ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వాలు జీవోలను ఎందుకు బయటకు రానివ్వడం లేదు, జగన్మోహన్ రెడ్డి సర్కారు మరింత రహస్యంగా వ్యవహరిస్తోందా?

ఆంధ్రప్రదేశ్‌

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRA PRADESH CM

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టడానికి నిరాకరిస్తోంది. గడిచిన మూడేళ్ల లెక్కలు చూస్తే ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రభుత్వ నిర్ణయం మూలంగా 2021 ఆగస్టు నుంచి అత్యధిక జీవోలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు.

దేశంలో 2012లో నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసబుల్ పాలసీ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, కార్యకలాపాలు ప్రజలందరికీ చేర్చేందుకు సాంకేతిక సదుపాయాలను వినియోగించుకోవాలని ఈ విధానం నిర్దేశించింది.

ఈ విధానానికి ముందే 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ (జీవోఐఆర్) వినియోగంలోకి వచ్చింది. 2007లో నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందా చొరవతో జీవోఐఆర్‌కి రూపకల్పన చేశారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను అందరికీ అందుబాటులో ఉంచడం కోసం http://goir.ap.gov.in/ పేరుతో 2008 నాటికి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది.

జీవో

ఫొటో సోర్స్, apegazette

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన చొరవ కావడంతో అప్పట్లో అనేక ప్రశంసలు కూడా వచ్చాయి. పారదర్శకతకు ఇది తోడ్పడుతుందనే అభిప్రాయం వినిపించింది.

ఏపీ ప్రభుత్వం జీవోఐఆర్‌లో పాటిస్తున్న విధానాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు అనుసరించాయి. కేంద్రం కూడా 2012లో దేశవ్యాప్త విధానం రూపొందించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ), అన్ని ప్రధాన సంస్థలు తమ కార్యకలాపాల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచే విధానం అమలు చేస్తున్నాయి.

ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ అత్యధికులు తమకు కావాల్సిన సమాచారం కోసం జీవోఐఆర్‌లో వెతకడం పెరిగింది. జీవోఐఆర్ అమలులోకి వచ్చిన తర్వాత అనేక వివరాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఒక క్లిక్‌తోనే సమగ్ర సమాచారం తెలుసుకునే వెసులుబాటు దక్కింది. ఒక ఉద్యోగి సర్వీసుకు సంబంధించిన ఉత్తర్వుల నుంచి, అత్యున్నత అధికారుల బదిలీల వరకు ఉత్తర్వులన్నీ ప్రజలు చూడగలిగేవారు.

ఏపీ హైకోర్టు

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN

విధాన మార్పు ఏమిటి?

జీవోలను విడుదల చేసే బాధ్యత ఆయా శాఖల సెక్షన్ ఆఫీసర్‌ది. దానిని పరిశీలించి, సంతకం చేసే అధికారం కార్యదర్శి, ఆపై స్థాయి అధికారికి ఉంటుంది.

దానిని పరిశీలన చేసేందుకు కార్యదర్శి నుంచి సంబంధిత శాఖ మంత్రి లేదా కొన్నిసార్లు సీఎం వరకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అందరూ పరిశీలించినప్పటికీ చివరకు కార్యదర్శి సంతకం చేసిన తర్వాత సెక్షన్ ఆఫీసర్ వద్దకే వస్తుంది.

ప్రభుత్వ ఉత్తర్వులకు విధాన, రాజకీయ, ఆర్థిక పరమైన అనేక కారణాలుంటాయి. వాటిని జీవోల రూపంలో తీసుకురావడం బ్రిటీష్ హయాం నుంచి వస్తున్న ఆనవాయితీ.

జీవోలలో ప్రధానంగా మూడు రకాలుంటాయి. అందులో జీవో (ఎంఎస్) అంటే మాన్యువల్ స్క్రిప్ట్ అని, జీవో (పి) అంటే ప్రింటెడ్ అని, జీవో (ఆర్టీ) రొటీన్ కార్యకలాపాలకు సంబంధించిన జీవో అని వర్గీకరించేవారు. అదే పద్ధతిలో వెబ్ సైట్‌లో అందుబాటులో ఉండేవి.

