వైసీపీ పేరు మార్చడం సాధ్యమవుతుందా, గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఫొటో సోర్స్, Facebook/YSRCP

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

దేశంలో రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ వ్యవహారాలను ఎన్నికల కమిషన్ చూస్తుంది. పార్టీ రిజిస్ట్రేషన్, గుర్తింపు, రాష్ట్ర, జాతీయ హోదా వరకూ అన్నింటినీ అదే నిర్ణయిస్తుంది.

ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి వారికి హోదా దక్కుతుంది. అయితే, గతంలో రిజిస్టర్ అయిన పార్టీని మరొకరికి బదలాయించారా? రెండు సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత గతంలో ఎప్పుడైనా పార్టీ పేరు మార్చారా? వైసీపీ పేరు ఎందుకు మార్చుకుంటోంది? ఈమేరకు మూడో ప్లీనరీలో ఆ పార్టీ చేసిన తీర్మానాన్ని ఈసీ అంగీకరిస్తుందా?

భారతీయ ఎన్నికల కమిషన్

ఫొటో సోర్స్, PTI

చట్టం ఏం చెబుతోంది?

ప్రజా ప్రతినిధుల చట్టం 1951, సెక్షన్-29ఏ ప్రకారం పార్టీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియలో భాగస్వామయ్యే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఏదైనా రాజకీయ పార్టీలో పనిచేయవచ్చు లేదా తనే సొంతగా పార్టీని స్థాపించవచ్చు. అందుకు ఎన్నికల కమిషన్ వద్ద దరఖాస్తు చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. నిబంధనలకు అనుగుణంగా ఉంటే వాటిని రిజిస్టర్డ్ పార్టీలుగా ప్రకటిస్తారు.

తదుపరి ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే స్థానాలను బట్టి, నిబంధనలను అనుసరించి కామన్ సింబల్ కేటాయింపు జరుగుతుంది. ఆ పార్టీకి ఫలితాల తర్వాత వచ్చే ఓట్లను బట్టి ఆ గుర్తు కొనసాగించాలా లేదా అన్నది ఈసీ నిర్ణయిస్తుంది.

2021 సెప్టెంబర్ నాటికి దేశంలో అలా రిజిస్టర్ అయిన పార్టీల సంఖ్య 2,797గా ఉంది. అందులో 8 పార్టీలకు జాతీయ హోదా ఉంది. వాటిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, టీఎంసీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు జాతీయ రాజకీయ పార్టీలుగా గుర్తింపు ఉంది. మరో 54 రాష్ట్ర పార్టీలున్నాయి. వైసీపీ, టీడీపీలకు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించిన పార్టీల జాబితా ప్రకారం ఏపీలో 6 జాతీయ పార్టీలు, ఏపీ ఎన్నికల సంఘం గుర్తించిన మూడు పార్టీలు(వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్) ఉన్నాయి. మరో 10 రాష్ట్ర పార్టీలున్నాయి. పార్టీ గుర్తు కలిగిన రాజకీయ పార్టీగా జనసేన ఉంది. ఎన్నికల గుర్తు కూడా లేని రిజిస్టర్డ్ పార్టీలు మరో 93 ఉన్నాయి.

వైసీపీ పార్టీ జెండాలు

ఫొటో సోర్స్, YSRCongress.com

వైసీపీ ప్రస్థానం లా..

వైఎస్సార్ మరణం తర్వాత 2009 సెప్టెంబర్‌లోనే తెలంగాణకు చెందిన అడ్వొకేట్ శివకుమార్ యువజన, శ్రామిక , రైతు కాంగ్రెస్ పేరుతో పార్టీని స్థాపించారు. ఆనాటికి జగన్ కాంగ్రెస్ ఎంపీగానే ఉన్నారు. పొడి అక్షరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుచుకునేలా, సమాజంలో మెజార్టీ తరగతులను ప్రతిబింబించేలా ఈపేరు ఉండడంతో 2010లో సొంతంగా పార్టీ పెట్టాలని భావించిన జగన్ ఆ పేరు వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్‌ను వీడి బయటకు రావడం, తన తండ్రి వైఎస్సార్ ఇమేజ్ ఆధారంగా రాజకీయాలు నడిపేందుకు ఆయన పూనుకోవడంతో తమకు తగిన పార్టీ అవుతుందని ఆయన గుర్తించారు. అప్పటికే శరద్ పవర్ కాంగ్రెస్‌ను వీడిన తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ తన మాతృపార్టీకి గుడ్ బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలను స్థాపించి, రాజకీయంగా రాణిస్తున్న నేపథ్యంలో జగన్ కూడా వైఎస్సార్‌కు తోడుగా కాంగ్రెస్‌ను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో పార్టీని రిజిస్టర్ చేసిన శివకుమార్‌తో చర్చల తర్వాత ఈసీ నిబంధనల ప్రకారం జగన్ ఆ పార్టీలో చేరడం, కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడిగా ఎన్నిక కావడం వంటి ప్రక్రియనంతా పూర్తి చేశారు. దానికి అనుగుణంగా 2011 ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం ఆపార్టీకి జగన్ నాయకుడిగా గుర్తించింది. ఆ వెంటనే 2011 మార్చి 12న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట కేంద్రంగా తన పార్టీ పేరు, జెండాని అధికారికంగా జగన్ ప్రకటించారు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పేరుని కూడా చిరంజీవి జగ్గంపేట వేదికగానే ప్రకటించడం విశేషం.

