ప్రపంచ జనాభా దినోత్సవం: 'భారత్ జనాభా 2023లో చైనాను మించిపోతుంది' - ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్టెఫానీ హెగార్టీ
- హోదా, పాపులేషన్ కరెస్పాండెంట్
ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) సందర్భంగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ వచ్చే ఏడాది 1.4 బిలియన్ల (140 కోట్లు) జనాభాతో చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది.
ఈ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్ నాటికి 800 కోట్లకు చేరనుంది.
కానీ, ప్రస్తుతం జనాభా పెరుగుదల, గతంలో ఉన్నంత వేగంగా లేదు.
1950 తర్వాత జనాభా వృద్ధి రేటు ఇప్పుడు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ, 2080ల నాటికి 10.4 బిలియన్ల (1040 కోట్లు)కు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే, కొందరు జనాభాశాస్త్రం నిపుణులు మాత్రం ఇది మరింత తొందరగా జరుగవచ్చని నమ్ముతున్నారు.
కానీ, ప్రపంచ జనాభా పెరుగుదల అసమానంగా జరుగుతోంది.
వచ్చే 30 ఏళ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50 శాతానికి పైగా కేవలం 8 దేశాల్లోనే సంభవిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లోనే ఈ అధిక జనాభా రేటు నమోదవుతుందని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
అదే సమయంలో, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఇప్పటికే జనాభా క్షీణతను చూస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు ప్రతీ మహిళకు సగటున 2.1 కంటే తగ్గిపోయింది. 61 దేశాల్లో 2050 నాటికి జనాభా కనీసం 1 శాతం తగ్గుతుందని నివేదిక చెబుతోంది.
ప్రపంచంలోనే అతి తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న దేశాల్లో చైనా కూడా ఒకటి. చైనాలో ప్రతీ మహిళ సగటున 1.15 మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తమ జనాభాలో క్షీణత ప్రారంభమవుతుందని చైనా ప్రకటించింది. దేశంలో 'ఒకే బిడ్డ' అనే విధానాన్ని విడిచిపెట్టి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే జంటలకు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టినప్పటికీ చైనా జనాభా అనుకున్నదానికంటే వేగంగా తగ్గుతోంది.
భారత్‌లో జనాభా పెరుగుతూనే ఉన్నందున, కచ్చితంగా చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది.
జనాభా పెరుగుతోన్న చాలా దేశాల్లోనూ సంతానోత్పత్తి రేట్లు పడిపోతున్నాయి.
సైన్స్, మెడిసిన్ రంగాల్లో వచ్చిన అభివృద్ధి కూడా జనాభా పెరుగుదలకు ఒక కారణం. వీటి కారణంగానే శిశు మరణాల రేటు తగ్గిపోవడంతో పాటు, ఎక్కువ మంది పిల్లలు యుక్త వయస్సు వరకు, చాలా మంది వృద్ధాప్యంలో కూడా మనుగడ కొనసాగిస్తున్నారు. ఇకముందు కూడా ఇదే కొనసాగనున్న నేపథ్యంలో 2050 నాటికి ప్రపంచ సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలుగా ఉండనుంది.
కానీ, దీని ప్రకారం జనాభాలో 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య 2022లో 10 శాతంగా ఉండగా, 2050 నాటికి 16 శాతానికి పెరుగుతుంది. ఈ పెరుగుదల కూడా అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు.
ఇవి కూడా చదవండి:
- అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు
- Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
- గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











