National Emblem: జాతీయ చిహ్నంలో సింహాలు క్రూరంగా కనపడేలా మార్చారా, ఆర్కిటెక్ట్ చెప్పిన విషయాలేంటి

ఫొటో సోర్స్, ANI
తాజాగా కొత్త పార్లమెంటు భవనంపై నాలుగు సింహాల విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అయితే, ఈ విగ్రహం రూపురేఖలపై వివాదం రాజుకొంది.
ఈ సింహాలు జాతీయ చిహ్నంలో అవసరమైన దాని కంటే చాలా ఆగ్రహంతో కనిపిస్తున్నాయని విమర్శకులు చెబుతున్నారు.
ఈ విగ్రహాన్ని తయారుచేసిన సునీల్ దేవ్డేతో బీబీసీ మాట్లాడింది.
‘‘ఈ విగ్రహంపై సంవత్సరం పాటు పూర్తి నిబద్ధతతో పనిచేశాను. అది చాలా చక్కగా వచ్చిందని నాకు అనిపిస్తోంది. జాతీయ చిహ్నాన్ని తయారుచేసే అవకాశం నాకు దక్కడంతో చాలా సంతోషంగా అనిపిస్తోంది. దీని కోసం నేను వంద శాతం శక్తి వంచన లేకుండా పనిచేశాను’’అని ఆయన తెలిపారు.

‘‘అచ్చం అలానే తయారు చేశాను’’
ప్రభుత్వ సూచనల మేరకు సింహాలు మరింత ఆగ్రహంతో కనిపించేలా మార్పులు చేశారనే ఆరోపణలపై సునీల్ మాట్లాడారు.
‘‘ఆ ఆరోపణల్లో అసలు నిజం లేదు. అశోక స్తంభంపై కనిపించే విగ్రహాన్ని అచ్చు గుద్దినట్లు అలానే తయారుచేశాం. ఆ విగ్రహంలోనూ సింహాల నోర్లు తెరిచే ఉంటాయి. దంతాలు కూడా కనిపిస్తాయి. మేం కూడా అచ్చం అలానే తయారుచేశాం’’అని ఆయన చెప్పారు.
‘‘ఈ విగ్రహం తయారీ పనులు మొదలుపెట్టి ఏడాదికిపైనే పూర్తయింది. మొదట మేం సారనాథ్ అశోక స్తంభంపై అధ్యయనం చేపట్టాం. దాని చరిత్ర కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత పనులు మొదలుపెట్టాం. మొదటగా ఔరంగాబాద్‌లో ఒక విగ్రహాన్ని రూపొందించాం’’అని ఆయన చెప్పారు.
సింహాలు ఆగ్రహంగా కనిపిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఫోటోలపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆ ఫోటోలను వేరే కోణంలో తీశారు’’అని ఆయన అన్నారు.
‘‘కింద నుంచి ఫోటోలు తీసినప్పుడు అలా కనిపిస్తాయి. మీరు సారనాథ్ అశోక స్తంభంపై చిహ్నాన్ని ఆ కోణంలో చూసినా అలానే కనిపిస్తుంది. దీనికి ఆధారమైన ఆ విగ్రహం మూడున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. దీన్ని పెద్దగా చేశాం తప్ప.. ఎలాంటి మార్పులూ చేయలేదు. మేం తయారుచేసిన విగ్రహాన్ని పైనుంచి చూస్తే, మీకు సింహాలు ప్రశాంతంగానే కనిపిస్తాయి’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, ANI

కొత్త పార్లమెంటు భవనంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జులై 11న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఆరున్నర మీటర్ల పొడవున్న ఈ భారీ విగ్రహంలో సింహాలు చాలా ఆగ్రహంతో కనిపిస్తున్నాయని వివాదం రాజుకుంది.
సింహాలు హుందాగా, ప్రశాంతంగా ఉండాలని.. కానీ ఇక్కడ మాత్రం విపరీతమైన కోపంగా ఉన్నాయని కొందరు వ్యాఖ్యానించారు.
అయితే, ఈ విమర్శలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.


ఫొటో సోర్స్, Getty Images
‘‘కళాకారులకు మతం, కులం ఉండవు’’
ఈ విగ్రహం విషయంలో వస్తున్న విమర్శలపై సునీల్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికీ ఒక్కో దృక్కోణం ఉంటుంది. కానీ, కళాకారుడికి మాత్రం మతం, కులాలతో సంబంధం లేదు. దీని కోసం నేను ఏడాది నుంచి కష్టపడ్డాను. ఈ విగ్రహం కాస్త పెద్దగా ఉండటంతోపాటు, కింద నుంచి చూడటం వల్ల అలా కనిపిస్తోంది’’అని ఆయన అన్నారు.
‘‘మిగతా వారు ఏం అనుకుంటున్నారో నాకు తెలియదు. మీరు చెప్పిన ప్రతి విమర్శకు నేను వివరంగా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించాను’’అని ఆయన వివరించారు.
‘‘సారనాథ్ అశోక స్తంభాన్ని ఎలా తయారుచేశారు? అని మేం నాలుగు నెలలు పరిశీలన చేశాం. ఆ విగ్రహాన్ని రాయితో తయారుచేశారు. అయితే, అది కాస్త దెబ్బతింది. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో ఐదారు మ్యూజియంలలో ఉన్నాయి. వాటిపై మేం అధ్యయనం చేపట్టాం. దీన్ని పెద్దగా ఎలా తయారుచేయాలనే కోణంలో మా అధ్యయనం సాగింది. ఆ తర్వాతే మేం తయారీ ప్రక్రియ మొదలుపెట్టాం’’అని ఆయన చెప్పారు.
వివాదంపై మీరు ఏం అనుకుంటున్నారు? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘నేను చేసిన పని విషయంలో చాలా సంతృప్తికరంగా ఉన్నాను. దీన్ని తయారుచేయడంలో మాకు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, మేం విజయవంతంగా పని పూర్తి చేశాం’’అని ఆయన అన్నారు.
విగ్రహాన్ని తయారుచేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన మంత్రిని గానీ, లేదా ఏదైనా ప్రతినిధిని గానీ మీరు కలిశారా? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘నాకు టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ నుంచి ప్రాజెక్టు వచ్చింది. నేను ఆర్కిటెక్ట్, డిజైనర్‌గా పనిచేశాను’’అని సునీల్ సమాధానం ఇచ్చారు.
ఈ విగ్రహాన్ని చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మేం కలిశాం. ఆయన మమ్మల్ని మెచ్చుకున్నారు’’అని సునీల్ చెప్పారు.
‘‘నేను విమర్శలు చేసేవారికి ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను. ఇది ఒక కళారూపం. దీని కోసం మా బృందం అంతా చాలా కష్టపడింది. అశోక స్తంభంపై కనిపించే చిహ్నంలో మేం ఎలాంటి మార్పులూ చేయలేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- గోదావరి వరదలు: జులై నెలలో ఈ స్థాయి వరద వందేళ్లలో ఇదే తొలిసారి , ముంపు గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
- రాణి రుద్రమ దేవి వారసుడు ఈయనేనా, ఇన్నాళ్లూ ఎక్కడున్నారు
- శ్రీలంక సంక్షోభం: దివాలా తీసిన దేశంలో ప్రతిరోజూ బతుకు గండమే శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసిందనే వదంతులు భారత్‌పై ఎందుకు వస్తున్నాయి
- ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- వైసీపీ పేరు మార్చడం సాధ్యమవుతుందా, గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














