రిపోర్టర్ జమీర్ మరణం: ‘జర్నలిజంలో ఆర్థికంగా స్థిరపడటం కష్టమని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవుదామనుకున్నాడు’

ఫొటో సోర్స్, UGC
- రచయిత, సురేఖ అబ్బూరి, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ ప్రతినిధులు
'అమ్మాయిని డాక్టర్... అబ్బాయిని పైలట్ చేయాలి. జర్నలిజంలో ఆర్థికంగా స్థిర పడడం కష్టం అని భావించి డేటాబేస్ అప్లికేషన్ నేర్చుకుంటూ భవిష్యత్తులో విదేశాలలో స్థిరపడాలి అని నాతో అనేవాడు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేవాడు. కానీ మేం కన్న అందమైన కలలు నా చేతుల నుంచి జారి పోయాయి' అని విధి నిర్వహణలో మృతి చెందిన పాత్రికేయుడు జమీరుద్దీన్ భార్య సాఫురా మనోవర్ బీబీసీతో చెప్పారు.
ఎన్‌టీవీ ప్రతినిధి అయిన జమీరుద్దీన్, జగిత్యాల అంతటా తిరుగుతూ వార్తలు సేకరిస్తూ ఉంటారు. జగిత్యాలలోని బోర్నపల్లిలో ఈ నెల 12న, 9 మంది పనివాళ్లు వరదలో చిక్కుకున్నారనే సమాచారంతో మొహ్మద్ ఇర్షాద్ అనే వ్యక్తితో కలిసి జమీరుద్దీన్ అక్కడికి వెళ్లారు. స్నేహితుని దగ్గర స్విఫ్ట్ కారు తీసుకొని లొకేషన్‌కు వెళ్లారు.
వార్త కవర్ చేసి, తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు వరద ప్రవాహం ఎక్కువై కారు కొట్టకుని పోయింది. స్థానికుల సాయంతో మొహ్మద్ ఇర్షాద్ కారు నుంచి బయటకు రాగా జమీరుద్దీన్ మాత్రం కారుతోపాటు కొట్టుకుని పోయారు.

కొద్ది రోజులుగా జమీరుద్దీన్ కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా రామోజీపేట్ భూపతిపూర్ రహదారి మీద, ఆయన మృతదేహం నేడు లభించింది. వారు తీసుకెళ్లిన కారు కూడా కొద్ది దూరంలోనే కనిపించింది.
నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు వరద నీటిలోకి జారిపోయిందని రాయికల్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్ తెలిపారు. శుక్రవారం వరదలు ఉన్న ప్రాంతం నుంచి వాహనం వెలికితీసినట్లు వెల్లడించారు. మృతదేహానికి అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించగా సాయంత్రం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

ఫొటో సోర్స్, UGC
'ఇది దురదృష్టకరమైన సంఘటన. గతంలో ఎన్నడూ ఎన్‌టీవీ బృందం విధి నిర్వహణలో ఇలా చనిపోలేదు. ఎన్‌టీవీ తరపున ఒక బృందాన్ని జమీర్ ఇంటికి పంపుతున్నాం. కుటుంబానికి ఆర్థికసాయంగా రూ.5 లక్షలు అందిస్తున్నాం' అని ఎన్‌టీవీ ఎడిటర్ శివప్రసాద్ బీబీసీతో అన్నారు.
అయితే ఆ రోజు ఎవరు త్వరగా మొదట వార్త పంపిస్తారో అన్న పోటీ కూడా ఉండిందని ఇతర ఛానల్ వారు బీబీసీ తో చెప్పారు .
జమీరుద్దీన్ స్వస్థలం జగిత్యాల జిల్లాలోని ఇస్లాంపూర్. ఇస్లామియా మసీదుకు కూతవేటు దూరంలో ఉండే అద్దె ఇంట్లో తన తల్లి తండ్రులు, భార్య ఇద్దరు పిల్లలతో జమీరుద్దీన్ నివసిస్తున్నారు. ఆయన భార్య ప్రస్తుతం రెండు నెలల గర్భవతి. నిరుపేద కుటుంబానికి చెందిన జమీర్ గతంలో దుబాయి వెళ్లి వచ్చాక ఇస్లాంపుర్‌లో అద్దెకు ఉంటున్నారు. తండ్రి నాసిరుద్దీన్ ఆర్‌టీసీలో పని చేసే వారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా జమీరుద్దీన్, ఎన్‌టీవీ జగిత్యాల రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. భార్య సాఫురాకు ఆరు నెలల క్రితమే మైనార్టీ కళాశాలలో కాంట్రాక్ట్ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు. పాప సిద్రా సదాఫ్‌కు సుమారు 3 ఏళ్లు. బాబు ఆజాన్ వయసు ఏడాది ఉంటుంది.

ఫొటో సోర్స్, UGC
చాలా చురుకుగా వీలైనంత త్వరగా వార్త అందించాలనే తపన జమీరుద్దీన్‌లో చాలా ఉండేదని తన తోటి జర్నలిస్టులు అన్నారు. 'ఏ వార్త అయినా త్వరగా ఇవ్వాలన్న తపన జమీర్‌లో ఎక్కువుగా ఉండేది. ఏదైనా ప్రెస్ మీట్ అవ్వగానే మేం ఇంకా సర్దుకుంటుండగానే తను న్యూస్ ఫైల్ చేసేవాడు. చాలా వేగంగా టైప్ చేస్తాడు' అని వారు చెప్పుకొచ్చారు.
జగిత్యాల నియోజకవర్గానికి ఎన్‌టీవీ ప్రతినిధిగా పని చేసే జమీర్ ఆ రోజు సంఘటనా స్థలం తనకు దగ్గర అవుతుందనే ఉద్దేశంతో వెళ్లాడని అక్కడి పాత్రికేయులు చెప్పారు. ఈ మధ్య గోదావరిపై బోర్నపల్లి అనే ఒక వంతెన అందుబాటులోకి వచ్చింది. బోర్నపల్లి నుంచి ఆ వంతెన దాటి వెళ్తే నేరుగా కడెం ప్రాజెక్ట్‌కు వెళ్లొచ్చని స్థానికులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, UGC
బోర్నపల్లి నుంచి నిర్మల్ వెళ్లే దారిలో ఉన్న కుర్రు అనే దీవి లాంటి ప్రాంతంలో కార్మికులు చిక్కుకున్నారన్న సమాచారంతో అక్కడకి జమీరుద్దీన్ వెళ్లారు.
'వెళ్లేటప్పుడు వేరే రూట్‌లో వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ దారిలో వరద నీరు ఎక్కువ ఉన్నందున షార్ట్ కట్ రూట్ తీసుకుని రామోజీ పేట్ రోడ్ కల్వర్టు మీదుగా వస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవింగ్ చేస్తున్న మొహమ్మద్ ఇర్షాద్, కారు కొట్టుకుపోతుండటంతో బయటకు రాగలిగాడు. కానీ జమీర్ రాలేక పోయాడు. కొద్ది సేపు ఆయన ముఖం కనిపించింది. ఆ తరువాత కారు కొట్టుకుపోయింది' అని స్థానికులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?
- గోదావరి 1986 నాటి స్థాయిలో పొంగితే ఏటిగట్లు నిలుస్తాయా
- ద్వారక: సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరం కోసం అన్వేషణ. దొరికిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి
- రంప తిరుగుబాటుకు, అల్లూరి కి సంబంధం ఉందా?మోదీ ఏమన్నారు, చరిత్ర ఏం చెబుతోంది?- బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్‌పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన పార్లమెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













