శ్రీలంకకు సాయం చేసేందుకు భారత్, చైనా చేతులు కలుపుతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫైజల్ మహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీలంకను ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు భారత్‌తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల బీజింగ్‌లో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ చెప్పారు.
శ్రీలంకకు సాయం చేసేందుకు భారత్ ముందుకు రావడంపై లిజియాన్ ప్రశంసలు కూడా కురిపించారు. మరోవైపు శ్రీలంకకు ఇటీవల 7300 మిలియన్లు డాలర్లు (రూ.58,103 కోట్లు) ఆర్థిక సాయాన్ని చైనా అందించినట్లు ఆయన చెప్పారు.
దీనికి వారం రోజుల ముందు చైనా ప్రభుత్వ పత్రిక ‘‘గ్లోబల్ టైమ్స్’’కు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒక కథనం రాశారు. శ్రీలంకకు సాయం అందించడంలో భారత్, చైనా కలిసి పనిచేయాలని దీనిలో కూడా ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు గత మే నెలలోనూ ఈ విషయంపై గ్లోబల్ టైమ్స్‌లో ఓ కథనం ప్రచురించారు. ‘‘శ్రీలంకలో చైనాకు చెందిన బెల్టు అండ్ రోడ్ ఇనీషియేటివ్ ప్రాజెక్టుల విషయంలో భారత్ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. అయినప్పటికీ ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రెండు దేశాలు కలిసి పనిచేయాలి’’అని కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కలిసి పనిచేస్తాయా?
ఇటీవల కాలంలో భారత్-చైనా కలిసి పనిచేయాలని అంతర్జాతీయ నిపుణులు పిలుపునిస్తున్నారు. రెండు దేశాలు కలిసి పనిచేసేందుకు చాలా అవకాశముందని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతూ ఉండొచ్చని ప్రొఫెసర్ ఫుష్ప్ అధికారి చెప్పారు.
అయితే, ఇదంతా చైనా వ్యూహంలో భాగమేనని, దీని వల్ల చైనాకే ఎక్కువ మేలు జరుగుతుందని జేఎన్‌యూ ప్రొఫెసర్ కొండపల్లి శ్రీకాంత్ వివరించారు.
ప్రస్తుత సంక్షోభంలో మాత్రం రెండు దేశాలు శ్రీలంకకు సాయం చేయాలని ఇద్దరూ అంగీకరించారు. దీని ద్వారా ఆసియా ప్రాంతానికే మేలు జరుగుతుందని చెప్పారు.
మరోవైపు చైనాకు కూడా తమ పెట్టుబడులు, రుణాల విషయంలో రక్షణ లభిస్తుంది. భారత్‌కు కూడా శ్రీలంక సంక్షోభం వల్ల కొత్త సమస్యలు చుట్టుముట్టకుండా ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు ఎక్కువ సమస్యలు..
శ్రీలంక సంక్షోభంపై బీబీసీతో దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన శ్రీకాంత్ కొండపల్లి, కాఠ్‌మాండూలోని త్రిభువన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుష్ప అధికారి మాట్లాడారు.
శ్రీలంక సంక్షోభాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడం భారత్‌కు చాలా ముఖ్యమని ఇద్దరూ అంగీకరించారు. భారత్ అంతర్గత అంశాలపై ఈ సంక్షోభం ప్రభావం చూపే అవకాశముందని అన్నారు.
ఈ ఏడాది మొదటి నుంచి శ్రీలంకలో చోటుచేసుకుంటున్న నిరసనలు ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చాయి. అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మిలిటరీ జెట్‌లో మాల్దీవులకు పరారైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
గత శనివారం గొటాబయ రాజపక్షతోపాటు మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘె ఇళ్లనూ నిరసనకారులు ధ్వంసం చేశారు.
ఇటు ప్రధాన మంత్రితోపాటు అధ్యక్షుడు కూడా రాజీనామా చేస్తేగానీ శాంతించబోమని నిరసనకారులు చెబుతున్నారు.
భారత్ పొరుగునున్న దేశంలో సంక్షోభం నానాటికీ ముదురుతోందని గత ఆదివారం తిరువనంతపురంలో మీడియాతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. ప్రస్తుతానికి భారత్‌కు శరణార్థులు పోటెత్తడంలేదని ఆయన స్పష్టంచేశారు.
శ్రీలంక సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తంగా 90 మంది శరణార్థులు భారత్‌కు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు ముఖ్యం?
శ్రీలంకలో శాంతి భారత్‌కు ఎందుకు అంత ముఖ్యమో శ్రీలంక మాజీ దౌత్యవేత్త ఆస్టిన్ ఫెర్నాండో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
‘‘ఇప్పటికే భారత్‌కు ఉత్తరం, ఈశాన్యం, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణంవైపు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. శ్రీలంకలో మళ్లీ ఎల్‌టీటీఈ లాంటి సంస్థలు క్రియాశీలమయ్యే ముప్పుందని వార్తలు వస్తున్నాయి. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి చేసినది ఈ సంస్థే’’అని ఆయన అన్నారు.
గత ఆదివారం కొలంబోలో శ్రీలంక వ్యవసాయ మంత్రి మహింద అమరేశ్వరతో భారత రాయబారి గోపాల్ బాగ్లే సమావేశమైనట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. 44,000 టన్నుల యూరియాను పంపించేందుకు భారత్ అంగీకరించిందని పేర్కొంది.
ఈ ఏడాది మొదటి నుంచీ శ్రీలంకకు భిన్న విధాలుగా భారత్ సాయం అందిస్తోంది. తమిళనాడుకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే శ్రీలంక ఉంటుంది.
