Climate Change: ఈ నల్లరేగడి నేల వ్యవసాయానికి పనికిరాదా.. కర్నూలు జిల్లా రైతులపై ఇక్రిశాట్ అధ్యయనంలో ఏం తేలింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
రాయలసీమలో వాతావరణం పెనుమార్పులకు గురవుతూ ఉంది. ఇది ఇక్కడ వ్యవసాయం మీద తీవ్ర దుష్ప్రభావం చూపించడం మొదలైంది.
వాతావరణంలో కాలుష్యం పెరుగుతున్నందున ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత క్రమంగా పెరగనుందని... ఆ ప్రభావంతో ఇక్కడ అకాల, అస్థిర వర్షాలు భారీగా కురిసి, వర్షాధార వ్యవసాయంపై దుష్ప్రభావం చూపిస్తాయని అగ్ మిప్ (AgMIP: Agricultural Model Intercomparison and Improvement Project)కు చెందిన ఆరుగురు శాస్త్రవేత్తలు బృందం హెచ్చరించింది.
ఇప్పటికే జూన్-సెప్టెంబర్ మధ్య వానలు కురిపించి వెళ్లాల్సిన నైరుతి రుతుపవనాలు ఆల్యంగా రావడం, ఆలస్యంగా పోవడం జరుగుతోంది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియాల్సిన వర్షాకాలం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు విస్తరించి మామిడి కాపుపై తీవ్ర ప్రభావం చూపించిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఈ వాతావరణ మార్పులు 2050 నాటికి ఈ ప్రాంత వర్షాధార రైతుల కుటుంబ ఆదాయాలను దెబ్బతీయనుందని అగ్ మిప్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా శనగ పంట(బెంగాల్ గ్రామ్) మీద పరిశోధన చేసిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆందోళన కలిగించే ఈ పరిణామం ఏమిటో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
తిమ్మిశెట్టి మణి రాయచోటి జిల్లా రైల్వే కోడూరులో మామిడి కాయల వ్యాపారి.
ఈసారి ఆయన వ్యాపారం డీలా పడిపోయింది. కారణం, కాపు తక్కువ. వచ్చిన కాయలకు బంగారుదోమ పోటు తాకిడి. పంట తక్కువగా రావడం తోపాటు వచ్చిన పంట క్వాలిటీ లేకపోవడంతో ధరలు బాగా పడిపోయాయి.
ఒక దశలో కిలో రూ. 15కు కూడా కొనేవారు లేరు. ఇదే పరిస్థితి కోడూరు సమీపంలోని శెట్టిగుంట రైతు ఎం.బాబుది కూడా. బాబు ఈసారి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని చెబుతున్నారు.
అధిక వర్షాలు, ఆపైన ఈగ.. మామిడికాపు మీద దాడి చేసి బీభత్సం సృష్టించాయి. కాయలన్నీ పురుగు పట్టాయని, అసలు మామిడి తోటలోకే వెళ్లాలనిపించడం లేదని మణి చెబుతున్నారు.
చాలా మంది వ్యాపారస్థుల పురుగుపట్టిన పళ్లను వందల టన్నుల్లో కోడూరు పక్కనున్న ఏట్లో పడేశారు. ఇలాంటి వైపరీత్యమే చిత్తూరు జిల్లా రైతులది కూడా. అక్కడ ఈ ఏడాది మామిడి పంట నాశనమైంది. ఈ ఏడాది పూత రావడమే ఆలస్యం కాగా వచ్చిన పూత అంతా కూడా రాలిపోయింది.
పూత ఎందుకు ఆలస్యమెందుకయింది? వచ్చిన పూత ఎందుకు రాలిపోయింది? మిగిలిన కొద్ది పాటి పిందెలకు పురుగు ఎందుకు పట్టింది? అనేవి పెద్ద ప్రశ్నలు.

ఫొటో సోర్స్, Getty Images
అకాల వర్షాలే కారణం
కోడూరు మండలంలో ఇన్ చార్జ్ గా పనిచేస్తున్న హార్టికల్చర్ అధికారి హర్నాథరెడ్డి వివరణ ప్రకారం, దీనికంతటికి ఆలస్యంగా కురిసిన వర్షాలే కారణం.
