Uber Files Leak: బడా రాజకీయ నేతలు ఉబర్‌కు రహస్యంగా మేలు చేసిన వైనమంతా బట్టబయలు

ఉబర్ ఫైల్స్ లీక్
    • రచయిత, ఉబర్ ఫైల్స్ రిపోర్టింగ్ టీమ్
    • హోదా, బీబీసీ పనోరమ

ఉబర్‌కు ఎంతమంది అగ్ర నేతలు సాయం చేశారో, చట్టం నుంచి తప్పించుకోడానికి అది ఎంత దూరం వెళ్లిందో ఉబర్ ఫైల్స్ లీకుల్లో వెల్లడైంది.

ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, యూరోపియన్ కమిషన్ (ఈయూ) మాజీ కమీషనర్ నీలీ క్రోస్ వంటి నాయకులు ఉబర్‌కు ధారాళంగా సాయం చేశారని ఈ లీకుల్లో బయటపడింది.

పోలీసులు దాడి చేసి కంప్యూటర్లను యాక్సెస్ చేయకుండా "కిల్ స్విచ్" ఉపయోగించమని ఉబర్ మాజీ బాస్ ఆదేశించినట్టు ఈ ఫైల్స్‌లో వెల్లడైంది.

అయితే, "గతంలో తమ సంస్థ నిర్వహణకు, ఇప్పటి సంస్థ విలువలకు చాలా వ్యత్యాసం ఉందని, ఇప్పుడు తమ సంస్థ పూర్తిగా మారిపోయిందని" ఉబర్ అంటోంది.

ఉబర్ ఫైల్స్ అంటే ఆ సంస్థకు సంబంధించి బయటపడిన రికార్డుల గుట్ట. 2013 నుంచి 2017 మధ్య కాలంలో ఆ సంస్థకు సంబంధించిన 83,000 ఈమెయిల్స్, 1,000 ఇతర ఫైల్స్ సహా మొత్తం 1,24,000 ఫైల్స్ లీకయ్యాయి.

ఇవి గార్డియన్ పత్రికకు అందాయి. వాటిని ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌లతోనూ, బీబీసీ పనోరమ సహా అనేక మీడియా సంస్థలతో పంచుకున్నారు.

ఉబర్, ఐరోపా టాక్సీ పరిశ్రమకు అంతరాయం కలిగించే ప్రచారంలో సహాయం చేయడానికి సంవత్సరానికి 90 మిలియన్ డాలర్ల లాబీయింగ్ చేసిందని, రాజకీయ నాయకులతో స్నేహం నెరిపిందని తొలిసారిగా ఈ లీకుల్లో బయటపడింది.

ఓపక్క ఉబర్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ఫ్రెంచ్ టాక్సీ డ్రైవర్లు వీధుల్లోకి వస్తే, మరోపక్క మేక్రాన్ ఉబర్ వివాదాస్పద బాస్ ట్రావిస్ కలానిక్‌తో స్నేహం కట్టి, వారి సంస్థకు అనుకూలంగా చట్టాలను సవరిస్తానని మాటిచ్చారు.

ఉబర్ క్రూరమైన వ్యాపార పద్ధతులు ప్రపంచానికి తెలుసు. అయితే, ఈ సంస్థ దాని లక్ష్యాలను సాధించేందుకు ఎంత దూరం వెళ్ళింది, లోపల్లోపల ఏం జరిగిందనేది మొదటిసారిగా బయటపడింది.

బ్రస్సెల్స్ ఉన్నత అధికారులలో ఒకరైన ఈయూ మాజీ డిజిటల్ కమిషనర్ నీలీ క్రోస్ తన పదవీకాలం ముగియకముందే ఉబర్‌లో చేరడానికి చర్చలు జరిపారని, ఈయూ నైతిక నియమాలను ఉల్లంఘిస్తూ రహస్యంగా ఆ సంస్థ కోసం లాబీయంగ్ చేశారని ఈ లీకుల్లో వెల్లడైంది.

ఆ సమయంలో ఉబర్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ మాత్రమే కాదు, అత్యంత వివాదాస్పదమైన సంస్థ కూడా. కోర్టు కేసులు, లైంగిక వేధింపుల ఆరోపణలు, డేటా ఉల్లంఘన కుంభకోణాలు వంటి ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది.

