శ్రీలంక: 'ప్యాలెస్‌ను వదిలేదే లేదు... అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేసే దాకా ఇక్కడే ఉంటాం' - నిరసనకారులు

శ్రీలంక అధ్యక్ష భవనంలో నిరసనకారులు

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష, ప్రధాని రణిల్ విక్రమ సింఘే అధికారికంగా రాజీనామా చేసేంతవరకు అధ్యక్ష భవనం, ప్రధాని నివాసాలను ఆక్రమిస్తూనే ఉంటామని నిరసనకారులు అన్నారు.

జూలై 13న అధ్యక్ష పదవి నుంచి దిగిపోతానని గొటాబయ రాజపక్ష చెప్పినట్లు శనివారం పార్లమెంట్ స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

కానీ, ఇప్పటివరకు అధ్యక్షుడు కనిపించలేదు. స్వయంగా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.

శ్రీలంకలో కొన్ని నెలలుగా నిరసనలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వేలాదిమంది కొలంబో రోడ్ల మీదకు వచ్చారు.

శ్రీలంక ఎదుర్కొంటోన్న ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడే కారణమంటూ వారు ఆరోపించారు. ఈ సంక్షోభం వల్ల నెలల తరబడి ఆహారం, చమురు, ఔషధాల కొరత ఏర్పడిందని చెబుతున్నారు.

శనివారం నిరసనల నేపథ్యంలో రణిల్ విక్రమసింఘే కూడా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. ఆయన ప్రైవేటు నివాసానికి, నిరసనకారులు నిప్పంటించారు.

అయితే, నేతల ప్రకటనలపై నిరసనకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్యాలెస్‌లోని విలాసాలను చూసి చాలామంది నిరసనకారులు ఆశ్చర్యపోయారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ప్యాలెస్‌లోని విలాసాలను చూసి చాలామంది నిరసనకారులు ఆశ్చర్యపోయారు

''మా పోరాటం ముగియలేదు. వారు నిజంగా పదవుల నుంచి తప్పుకునేంతవరకు మా పోరాటాన్ని ఆపబోం'' అని విద్యార్థి నిరసన నాయకుడు లహిరు వీరశేఖర అన్నట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.

''రాబోయే రెండు రోజుల్లో రాజకీయంగా ఏం జరగబోతుందనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఆ నేతలిద్దరూ నిజంగా రాజీనామా చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది'' అని వార్తా ఏజెన్సీ రాయిటర్స్‌తో మాట్లాడుతూ రాజకీయ విశ్లేషకులు, మానవ హక్కుల న్యాయవాది భవానీ ఫోన్సెకా అన్నారు.

అధికార మార్పిడిపై చర్చించేందుకు రాజకీయ నేతలు తదుపరి సమావేశాలను నిర్వహించనున్నారు.

కొత్త ప్రభుత్వం ఏదైనా, తక్షణమే దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు.

శనివారం నాటి నిరసనల్లో డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. బుల్లెట్ గాయాలైన ముగ్గురికి చికిత్స అందించినట్లు కొలంబో ప్రధాన ఆసుప్రతి అధికార ప్రతినిధి ఒకరు, వార్తా ఏజెన్సీ ఏఎఫ్‌పీతో చెప్పారు.

జాతీయ జెండాలు ఊపుతూ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, బారికేడ్లను నెట్టుకుంటూ అధ్యక్షుని నివాసంలోకి ప్రవేశించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనకారులు ,జాతీయ జెండాలు ఊపుతూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అధ్యక్షుని నివాసంలోకి ప్రవేశించారు

శనివారం నాటి అసాధారణ సంఘటనలు, శ్రీలంకలో నెలల తరబడి శాంతియుతంగా సాగిన నిరసనలకు పరాకాష్టగా నిలిచాయి.

అధ్యక్ష భవనం వద్ద భారీగా గుమిగూడిన జనాలు, జాతీయ జెండాలు ఊపుతూ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, బారికేడ్లను నెట్టుకుంటూ అధ్యక్షుని నివాసంలోకి ప్రవేశించారు.

ప్రజలు, అధ్యక్ష నివాసంలో తిరుగుతున్నట్లు, స్విమ్మింగ్ పూల్‌లో స్నానాలు చేస్తున్నట్లుగా ఆన్‌లైన్‌ వీడియో ఫుటేజీల్లో కనిపిస్తోంది. మరికొంతమంది అల్మారాలను తెరిచి అధ్యక్షుని వస్తువులను, అక్కడి విలాసవంతమైన బాత్రూమ్‌లను ఉపయోగించుకున్నారు.

''ఈ ఇంట్లోని విలాసాలు చూస్తుంటే, దేశం కోసం పనిచేసేంత సమయం వారికి లేదనే విషయం స్పష్టమవుతోంది'' అని రాయిటర్స్‌తో చానుక జయసూర్య అన్నారు.

నిరసన కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా శుక్రవారమే అధ్యక్షుడు రాజపక్ష అధికారిక నివాసం నుంచి వెళ్లిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది.

ఇది గొటాబయ రాజపక్ష అధికారిక నివాసం అయినప్పటికీ, ఆయన సాధారణంగా ఈ ఇంటికి సమీపంలో ఉండే మరో ఇంటిలో పడుకుంటారు.

అధ్యక్షుడు ఎక్కడున్నారనే వివరాలను బీబీసీ నిర్ధారించలేకపోయింది.

ఆదివారం అధ్యక్ష భవనంలో ప్రజలు పేకాట ఆడారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆదివారం అధ్యక్ష భవనంలో ప్రజలు పేకాట ఆడారు

కొలంబోలో ఉన్నత వర్గాలు నివసించే ప్రాంతంలో ఉన్న ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసానికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు.

పౌరుల భద్రత, అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటు కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని శనివారం రణిల్ ప్రకటించారు.

ఈ ప్రకటన వచ్చిన కాసేపటికే ఆయన ఇంటికి నిప్పు అంటించినట్లు వీడియోలు రావడం మొదలైంది.

ప్రధానమంత్రి, తన కుటుంబంతో కలిసి ప్రైవేటు ఇంటిలో నివసిస్తారు. అధికారిక కార్యక్రమాల కోసం మాత్రమే అధికారిక నివాసాన్ని ఉపయోగిస్తారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్షుడి అధికారిక నివాసంలో నిరసనకారులు, స్విమ్మింగ్ పూల్లో స్నానాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)