మహారాష్ట్ర సంక్షోభం: బీజేపీ హిందుత్వ విధానంతో ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వ పోటీపడలేకపోయిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్రలో శివసేన సర్కారు భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఈ రాజకీయ సంక్షోభ ప్రభావం జాతీయ ప్రతిపక్షాలపై ఎలా ఉంటుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మిగిలి ఉంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న జాతీయ ప్రతిపక్షం, మహావికాస్ అఘాడీ సంక్షోభంతో మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
సీఎస్‌డీఎస్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ దీని గురించి మాట్లాడారు. ''విపక్షం ఇప్పటికే నిస్తేజంగా ఉంది. 2024 ఎన్నికల్లో వారు గెలిచే అవకాశాలు లేవు. ఒకవేళ మీరు వచ్చే నెలలోనే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించినా... బీజేపీ భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ మరింత దీనావస్థలోకి వెళ్తుంది. విపక్షాలు రాన్రాను మరింత బలహీనపడుతున్నాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
''నేను చూస్తున్నదాని ప్రకారం బీజేపీ 350 సీట్లు, కాంగ్రెస్‌కు 30 లేదా 20 సీట్లు రావొచ్చు'' అని సంజయ్ కుమార్ అన్నారు.
అయితే, రెండేళ్లు అనేది సుదీర్ఘ సమయం అని ప్రశాంత్ కిశోర్ వంటి విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ప్రత్యామ్నాయ హిందుత్వాన్ని ఇవ్వడంలో ఠాక్రే విఫలమయ్యారా?
పుణేలోని హిందూ బిజినెస్ లైన్ సీనియర్ జర్నలిస్ట్ రాధేశ్యామ్ జాదవ్ ప్రకారం... ఉద్ధవ్ ఠాక్రేతో పాటు శివసేన అనుచరులు మహారాష్ట్రలో బీజేపీ హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ హిందుత్వను అందించడానికి ప్రయత్నించారు.
ఈ ప్రత్యామ్నాయ హిందుత్వ నమూనాను దేశంలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లగలమని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆశించాయి. కానీ, శివసేన ప్రభుత్వంలో తలెత్తిన తాజా సంక్షోభం ఈ ప్రయత్నాలకు అడ్డు కానుంది.
తమ హిందుత్వ విధానం ప్రజలందరినీ కలుపుకొని వెళ్తుందని ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో అన్నట్లు రాధేశ్యామ్ చెప్పారు.
మహారాష్ట్రలో హిందుత్వ రాజకీయాల చరిత్రపై రాధేశ్యామ్ మాట్లాడారు. ''హిందుత్వ రాజకీయాలను బాల్ ఠాక్రే ప్రారంభించారు. మహారాష్ట్రలో ముందుకు సాగాలంటే హిందుత్వ విధానానికి తామే ఏకైక గొంతుగా ఉండాలని బీజేపీ భావించింది. అందుకే శివసేన తమ్ముడి పాత్రను పోషించాలని బీజేపీ కోరుకుంది'' అని ఆయన చెప్పుకొచ్చారు.
''బీజేపీ కూటమి నుంచి తప్పుకోవాలని 2019లో ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించుకున్నారు. బీజేపీ హిందుత్వ విధానాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ హిందుత్వ విధానం అవసరమని కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ లాంటి పార్టీలు ఆశించాయి. ఈ ప్రయత్నాలకు తాజా సంక్షోభంతో ఎదురుదెబ్బ తగిలింది.''
''జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు హిందుత్వ గురించి మాట్లాడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. శివసేనకు సొంత వాళ్లే సవాళ్లు విసిరారని బీజేపీ తన అనుచరుల్లో నమ్మకాన్ని కలిగించింది. హిందుత్వ కారణంగా ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోవడం ఇదే తొలిసారి అని బీజేపీ వర్గాలు అంటున్నాయి'' అని రాధేశ్యామ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
హిందుత్వ, ఈడీ
ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుకు హిందుత్వను కాపాడటానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని రాధేశ్యామ్ చెప్పారు. అయితే, గువాహటిలో సమావేశమైన చాలామంది ఎమ్మెల్యేలు... తమ వ్యాపారాలు, సంస్థలు మొదలైన వాటి కోసమే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు.
''బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి, హిందుత్వకు ఏకైక గొంతుకగా ఆ పార్టీ మారేందుకు ఇదంతా జరుగుతోంది'' అని ఆయన చెప్పారు.
ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటులో బీజేపీ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా ప్రకారం... ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోతే, బీజేపీకి ప్రయోజనం కలుగుతుంది.
''ప్రజలంతా బీజేపీనే మళ్లీ గెలుస్తుందని, అధికారంలోకి వస్తుందని భావిస్తారు. ప్రతిపక్షాలకు పోరాడే సత్తా లేదని వారికి అనిపిస్తుంది. మరోవైపు బీజేపీ దేశంలోని ప్రతీ ప్రాంతానికి వెళ్లి ప్రజలు మళ్లీ మమ్మల్నే కోరుకుంటున్నారని చెబుతుంది'' అని ఆయన చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యతలేని విపక్షాలు
భారత్‌లోని 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అంటే దేశ విస్తీర్ణంలో 44 శాతం, జనాభాలో 50 శాతం బీజేపీ పాలనలో ఉంది.
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పునాదులు కదులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. బలహీనమైన, ఐక్యత లేని ప్రతిపక్షాలు ఉండటమే మోదీ అంత పేరు పొందడానికి ఒక కారణంగా చెబుతుంటారు.
బీజేపీపై కలిసికట్టుగా పోరాడటానికి బదులుగా, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే ధోరణిలో ప్రతిపక్షాలు ఉన్నాయని సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఇలాంటి పరిస్థితుల్లో, మహారాష్ట్రలో తలెత్తిన పరిణామాలు ప్రతిపక్షాలకు ఏమాత్రం మంచిది కాదు అని ఆయన అన్నారు.
