గోదావరి వరదలు: జులై నెలలో ఈ స్థాయి వరద వందేళ్లలో ఇదే తొలిసారి , ముంపు గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Prasad
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
గోదావరి వరదల తాకిడితో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి.
కడెం, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో తగ్గడంతో కొన్ని ప్రాంతాలు తేరుకున్నాయి. కానీ కాళేశ్వరం దిగువన తెలంగాణలోని అనేక మండలాలు వరద ముంపులో కనిపిస్తున్నాయి.
అదే సమయంలో భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరు జిల్లాల్లోని వందల గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పోలవరం ముంపు మండలాలతో పాటుగా, గోదావరి లంకలు, కోనసీమ గ్రామాల ప్రజలు భయాందోళనతో గడపాల్సి వస్తోంది.
శుక్రవారం ఉదయానికి భద్రాచలం వద్ద 2006 నాటి వరద స్థాయిని దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయానికి 67.1 అడుగులతో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతోంది.
ఈ ప్రవాహం 70 అడుగులు దాటిపోయే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 2006లో 66.9 అడుగులకు చేరుకుంది. వరద అంతకంతకు పెరుగుతుండటంతో పూర్వపు గోదావరి జిల్లాలు ప్రమాదం అంచుకు చేరుకుంటున్నాయి. చరిత్రలోనే తొలిసారిగా జులై నెలలో ఇంత పెద్ద వరదలు వచ్చినట్లు నీటి పారుదల శాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి.
వరదల వల్ల ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం యంత్రాంగం రంగంలోకి దిగింది.

ఫొటో సోర్స్, ugc
అనూహ్య వరదలతో అతలాకుతలం..
గోదావరికి సహజంగా జులైలో వరదల సీజన్ ప్రారంభమవుతుంది ఆగష్టులో అది ఉధృతమవుతుంది. సెప్టెంబర్‌తో ముగుస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా సీజన్ ఆరంభంలోనే నదీ ప్రవాహం ఎక్కువైంది.
అది కూడా అసాధారణ స్థాయిలో కనిపిస్తోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద 2006 తర్వాత అత్యధిక వరద ప్రవాహంగా నమోదయ్యింది.
సరిగ్గా పది రోజుల క్రితం గోదావరి నదిలో నీటి ప్రవాహం అంతంత మాత్రంగానే ఉండేది. ఎగువన వర్షాలు కురవకపోవడంతో నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో ధవళేశ్వరం నుంచి పంట కాలువలకు నీటిని విడుదల చేయడానికి సరిపడా నిల్వలు మాత్రమే మిగిలాయి.
కానీ అనూహ్యంగా వారం గడిచేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిండుకుండలా నదీ ప్రవాహం మారిపోయింది. ఎండిపోయినట్టుగా కనిపించిన నది ఇప్పుడు హఠాత్తుగా భిన్నమైన రూపంలో దర్శనమిస్తోంది.

ఫొటో సోర్స్, Prasad
తొలుత మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగా ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి వచ్చిన వరద నీరు గోదావరిలో చేరింది. బాబ్లీ మీదుగా ఎస్సార్సెపీ నుంచి ప్రవాహం సాగింది. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో కూడా భారీ వర్షాలు కురియడం వల్ల శబరి ఉప్పొంగింది.
తాలిపేరు, కిన్నెరసాని నుంచి కూడా వరద నీరు తరలిరావడంతో ఈనెల ధవళేశ్వరం వద్ద 10వ తేదీ నాటికి వరద తాకిడి మొదలయ్యింది. నాలుగు రోజుల్లోనే అది మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది.