క్రమంగా, షేర్‌హోల్డర్లు విసుగు చెందారు. 2017లో ట్రావిస్ కలానిక్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆయన స్థానంలో వచ్చిన దారా ఖోస్రోషాహి ఉబర్ సంస్థను సంస్కరించేందుకు ప్రయత్నించారని, సంస్థ నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశాన్ని మార్చేందుకు శ్రమపడ్డారని ఉబర్ చెబుతోంది. ఒక పబ్లిక్ సంస్థ నిర్వహణకు అవసరమైన కఠిన నియంత్రణలు, నిబద్ధత పొందుపరిచారని అంటోంది.

ఊబర్ ఫైల్స్

'అద్భుతమైన' మేక్రాన్ సాయం

యూరప్‌లో పారిస్‌లోనే ఉబర్‌ను తొలుత ప్రారంభించారు. అక్కడి టాక్సీ పరిశ్రమ ఉబర్‌కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

2014 ఆగస్టులో బ్యాంకర్ అయిన ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఉబర్ అభివృద్ధికి బాటలు వేయగలదని, కొత్త ఉద్యోగాలు సృష్టించగలదని ఆయన విశ్వసించారు. అందుకే ఉబర్‌కు సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు.

అదే ఏడాది అక్టోబర్‌లో కలానిక్, ఇతర కార్యనిర్వాహకులు, లాబీయిస్టులతో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దాంతో, ఈ వివాదాస్పద సంస్థకు ప్రభుత్వంతో సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఇది సుదీర్ఘ కాలం కొనసాగింది. కానీ, దీని గురించి బయటకు పొక్కింది తక్కువ.

ఉబర్ లాబీయిస్ట్ మార్క్ మాక్‌గన్ ఈ సమావేశాన్ని "అద్భుతమైనది. నేను ఎన్నడూ చూడని విధంగా జరిగింది" అంటూ అభివర్ణించారు. "త్వరలో మేం డాన్స్ చేయబతున్నాం" అని ఆయన అన్నట్టు ఫైల్స్‌లో బయటపడింది.

మేక్రాన్‌కు, కలానిక్‌కు మంచి స్నేహం కుదిరిందని, పారిస్‌లో, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో, ఇతరత్రా కనీసం నాలుగుసార్లు కలిశారని ఫైల్స్ చెబుతున్నాయి. అయితే, దావోస్ మీటింగ్ గురించి మాత్రమే బయటకు తెలిసింది.

ఒకానొక సమయంలో ఉబర్, మేక్రాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాసింది. "ప్రభుత్వ-పరిశ్రమ సంబంధాలలో మాకు లభించిన ఆదరణ అసాధారణం" అని పేర్కొంది.

మరోవైపు 2014లో ఫ్రెంచ్ టాక్సీ డ్రైవర్లు ఉబర్‌పై విపరీతమైన కోపంతో ఉన్నారు. ప్రత్యేకించి 'ఉబర్‌పాప్‌'ను పరిచయం చేయడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ సర్వీసు కింద లైసెన్సు లేని డ్రైవర్లు కూడా ఉబర్ నడపవచ్చు. అదీ అతి తక్కువ ధరల వద్ద.

కోర్టులు, ప్లారమెంటు ఈ సర్వీసును నిషేధించాయి. కానీ, ఉబర్ కోర్టు తీర్పును సవాలు చేసింది. ఊబర్‌పాప్‌ను కొనసాగించింది.

ఉబర్‌పాప్‌కు భవిష్యత్తు ఉంటుందని మేక్రాన్ భావించలేదు. కానీ ఆ సంస్థ అందించే ఇతర సర్వీసులకు సంబంధించి చట్టాలను తిరగ రాసేందుకు సంస్థతో కలిసి పనిచేస్తానని మాటిచ్చారు.

"ఉబర్ తమ సర్వీసులకు సంబంధించి ఒక రెగ్యులెటరీ ఫ్రేంవర్క్ అవుట్‌లైన్‌ను అందిస్తుంది. దాని సాయంతో ఫ్రాన్స్‌లో అధికారికంగా అమలుపరచగలిగే నిబంధనల ప్రతిపాదన రూపొందించే పనిని సంబంధిత బృందాలకు అప్పగిస్తాం" అని మేక్రాన్, కలానిక్‌కు రాసిన ఓ ఈమెయిల్ ఈ లీకుల్లో బయటపడింది.

2015 జూన్ 25న టాక్సీ డ్రైవర్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఒక వారం తరువాత మేక్రాన్, కలానిక్‌కు రాస్తూ సాయం అందిస్తానని తెలిపారు.

"వచ్చే వారం అందరితో సమావేశమై చట్టాల్లో సవరణలు తీసుకొస్తాం" అని మేక్రాన్ రాశారు.

