యుక్రెయిన్ ఈయూలో చేరేందుకు సిద్ధమవుతోందా... రష్యా ఊరుకుంటుందా?

ఫొటో సోర్స్, Getty Images
యూరోపియన్ యూనియన్(ఈయూ)లో అధికారికంగా సభ్యత్వం పొందేందుకు యుక్రెయిన్ సిద్ధం అవుతోంది.
యుక్రెయిన్ అభ్యర్థనపై జూన్ 23, 24 తేదీల్లో జరిగే సదస్సులో యూరోపియన్ యూనియన్ నాయకులు చర్చలు జరుపనున్నారు.
అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా దాడులను మరింత తీవ్రంచేసే ముప్పుందని యుక్రెయిన్ అధ్యక్షుడు హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Gertty Images
ఏమిటీ ఈయూ?
యూరోపియన్ యూనియన్.. 27 దేశాల ఆర్థిక, రాజకీయ కూటమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దీన్ని ఏర్పాటుచేశారు.
వస్తువులు, సేవలు, కరెన్సీ ఈ సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా అటూఇటూ మార్పిడి జరుగుతుంది. ఈ బ్లాక్‌లో ఈయూ పౌరులు ఎక్కడైనా జీవించొచ్చు. ఎక్కడైనా పనిచేసుకోవచ్చు.
ఇక్కడ యూరోపియన్ కరెన్సీ యూరో చెలామణీలో ఉంటుంది. దీన్ని 27 దేశాల్లోని 19 దేశాలకు చెందిన 34 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు.
ఆహార భద్రత, వ్యవసాయం, కార్మిక హక్కుల విషయంలో అన్ని దేశాలూ ఒకేలాంటి ప్రమాణాలు పాటిస్తాయి.
యూరోపియన్ యూనియన్‌లోని పేద దేశాలకు ఈయూ ఆర్థిక సాయం కూడా చేస్తుంటుంది.

ఫొటో సోర్స్, EPA
యుక్రెయిన్ ఎందుకు చేరాలని అనుకుంటోంది?
ఫిబ్రవరిలో రష్యా దాడి మొదలైన ఐదు రోజులకే యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలియెన్‌స్కీ దరఖాస్తు చేశారు.
వెంటనే తమకు సభ్యత్వం ఇవ్వాలని ఆయన కోరారు. కానీ, ఇది పూర్తయ్యేసరికి ఏళ్ల సమయం పట్టొచ్చు.
ఈయూలో చేరడం ద్వారా యుక్రెయిన్‌కు చాలా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కానీ, ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాల కోసం యుక్రెయిన్ ఈ కూటమిలో చేరడం లేదని బ్రసెల్స్‌లోని సెంటర్ ఫర్ యూరోపియన్ పాలసీ స్టడీస్‌కు చెందిన డాక్టర్ జెక్ పైకిన్ చెప్పారు.
''ఈయూ సభ్యత్వంతో యుక్రెయిన్ సార్వభౌమత్వానికి గుర్తింపు దక్కినట్లు అవుతుంది. ఇది ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమనే ముద్రను చెరిపేసుకోవాలని యుక్రెయిన్ భావిస్తోంది''అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
మిగతా దేశాలు ఎలా చేరాయి?
ఒక దేశంలో ఈయూ చేరాలని అర్జీ పెట్టుకున్నప్పుడు, మొదటగా ఈయూ సివిల్ సర్వీస్ విభాగం ఆ అభ్యర్థనను పరిశీలిస్తుంది.
ఇక్కడ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది? ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మానవ హక్కులకు పరిరక్షిస్తున్నారా? మార్కెట్ వ్యవస్థ ఎలా ఉంది? లాంటి అంశాలను పరిశీలిస్తారు.
ఒక దేశం ఈయూలో చేరాలంటే కూటమిలోని అన్ని సభ్య దేశాలూ అంగీకారం తెలపాలి.
అదే సమయంలో ఈయూ చట్టాలు, నిబంధనలన్నింటినీ అర్జీ పెట్టుకున్న దేశం కూడా అంగీకరించాలి. దీనికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది.
చివరగా ఈయూలో చేరుతున్నట్లు ధ్రువీకరించే ఒప్పందంపై సదరు దేశం సంతకం చేస్తుంది. దీనికి ఈయూ సభ్య దేశాలు కూడా విడివిడిగా ఆమోదం తెలుపుతాయి.

