గుజరాత్ అల్లర్లను NCERT పుస్తకాల నుంచి తొలగిస్తే చరిత్ర మారిపోతుందా?

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు

ఫొటో సోర్స్, ANDREW AITCHISON

    • రచయిత, రాక్సీ గగ్డేకర్ ఛారా
    • హోదా, బీబీసీ గుజరాతీ ప్రతినిధి

పన్నెండో తరగతిలో రాజకీయ శాస్త్రం (పొలిటికల్ సైన్స్) చదివే విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి ఏమీ కనిపించదు.

2002 ఫిబ్రవరి 27న అయోధ్య నుంచి వస్తోన్న సబర్మతీ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ ఎస్-6కు గోద్రా రైల్వే స్టేషన్‌లో నిప్పు అంటించారు. అందులోని 59 మంది కరసేవకులు చనిపోయారు. ఈ ఘటన తర్వాత గుజరాత్‌లో అల్లర్లు జరిగాయి.

ఎన్‌సీఈఆర్‌టీ పన్నెండో తరగతి రాజకీయ శాస్త్రం పుస్తకాల్లో తొమ్మిదో అధ్యాయంలో ఈ అల్లర్లకు సంబంధించిన పాఠం ఉంది.

మీడియా నివేదికల ప్రకారం, గుజరాత్ అల్లర్లే కాకుండా భారత్‌లో ఎమర్జెన్సీ అధ్యాయాన్ని కూడా పుస్తకాల నుంచి ఎన్‌సీఈఆర్‌టీ తొలగిస్తోంది.

పుస్తకాల్లో ఈ మార్పుల గురించి ఎన్‌సీఈఆర్‌టీ నుంచి సరైన సమాచారాన్ని పొందేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇంగ్లిష్ వార్తాపత్రిక 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో సహా చాలా మీడియా సంస్థలు, పుస్తకాల్లో ఈ మార్పులకు సంబంధించిన వార్తలను ప్రచురించాయి.

పాఠ్యాంశాలను మార్చడం, గుజరాత్ అల్లర్ల అధ్యాయాన్ని తొలగించడం గురించి 2002నాటి అల్లర్ల బాధితులు, విద్యావేత్తలు, చరిత్రకారులతో బీబీసీ గుజరాతీ మాట్లాడింది.

కానీ, అన్నింటికంటే ముందుగా, ఎన్‌సీఈఆర్‌టీ పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో గుజరాత్ అల్లర్ల గురించి ఇప్పటివరకు ఏమి బోధించారో తెలుసుకోవాలి?

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు

ఫొటో సోర్స్, CHRISTIAN ENDER

అధ్యాయంలో ఏం ఉంది? ఏం మార్చారు?

భారత రాజకీయాల్లోని ఇటీవలి పరిణామాల ఆధారంగా ఎన్‌సీఈఆర్‌టీ, పన్నెండో తరగతి పొలిటికల్ సైన్స్‌లో తొమ్మిదో అధ్యాయాన్ని రూపొందించింది.

ఈ అధ్యాయంలో 1990వ దశకం, ఆ తర్వాతి సంవత్సరాల్లో భారత రాజకీయాల గురించి వివరించారు.

బీజేపీ నేత ఎల్‌కే అధ్వానీ రథయాత్ర, మండల్ కమిషన్ వంటి అంశాలపై సమాచారం పొందుపరిచారు.

ఆ సమయంలోని సంకీర్ణ రాజకీయాల గురించి విస్తృతంగా వివరించారు. వీటితో పాటు గుజరాత్ అల్లర్ల విషయాలను కూడా అందులో పేర్కొన్నారు.

ఈ అధ్యాయంలో మతతత్వం, లౌకికత్వం, ప్రజాస్వామ్యం, దేశంలో హిందుత్వ రాజకీయాల ఆరంభం, అయోధ్య కేసు, బాబ్రీ మసీదు విధ్వంసం, గోద్రాలో సబర్మతీ ఎక్స్‌ప్రెస్ కోచ్ ఎస్-6 దహనం, మత అల్లర్లు మొదలైన అంశాలపై చర్చించారు.

విద్యార్థులు, ఈ అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఇంగ్లిష్ వార్తా పత్రికలు ప్రచురించిన హెడ్‌లైన్ల పేపర్ కటింగ్‌లను కూడా ఈ అధ్యాయంలో పొందుపరిచారు.