మొత్తంగా శ్రీలంకకు భారత్ 3.8 బిలియన్ డాలర్లు(రూ.30,246 కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీనిలో కరెన్సీ మార్పిడితోపాటు రుణ సదుపాయం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Reuters
చైనా-శ్రీలంక బంధం...
భారత్-శ్రీలంక బంధాలు కేవలం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితంకావని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు దేశాలు ఒకప్పుడు బ్రిటిష్ పాలన కింద ఉండేవి.
మరోవైపు రాజకీయంగానూ శ్రీలంకకు భారత్ సాయం చేస్తుంటుంది. ముఖ్యంగా తమిళుల సమస్యల విషయంలో భారత్ సాయం చేస్తోంది.
అయితే, చైనా-శ్రీలంక బంధాలు ఆర్థిక రంగంపైనే ప్రధానంగా పెనువేసుకున్నాయి. అయితే, ఇటీవల కాలంలో సైనిక, రాజకీయ సంబంధాల్లోనూ కాస్త పురోగతి కనిపిస్తోంది.
ఎల్‌టీటీఈపై పైచేయి సాధించడంలో శ్రీలంకకు చైనా సాయం చేసినట్లు చాలా కథనాలు వచ్చాయి.
‘‘తీవ్రవాద సంస్థల విషయంలో భారత్ విధానాలు అమలుచేయడానికి చాలా కష్టంగా ఉంటాయి. అందుకే ఈ విషయంలో చైనాకు శ్రీలంక దగ్గరైంది’’అని పుష్ప అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
అప్పుల ఊబిలోకి ఎలా?
శ్రీలంక-చైనాల మధ్య దృఢమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి చైనా కూడా ఒక కారణమని చాలా విశ్లేషణలు వస్తున్నాయి.
అయితే, పశ్చిమ దేశాల మీడియా ఇలాంటి కట్టుకథలను అల్లుతోందని చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్‌లో ఇటీవల ఒక కథనం ప్రచురించారు. శ్రీలంక మొత్తం అప్పుల్లో చైనా ఇచ్చింది కేవలం పది శాతం మాత్రమేనని పేర్కొన్నారు.
శ్రీలంక ఫారెన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ గణాంకాలను ఈ కథనంలో ఉదహరించారు. దీనిలో శ్రీలంక మొత్తం రుణాల్లో 47 శాతం ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి, మరో 13 శాతం ఆసియా డెవల్‌మెంట్ బ్యాంకు నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు. చైనా, జపాన్‌లు చెరో పది శాతం చొప్పున రుణాలు ఇచ్చినట్లు వివరించారు.
ఈ అప్పుల్లో ప్రపంచ బ్యాంకు వాటా 9 శాతం. మరోవైపు భారత్‌తోపాటు మరో రెండు అంతర్జాతీయ సంస్థలు కూడా 9 శాతం చొప్పున రుణాలను ఇచ్చాయి.
అయితే, చైనా ఇచ్చిన రుణాలు తక్కువగా ఉన్నప్పుడు.. శ్రీలంకను ఆదుకోవడానికి చైనా ఎందుకు ముందుకు రావడం లేదని శ్రీకాంత్ కొండపల్లి ప్రశ్నించారు.
ఇది చైనా ప్రణాళికేనా?
ప్రస్తుతం శ్రీలంక-భారత్ బంధాలు దృఢంగానే ఉన్నాయని, దీనికి ప్రధాన కారణాల్లో భౌగోళిక పరిస్థితులు కూడా ఒకటని ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి వ్యాఖ్యానించారు. ‘‘శ్రీలంక, భారత్ పక్కపక్కనే ఉంటాయి. అదే సమయంలో చైనా, శ్రీలంకల మధ్య ఆరువేల కి.మీ. దూరం ఉంది’’అని ఆయన అన్నారు.
శ్రీలంక సంక్షోభాన్ని పరిష్కరించడానికి కలిసి పనిచేద్దామని చైనా పిలుపు నివ్వడం వెనుక చైనాకు వేరే ఉద్దేశాలు ఉన్నాయని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. ‘‘నేపాల్‌లో భూకంపం తర్వాత కలిసి పనిచేద్దామని చైనా ఇలానే పిలుపునిచ్చింది. కానీ, కాఠ్‌మాండూలోని చైనా దౌత్య కార్యాలయం నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని భారత్‌కు వ్యతిరేకంగా పరిస్థితులను మార్చింది’’అని ఆయన చెప్పారు.
‘‘ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడం ద్వారా భారత్‌కు మేలు జరగొచ్చు. అయితే, రాజకీయ దురుద్దేశాలతోనే భారత్ ఇప్పుడు జోక్యం చేసుకుంటోందని కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇలాంటి వాదనలతో భారత్‌కు కొత్త సమస్యలు రావొచ్చు. అందుకే శ్రీలంకలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాలి’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని భారత జట్టులో ఉంచాలా? తీసేయాలా? - గొంతు విప్పుతున్న మాజీ క్రికెటర్లు
- పండర్‌పుర్ వారీ: ‘పీరియడ్స్ అనేవి పాండురంగడు ఇచ్చినవే. అవన్నీ ఆయనకే చెందుతాయి’
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- సీఐ నాగేశ్వర రావు అరెస్ట్, వివాహితను బెదిరించి, అత్యాచారం చేసిన ఆరోపణల కేసులో విచారిస్తున్న పోలీసులు
- వైసీపీ పేరు మార్పు..జీవితకాల అధ్యక్షుడిగా జగన్ అన్న పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