"గత ఏడాది వర్షాలు బాగా ఆలస్యంగా కురిశాయి. దీనితో మామిడితోటలు పూత వచ్చేందుకు అనుకూల వాతావరణం జనవరి చివరకు రాలేదు. తర్వాత పూత రాగానే ఎండలు బాగా కాయడంతో పూత రాలిపోయింది. మిగిలిన పిందెలు అకాలంలో రావడంతో పురుగుల బారినపడ్డాయి," అనిహర్నాథ రెడ్డి 'బీబీసీ తెలుగు'తో చెప్పారు.
పిందెకు వచ్చినపుడు ఫిబ్రవరిలో కూడా వానలు రావడంతో తోటల్లో గడ్డి పెరిగి, బంగారు దోమ పురుగు వ్యాపించడంతో కాయలన్నీ పుచ్చిపోవడం మొదలైందని మణి, బాబు చెప్పారు.

ఫొటో సోర్స్, Jinka Nagaraju
చిత్తూరు జిల్లాలో మామిడి పంట దిగుబడి పడిపోయేందుకు కూడా కారణం కూడా అవే అకాల వర్షాలు.
''మామిడి చెట్లు పూత రావాలంటే పగలు రాత్రి మధ్య ఉష్ణోగ్రతల తేడా 11 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. 2021 చివర్లో విపరీతంగా వర్షాలు కురిసినందున ఇలాంటి అనువైన వాతావరణం 2022 జనవరి వరకు రాలేదు. ఆలస్యంగా వచ్చిపూతను కాపాడుకునేందుకు రైతులు పురుగు మందులు విపరీతంగా చల్లారు. దీంతో పూతల్లో మార్పులొచ్చి మామిడి కాపు బాగా పడిపోయింది," అని చిత్తూరు జిల్లా హార్టికల్చరల్ అధికారి బి.శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Jinka Nagaraju
2021లో వర్షచ్ఛాయ (రైన్ షాడో) ప్రాంతంలో ఉన్న రాయలసీమలో వర్షాలు విపరీతంగా కురిసి వరదలు వచ్చాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వస్తాయి. రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా వర్షాలు తెచ్చేవి ఈ రుతుపవనాలే. అందుకే వ్యవసాయం ఈ రుతుపవనాల వానల మీదే అధారపడి ఉంటుంది. అలాంటపు ఈ వానలు అలా కురుస్తూ పోతే ఏమవుతుంది.
గత ఏడాది అదే జరిగింది. వర్షాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా కురిసాయి. కొన్ని ప్రాంతాలలో జనవరిలో కూడా కురిశాయని హరినాథ్ రెడ్డి, శ్రీనాసులు రెడ్డి చెప్పారు.
అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ అకాలవర్షాల వల్లే మామడి పంట నాశనమయిందని అర్థమవుతుంది. రాయచోటి, చిత్తూరు జిల్లాలాగే కర్నూలు కూడా రాయలసీమ వర్షచ్ఛాయ ప్రాంతంలో భాగమే. అందుకు అగ్ మిప్ పరిశోధనకు చాలా ప్రాముఖ్యం ఉంది.
అకాల వర్షాలు ఎందుకు వస్తున్నాయి?
జూన్-సెప్టెంబర్ మధ్య కురవాల్సిన వర్షాలు అక్టోబర్ -జనవరి లో కురవడానికి కారణం మీద చాలా పరిశోధన జరిగింది. ఖరగ్‌పూర్ ఐఐటి శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల నైరుతి పవనాలు దక్షిణ వైపు జరిగాయి.
దీని వల్ల వర్షాలు జూన్-సెప్టెంబర్ లలో కాకుండా అక్టోబర్-జనవరి మధ్య కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ శాస్త్రవేత్తలు గమనించారు.
ప్రొఫెసర్ మయాంక్ సుమన్, ప్రొఫెసర్ రజీబ్ మైటీలు చేసిన ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత సైన్స్ జర్నల్ నేచర్‌లో ప్రచరితమయ్యాయి.
ఈ పరిశోధన పత్రం (Southward Shift of the Precipitation Extremes over South Asia: Evidence from CORDEX data) ప్రకారం రుతుపవనాల తీరు, రోజువారీ భారీ వర్షాల తీరు భారతదేశంలో మారిపోతూ ఉంది.
