకు నైతికతను బోధిస్తుంది. సమాజ శ్రేయస్సు పట్ల మన బాధ్యతను తెలియజేస్తుంది. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే అనేక కథలు ఇందులో ఉన్నాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి" అని జోషి ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.

    గుజరాత్‌లోని అన్ని పాఠశాలల్లో ఈ ఏడాది మొదలుకొని 6 నుంచి 12వ తరగతి వరకు భగవద్గీత బోధించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జితు వాఘాని గురువారం ప్రకటించారు.

  15. భారత్‌లో తొలిసారిగా పర్యటించనున్న ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ నఫ్తాలీ

    ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెనెట్ నఫ్తాలీ ఈ ఏడాది ఏప్రిల్ 2న తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్నారు.

    భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బెనెట్ భారతదేశాన్ని సందర్శిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

    బెనెట్ గత ఏడాది అక్టోబర్‌లో గ్లాస్గోలో జరిగిన కాప్ 26 సదస్సులో మోదీని కలిశారు. ఆ సందర్భంగా, భారతదేశానికి రావాల్సిందిగా మోదీ ఆయన్ను ఆహ్వానించారు.

    భారత్-ఇజ్రాయెల్ మధ్య సంబంధాలకు ముప్పై ఏళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంలో బెనెట్ భారత్‌లో పర్యటించనున్నారు.

    ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక మైత్రిని మరింత బలోపేతం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడం ఈ పర్యటన ఉద్దేశం.

    ఈ పర్యటనలో బెనెట్, మోదీ సహా ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులను కలవనున్నారు. అలాగే, భారతదేశంలో నివసిస్తున్న యూదు సమాజాన్ని కూడా కలవనున్నారు.

    "నా మిత్రుడు, ప్రధానమంత్రి మోదీ ఆహ్వానం మేరకు తొలిసారిగా భారతదేశంలో పర్యటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇజ్రాయెల్, భారత్‌ల మధ్య సంబంధాలను మోదీ పునరుద్ధరించారు. దీనికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది" అని బెనెట్ పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. యుక్రెయిన్ సంక్షోభం - తాజా పరిణామాలు

    • గత వారంలో వేలాది మంది నివాసితులను రష్యా బలగాలు రష్యా నగరాలకు బలవంతంగా తీసుకెళ్లాయని మారియుపూల్ నగర అధికారులు చెబుతున్నారు. ఈ వాదనను బీబీసీ ఇంకా ధృవీకరించలేదు.
    • మరియుపూల్ నగరంపై రష్యా వరుస దాడులు జరుపుతోంది. కొన్ని ప్రాంతాల్లో కరంట్, గ్యాస్, నీటి సరఫరా ఆగిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
    • నగరంలో కొనసాగుతున్న భీకర పోరు వల్ల గురువారం బాంబు దాడులకు గురైన థియేటర్ శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కష్టంగా మారిందని మరియుపూల్ నగర మేయర్ చెప్పారు.
    • శనివారం, 200 మంది సైనికులు నిద్రిస్తున్న మిలిటరీ బ్యారక్‌ను ఒక రష్యా క్షిపణి తాకింది. ఈ యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైన రాకెట్ దాడులలో ఇదీ ఒకటని భావిస్తున్నారు.
    • రష్యాతో అర్థవంతమైన శాంతి చర్చలకు తాను సిద్ధమని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ప్రకటించారు. రష్యా కూడా ఈ చర్చలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
    • రష్యా దాడులను వ్యతిరేకిస్తూ చైనా తన వైఖరిని స్పష్టపరచాలని యుక్రెయిన్ కోరింది. బ్రిటన్ ప్రధాని కూడా ఇదే అంశంలో చైనాపై ఒత్తిడి తెచ్చారు.
    • అయితే, పాశ్చాత్య దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు "దారుణంగా" ఉన్నాయని చైనా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
    • 20 లక్షల కంటే ఎక్కువమంది యుక్రెయినియన్లు పోలండ్‌కు పారిపోయారు. ఇప్పటివరకు 33 లక్షల మంది యుక్రెయినియన్లు ఇతర దేశాలకు తరలివెళ్లారని అంచనా.
    • రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్‌లో 64 మంది పిల్లలు సహా కనీసం 847 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది.
  17. యుక్రెయిన్‌లో 1,500 రష్యన్ మీడియా సంస్థలను బ్లాక్ చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి

    యుక్రెయిన్‌

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి యుక్రెయిన్‌లో రష్యా అనుకూల ప్రచారాలను నిర్వహిస్తున్న 1,500 మీడియా సంస్థలను బ్లాక్ చేసినట్లు ఇంటర్‌ఫాక్స్-యుక్రెయిన్ వార్తా సంస్థ తెలిపింది.

    "దురాక్రమణదారులకు చెందిన 1,500 సంస్థలను బ్లాక్ చేశాం" అని నేషనల్ పోలీస్ వెల్లడించినట్లు ఆ సంస్థ తెలిపింది.

    "బ్లాక్ చేసిన ఛానెల్స్‌కు 1.5 కోట్ల మంది ప్రేక్షకులు ఉన్నట్లు అంచనా. అదనంగా, యుద్ధ నేరాలు యుక్రేనియన్ పౌరుల మరణాలను సమర్థించే 3,178 ప్రచురణలను తొలగించాం" అని పోలీసు శాఖ తెలిపింది.

    ఈ ఛానెల్స్ గురించి యుక్రెయిన్ వెబ్ వినియోగదారులు ఫిర్యాదులు చేయడంతో, వాటిని బ్లాక్ చేసినట్లు చెప్పారు.

  18. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    నమస్కారం. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తలు, బ్రేకింగ్ న్యూస్, లైవ్ అప్‌డేట్ల కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.