ఫొటో సోర్స్, UKRAINIAN PRESIDENTIAL PRESS SERVICE
ఎన్నేళ్ల సమయం పడుతుంది?
బల్గేరియా, రొమానియా, క్రొయేసియా లాంటి దేశాలకు పూర్తిగా ఈయూలో చేరేందుకు 10 నుంచి 12ఏళ్ల మధ్య సమయం పట్టింది.
అల్బేనియా, నార్త్ మాసిడోనియా, మాంటెనిగ్రో, సెర్బియాలు అధికారంగా ఈయూలో సభ్య దేశాలు. అయితే, ఇప్పటికీ కొన్ని ప్రక్రియలు పెండింగ్‌లో ఉన్నాయి.
టర్కీ కూడా 1999లో ఈయూలో చేరింది. అయితే, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణల నడుమ కొన్ని ప్రక్రియలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి.
యుక్రెయిన్‌కు పొరుగుతున్న మాల్డోవాతోపాటు జార్జియా కూడా సభ్యత్వం కూడా కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్లడం లేదు.
ఈయూలో యుక్రెయిన్‌లో చేరితే..
- ఈయూలో అతిపెద్ద భూభాగం కలిగిన దేశంగా యుక్రెయిన్ (603,550 చ.కి.మీ.) మారుతుంది. ఫ్రాన్స్ విదేశీ భూభాగాలను కలపలేదు.
- జనాభా పరంగా ఐదో అతిపెద్ద దేశం: 4.43 కోట్లు.
- యుక్రెయిన్ వార్షిక తలసరి జీడీపీ 3724 డాలర్లు (రూ. 2.91 లక్షలు). ఈయూ సగటులో ఇది తొమ్మిదో వంతు మాత్రమే.
- ఇప్పటికే యుక్రెయిన్ దిగుమతుల్లో 30 శాతం ఈయూకే వెళ్తున్నాయి.
ప్రస్తుత సంబంధాలు ఎలా ఉన్నాయి?
2017 నుంచి ఎలాంటి సుంకాలు చెల్లించకుండానే ఈయూ సభ్య దేశాలతో యుక్రెయిన్ వాణిజ్య లావాదేవీలు కొనసాగిస్తోంది. దీని కోసం అసోసియేషన్ అగ్రీమెంట్ కుదర్చుకుంది.
2016లో ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కూడా యుక్రెయిన్ కుదుర్చుకుంది.
ప్రస్తుతం పూర్తి సభ్యత్వం కోసం ఇప్పటికే తమ చట్టాల్లో చాలా వాటికి యుక్రెయిన్ మార్పులు చేసింది. యూరోపియన్ యూనియన్ ప్రమాణాలకు తగినట్లుగా మార్పులు చేసింది.

ఫొటో సోర్స్, EPA
యుక్రెయిన్ ఇంకా ఏం చేయొచ్చు?
యూరోపియన్ యూనియన్‌లో చేరే దిశగా ఇప్పటికే యుక్రెయిన్ చాలా చర్యలు తీసుకొందని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డే లెయెన్ చెప్పారు. అయితే, ఇంకా కొన్ని ప్రధాన సంస్కరణలు పెండింగ్ ఉన్నాయని అన్నారు.
పాలనా పరమైన సంస్కరణలతోపాటు మానవ హక్కుల పరిరక్షణ, ఓలిగార్క్‌ల ప్రభావాన్ని తగ్గించడం, అవినీతి నిర్మూలన తదితర సంస్కరణలను లెయెన్ ప్రస్తావించారు.
యుక్రెయిన్ పూర్తిస్థాయి మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు మారాల్సి ఉందని పరిశోధకుడు పైకిన్ కూడా అన్నారు. ఒకప్పటి సోవియట్ దేశానికి ఈ సంస్కరణలు కాస్త కష్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
తాజాగా చేరిన దేశాల సంగతేంటి?
యూరోపియన్ యూనియన్‌లో చేరిన 15ఏళ్లలో రొమానియా ఆర్థిక వ్యవస్థ మూడు రెట్లు పెరిగింది. బల్గేరియా ఆర్థిక వ్యవస్థ కూడా రెండింతలైంది.
ఈ రెండు దేశాలకు బిలియన్ల డాలర్లలో ఈయూ నిధులు అందించింది. కొత్త రోడ్ల నిర్మాణం, విమానాశ్రయాల ఏర్పాటుకు కూడా నిధులు సమకూర్చింది.
2014 నుంచి 2020 మధ్య బల్గేరియా మొత్తంగా 11.2 బిలియన్ల యూరోలు (రూ. 92189 కోట్లు), రొమానియాకు 35 బిలియన్ యూరోల (రూ.2,88,092 కోట్లు) సాయం అందింది.
అయితే అవినీతి వల్ల చాలా నిధులు వృథాగా పోయాయని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది.
వేతనాలు, ఆరోగ్యం, విద్య లాంటి రంగాల్లో ఈయూ దేశాల్లో ఇప్పటికీ బల్గేరియా అట్టడుగునే ఉంది. కానీ, రొమానియా మాత్రం రెండో పేద దేశం నుంచి ఆరో పేద దేశంగా మెరుగుపడింది.

ఫొటో సోర్స్, EPA
రష్యా స్పందన ఎలా ఉంటుంది?
ఎప్పటినుంచో యూరోపియన్ యూనియన్‌లో చేరాలనే యుక్రెయిన్ నిర్ణయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేకిస్తున్నారు.
యుక్రెయిన్ అభ్యర్థనను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు.
''మిలిటరీ, డిఫెన్స్, సెక్యూరిటీ తదితర అంశాలను మేం పరిశీలిస్తున్నాం''అని ఆయన అన్నారు.
అయితే, సరిహద్దుల వెంబడి రష్యా తన దాడులను మరింత ఉద్ధృతం చేయొచ్చని ఇప్పటికే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ హెచ్చరించారు.
''కచ్చితంగా రష్యా మరింత విద్వేషం వెళ్లగక్కుతుంది. యుక్రెయిన్‌పై మాత్రమే కాదు. యూరోపియన్ యూనియన్‌లోని అన్ని సభ్యదేశాలపైనా రష్యా విరుచుకుపడుతుంది''అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నూరేళ్ళు జీవించేందుకు ఫార్ములా ఉందా?
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













