బుల్డోజర్ పాలిటిక్స్: యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ దాడులపై ప్రజలు ఏమంటున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది రెండున్నర ఎకరాల మధ్య నిర్మించిన ఇల్లు. ఇప్పడు దాని పై కప్పులు కూలిపోయి కనిపిస్తున్నాయి. పిల్లల దుస్తులు , బూట్లు, కుర్చీలు, టేబుళ్లు దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. ఇంటి ముందు ఎస్‌యూవీల రేడియేటర్‌లు, స్టీరింగ్ వీల్, ఐరన్ బంపర్‌లు తుప్పుపట్టి కనిపించాయి.
ఆ ఇంటి కిచెన్ పై కూడా కప్పులేదు. అక్కడ పావురాలు గూళ్లు పెట్టుకున్నాయి. ఈ ఇల్లు ఎవరిదని అడిగితే, చుట్టుపక్కల వాళ్లు చనిపోయిన వికాస్ దూబేది అని చెబుతారు. కానీ, ఇక్కడ ఒక్క ఇటుకను కూడా తీయడానికి సాహసించరు.
ఈ ఇల్లు జూలై, 2020లో బుల్డోజర్ ఆగ్రహానికి గురైంది.
అంతకు ముందు, ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లా బిక్రు గ్రామంలో తమ ఇంటిపై దాడి చేయడానికి వచ్చిన 8 మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే, అతని సహచరులు చంపి పారిపోయారు.
ఒకవారం తర్వాత, మధ్యప్రదేశ్‌లో అరెస్టయిన తర్వాత వికాస్ దూబే, ఓ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. సంచలనం సృష్టించిన ఈ ఎన్‌కౌంటర్‌పై అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

బుల్డోజర్ 'పాపులారిటీ'
ఎన్నికల ర్యాలీలలో యోగి ఆదిత్యనాథ్ మద్దతుదారులు బొమ్మ బుల్డోజర్లను ప్రదర్శించేవారు. అప్పటి నుంచి బుల్డోజర్లు పాపులర్ కావడం ప్రారంభించాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వీటి వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీని వెనుక రాజకీయం ఉందని చాలామంది భావిస్తున్నారు.
2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. యోగి ఆదిత్యనాథ్‌కు అధికారాన్ని చేపట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేకు చెందిన కాంప్లెక్స్‌ను బుల్‌డోజర్ ద్వారా కూలగొట్టిన తర్వాత బుల్డోజర్‌కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం మొదలుపెట్టింది యోగి ప్రభుత్వం.
రాష్ట్రంలో హత్యలు, కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్తార్ అన్సారీ, అతీక్ అహ్మద్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులపై కూడా యోగీ ప్రభుత్వం బుల్డోజర్ తో చర్యలు తీసుకుంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బుల్డోజర్ వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు చేసింది. కానీ, బీజేపీ దాని ద్వారా కూడా లబ్ధి పొందేందుకు ప్రయత్నించింది. "నేరస్థులను అణిచివేసేందుకు బుల్డోజర్లను ఉపయోగిస్తాం'' అంటూ బీజేపీ ప్రతి ఎన్నికల ర్యాలీలో ప్రచారం చేయడం మొదలు పెట్టింది.
ఆక్రమణల తొలగింపు వ్యవహారం ఎన్నికల ప్రచారంలో భిన్నరూపం దాల్చింది. అయితే ఇలాంటివి ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా అన్న సందేహాలు కూడా వచ్చాయి.
యోగి ప్రభుత్వం బుల్‌డోజర్ల పేరుతో వాగ్దానాలు చేయడంతో పాటు చర్యలు కూడా కొనసాగిస్తోంది. వివిధ జిల్లాల్లో అక్రమ ఆక్రమణలను తొలగిస్తుండగా, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇళ్లు కూడా ఈ బుల్డోజర్ల కింద కూలిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
బాధితులు ఏమంటున్నారు?
అజంగఢ్ లోని గోధౌరా గ్రామంలో ఆక్రమణ అంటూ రామ్ నారాయణ్ అనే దళితుడి ఇంటిని కూల్చివేశారు. బీబీసీ ఆయన్ను కలిసింది. తనకు భూమి లేదని అంగీకరించిన రామ్ నారాయణ్, మాజీ గ్రామపెద్దలు చాలామంది ఇక్కడ ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పారు.
''దళితుల ఇల్లు పదే పదే కూల్చివేస్తున్నారు. మిగిలిన వారిని ముట్టుకోవడం లేదు. ఇక్కడ యాదవ్‌లు, ఇతర గ్రామ పెద్దలు చాలామంది ప్రభుత్వ భూములను ఆక్రమించారు. కానీ, వాళ్లనెవ్వరినీ ఖాళీ చేయించడం లేదు. 11 గంటలకు నోటీస్ ఇచ్చి, 12 గంటలకు కూల్చివేతలు చేపడుతున్నారు'' అని ఆయన అన్నారు.