గుజరాత్‌కు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గురించి అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి చెప్పిన విషయాలను కూడా ఈ అధ్యాయంలో చేర్చారు.

ఇప్పుడు ఈ వివరాలన్నింటినీ ఈ ఏడాది పుస్తకాల నుంచి తొలగించారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో 2002 ఫిబ్రవరి 27న గోద్రా ఘటన జరిగింది. అయోధ్య నుంచి అహ్మదాబాద్‌కు వస్తోన్న సబర్మతీ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ ఎస్-6ను దహనం చేయడంతో 59 మంది కరసేవకులు చనిపోయారు. దీని తర్వాత గుజరాత్‌ వ్యాప్తంగా పెద్ద హింస చెలరేగింది.

ఈ ఘటన విషయంలో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: గుజరాత్ అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా?

2002 గుజరాత్ అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోయారని పార్లమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. 2500 మందికి గాయపడినట్లు, 223 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు తెలిపింది. వీటితో పాటు వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పింది.

గుజరాత్ అల్లర్లు సృష్టించిన భయానక వాతావరణం ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో అలాగే నిలిచిపోయింది. అల్లర్ల సమయంలో సహాయం కోసం చేతులు జోడించి ఏడుస్తోన్న ఒక వ్యక్తి ఫొటో, ప్రపంచం దృష్టిని గుజరాత్ హింస వైపు దృష్టి సారించేలా చేసింది. ఆ ఫొటో అహ్మదాబాద్‌కు చెందిన కుతుబుద్దీన్ అన్సారీ అనే వ్యక్తిది.

కుతుబుద్దీన్ అన్సారీతో బీబీసీ మాట్లాడింది. ''ఈ విషయాలను పుస్తకాల నుంచి తొలిగిస్తే ఏమవుతుంది? అన్ని వర్గాల ప్రజలు, 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి ఇంకా చాలా ఏళ్ల పాటు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే నాలాంటి ఎంతోమంది వ్యక్తులు ఈ అల్లర్ల కారణంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది'' అని అన్సారీ అన్నారు.

ఈ అల్లర్ల గురించి, ఆనాటి బాధ గురించి తెలుసుకోవాలనుకునే వారికి పుస్తకాలతో పనిలేదు అని ఆయన చెప్పారు.

అశోక్ మోచీ చెప్పుల షాపును ప్రారంభిస్తున్న కుతుబుద్దీన్ (ఫైల్ ఫొటో)
ఫొటో క్యాప్షన్, అశోక్ మోచీ (కుడివైపు నుంచి మొదటి వ్యక్తి) చెప్పుల షాపును ప్రారంభిస్తున్న కుతుబుద్దీన్ (ఫైల్ ఫొటో)

ప్రస్తుతం అన్సారీ, తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్‌లోనే ఉంటున్నారు. కమ్యూనల్ యూనిటీ కోసం తన హిందు మిత్రుడు అశోక్ మోచీతో కలిసి పనిచేస్తున్నారు.

గుజరాత్ అల్లర్ల సమాచారం ఒక తరం నుంచి మరొక తరానికి చేరుతూనే ఉంటుందని, పుస్తకాల్లో మార్పులు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అన్సారీ అభిప్రాయపడ్డారు.

2002 గుజరాత్ అల్లర్లలో అహ్మదాబాద్‌లోని నరోదా పాటియా ప్రాంతంలో భారీ మారణకాండ జరిగింది.

నరోదా పాటియా కేసులో విచారణ కోసం సుప్రీం కోర్టు సిట్‌ను నియమించింది. ఈ కేసులో సలీమ్ షేక్ అనే వ్యక్తి ప్రధాన సాక్షి. నాటి అల్లర్లలో సలీమ్ కుటుంబంలోని చాలా మందిని అల్లరి మూకలు చంపేశాయి.

''నరోదా పాటియా కేసులో ఎవరిపై మేం కేసు నమోదు చేశామో వారే ఇప్పుడు అధికారంలో ఉన్నారు'' అని బీబీసీ గుజరాతీతో సలీమ్ చెప్పారు.