అదే రోజు ఉబర్‌పాప్ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

వీడియో క్యాప్షన్, ఉబర్: వ్యాపార విస్తరణ కోసం చట్టాల్ని మార్చేందుకు లాబీయింగ్.. లీకైన పత్రాలు చెప్పిన రహస్యం

కొన్ని నెలల తరువాత మేక్రాన్, ఉబర్ డ్రైవర్లకు లైసెన్సింగ్ అవసరాలను సడలించే డిక్రీపై సంతకం చేశారు.

ఫ్రెంచ్ చట్టాలను ఉల్లంఘిస్తూ పనిచేసిన ఈ వివాదాస్పద సంస్థతో ఫ్రాన్స్ ప్రస్తుత అధ్యక్షుడికి ఇంత సన్నిహిత సంబంధం ఉందని ఇప్పటివరకు బయటపడలేదు.

"సహజంగా ఆయన విధుల్లో భాగంగా ఆ కొన్ని సంవత్సరాలలో సేవా రంగంలో పదునైన మార్పులకు దోహపడిన సంస్థలను కలిసి, మాట్లాడే అవసరం ఏర్పడింది. ఈ చర్చలు పరిపాలన, నియంత్రణ అడ్డంకులను తొలగించేందుకు దారితీశాయి" అని మేక్రాన్ ప్రతినిధి ఒక ఈమెయిల్‌లో తెలిపారు.

"తమకు అనుకూలంగా నిబంధనలు మార్చడం వల్లే ఉబర్‌పాప్‌ను రద్దు చేయలేదని, ఈ రెండిటికీ సంబంధం లేదని" ఉబర్ అంటోంది. 2018లో ఫ్రాన్స్‌లో అమలులోకి వచ్చిన కొత్త చట్టం "స్టికర్ రెగులేషన్" ఉబర్‌కు ఎటువంటి ప్రయోజనం కలిగించలేదని గుర్తుచేసింది.

ఉబర్ ఫైల్స్ లీక్

ఫొటో సోర్స్, Getty Images

రెగ్యులేటర్ లాబీయిస్ట్‌గా మారారు

యూరోప్ ఉన్నతాధికారుల్లో ఒకరైన యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ నీలీ క్రోస్‌కు ఉబర్‌కు ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఈ లీకుల్లో బయటపడింది. ప్రారంభ దశలోనే ఉబర్‌కు ఆమెతో బలమైన స్నేహం కుదిరిందని, దాంతో ఆమె కమిషన్ ప్రవర్తన నియమావళిని కూడా ఉల్లంఘించారని ఈ ఫైల్స్ వెల్లడించాయి.

2014 నవంబర్‌లో ఆమె తన చివరి యూరోపియన్ పోస్ట్‌ను వదిలివేయక ముందే ఉబర్ అడ్వైజరీ బోర్డులో చేరేందుకు చర్చలు జరిపినట్టు లీకుల్లో బయటపడింది.

ఈయూ నియమాల ప్రకారం, కమిషనర్లు 18 నెలల "కూలింగ్-ఆఫ్" పీరియడ్‌ను గౌరవించవలసి ఉంటుంది. ఈ 18 నెలల కాలంలో కొత్త ఉద్యోగాలకు అప్ప్లై చేయవచ్చు కానీ వాటిని కమిషన్ ఆమోదించాల్సి ఉంటుంది.

కమిషనరుగా క్రోస్ డిజిటల్ అండ్ కాంపిటిషన్ పాలసీ విభాగాన్ని పర్యవేక్షించేవారు. ఈ విభాగం పెద్ద పెద్ద టెక్ కంపెనీల నియంత్రణలో కఠినంగా వ్యవహరించేది. ఫలితంగా, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ లాంటి సంస్థలు భారీ జరిమానాలు చెల్లించాయి.

కమిషనరుగా పదవీ విరమణ చేసిన తరువాత ఆమె ప్రత్యేకించి ఉబర్ సంస్థలో చేరాలనుకోవడం వివాదాస్పదమైన నిర్ణయం.

ఆమె స్వదేశం నెదర్లాండ్స్‌లో కూడా ఉబర్‌పాప్ చట్టపరమైన, రాజకీయ సమస్యలను తెచ్చిపెట్టింది.

2014 అక్టోబర్‌లో ఉబర్ డ్రైవర్లను అరెస్ట్ చేశారు. ఆ డిసెంబర్‌లో హేగ్‌లోని న్యాయమూర్తి ఉబర్‌పాప్‌ను నిషేధించారు. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే 1,00,000 జరిమానా ఉంటుందని వెల్లడించారు.