2011 మార్చి నుంచి అధికారికంగా జగన్ ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికి మూడు ప్లీనరీలు నిర్వహించారు. ఆయా ప్లీనరీల సందర్భంగా కొత్త అధ్యక్షుడి ఎన్నికను నిర్వహించడం జరుగుతోంది. ఈసారి మూడో ప్లీనరీలో మాత్రం అధ్యక్ష ఎన్నికలో జీవితకాలం బాధ్యతలు జగన్ కి అప్పగిస్తూ తీర్మానం చేశారు. అంతేగాకుండా పార్టీ పేరులో యువజన, శ్రామిక, రైతుని తొలగిస్తూ మరో తీర్మానం ఆమోదించారు. ఇకపై వైఎస్సార్ కాంగ్రెస్ లేదా, వైఎస్సార్సీపీగా ఉండాలని నిర్ణయించారు.

ఓటు వేసి వేలు చూపిస్తున్న అమ్మాయి

ఫొటో సోర్స్, UGC

ఎన్నికల కమిషన్ అంగీకరిస్తుందా?

వైసీపీ ప్లీనరీలో చేసిన తీర్మానం ప్రకారం కొత్త పేరు ప్రతిపాదనలను ఈసీకి నివేదించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ లేదా వైఎస్సార్సీపీ విషయంలో నిబంధనలకు అనుగుణంగా ఈసీ వ్యవహరిస్తుంది.

ఒక రాజకీయ పార్టీకి ఏ పేరు ఉండాలనే విషయంలో స్వేచ్ఛ ఉంది. 2014 మే 19న ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని స్పష్టం చేశారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం ఒక రాజకీయ పార్టీ తన పేరును సవరించుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు.

అందుకు కొన్ని నిబంధనలు అనుసరించాలి. అప్పటికే మనుగడలో ఉన్న మరో రాజకీయ పార్టీని ప్రభావితం చేసేలా కొత్త పేరు ఉండకూడదు. పార్టీ పేరు హిందీ, ఇంగ్లీష్ లేదా ఏ ప్రాంతీయ భాషలోనైనా నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. కానీ వాటిని ట్రాన్స్ లేట్ చేస్తే మరో పార్టీ పాపులారిటీకి సమస్య అవుతుందనే ఫిర్యాదులు ఉండకూడదు. అందుకు అనుగుణంగా అన్ని నిబంధనలను అనుసరించి ఎవరైనా ఎప్పుడయినా పేరు మార్చుకోవచ్చునంటూ ఈసీ నిబంధనలు చెబుతున్నాయి.

'వైఎస్సార్ కాంగ్రెస్‌గా పేరు మార్చుకోవడం మీద అభ్యంతరం ఉండకపోవచ్చు. ఏపీలోని రిజిస్టర్డ్ పార్టీల్లో ఇప్పటికే వైఎస్సార్ బహుజన పార్టీ, వైఎస్సార్ ప్రజా పార్టీ అనేవి ఉన్నాయి. తెలుగుధర్మం పార్టీ వంటివి అనేకం కూడా టీడీపీని పోలి ఉన్నాయి. కానీ అవి పెద్దగా మనుగడలో కనిపించవు. పేరుకి రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటారు. చాలామంది ఎన్నికల్లో పోటీ కూడా చేయరు. నిబంధనల ప్రకారం ఏటా పార్టీ సమావేశాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నివేదికలు మాత్రం కొందరు సమర్పిస్తారు. అత్యధికులు వాటి జోలికి కూడా పోరు. అలాంటి పార్టీలు కాలక్రమంలో కనుమరుగవుతూ ఉంటాయి' అని ఎన్నికల సంఘంలో పనిచేసి రిటైర్ అయిన బీఎన్ ఆచార్యులు తెలిపారు.