ఫొటో సోర్స్, ugc
1950 తర్వాత ఎన్నడూ లేదు..
ధవళేశ్వరంలోని నీటి పారుదల శాఖ గోదావరి హెడ్ వర్క్స్ అధికారుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం గడిచిన వందేళ్లలో ఇంత పెద్ద స్థాయిలో వరద ప్రవాహం జులైలో ఎన్నడూ నమోదు కాలేదు. అందులో 1950ల తర్వాత జులైలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిన జాడ లేదని ధవళేశ్వరం ఇరిగేషన్ డీఈ ప్రదీప్ కుమార్ బీబీసీకి తెలిపారు.
గోదావరికి 1954, 1986, 1990, 2006, 2013, 2020లలో వచ్చిన వరదలే పెద్దవిగా నమోదయ్యాయి. ఆ వరదలన్నీ ఆగష్టు నెలలోనే వచ్చాయి. ఎక్కువగా ఆగష్టు మొదటి, రెండు వారాల్లోనే భారీ వరదలు వస్తుండడం సహజంగా కనిపించింది. ఈసారి అందుకు భిన్నంగా ధవళేశ్వరం వద్ద జూలై 14వ తేదీ సాయంత్రానికే మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది.
ముఖ్యమంత్రి కార్యాలయం అందించిన సమాచారం మేరకు ఈసారి వరద ప్రవాహం 23 నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరకూ డిశ్చార్జ్ చేయాల్సిన స్థితికి చేరడం ఖాయంగా యంత్రాంగం భావిస్తోంది.
ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో యధావిధిగా మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్‌కు చెందిన 175 క్రష్ట్ గేట్లను పూర్తిగా ఎత్తేసి దిగువకు వదులుతున్నారు. 14వ తేదీ సాయంత్రం 6గం.ల సమయానికి నీటిమట్టం 16.10 అడుగులుగా నమోదయ్యింది. 15వ తేదీ ఉదయానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 18.46 లక్షల క్యూసెక్కులు ఉందని ఏపీ విపత్తుల నివారణ సంస్థ వెల్లడించింది. నీటి 21 అడుగులు దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈ వరద 22 నుంచి 23 క్యూసెక్కులను చేరుకునే అవకాశం ఉందని, అదే జరిగితే ఏపీలోని ఆరు జిల్లాల్లోని 42 మండలాలపై తీవ్రప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, UGC
భద్రాచలం వద్ద కూడా అంతే..
భద్రాచలం వద్ద 2006లో 66.9 అడుగుల నీటిమట్టం నమోదయ్యింది. ఆ తర్వాత 2013, 2020లో అది 61.6 అడుగులకు చేరింది.
2022లో గురువారం సాయంత్రానికే అది 62 అడుగులకు చేరిపోయింది. అంటే దశాబ్దంన్నర కాలంలో అత్యధిక వరదగా నమోదయ్యింది.
అదే సమయానికి ఎగువన కాళేశ్వరం వద్ద 28 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ జరుగుతోంది. అధికారుల అంచనా ప్రకారం కాళేశ్వరం నుంచి వరద ప్రవాహం భద్రాచలం చేరేసరికి కనీసంగా 25 గంటలు పడుతుంది. అంటే శుక్రవారం సాయంత్రానికి భద్రాచలంలో నీటిమట్టం మరింత పెరిగే ముప్పు ఉంది. అది 64 అడుగులు దాటిపోవడం అనివార్యమని అధికారులు నిర్ధారణకు వచ్చారు.

వరద అంచనాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి వరద ముంపుకి గురైన చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మరియు కొత్తగూడెం మండలాల్లో ముంపుకు గురైన 59 గ్రామాలకు చెందిన 2,619 కుటుంబాల వారిని 47 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈ పునరాస కేంద్రాల్లో 8,984 మందికి సంరక్షణ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
మరోవైపు భద్రచలం పట్టణంలోకి రాకపోకలు నిలిపివేశారు. గోదావరి వంతెనపై 48 గంటల పాటు వాహనాల కదలికలకు ఆంక్షలు విధించారు.

ఫొటో సోర్స్, ugc
ముంపు మండలాల్లో అస్తవ్యస్తం
అల్లూరి, ఏలూరు జిల్లాల పరిధిలో ఉన్న పోలవరం ముంపు మండలాల ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి శబరి కాస్త శాంతించడంతో చింతూరు వాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ కూనవరం, వీఆర్ పురం, వేలేరుపాడు మండలాల్లోని వంద గ్రామాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కకున్నారు. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో కొండలపైకి తల దాచుకుంటున్నారని గిరిజన సంఘం నాయకుడు లోతా రాంబాబు బీబీసీతో అన్నారు.
"వరద వేగంగా పెరుగుతోంది. ఊళ్లన్నీ నీళ్లలో నానుతున్నాయి. కానీ యంత్రాంగం మాత్రం స్పందించలేదు. బుధవారం మధ్యాహ్నం తర్వాత సహాయక బృందాలు వచ్చాయి. గురువారం కొన్ని గ్రామాల నుంచి బాధితులను తీసుకొచ్చారు. పునరావాస కేంద్రాల్లో సదుపాయాలు కూడా లేవు. అయినా ప్రాణభయంతో వస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. కొండలపై తలదాచుకున్న వారికి ఆహారం, నీళ్ల ప్యాకెట్లు అందించాలి. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పుడైనా మానవత్వంతో ఆదుకోవాలి" అంటూ ఆయన కోరారు.
వరద బాధితులను ఆదుకుంటామంటూ ముఖ్యమంత్రి చెబుతున్న మాటలకు, ఆచరణలో పరిస్థితికి పొంతన లేదని రాంబాబు విమర్శించారు.

