Sri Lanka Presidential Palace: అధ్యక్ష భవనం లోపలే మకాం వేసిన శ్రీలంక నిరసనకారులు

శ్రీలంక
ఫొటో క్యాప్షన్, అధ్యక్ష భవనంలో సెల్ఫీలు దిగుతున్న పౌరులు
    • రచయిత, అణ్బరసన్ ఎతిరాజన్
    • హోదా, బీబీసీ న్యూస్

కొలంబోలోని శ్రీలంక అధ్యక్షుడి అధికార నివాసంలోకి అడుగు పెడతానని కలలో కూడా అనుకోలేదని రష్మీ కావింధ్య చెప్పారు.

దేశంలోనే అత్యంత భారీ కాపలా ఉండే అధ్యక్ష భవనంలోకి శనివారం శ్రీలంకవాసులు చొచ్చుకువచ్చారు. ఆ మరుసటి రోజు కావింధ్య లాంటి ఎంతోమంది పౌరులు విశాలమైన ఆ ప్రాంగణాన్ని సందర్శించేందుకు గుడికూడారు.

బ్రిటిష్ వలసవాద పాలన కాలం నాటి నిర్మాణం కలిగిన భవనం అది. పలు వరండాలు, సమావేశ గదులు, నివాస ప్రాంతాలు, స్విమ్మింగ్ పూల్, పెద్ద పచ్చిక బయలుతో కూడిన విశాలమైన భవనం.

గత శనివారం నాటకీయ పరిణామలు చోటుచేసుకోవడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్ష భవనం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

"ఈ భవనం ఎంత సంపన్నంగా, భాగ్యవంతంగా ఉందో చూడండి. మేం గ్రామంలో ఒక చిన్న ఇంట్లో ఉంటాం. ఈ భవనం ప్రజలది, ప్రజల సొమ్ముతో కట్టినది" అని కావింధ్య అన్నారు. ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి అధ్యక్ష భవనం చూడ్డానికి వచ్చారు.

వేలాది మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. నిరసన నిర్వాహకులు ఈ గుంపును అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

శ్రీలంక పోలీసు బృందాలు, ప్రత్యేక దళాలు ఓ మూల నిల్చుని నిశ్శబ్దంగా జరుగుతున్నది చూస్తున్నాయి.

భవనం లోపల ప్రజలు గది గదికీ తిరిగి చూస్తున్నారు. టేకుతో చేసిన డెస్కులు, పెయింటింగ్స్ ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు.

శనివారం నాటి గందరగోళానికి ప్రతీకలుగా విరిగిన కుర్చీలు, పగిలిన కిటికీ అద్దాలు, పాత్రలు భవనంలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిఉన్నాయి.

శ్రీలంక

"ఇలాంటి భవనాన్ని చూడాలనుకున్న నా కల నెరవేరినట్టుంది" అని ఏఎల్ ప్రేమవర్ధనే అన్నారు. గణేముల్లా పట్టణంలోని ఒక పిల్లల పార్కులో ఆయన పనిచేస్తున్నారు.

"కిరోసిన్, గ్యాస్, ఆహారం కోసం మేం క్యూలు కడుతుంటే, రాజపక్ష భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారు" అన్నారు ప్రేమవర్ధనే.

శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష, ప్రధాని రణిల్ విక్రమ సింఘే అధికారికంగా రాజీనామా చేసేంతవరకు అధ్యక్ష భవనం, ప్రధాని నివాసాలను విడిచిపెట్టేది లేదని నిరసనకారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇంతమంది జనం గుమికూడడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నా సాయుధ దళాలు, ప్రత్యేక పోలీసు అధికారులు నిలబడి చూస్తూ ఉండిపోయారు. నిరసన బృందాలకు చెందిన వలంటీర్లే జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

శ్రీలంక

స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ..

భవనం లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోధుమరంగు నీళ్లతో నిండి ఉన్న పూల్ చుట్టూ జనం గుమికూడి వింతగా చూస్తూ నిల్చున్నారు. ఒక యువకుడు నీళ్లల్లోకి దూకు ఈత కొట్టాడు. చుట్టూ ఉన్న వాళ్లంతా చప్పట్లు కొట్టారు. శనివారం నిరసనకారులు స్విమ్మింగ్ పూల్‌లో ఈదుతున్న దృశ్యాలు బయటకి వచ్చాయి.

"నాకు చాలా బాధగా ఉంది" అన్నారు నిరోషా సుదర్శిని హచిన్‌సన్. తన ఇద్దరు టీనేజీ కుమార్తెలతో అధ్యక్ష భవనాన్ని చూడ్డానికి వచ్చారామె.

"ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఇంత అవమానకరమైన రీతిలో నిష్క్రమించాల్సి వచ్చింది. ఆయనకు ఓటు వేసి గెలిపించినందుకు సిగ్గుపడుతున్నాం. వారు ఈ దేశం నుంచి దోచుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు" అన్నారు నిరోష.

భవనంలోని నాలుగు కోళ్ల పందిరి మంచం చాలామందిని ఆకర్షించింది. యువకులు చాలామంది దానిపైన కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు.

కారిడార్లల్లో సింహళ, తమిళంతో పాటు ఇంగ్లిష్ కూడా వినిపించింది. భవనంలోకి అడుగుపెట్టినవారిలో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

బయట లాన్‌లో బౌద్ధులు, హిందువులు, క్రిస్టియన్లు పచార్లు చేస్తున్నారు. ఒక కుటుంబం అక్కడ పిక్నిక్ జరుపుకుంటోంది. ఒక 24 గంటల ముందు అక్కడ కూర్చుంటామని వాళ్లు కూడా అనుకుని ఉండరు.

ప్రజలు నెలల తరబడి చేసిన నిరసనలు చివరికి దేశ నాయకులను గద్దె దించాయని శ్రీలంకన్లు భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రభుత్వమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. వారి నాయకుల జీవనశైలి చూశాక వాళ్ల కోపం మరింత పెరిగింది.

వీడియో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్షుడి అధికారిక నివాసంలో నిరసనకారులు, స్విమ్మింగ్ పూల్లో స్నానాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)