జగన్ సారథ్యంలో పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్‌గా పేరు మార్చడానికి ఎటువంటి ఆటంకాలుండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ అవసరాల కోసం ఎవరైనా పేర్లు మార్చుకోవడం పెద్ద విశేషం కూడా కాదన్నారు.

వైఎస్ విజయమ్మ

ఫొటో సోర్స్, Facebook/YSRCP

పేరు మార్పు అవసరం ఏమిటి?

ఈసీ నిబంధనలను అనుసరించి వైఎస్సార్ కాంగ్రెస్‌గా పేరు మార్చుకోవడానికి పెద్దగా సమయం పట్టే అవకాశం లేదు. కానీ అసలెందుకు ఇలా పేరు మార్చారు అనేది కీలకాంశం. నిజానికి ఆ పార్టీ మూడో ప్లీనరీ సమావేశాలు అనేక విధాలుగా ఆసక్తికరంగా ముగిశాయి. గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ ఆ పదవి నుంచి పార్టీ నుంచి నిష్క్రమించడంతో ఇక పార్టీకి గౌరవాధ్యక్షులు అనే పదవి ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. నిజానికి ఈసీకి సమర్పించే రాజకీయ పార్టీల కార్యవర్గంలో గౌరవాధ్యక్షులు అనే పదవి ఉండకపోయినా, అలాంటి హోదాని ప్రచారంలో చెప్పుకుంటారని బీఎన్ ఆచార్యులు అన్నారు.

మరో కీలక పరిణామం జగన్‌కు జీవితకాల అధ్యక్ష హోదా కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం. దానిపై ఇప్పటికే అభ్యంతరాలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ కూడా దానికి అంగీకరించే అవకాశం లేదనే అభిప్రాయాన్ని రాజ్యాంగ పరిశీలకులు, సీనియర్ న్యాయవాది ఎస్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

'దేశంలో రాజకీయ పార్టీలన్నీ ప్రజాస్వామ్య సూత్రాలను పాటించాలి. అంతర్గతంగానూ దానిని అనుసరించాలి. నిర్దిష్ట కాల వ్యవధిలో పార్టీల అధ్యక్ష ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇతర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవాలి. సాధారణంగా చాలా రాజకీయ పార్టీల్లో కార్యవర్గ నియామకాలను అధ్యక్షుడి ఇష్టానుసారం ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఈసీకి సమర్పించే నివేదికల్లో మాత్రం తమ కార్యవర్గాన్ని పార్టీ సమావేశంలో కోరం అనుసరించి ఎన్నుకున్నట్టు తెలియజేస్తారు. ప్రస్తుతం జగన్ జీవితకాల అధ్యక్ష హోదా కూడా అలాంటిదే కావచ్చు. రాజకీయంగా ప్రజల్లో ఆయన జీవితకాల అధ్యక్షుడిగా చెప్పుకుంటూ, ఈసీకి సమర్పించే పత్రాల్లో మాత్రం ఎప్పటికప్పుడు ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు తెలియపరచాల్సి ఉంటుంది' అంటూ ఆయన వివరించారు.

బాల్ ఠాక్రే వంటి వారు శివసేన రాజకీయ పార్టీగా మారిన తర్వాత జీవితాంతం అధ్యక్షుడి హోదాలో ఉన్నారు గానీ ఈసీ నిబంధనల్లో అలాంటి వాటికి అవకాశం ఉండదని రాజేంద్ర ప్రసాద్ బీబీసీకి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి

ఫొటో సోర్స్, Facebook/YSRCP

రాజకీయ అవసరాలేనా?

వైసీపీ అభ్యర్థిగా గెలిచి, నాయకత్వానికి ఎదురుతిరిగిన నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుతో ఆ పార్టీకి విచిత్రమైన అనుభవం ఎదురైంది. పార్లమెంట్‌లోనూ వెలుపలా ఆయన వ్యవహరించే తీరుపై వైసీపీ నాయకత్వం గుర్రుగా ఉంది. దాంతో ఆయనకు పార్టీ తరుపున ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి సంజాయిషీ కోరుతూ లేఖలు రాశారు. అంతేగాకుండా పార్లమెంట్‌లో స్పీకర్‌కు కూడా ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం ఆ ఎంపీ మీద వైసీపీ వేసిన అనర్హత వేటు పిటీషన్ విచారణలో ఉంది.

తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ తరుపున గెలిచానని, వైఎస్సార్ కాంగ్రెస్ కాదని ఆయన పలుమార్లు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ లెటర్ హెడ్ మీద నాకు పార్టీ నుంచి వచ్చే లేఖలకు స్పందించాల్సిన అవసరం లేదంటూ ఆయన బదులిచ్చారు. అంతేగాకుండా తన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని ఆయన పదే పదే పేర్కొన్నారు. అంతటితో సరిపెట్టకుండా వైఎస్సార్‌కి పార్టీకి సంబంధం లేదని కూడా కొన్ని సార్లు వ్యాఖ్యానించారు.

'తిరుగుబాటు ఎంపీ అనుభవం పార్టీ పేరు మార్పునకు దారి తీసిందని అనుకోలేం. వైసీపీ పేరుని పలు చోట్ల పలు విధాలుగా ప్రస్తావిస్తున్న తరుణంలో అన్ని చోట్లా వైఎస్సార్ పేరు ఉండాలని, ఆ పేరుతోనే ప్రస్తావించేలా జాగ్రత్తలు పడుతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీగా షర్మిల పార్టీ ఉంది. ఏపీలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌గా ఉండడం విశేషం కాదు. పార్టీ ప్రారంభంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ఉండాలని యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్‌గా చెప్పుకున్నారు. ఇప్పుడు అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు. ఏపీలో బలమైన పార్టీగా మారారు. కాబట్టి ఇక ఆయా వర్గాలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టున్నారు. అందరి పార్టీగా ఎదిగిన తర్వాత వైఎస్సార్ పేరు మరింతగా వినిపించాలని ఆశిస్తున్నట్టు భావించాలి' అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఎంవీ రమణ అభిప్రాయపడ్డారు.

వైఎస్ విజయమ్మ పార్టీని వీడుతున్న తరుణంలో పార్టీలో వైఎస్సార్ పేరు మరింత ప్రబలంగా వినిపించేందుకు ప్రాధాన్యతనివ్వడం ఆసక్తికరం అంటూ ఆయన బీబీసీతో అన్నారు. రాజకీయ అవసరాలే అన్నింటినీ నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ తో చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, facebook/TDP.Official

గతంలో ఎప్పుడైనా జరిగిందా?

దేశంలో పలు పార్టీలు పుట్టడం, వాటిలో కొన్ని రాజకీయంగా అంతర్ధానం కావడం చాలా సహజం, ఇప్పుడు గుర్తింపులో ఉన్న పార్టీల్లో కూడా 10 శాతం మాత్రమే క్రియాశీలంగా ఉంటాయి. మిగలిన వన్నీ పేపర్ల మీద పార్టీలుగానే అంతా భావిస్తారు. చివరకు ఎన్నికల్లో కూడా పట్టుమని పది స్థానాల్లో పోటీ చేయగలిగే పార్టీల సంఖ్య కూడా అంతంతమాత్రమే.

రాజకీయ పార్టీలు తమ పేర్లు ఎప్పుడయినా సవరించుకునే అవకాశం ఉంది. దానికి విస్తృత సమావేశంలో చేసిన తీర్మానం అవసరం. దానిని పరిశీలించిన తర్వాత ఈసీ 30 రోజుల వ్యవధిలో తుది నిర్ణయం వెలువరిస్తుంది. దానికి ముందు అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరిస్తుంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత పేరు మార్పు ప్రక్రియ జరుగుతుంది.

'రాజకీయంగా పార్టీలు పేర్లు మార్చుకున్న ఘటనలు గతంలో జరిగిన దాఖలాలు లేవు. పైగా ఒక పార్టీ తరుపున గెలిచిన తర్వాత మరో పేరుతో వారిని పరిగణించాలని కోరడం అనూహ్యమే. గతంలో పార్టీల్లో చీలికలు వచ్చినప్పుడు పార్టీ పేరు కోసం, గుర్తు కోసం వివాదాలు జరిగాయి. దేశంలో 1969లో నిజలింగప్ప నాయకత్వంలోని సిండికేట్ గ్రూప్ ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ మీద తిరుగుబాటు చేసిన సమయంలో అలానే జరిగింది. 1978లో కూడా బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ చీలిక పార్టీ తమదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌గా పేర్కొనడంతో ఇందిరా గాంధీ నాయకత్వంలోని పార్టీ కాంగ్రెస్ (ఐ) అంటూ బరిలో దిగింది. అప్పట్లో ఆవూ, దూడ గుర్తు విషయంలో కూడా వివాదం తలెత్తింది. చివరకు ఇందిర నాయకత్వంలోని పార్టీ హస్తం గుర్తుతో పోటీ చేసింది' అంటూ వివరిచాంరు రాజకీయ పరిశీలకుడు ఎం శివకుమార్.

తెలుగుదేశంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ తనదేనని, సైకిల్ గుర్తు తనకే దక్కాలని కూడా కోరిన సంగతిని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)