దీని ప్రభావం దక్షిణ భారతదేశంతో పాటు హిమాలయాల పాదభాగాన తీవ్రంగా కనిపిస్తుంది. 2021లో అక్టోబర్ నుంచి డిసెంబర్, జనవరి దాకా ఆంధ్రప్రదేశ్ తీవ్ర అకాల వర్షాలు వచ్చేందుకు కారణం, రుతుపవనాలు కొద్ది దక్షిణం వైపు మళ్లిన ప్రభావమే నని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ అకాల వర్షాల వల్ల మామిడి పంట ఎలా దెబ్బతినిందో కడప ,చిత్తూరు జిల్లాలలో చాలా స్పష్టంగా కనిపించింది. క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ఈ మార్పులు స్థిరపడితే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పుల తీవ్ర ప్రభావం
అకాల వర్షాల మీద చర్చ జరుగుతున్నపుడు అగ్ మిప్ శాస్త్రవేత్తలు కర్నూలు జిల్లాలో వర్షాధార శనగపంట విషయంలో పరిశోధన చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
2050 నాటికి ఈ జిల్లాలోని శనగ పండించే రైతుల్లో 60 శాతం వాతావరణ మార్పుల బారినపడబోతున్నారని ఈ బృందం హెచ్చరించింది.
శనగరైతుల తలసరి కుటుంబాదాయం కనీసం 12 శాతం పడిపోతుందని ఈ బృందం అంచనా వేసింది.
దీనికి కారణం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరిగి, ఆపైన వర్షపాతమూ పెరగడమేనని వారు తేల్చారు.
ఈ టీమ్‌కు తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ వి. గీతాలక్ష్మి ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ గా ఉన్నారు. బృందంలో డాక్టర్ దక్షిణామూర్తి, డా స్వామికన్ను నెడుమారన్, డాక్టర్ కుమార ఆచార్యులు, డాక్టర్ పొన్ను స్వామి పరమశివమ్, డాక్టర్ అరుణాచలమ్ లక్ష్మణన్ ఇతర సభ్యులు.
కర్నూలు జిల్లాలో ఇపుడు శనగ ప్రధాన వర్షాధార పంట. రాష్ట్రంలో ఇతర జిల్లాలకంటే కర్నూలు జిల్లాలోనే ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు.ఈ పంట విస్తీర్ణం పెరుగుతూ పోతున్నది. ఈ పంట మీద ఆధార పడిన వాళ్లంతా చిన్న సన్నకారు రైతులే.
అంటే 2050 నాటికి వాతావరణ మార్పుల జిల్లాలో ఆర్థికంగా నష్టపోయే వారిలో చిన్న సన్న కారు రైతులే ఎక్కువగా ఉంటారు. అందుకే అగ్ మిప్ పరిశోధనకు కర్నూలు జిల్లాను ఎంపిక చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కర్నూలు జిల్లాయే ఎందుకంటే..
"ఆంధ్రప్రదేశ్ లోని వర్షాభావ ప్రాంతాల్లోని వ్యవసాయం మీద క్లైమేట్ చేంజ్ చూపించే ప్రభావాన్ని ఇక్రిశాట్ అధ్యయనం చేయాలనుకుంది. ఇక్రిశాట్ పరిశోధనచేస్తున్న పంటల్లో శనగ పంట ఒక ప్రధానమయింది. ఇక కర్నూలు జిల్లాలో ఇదే ప్రధానమయిన పంట. అందువల్ల మా పరిశోధనకు జిల్లా అనువైందని అనుకుని అధ్యయనం మొదలుపెట్టాం" అని డాక్టర్ నెడుమారన్ బీబీసీ తెలుగుకు చెప్పారు.
ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసిన బెంగాల్ గ్రామ్ అవుట్ లుక్ పేపర్ ప్రకారం కర్నూలు జిల్లాలో 1,56,000 హెక్టార్లలో శనపంట పండిస్తున్నారు. గత 20 సంవత్సరాలలో ఈ పంట విస్తీర్ణం బాగా పెరిగింది.
వర్షాల్లేక పోవడం, పెద్ద శ్రమ అవసరం లేకపోవడంతో రైతులు ఈ పంట వైపుమరలుతున్నారు.