2015 మార్చిలో ఉబర్ ఆమ్‌స్టర్‌డామ్ కార్యాలయంపై డచ్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడి నుంచి వెనక్కి మళ్లాలని మంత్రులను, ఇతర ప్రభుత్వ సభ్యులను ఒప్పించేందుకు క్రోర్స్ ప్రయత్నించారని ఈమెయిల్స్ చెబుతున్నాయి.

ఒక వారం తరువాత మరొక దాడి సందర్భంగా క్రోస్ ఒక డచ్ మంత్రిని సంప్రదించారని ఫైల్స్‌లో వెల్లడైంది. అలాగే ఈమెయిల్స్‌లో రాసిన మాటల ప్రకారం డచ్ సివిల్ సర్వీస్ అధిపతిని "వేధించారు".

ఆమె అనధికారిక సంబంధాలను బహిరంగంగా చర్చించవద్దని సిబ్బందికి ఒక అంతర్గత ఈమెయిల్ ద్వారా సూచించారు.

"ఆమె ప్రతిష్ట దెబ్బతింటుందని, నెదర్లాండ్స్ సహా ఇతర దేశాల్లో మన కార్యసాధాన సామర్ధ్యాలు అపహాస్యం పాలవుతాయని" ఆ ఈమెయిల్‌లో రాశారు.

ఉబర్ ఫైల్స్

డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే కార్యాలయానికి నీలీ క్రోస్ సందేశాలను పంపాలని కంపెనీ కోరినట్టు ఫైల్స్ చూపిస్తున్నాయి.

2015 అక్టోబర్‌లోని ఒక ఈమెయిల్‌లో, "నీలీ, పీఎం చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో బ్యాక్‌చానెల్ కొనసాగిస్తాం. విజయం అనే భావనను వారికి అందించడం ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందేందుకు ప్రయత్నిస్తాం" అని రాసి ఉంది.

18 నెలల గడువు పూర్తి కాకముందే ఉబర్ అడ్వైజరీ బోర్డులో చేరేందుకు అనుమతిని కోరుతూ క్రోస్, కమిషన్ ఆడ్ హాక్ ఎథికల్ కమిటీకి లేఖ రాశారు. ఆ మేరకు, కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్ జంకర్‌కు విజ్ఞప్తి చేశారు.

అయితే, ఆమెకు అనుమతి లభించలేదు. కానీ, ఆమె అనధికారంగా ఉబర్ సంస్థకు సహాయం అందిస్తూనే ఉన్నారని ఫైల్స్ తెలిపాయి. ఆమె కూలింగ్-ఆఫ్ పీరియడ్ ముగిసిన వెంటనే ఉబర్‌లో చేరారు.

క్రోస్ నిబంధనలను "ఉల్లంఘించారని" స్పష్టంగా తెలుస్తోందని హెచ‌్‌ఈసీ పారిస్‌లో 'యూరోపియన్ యూనియన్ లా'లో జీన్ మొన్నెట్ ప్రొఫెసర్ అల్బెర్టో అలెమన్నో అన్నారు.

"మీకు అనుమతి లేని పనిని మీరు చేశారని నిరూపణ అయింది. ఒకవేళ ఆమె అనుమతి కోరపోతే, గ్రే ఏరియా అని వాదించవచ్చు. కానీ ఆమె అనుమతి కోరారు, దాన్ని అధికారులు తిరస్కరించారు. అయినా కూడా ఆ పని చేస్తే అది ఉల్లంఘనే అవుతుంది" అని ఆయన బీబీసీ పనోరమతో చెప్పారు.

క్రోస్‌కు ఉబర్‌తో ఉన్న సంబంధాలు బయటపెట్టిన రుజువులను చూస్తూ, "మన వ్యవస్థ ప్రయోజనాలు పొందేందుకు సరిపోదని నాకు అనిపిస్తోంది. ఈ పరిస్థితిని నివారించాల్సింది" అని అల్బెర్టో అన్నారు.

అయితే, 2016కు ముందు ఉబర్‌తో తనకు ఎలాంటి అధికారిక, అనధికారి సంబంధాలు లేవని క్రోస్ అంటున్నారు.

ఈయూ కమిషనరుగా అనేక టెక్ సంస్థలతో సంభాషించానని, "ప్రజా ప్రయోజనాలను చేకూర్చే చర్యలనే చేపట్టానని" ఆమె తెలిపారు.

