Iran Women-Hijab: ఈ ఇస్లామిక్ రిపబ్లిక్‌లో మహిళలు హిజాబ్‌ను నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కుతున్నారు, వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెడుతున్నారు

Iran Hijab Protest
ఫొటో క్యాప్షన్, మహిళలు తమ తలకు హిజాబ్ ధరించకుండా ఫొటోలు షేర్ చేశారు
    • రచయిత, ఫరేన్ తాఘిజాదే
    • హోదా, బీబీసీ పర్షియన్

ఇరాన్‌లో మహిళలు కఠిన హిజాబ్ నిబంధనలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తమ తల మీద హిజాబ్‌లను తొలగిస్తూ, ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

''హిజాబ్ తప్పనిసరి అనటాన్ని తిరస్కరిస్తున్నా. ఈ నిబంధనలను తిరస్కరించటానికి ఈ రోజు నేను హిజాబ్ లేకుండా ఇంటి నుంచి ఆఫీస్ వరకూ కారు నడుపుకుంటూ వెళ్లా’’ అని ఒక ఇరానీ మహిళ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పారు.

ఇరాన్ అధికారిక క్యాలండర్‌ ప్రకారం జూలై 12వ తేదీ 'హిజాబ్, పవిత్రత జాతీయ దినం'. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలు హిజాబ్ తొలగిస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేయాలని హక్కుల కార్యకర్తలు పిలుపునిచ్చారు.

అలా చేయటం 'ఇస్లామిక్ వస్త్రధారణ'పై ఇరాన్‌ చట్టాలకు వ్యతిరేకమైనా, శాసనోల్లంఘన కింద అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నా.. ఆ పిలుపుకు పదుల సంఖ్యలో మహిళలు స్పందించారు.

Removing Hijab
ఫొటో క్యాప్షన్, కొందరు మహిళలు హిజాబ్ తొలగిస్తూ వీడియోలు పోస్ట్ చేశారు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పార్కులు, నగర వీధులతో పాటు బీచ్‌లలో సైతం మహిళలు హిజాబ్ లేకుండా తమను చూపుతూ సెల్ఫీ వీడియోలను పోస్ట్ చేశారు. కొందరైతే సమ్మర్ టాప్స్, షార్ట్స్ ధరించి ఈ వీడియోలు రికార్డు చేశారు.

వేలాది మంది షేర్ చేసిన ఒక వీడియోలో.. ఒక మహిళ బీచ్ వద్ద తన హిజాబ్ తొలగించి, దానిని కిందకు జారవిడిచి, దానిని కాళ్లతో తొక్కి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాన్ని చూపుతోంది.

మరోవైపు.. హిజాబ్ 'ఇస్లామిక్ రక్షణ' సంబరాలు చేస్తూ.. ప్రభుత్వ యంత్రాంగం అదే రోజున హిజాబ్ ధరించిన మహిళలతో భారీ బహిరంగ ప్రదర్శనలు నిర్వహించింది.

Hijab ceremony

ఫొటో సోర్స్, Tasnim News Agency

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ టీవీ చానల్ ‘హిజాబ్ - పవిత్రత’ ఉత్సవాలను ప్రసారం చేసింది

ప్రభుత్వ టెలివిజన్ చానల్‌లో 'హిజాబ్ - పవిత్రత' ఉత్సవాన్ని ప్రసారం చేశారు. మహిళలు పొడవాటి తెల్లటి దుస్తులు, తలకు ఆకుపచ్చ రంగులో హిజాబ్‌లు ధరించి.. జాతీయ రంగుల్లో ఇచ్చిన ప్రదర్శన కూడా ఆ ప్రసారంలో ఉంది.

ఇదిలావుంటే.. పర్షియన్ సోషల్ మీడియాలో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం కోసం ఒక హ్యాష్ ట్యాగ్ వేగంగా వైరల్‌ అయింది. 'నో అంటే నో.. ఈసారి తప్పనిసరి హిజాబ్‌కు నో' అని పార్సీలోని ఆ హ్యాష్ ట్యాగ్‌కు అర్థం. దీనిని ఉద్యమకారులు, కొందరు పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలు ప్రమోట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అధికారంలో ఉన్న పురుషులు.. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రిస్తున్నారని కొందరు మహిళలు విమర్శిస్తూ మాట్లాడారు.