సంజయ్ ఝా మాట్లాడుతూ ''ప్రతిపక్షంలో కాంగ్రెస్ కీలక పార్టీ. కాంగ్రెస్ బలహీనత ఇతర పార్టీలను కూడా ప్రభావితం చేసింది. ప్రతిపక్షాలను లూజర్స్‌గా చూస్తున్నారు'' అని అన్నారు.
బుల్డోజర్ సమస్యపై గానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు రాహుల్ గాంధీని గంటపాటు హాజరు పరచడంపై కేంద్ర సంస్థల దుర్వినియోగంపై ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
యశ్వంత్ సిన్హా పేరు ప్రకటన
రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించడంలో విపక్షాల వ్యూహం ఎలా ఉందో బయటపడింది.
విపక్షాల ఐక్యతను చాటిచెప్పేందుకు రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనను అవకాశంగా ఉపయోగించుకోవాలని భావిస్తే... ఏడాది లేదా ఆరు నెలల క్రితమే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించి ఉండాల్సిందని టీఎంసీకి చెందిన పవన్ వర్మ అన్నారు.
''ఇందుకోసం జాతీయ స్థాయిలో సమన్వయం చేసుకుంటూ నవీన్ పట్నాయక్, జగన్ రెడ్డి వంటి నేతలు సంప్రదింపులు జరిపి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాలి. అంతేగానీ, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సమావేశం నిర్వహించి చేతుల్లో ఉన్న డేటా ఆధారంగా అభ్యర్థిని ప్రకటించకూడదు. దీన్ని విపక్షాల ఐక్యతకు గుర్తుగా చూడకూడదు.
వేదికలపై చేయి చేయి కలిపి ప్రదర్శించే నకిలీ ఐక్యత దేశానికి అక్కర్లేదు... దేశానికి నిజంగా ఐక్యంగా ఉండే విపక్షాలు అవసరం'' అని పవన్ వర్మ అభిప్రాయపడ్డారు.
''యశ్వంత్ సిన్హాకు అనుభవం ఉంది. ఆయన నైపుణ్యం ఉన్న రాజకీయ నాయకుడు. కానీ, నా దృష్టిలో చాలా పార్టీలు ద్రౌపది ముర్ముకు కూడా మద్దతు ఇవ్వడానికి చాలా తార్కిక కారణాలు ఉన్నాయి. ఆమె ఒక గిరిజన వ్యక్తి. ఒక మహిళ, ఆమె సొంతంగా ఈ స్థాయికి ఎదిగారు'' అని వర్మ వ్యాఖ్యానించారు.
అలాంటి ఒక వ్యక్తిని బీజేపీ, రాష్ట్రపతి పదవి కోసం ప్రతిపాదించింది. దీనికి వ్యతిరేకంగా వెళ్లడం విపక్షాలకు అంత సులభం కాదు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
మహారాష్ట్ర, జాతీయ ప్రతిపక్షం
ఈ ఏడాది ముంబైలోని బీఎంసీతోపాటు ఇతర నగరాల్లో కూడా స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.
కొన్నేళ్లుగా బీఎంసీపై శివసేనకు పట్టు ఉంది. బీఎంసీ బడ్జెట్, శివసేన రాజకీయాలకు ఆయువుపట్టు అని నమ్ముతారు.
శివసేన ఒకవైపు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉంది. మరోవైపు తమ రాజకీయ భవిష్యత్ కోసం పోరాటం కూడా చేయాలి. ఈ రెండు సవాళ్లను శివసేన ఎదుర్కోవాల్సి ఉంది.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా శివసేనకు సహాయం చేయలేని పరిస్థితి ఉందని.. అందుకే దీన్ని శివసేన అంతర్గత వ్యవహారంగా ఆయన పేర్కొన్నారని అంటున్నారు.
తమ మధ్య సరైన సమన్వయం ఉండకపోతే, కష్టాలు చుట్టుముడతాయని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ వర్మ అన్నారు.
ఈ విషయాన్ని విపక్షాలు అర్థం చేసుకోకపోతే వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలు, బీజేపీకి అనుకూలంగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒకవేళ ఇప్పుడు శివసేన ముందున్న సవాళ్లను ఎదుర్కోవడంలో ఉద్ధవ్ ఠాక్రే విజయం సాధిస్తే, భవిష్యత్‌లో ఆ పార్టీ మరోసారి బలమైన స్థితికి చేరవచ్చు అని నకల్ వార్తాపత్రికకు చెందిన మృణాళిని నానివాడేకర్ అన్నారు.
ప్రస్తుతం శివసేన తన భవిష్యత్తు కోసం పోరాడుతున్న వేళ... దేశంలోని విపక్షాల కళ్లు దానిపైనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ ఈయూలో చేరేందుకు సిద్ధమవుతోందా... రష్యా ఊరుకుంటుందా?
- రావాల్సిన ఉద్యోగం 24 ఏళ్లు ఆలస్యం.. ఒకరు పాత బట్టలు అమ్ముకుంటున్నారు, ఇంకొకరు ఎమ్మెల్యే అయ్యారు
- ఎవరీ ఏక్‌నాథ్? ఒకప్పుడు ఆటో నడిపిన ఆయన ఇప్పుడు రాజకీయ కేంద్ర బిందువుగా ఎలా మారారు
- హిరుణిక ప్రేమచంద్ర: 'నా రొమ్ముల గురించి నేను గర్వపడుతున్నాను.. ముగ్గురు పిల్లలను పాలిచ్చి పెంచాను'
- ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించి విపక్షాలపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