కూలింగ్-ఆఫ్ సమయంలో, డచ్ ప్రభుత్వం స్టార్టప్‌ల కోసం ఆమెను ప్రత్యేక రాయబారిని నియమించింది.

"నెదర్లాండ్స్‌లో వ్యాపార అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో విస్తృత స్థాయిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో" చర్చలు జరిపానని క్రోస్ అన్నారు.

అయితే, 2015లో ఉబర్‌ను ఒక స్టార్టప్‌గా పరిగణించలేదని డచ్ ఆర్థిక వ్యవహారాల శాఖ ప్రతినిధి చెప్పారు.

2018లో తమ సంస్థ అడ్వైజరీ బోర్డు నుంచి క్రోస్ తప్పుకున్నారని, ఆ తరువాత కొత్త గైడ్‌లైన్స్ తీసుకువచ్చామని, "లాబీయింగ్, పాలసీ మేకర్స్‌తో సంప్రదింపుల విషయంలో పటిష్టమైన పర్యవేక్షణ విధానాన్ని అమలుచేస్తున్నామని" ఉబర్ తెలిపింది.

ఊబర్ ఫైల్స్ లీక్

ఫొటో సోర్స్, ANP / ALAMY STOCK PHOTO

ఫొటో క్యాప్షన్, 2016లో సిలికాన్ వ్యాలీని సందర్శించిన డచ్ పీఎం మార్క్ రుట్టే, అప్పటి ఉబర్ సీఈఓ ట్రావిస్ కలానిక్, నీలీ క్రోస్

'తక్షణమే కిల్ స్విచ్ నొక్కండి'

పోలీసులు దాడి జరిపితే తప్పించుకునేందుకు ఉబర్ 'కిల్ స్విచ్ ' బటన్ పెట్టింది. అది నొక్కితే ఆ సంస్థ కంప్యూటర్లను అధికారులు యాక్సెస్ చేయలేరు.

దానివల్ల కంపెనీ డ్రైవర్ల జాబితా సహా కంపెనీ డాటాను ఎవరూ యాక్సెస్ చేయలేరు. ఈ డాటా అధికారుల చేతికి చిక్కడం కంపెనీ అభివృద్ధికి హాని కలిగిస్తుందని ఉబర్ భావించింది.

కిల్ స్విచ్ గురించి అప్పట్లో వార్తా కథనాలు వచ్చాయని, కలానిక్ స్వయంగా కిల్ స్విచ్‌ను ఒకసారి యాక్టివేట్ చేసినట్టు ఫైల్స్ ధృవీకరించాయి.

"తక్షణమే కిల్ స్విచ్ నొక్కండి. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఎవరికీ మన డాటా యాక్సెస్ దొరకకూడదు" అని ఒక ఈమెయిల్‌లో రాశారు.

బెల్జియం, భారత్, రొమేనియా, హంగేరీ, ఫ్రాన్స్‌లలో కనీసం మూడు సార్లు కిల్ స్విచ్ ఉపయోగించారు.

ఉబర్ ఫైల్స్

అయితే, 2017లో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడా 'కిల్ స్విచ్' వాడలేదని ఉబర్ చెబుతోంది.

కలానిక్ ప్రతినిధి మాట్లాడుతూ, ఏ దేశంలోనైనా చట్టానికి ఆటంకం కలిగించే చర్యలకు లేదా కార్యక్రమాలకు తాము పాల్పడలేదని, కలానిక్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని అన్నారు.

"వినియోగదారుల మేధో సంపత్తి, గోప్యతను రక్షించే సాధనాలను మాత్రమే ఉబర్ ఉపయోగించింది. ఇవి సురక్షితమైనవి. వినియోగదారులకు సంబంధించిన ఎలాంటి డాటా డిలీట్ చేయవు. తమ సంస్థ లీగల్, రెగ్యులేటరీ విభాగం ఆమోదం పొందాయి" అని ఆయన తెలిపారు.

బర్ ఫైల్స్ రిపోర్టింగ్ టీమ్: జేమ్స్ ఆలివర్, రోరీ టిన్మాన్, నాసోస్ స్టైలియానౌ, బెకీ డేల్, విల్ డాల్‌గ్రీన్

ఈ కథనాన్ని రాసినవారు బెన్ కింగ్

వీడియో క్యాప్షన్, మీ ఖాతాలో డబ్బులు పోతే బ్యాంకులు ఇస్తాయా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)