''మీరు మమ్మల్ని కేవలం మీ గౌరవానికి సేవ చేసే వారి లాగా, మీ ఆస్తి లాగా మాత్రమే చూస్తారు. మీరు మమ్మల్ని బలహీనులైన మనుషులుగా చూస్తారు. మీ భయాలు, అభద్రత భావనలతో మమ్మల్ని తల కప్పుకోవాలంటూ బలవంతం చేస్తారు'' అని విమర్శిస్తూ.. ఉత్తర ఇరాన్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ కెమెరా ముందు తన హిజాబ్ తొలగిస్తున్న వీడియోను బీబీసీ పర్షియన్‌కు పంపించారు.

Revolution street girls
ఫొటో క్యాప్షన్, 2018లో ఇలాంటి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన విదా మొవాహెద్ కొన్ని నెలలు జైలులో గడిపారు

ఈ ఉద్యమంలో భాగంగా హిజాబ్ తొలగిస్తున్న వీడియోలను పోస్ట్ చేసిన వారిలో కనీసం ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు బీబీసీ పర్షియన్ చెప్తోంది.

ఇరాన్‌లో ఇటీవలి సంవత్సరాల్లో పలుమార్లు ఇటువంటి ఉద్యమాలు జరిగాయి. ముసుగు ధరించాలా లేదా అని నిర్ణయించుకునే హక్కు కోసం పోరాడుతున్న మహిళలు #MyStealthyFreedom, #WhiteWednesday హ్యాష్‌ట్యాగ్‌లతో ఉద్యమించారు.

అయితే వస్త్రధారణ నియమావళిని పాటించటం లేదని ఆరోపిస్తూ మహిళల మీద ఇరాన్ 'నైతికత పోలీసు' విభాగం ఇటీవల విరుచుకుపడటంతో.. ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారు దీనిపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Morality police

ఫొటో సోర్స్, ISNA

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌లో మహిళలు ‘సరైన హిజాబ్’ ధరించకపోతే వారిని నైతికత పోలీసులు అరెస్ట్ చేయవచ్చు

ఇరాన్‌లో 1979 నాటి ఇస్లామిక్ తిరుగుబాటు నాటి నుంచీ.. మహిళలు 'ఇస్లామిక్' వస్త్రాలు ధరించటం చట్ట ప్రకారం తప్పనిసరి చేశారు. అంటే మహిళలు శరీరమంతా కప్పేసే కోటు, తల చుట్టూ స్కార్ఫ్, చేతులను కప్పేస్తూ ఓవర్‌కోటు ధరించాల్సి ఉంటుంది.

హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి కొందరు ఇరాన్ పురుషులు కూడా సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. నిరసన తెలుపుతున్న మహిళలతో పాటు వారు కూడా వీడియోలో కనిపిస్తున్నారు.

టెహ్రాన్ నగరంలోని ఒక మసీదు గోడ మీద 'రొట్టె, పని, స్వాతంత్ర్యం, స్వచ్ఛంద ముసుగు' అని పెద్ద అక్షరాలతో పెయింట్ చేసిన పదాల ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని, హిజాబ్ చట్టాలను ఆ పదాలు ప్రస్తావిస్తున్నాయి.

Graffitti reads "Bread, work, freedom, voluntary covering"
ఫొటో క్యాప్షన్, ‘రొట్టె, పని, స్వాతంత్ర్యం, స్వచ్ఛంద ముసుగు’ అంటున్న మాటలు

అయితే.. ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతి ఘోలామోసీన్ మొహ్‌సేని అజీయి, ఈ ఉద్యమం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని సూచిస్తూ.. ''ఈ నగ్న ముసుగు వెనుక ఉన్న హస్తాలను'' గుర్తించాలని నిఘా సంస్థలకు నిర్దేశించారు.

ఇది ''ఇస్లామిక్ సమాజంలో వ్యవస్థీకృత అవినీతిని ప్రోత్సాహంచటం'' అని, దీనిని అణచివేస్తామని దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రకటించారు.

కానీ ఈ ముప్పు ఉన్నాకూడా తమ నిరసనలను కొనసాగించాలని చాలా మంది మహిళలు గట్టి సంకల్పంతో ఉన్నారు.

''మీరు మమ్మల్ని అరెస్ట్ చేయగలరు, కానీ మీరు మా ఉద్యమాన్ని ఆపలేరు'' అని ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.

''మేం కోల్పోవటానికి ఏమీ లేదు. మా స్వేచ్ఛను చాలా ఏళ్ల కిందటే కోల్పోయాం. ఇప్పుడు దానిని తిరిగి తీసుకుంటున్నాం'' అన్నారామె.

వీడియో క్యాప్షన్, పరువు పేరుతో జరుగుతున్న హత్యల సంఖ్యలో పెరుగుదల ఆందోళనకరం అంటున్న హక్కుల సంఘాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)