Tamil Nadu-Bhoomi Pooja: ‘ప్రభుత్వ కార్యక్రమంలో హిందూమత పూజలు ఎందుకు చేయిస్తున్నారు? పూజారి ఉంటే.. ఫాదర్, ఇమామ్ ఎక్కడ?’ - భూమి పూజను ఆపించిన డీఎంకే ఎంపీ

భూమి పూజ కార్యక్రమంలో అధికారులను ప్రశ్నిస్తున్న ఎంపీ సెంథిల్ కుమార్

ఫొటో సోర్స్, Twitter/Dr.Senthilkumar.S

    • రచయిత, ప్రమీల కృష్ణన్
    • హోదా, బీబీసీ తమిళ్

తమిళనాడు ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఒక భూమి పూజ కార్యక్రమంలో హిందూ పూజారి మాత్రమే ఉండటం వివాదానికి దారి తీసింది.

ధర్మపురి జిల్లాలోని ఆలంపురం గ్రామంలో ఒక చెరువు పునరుద్ధరణ పనుల కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(పీడబ్ల్యూడీ) ఆధ్వర్యంలో భూమి పూజ చేపట్టారు. ఆ కార్యక్రమానికి డీఎంకే పార్టీకి చెందిన ధర్మపురి ఎంపీ ఎస్.సెంథిల్ కుమార్ కూడా వచ్చారు.

భూమి పూజ కార్యక్రమంలో హిందూ పూజారి మాత్రమే ఉండటం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పూజలు ఎలా చేస్తారంటూ పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను ఆయన ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

'ప్రభుత్వ కార్యక్రమంలో పూజలు ఎందుకు చేయిస్తున్నారు? ప్రభుత్వ పనుల్లో మతపరమైన కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పారు కదా? ఒకవేళ చేయిస్తే మిగతా మతాల వాళ్లు ఏరి? నాస్తికులు, క్రైస్తవులు, ముస్లింలు, ఇతర మతాలు వారు కూడా ఉండాలి కదా? ద్రవిడార్ కజగం ప్రతినిధులు, ఫాదర్, ఇమామ్‌లను కూడా పిలిపించండి' అంటూ సెంథిల్ కుమార్ అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

ద్రవిడార్ కజగం అనేది ఒక హేతువాద సంస్థ. దీన్ని పెరియార్ రామస్వామి ప్రారంభించారు. దీని నుంచే డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కజగం) పార్టీ పుట్టుకొచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

'ప్రభుత్వ కార్యక్రమాల్లో పూజలు చేయకూడదని మీకు తెలుసా? లేదా' అంటూ అధికారిని సెంథిల్ కుమార్ ప్రశ్నించారు. సంబంధిత శాఖా మంత్రి అనుమతితోనే తాను ఈ పూజ ఏర్పాటు చేశాని ఆ అధికారి బదులిచ్చారు.

'ఎవరు మీకు అనుమతిచ్చారు? ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొనే కార్యక్రమాల్లో ఇలాంటి పూజలు మీరు చూశారా? ఇది ద్రవిడ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్ని మతాలు, విశ్వాసాల వారికి చెందింది' అని ఆయన అన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

ఫొటో సోర్స్, Facebook/DMK - Dravida Munnetra Kazhagam

చివరకు భూమి పూజను సెంథిల్ కుమార్ ఆపించారు. ఈ నేపథ్యంలో సెంథిల్ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది.

'ప్రభుత్వ పనుల్లో ఒక మతానికే చెందిన కార్యక్రమాలు చేపట్టొద్దని, గతంలో చాలా సార్లు చెప్పాను. ఈ కారణం వల్లనే అనేక కార్యక్రమాల నుంచి నేను మధ్యలోనే వెళ్లిపోయాను కూడా. ఈ ఘటన మీద మాత్రమే ఎందుకు చర్చ జరుగుతోందంటే, దానికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో ఉంది కాబట్టి.

ఇతర మతాల వారిని ఎందుకు పిలవడం లేదని ప్రతిసారీ అధికారులను అడుగుతూనే ఉంటాను.

పిలిస్తే అన్ని మతాల వారినీ పిలవాలి. లేదంటే పూజలే పెట్టకండి. ప్రభుత్వ పనుల్లో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. అసలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పూజలు అవసరం లేదు. అయినా మీరు చేయాలనుకుంటే అందరినీ ఆహ్వానించాలి. తమిళనాడులో ఉంది ద్రవిడ ప్రభుత్వం. మతపరమైన ప్రభుత్వం కాదు' అని ఆయన బీబీసీతో అన్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి

ఫొటో సోర్స్, Getty Images

నాస్తికత్వానికి కట్టుబడి ఉంటూ ఎన్నికల్లో డీఎంకే గెలుస్తూ వస్తోందని సెంథిల్ కుమార్ చెప్పుకొచ్చారు.

'అన్నాదురై, కరుణానిధి పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో దేవుళ్ల బొమ్మలు పెట్టడానికే అధికారులు భయపడేవాళ్లు. అలాంటిది ప్రభుత్వ కార్యక్రమాల్లో పూజలను ఎలా అనుమతిస్తాం? మా పార్టీ సభ్యుల్లో దేవుళ్లను నమ్మేవాళ్లు ఉండొచ్చు. మా ఓటర్లు కూడా ఆస్తికులు కావొచ్చు. అదంతా వారి వ్యక్తిగతం. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పూజలు చేయడాన్ని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా' అని ఆయన అన్నారు.

డీఎంకే ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా అని బీబీసీ ప్రశ్నించగా...'వారి నమ్మకాలు, విశ్వాసాలు వాళ్ల ఇంటి వరకే పరిమితమైనప్పుడు సమస్యలేదు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒక మతానికి సంబంధించిన పూజలు మాత్రమే నిర్వహించడం, అందులో పాల్గొనడం తప్పు. డీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు దీని గురించి తప్పకుండా ఆలోచించాలి.

కొందరు అన్నా డీఎంకే నుంచి డీఎంకేకు వచ్చి ఉండొచ్చు. కానీ తొలి నుంచి డీఎంకేలో ఉన్న వారు మాత్రం పార్టీ సిద్ధాంతాల గురించి ఆలోచించాలి. ఆ సిద్ధాంతాలను తాము అనుసరిస్తున్నామో లేదో చూసుకోవాలి.

చాలా మంది దీని గురించి బయటకు మాట్లాడటానికి భయపడతారు. కానీ నాకు పోయేది ఏమీ లేదు. అందుకే నేను మాట్లాడుతున్నా’' అని సెంథిల్ కుమార్ అన్నారు.

ఆలంపురం చెరువు వద్ద పూజా సామాగ్రి, చేసిన ఏర్పాట్లు తొలగించిన తరువాత మాత్రమే పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.

వీడియో క్యాప్షన్, ఈ కులం ఏంటి? ఈ మతం ఏంటి? వీటిని వదిలేసుకుంటే పోలా.. అని మీకెప్పుడైనా అనిపించిందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)