2021 ఆగస్టులో ప్రభుత్వం జీవోఐఆర్ సైట్‌లో జీవో కాపీలు అందుబాటులో ఉంచే ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించింది. దాని మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కోర్టు స్పందించింది. న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించుకుంది.

అయినప్పటికీ జీవోఐఆర్‌లో పునరుద్ధరణ చేసే బదులు ఏపీ గెజిట్ అనే సైట్‌లో జీవోలు ఉంచాలని నిర్ణయించింది.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, Getty Images

రహస్య, బ్లాంక్‌ జీవోలు కూడా

జీవోల్లో ప్రభుత్వం కొన్నింటిని కాన్ఫిడెన్షియల్‌గా పేర్కొనడం చాలాకాలంగా ఉంది. శాంతి భద్రతలు, అంతర్గత భద్రతతోపాటు కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రం అదే రీతిలో 'కాన్ఫిడెన్షియల్‌'గా ఉంచడం ఆనవాయితీగా ఉండేది.

సాధారణంగా రహస్య జీవోల వివరాలు పూర్తిగా అందుబాటులో ఉంచరు. కేవలం జీవో నంబర్, శాఖ పేరు మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత రానురాను ప్రభుత్వాలు తాము దాచిపెట్టాలనుకున్న ప్రతీ అంశాన్ని రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించాయి. కొన్ని సార్లు వాటి చుట్టూ వివాదాలు కూడా రేగాయి.

2014 - 2019 కాలంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఐదేళ్లలో 1729 జీవోలను 'కాన్ఫిడెన్షియల్‌'గా పేర్కొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2019 జూన్ 1 నుంచి 2020 ఆగస్టు వరకు 227 జీవోలను 'కాన్ఫిడెన్షియల్‌' కేటగిరీలో చేర్చింది.

రహస్య జీవోలతో పాటుగా కొన్నిసార్లు బ్లాంక్ జీవోలంటూ కొత్త పద్ధతిని కూడా వైసీపీ ప్రభుత్వం అనుసరించింది. కొందరు ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన జీవోలను కూడా ఇలా బ్లాంక్ జీవోలని పేర్కొనడం విమర్శలకు దారితీసింది. దీనిపై విపక్షాలు గవర్నర్‌కు ఫిర్యాదులు చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌

ఫొటో సోర్స్, AP govt

కొత్త పద్ధతి వచ్చిన తర్వాత మరింత రహస్యం

పాత విధానం ప్రకారం https://goir.ap.gov.in/ వెబ్‌సైట్‌లో జీవోలు ఉంచినప్పుడు 2021 జనవరి 1 నుంచి జూన్ 24 వరకూ దాదాపుగా తొలి ఆరు నెలల కాలంలో 7,495 జీవోలు విడుదలయ్యాయి. వాటిని వివిధ కేటగిరీల కింద వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

అంతకుముందు ఏడాది 2020 లెక్కలు చూస్తే అదే కాలంలో 9,235 జీవోలు విడుదలయ్యాయి. ఇక 2019లో వాటి సంఖ్య 9,363గా ఉంది. జీవోఐఆర్ లెక్కల ప్రకారం గతంలో పెద్ద సంఖ్యలో జీవోలను ప్రభుత్వాలు అందరికీ అందుబాటులో ఉంచాయి.

ఇక 2022 లెక్కలు చూస్తే జనవరి 1 నుంచి జూన్ 24 వరకూ కేవలం 2,076 జీవోలు మాత్రమే https://apegazette.cgg.gov.in/home సైట్‌లో పోస్ట్ చేశారు. వాటిని కూడా గతానికి భిన్నంగా రెండు విభాగాలుగా పేర్కొన్నారు. ఎక్‌స్ట్రార్డినరీ, వీక్లీ అనే పేరుతో విభజించారు. 1,043 జీవోలు ఎక్‌స్ట్రార్డినరీ కోటాలోనూ, 1033 జీవోలను వీక్లీ కోటాలోనూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

గతంలో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్, సర్వీస్ మ్యాటర్, టూర్లు, ట్రాన్సఫర్స్‌తో పాటు అదర్స్ అంటూ విభజించి జీవోలు అందరికీ కనిపించేవి. ఈసారి శాఖల వారీగా ఉన్నప్పటికీ కేటగిరీలలో మాత్రం మార్పులు చేశారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సమాచార హక్కు చట్టం లాంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ప్రయత్నాలు తగవని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులిస్తోందో, వాటిలో మంచి చెడులు ఏమిటనే విషయం ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఆయన బీబీసీతో చెప్పారు.

"సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల గురించి బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వాలు దానిని అనుసరించకపోవడం చట్టవిరుద్ధం. జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచే విధానానికి తిలోదకాలివ్వడంపై గతంలో ఏపీ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినా అత్యధిక జీవోలు అందుబాటులో లేకపోవడం సమంజసం కాదు’’ అని శర్మ అన్నారు.

ఈ వైఖరి కొనసాగనివ్వకుండా, రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో "గోప్యత" పాటించడం తగదని శర్మ అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి వల్ల సామాన్యుల్లోనూ సందేహాలు పెరుగుతున్నాయని సమాచార హక్కు చట్టం కార్యకర్త పి.విశ్వేశ్వర రావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తాను తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలకు తెలియకూడదని భావించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

గతంలో జీవోఐఆర్ ద్వారా ఎప్పుడు అవసరం అనుకుంటే, అప్పుడు జీవో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండేదని విశ్వేశ్వరరావు అన్నారు.

‘‘చిన్న చిన్న బదిలీలు, సాధారణ నియామకాలకు సంబంధించిన అంశాలు కూడా దాచిపెడుతున్నారు. ఇటీవల అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ నియామకానికి సంబంధించిన జీవోను వెలుగులోకి రానివ్వలేదు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ ప్రతిష్టను తగ్గిస్తాయి. ప్రజలకు ప్రతీ విషయం తెలియడం పాలకుల సమర్థతను చాటుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

కొన్ని నెలలుగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోల్లో మూడో వంతు వాటిని సామాన్యులకు చేరకుండా చేయడం సమంజసం కాదని విశ్వేశ్వరరావు అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు ఆర్టీఐ కింద అడిగినా సమాచారం ఇచ్చేందుకు జాప్యం జరుగుతోందని తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి, ఈ బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిదా?

“ఇంత గోప్యత ఎన్నడూ లేదు”

ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ప్రభుత్వం భయపడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అనేక నిర్ణయాల ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అందుబాటులో లేకుండా దాచిపెట్టడం వెనుక అవకతవకలే కారణమని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ఆరోపించారు.

"జీవో గురించి జనాలు తెలుసుకోకూడదా. ఏ నిర్ణయం ద్వారా ఎవరికి ప్రయోజనం కలుగుతుందన్నది సామాన్యులు తెలుసుకోకూడదా. కేంద్ర ఆర్థిక శాఖ వివరాల కోసం పదే పదే అడగాల్సి వస్తోంది. ఇక ప్రజలకు ప్రభుత్వ ఉత్తర్వులు వెల్లడిస్తారని ఆశించడం అత్యాశేనేమో. ఇంతటి గోప్యత గతంలో ఎన్నడూ లేదు" అంటూ వ్యాఖ్యానించారు.

విధానాల ఫలితాలను అందరూ గ్రహించకూడదనే లక్ష్యంతోనే జగన్ ప్రభుత్వం ఇలాంటి జీవోలను దాచిపెట్టే పనికి దిగుతోందని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ప్రాణాలు మింగేస్తున్న మ్యాన్‌హోల్స్-మురుగు కాలువల్లోకి ఇంకా మనుషులే దిగాలా

అవసరమైనదంతా అందుబాటులోనే: మంత్రి

అయితే తమ ప్రభుత్వం పాదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు చెప్పారు.

జీవోలు దాచిపెడుతున్నారనడంలో వాస్తవం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని, ఇంకా అదనపు సమాచారం అవసరమని కోరితే అందిస్తామని తెలిపారు.

అయితే ప్రభుత్వం మాటలకు, అధికారిక గణాంకాలకు పొంతన కుదరడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)