2022 శాసనసభ ఎన్నికల ఫలితాల సమయంలో లఖ్‌నవూలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు డజన్ల కొద్దీ కార్యకర్తలు బుల్డోజర్ బొమ్మలు పట్టుకుని డాన్సులు చేశారు. అప్పటికి ఇంకా ఫలితాలు వెలువడ లేదు. ‘‘మా ప్రభుత్వం అభివృద్ధి చేయడమే కాదు..బుల్‌డోజర్లను కూడా ఉపయోగించడం ప్రారంభించింది' అని స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
ఎన్నికల్లో యోగీ విజయం సాధించినట్లు ప్రకటించిన తర్వాత అభిమానులు బుల్డోజర్ బొమ్మలను నెత్తి మీద పెట్టుకుని డాన్స్ చేశారు.

ఇతర రాష్ట్రాలలోనూ బుల్డోజర్ నినాదాలు
శాంతిభద్రతలను కాపాడిన ఘనతను బుల్‌డోజర్‌లకు ఆపాదించడం మొదలుపెట్టారు బీజేపీ కార్యకర్తలు, నేతలు. అంతేకాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఈ మోడల్‌ను అనుసరించడం మొదలైంది. బహుశా దీన్ని 'విన్నింగ్ ఫార్ములా' అని అక్కడి నేతలు భావించి ఉండవచ్చు.
మధ్యప్రదేశ్‌లో సాక్షి అనే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువకుడు ఆసిఫ్ ఇల్లును అధికారులు అక్రమ నిర్మాణమంటూ కూల్చేశారు.
‘‘గుండాయిజం చేసేవాళ్ల ఇళ్లు తుడిచిపెట్టుకు పోతాయి’’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిశివరాజ్ సింగ్ చౌహాన్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు.
'బుల్‌డోజర్ బాబా, బుల్‌డోజర్ మామా, బుల్‌డోజర్ జస్టిస్' వంటి మాటలు పాపులర్ అయ్యాయి.
యూపీలో బీజేపీ విజయం సాధించిన కొన్ని నెలల తర్వాత, ప్రవక్త మొహమ్మద్‌పై ఆ పార్టీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలో దేశంలోని అనేక ప్రాంతాలలో ముస్లిం వర్గానికి చెందిన వారు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొన్నిచోట్ల రాళ్లు రువ్వడంలాంటి ఘటనలు జరిగాయి.

అదే సమయంలో ప్రయాగ్‌రాజ్, సహరాన్‌పూర్, కాన్పూర్ వంటి జిల్లాల్లో అక్రమ నిర్మాణాలంటూ అధికారులు కొన్ని ఇళ్లను కూల్చేందుకు బుల్డోజర్‌లను పంపించారు. ''ఇవి చట్టవిరుద్ధమైన నిర్మాణాలని ఇంతకు ముందే నోటీసులు పంపాం'' అని అధికారులు చెప్పారు.
కాన్పూర్‌లోని స్వరూప్ నగర్ ఇలాంటి ఘటనలకు ఉదాహరణ. ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ను కూల్చివేశారు. ఈ భవనంలో అనేక కట్టడాలు అక్రమంగా నిర్మించారని నోటీసులలో పేర్కొన్నారు. ఈలోగా కాన్పూర్ పోలీసులు ఒక ప్రకటన చేశారు. ''ఈ భవనం యజమానికి నిరసనకారులతో సంబంధాలు ఉన్నాయి'' అన్నది ఆ ప్రకటన సారాంశం.
భవనం యజమానితో మాట్లాడటానికి నేను ప్రయత్నించగా, ''నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే స్థితిలో లేను'' అని ఆయన సమాధానం ఇచ్చారు.
అంతకు ఒక రోజు ముందు వరకు కూడా ఆయన నాతో మాట్లాడానికి సిద్ధమని ఫోన్‌లో చెప్పారు.
''నాకు నిరసనకారులు, హింసాకాండతో ఎటువంటి సంబంధం లేదు. నా భవనంలో అక్రమాల గురించి నాకు ఇంతకు ముందెప్పుడూ నోటీసులు రాలేదు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రభుత్వ చర్యలపై సందేహాలు.
నిరసన జరిగిన వెంటనే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సహజంగానే అనుమానాలు వ్యక్తమయ్యాయి. విమర్శలు కూడా వినిపించాయి. ''యూపీలో ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో నేరాలు పెరిగాయి" అని వారణాసిలో గాంధీ స్టడీ సెంటర్‌కు చెందిన మునిజా ఖాన్ అన్నారు.
ప్రస్తుతం బుల్‌డోజర్ రాజకీయాలు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని, ఒక వర్గాన్ని భయాందోళనకు గురిచేయాలనే లక్ష్యంతో కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ''ఎవరైనా ఏదైనా అంటే బుల్డోజర్ పంపిస్తారు. వాళ్ల దగ్గర అభ్యంతరకర సాహిత్యం, రచనలు, పుస్తకాలు దొరికాయని ఆరోపణలు చేస్తారు'' అని ఖాన్ విమర్శించారు.