ఫొటో సోర్స్, ugc
భయంతో కోనసీమ వాసులు
కోనసీమ గతంలో అనేక వరదల తాకిడికి గురయ్యింది. వాటి నుంచి కోలుకుని నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది. 2006లో 25లక్షల క్యూసెక్కులకు పైబడి డిశ్చార్జ్ చేయాల్సిన పరిస్థితి రావడంతో కోనసీమలోని రెండు చోట్ల గోదావరి గట్లు తెగిపోయాయి. అయినవిల్లి మండలంలోని శానపల్లిలంక, పి గన్నవరం మండంలోని మొండెపులంక వద్ద ఏటిగట్లు తెగిపోవడంతో అపారనష్టం సంభవించింది.
ఈసారి మళ్లీ దాదాపుగా అదే స్థాయిలో ప్రవాహం ఉంటుందనే అంచనాతో అంతా ఆందోళనతో గడుపుతున్నారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన 34 మండలాలు వరద ప్రమాదానికి గురయ్యాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో అత్యధికంగా కోనసీమ జిల్లాలో 20 మండలాలున్నాయి.
లంక గ్రామాలతో పాటుగా అనేక నదీ తీర గ్రామాల్లో కూడా వరద నీరు చేరింది. దాంతో రవాణా స్తంభించింది. కాజ్ వేలు, కల్వర్టులపై నుంచి వరద ప్రవాహం సాగుతోంది. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే నాలుగు రోజులుగా వరద నీటిలో నానుతున్న కొన్ని గ్రామాలకు మరో మూడు, నాలుగు రోజుల పాటు వరద ముప్పు తప్పదనే అంచనాలు అధికారులు వేస్తున్నారు. జనం కూడా దానికి అనుగుణంగా మంచినీరు వంటి అత్యవసరాల నిల్వల కోసం యత్నిస్తున్నారు.
"వరద భయం అందరిలో ఉంది. కానీ ఇల్లు వదిలి రాలేరు. సహాయక కేంద్రాల్లో తగిన వసతులు కల్పించరు. ఇంట్లో వస్తువులు, పశువులకు అవసరమైన ఏర్పాట్లు ఉండవనే ఉద్దేశంతో వరద నీటిలోనే చాలామంది ఉన్నారు. ప్రభుత్వం అందరికీ ఆహారం, మంచినీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొన్ని స్చచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయం అందిస్తున్నారు. అధికారులు మాత్రం పునరావాసకేంద్రానికి వస్తేనే ఏదైనా అంటున్నారు"అని ఊడిమూడిలంక గ్రామానికి చెందిన దుర్గా భవానీ అనే స్థానికురాలు బీబీసీతో అన్నారు.
వరద నీళ్లలో నానుతున్న తమకు సహాయం అందించాలని ఆమె కోరుతున్నారు.
సీఎం ఏరియల్ సర్వే
గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆదేశించారు. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వరద తీవ్రతపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం, ధవళేశ్వరంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తంచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధమయ్యిందని, సహాయక చర్యలు జరుగుతున్నాయని ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు.
"సహాయక చర్యలకు సీఎం ఆదేశించారు. వానలు, వరదల్లో చిక్కుకున్న వారికి తక్షణ సహాయం కింద రూ. 2వేలు చొప్పున అందించాలని కూడా ఆదేశించారు. అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఎటువంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పాం"అని ఆయన బీబీసీకి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్‌పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన కేంద్రం
- అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన 18 మందిని జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
- శ్రీలంక సంక్షోభం: దివాలా తీసిన దేశంలో ప్రతిరోజూ బతుకు గండమే శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసిందనే వదంతులు భారత్‌పై ఎందుకు వస్తున్నాయి
- ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- వైసీపీ పేరు మార్చడం సాధ్యమవుతుందా, గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