1991-1993 మధ్య ఈ పంట విస్తీర్ణం కేవలం 2.45 శాతమే. 2008-10 నాటికి ఇది 23 శాతానికి పెరిగిందని డాక్టర్ నెడుమారన్ చెప్పారు.
‘‘ఈ పంట మీద కొన్నివేల కుటుంబాలు ఆధారపడి ఉన్నందున క్లైమెంట్ చేంజ్ ప్రభావం ఈ పంట మీద ఎలా ఉంటుందో తెలుసుకోవలసిన అవసరం వచ్చింది. ఈ రాబోయే పరిస్థితులకు అనుగుణంగా పంట సేద్యాన్ని మార్చడం, రైతులు నష్టపోకుండా చూడాలి. అందుకే ఈ పరిశోధన చేపట్టాం’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2050 నాటికి..
ఈ అధ్యయనం కోసం జిల్లాను తక్కువ వర్షపాతం (500 మి.మీ లోపు) ప్రాంతంగా, ఎక్కువ వర్షపాతం (700 నుంచి 800 మి.మీ) ఉన్న ప్రాంతంగా విభజించారు. 29 రకాల వాతావరణ మార్పుల నమూనాలను ఉపయోగించి 2025 నాటికి జిల్లాలో శనగ రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో పరిశీలించారు.
ఈ నమూనాల ప్రకారం వాతావరణ కాలుష్య తక్కువగా ఉన్న ప్రాంతాలలో 2050 నాటికి ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 1.93 డిగ్రీల సెల్సియస్ కు పెరిగే సూచనలున్నాయి.
కాలుష్యం దారుణంగా ఉండే ప్రాంతాలలో ఉష్ణోగ్రత 0.46 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ కు పెరిగే అవకాశం ఉంది. ఇక వర్షపాతానికి సంబంధించి, మొదటి రకం ప్రాంతలో 2.9 శాతం నుంచి 26.7 శాతం, రెండో ప్రాంతంలో 6.4 శాతం నుంచి 47.8 శాతం పెరగవచ్చని ఈ అధ్యయనంలో వెల్లడయింది.
ఈ వర్షాల వల్ల ఇక్కడి నల్ల రేగడి భూమి ఈ పంటకు పనికి రాకుండా పోతుంది.
తాము పరిశీలించిన నమూనాల ప్రకారం.. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత పెరగనుందని వారు చెప్పారు. ఇది ఉష్ణోగ్రత, వర్షపాతంతో చర్యలకు లోనై పంటల పెరుగుదల మీద, వాతావరణానికి పంటలు స్పందించే తీరు మీద దుష్ప్రభావం చూపిస్తుందని ఈ పరిశోధనా పత్రంలో డాక్టర్ నెడుమారన్ బృందం హెచ్చరించింది.
క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న అకాల, అస్థిర వర్షాలు రైతులకు ఇప్పటికే ఒక సవాల్ గా మారాయని, 2050 నాటికి ఇప్పుడు అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులు పనికిరావని ఈ బృందం పేర్కొంది. దీనికి కొత్త పద్ధతులను, కొత్తరకాల పంటలను, జన్యుపరంగా బలమయిన తృణ ధాన్య పంటలను ఎన్నుకోవలసి ఉంటుందని దీనికి రైతులు సమాయత్తం కావాలని ఈ బృందం కోరింది.
ఇవి కూడా చదవండి:
- భావప్రకటనా స్వేచ్ఛ ఒప్పందంపై మోదీ సంతకం చేయడాన్ని కొందరు ఎందుకు తప్పుబడుతున్నారు?
- కన్నయ్యలాల్: రాజీ కుదిరిన తర్వాత కూడా నిందితులు ఎందుకు హత్యకు పాల్పడ్డారు, ఈ కేసులో ఇంతకు ముందు ఏం జరిగింది?
- తేనెటీగలకూ లాక్డౌన్ ఎందుకు విధించాల్సి వచ్చింది, వదిలేస్తే ప్రపంచానికి ప్రమాదమేంటి
- అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
- జులై 1 నుంచి దేశమంతా ప్లాస్టిక్ నిషేధం- ఈ లిస్ట్‌లోని వస్తువులు వాడితే అయిదేళ్ల జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