మరోవైపు ప్రయాగ్‌రాజ్ హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జావేద్ మొహమ్మద్ ఇంటిని కూడా బుల్డోజర్‌తో కూల్చివేశారు. ఇది కూడా అక్రమ నిర్మాణమని ప్రభుత్వం పేర్కొంది.
యోగి ప్రభుత్వం చర్యలను ప్రశ్నిస్తూ, ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకోవాలంటూ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'నేరస్థులు/మాఫియా ముఠాలపై బుల్డోజర్ యాక్షన్ కొనసాగుతుంది' అని ట్వీట్ చేశారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలో చట్టపరమైన ప్రక్రియను ఎంతవరకు అనుసరించారనే ప్రశ్నలు తీవ్రమయ్యాయి.
"నేరుగా బుల్డోజర్ తీసుకొచ్చి కట్టడాలు కూల్చివేయడం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే" అని అలహాబాద్ హైకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయవాది రవికిరణ్ జైన్ అభిప్రాయపడ్డారు.
''అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలి. నోటీసులు ఇవ్వాలి. అప్పీలు చేసుకునే అవకాశం కల్పించాలి. అలా చేయకపోతే అది చట్టవిరుద్ధమైన చర్యగా పరిగణిస్తారు. క్రిమినల్ కేసులున్నంత మాత్రాన వారి ఇంటిని కూల్చివేయలేరు'' అని ఆయన అన్నారు.
అయితే, అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఎలాంటి వివక్ష లేకుండా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని యోగీ సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది.
''యోగీ జీ బుల్‌డోజర్ సక్సెస్ అయ్యింది. ఇది రాష్ట్రాన్ని వేధించే వారి కోసం మాత్రమే నడుస్తోంది. అల్లర్లకు పాల్పడే వారిని మాత్రమే బుల్డోజ్ చేస్తారు'' అని ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన సూర్యప్రతాప్‌సింగ్ అన్నారు.

అయితే, రాయ్‌బరేలీ జిల్లాలో డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ కుమార్ వంటి ట్రక్ డ్రైవర్లు దీనిపై విమర్శలు చేశారు. ''ఇదంతా పగ తప్ప మరేమీ కాదు. నిరసన తెలిపే వారి ఇంటిని కూల్చివేస్తారు'' అని విమర్శించారు. మీడియా కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుకుతోందని ఆయన ఆరోపించారు.
ఆక్రమణల తొలగింపు పేరుతో బుల్డోజర్లను మైనారిటీ వర్గం వైపు మళ్లించారని పలువురు నిపుణులు అంటున్నారు.
ఇటీవల దిల్లీలోని జహంగీర్‌పురిలో బుల్డోజర్‌లు వెళ్లిన ప్రాంతం అల్లర్లు పాల్పడే బృందాలకు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు నిలయమని బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
"2022 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కార్యకర్తలు బుల్డోజర్ల పై డాన్స్ చేశారు. మహిళలు పూజలు చేస్తున్నారు. మనం ఏ సంస్కృతి, ఏ దేశం, ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాము? ఇది రాజకీయంగా మైలేజ్ తీసుకోవడం'' అని సీనియర్ జర్నలిస్టు సుమన్ గుప్తా అన్నారు.
సహజంగానే బుల్‌డోజర్‌ల కారణంగా ప్రజలు చట్టాలను అనుసరించడం ప్రారంభించారని చెప్పిన యూపీ ప్రభుత్వం, ఇది సుపరిపాలనకు మోడల్ గా అభివర్ణించింది.
''ప్రభుత్వం చేస్తున్నది సరైనది. దోపిడి చేసే వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వానికి మద్దతివ్వాలి. ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాల్సిందే'' అని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ చౌధురి అన్నారు.
''బుల్డోజర్ తో కూల్చివేతలు మీ పని కాదు కదా. అది న్యాయవ్యవస్థ ఇవ్వాల్సిన ఆదేశం కదా'' అని నేను ప్రశ్నించాను.
"ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. నేర మనస్తత్వం ఉన్నవారు కొందరు ఇది తమ హక్కుగా భావిస్తుంటారు. రోడ్డు మీద స్పీడ్‌గా డ్రైవింగ్ చేసేవారు అందరికీ ఆదర్శంగా నిలవలేరు. అన్ని మతాల ప్రార్ధనాలయాల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించడంలాంటి మంచి పనులను ప్రభుత్వం చేసింది. దీన్ని ప్రజలంతా అంగీకరించారు'' అని సంజయ్ చౌధురి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్ అల్లర్లను NCERT పుస్తకాల నుంచి తొలగిస్తే చరిత్ర మారిపోతుందా?
- తీస్తా సెతల్వాద్: అహ్మదాబాద్‌కు తరలించిన ఏటీఎస్, అక్కడ ఆమె ఏమన్నారంటే...
- రష్యా నుంచి భారత్‌కు రావల్సిన ఆయుధాలు తగ్గిపోతున్నాయా... యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమ దేశాల ఆంక్షలే కారణమా?
- ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