''ఈ కేసులో అప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను తప్పుబట్టారు. ఇప్పుడు వారి వద్ద అన్ని అధికారులు ఉన్నాయి. వారు చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నరోదా పాటియా చరిత్రనే కాదు, వారు తాజ్‌మహల్ చరిత్రను కూడా మార్చాలని చూస్తున్నారు. కానీ, మేం ఏం చేయగలం?'' అని ఆయన అన్నారు.

అధికారిక లెక్కల ప్రకారం నరోదా పాటియా హింసాత్మక ఘటనల్లో 97 మంది చనిపోయారు. కానీ, సలీమ్ షేక్ మాత్రం వీరి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

గోద్రా అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వం భయపడుతోందా?

పాఠ్యాంశాల్లో మార్పుల గురించి స్పందించాల్సిందిగా బీబీసీ గుజరాతీ, ఎన్‌సీఈఆర్‌టీని సంప్రదించింది. ఈమెయిల్ కూడా చేసింది. కానీ, ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ, వార్తా పత్రిక 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో మాట్లాడుతూ... ''ఈ ప్రక్రియ అంతా నేను డైరెక్టర్‌గా రాకముందే జరిగిపోయింది. అందువల్ల నాకు వివరాలు తెలియవు'' అని అన్నారు. 2022 ఫిబ్రవరిలో సక్లానీ, డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

సక్లానీ కంటే ముందు ఎన్‌సీఈఆర్‌టీకి డైరెక్టర్‌గా ఉన్న శ్రీధర్ శ్రీవాస్తవ దీని గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడారు. '' ఇది ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయం. ఇప్పుడు ఇది అందరి నిర్ణయంగా మారింది'' అని అన్నారు.

''ఏదైనా ఘటన జరిగిన 30 ఏళ్ల తర్వాత, దాని సమాచారం అంతా ప్రభుత్వ పుస్తకాల ద్వారా ఓపెన్ సోర్స్‌లోకి వస్తుంది. గుజరాత్ అల్లర్ల గురించి ఇప్పుడే విద్యా సంస్థల్లో చర్చించకూడదనేది నా అభిప్రాయం. ఎందుకంటే దానికి సంబంధించిన సమాచారం ఓపెన్ సోర్స్ రూపంలో ఇంకా అందుబాటులో లేదు. ఏదైనా ఘటన జరిగిన 30 ఏళ్ల తర్వాతే దాన్ని చరిత్రగా బోధించాలి'' అని గుజరాత్ యూనివర్సిటీ చరిత్ర విభాగం చీఫ్ అరుణ్ వాఘోల్, బీబీసీతో అన్నారు.

గౌరంగ్ జానీ ఒక రిటైర్డ్ సోషియాలజీ ప్రొఫెసర్. గుజరాత్ అల్లర్లు సహా అనేక సామాజిక అంశాల గురించి ఆయన గతంలో విద్యార్థులకు బోధించారు.

వీడియో క్యాప్షన్, ఫ్రాన్స్ వర్సెస్ ముస్లిం దేశాలు.. అసలు ఈ వివాదం ఏంటి?

''2002 అల్లర్ల గురించి విద్యార్థులతో చర్చించడం ఉపాధ్యాయుల బాధ్యత. పుస్తకాల్లో ఈ అంశం లేనప్పటికీ ఉపాధ్యాయలు చర్చించాలి'' అని గౌరంగ్ జానీ అభిప్రాయపడ్డారు.

''గుజరాత్ అల్లర్లలో ప్రస్తుత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కోరుకుంటోన్న సెక్యులర్ ఇమేజ్‌కు ఈ అల్లర్లు, ఎన్‌సీఈఆర్‌టీ చాప్టర్లు అడ్డంకిగా ఉన్నాయి. కాబట్టి వాటిని తొలిగించాలని అనుకుంటున్నారు.

ఇది ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన విషయం. కానీ, గుజరాత్ పుస్తకాల్లో మాత్రం వీటికి సంబంధించిన సమాచారం ఎప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడు అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. కాబట్టి ఈ విషయాల గురించి విద్యార్థులకు తెలియజెప్పడంలో తప్పేమీ లేదు'' అని జానీ అన్నారు.

గుజరాత్ అల్లర్ల తరహాలోనే ఇకనుంచి 1975 ఎమర్జెన్సీ గురించి పాఠాల్లో ఉండబోదని, అయితే దీన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)