గుజరాత్‌లో ఈ పనులు నిషిద్ధం... బర్త్ డే పార్టీలలో జర భద్రం

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోనే తొలిసారిగా గుజరాత్‌లోని సూరత్ నగరంలో బహిరంగ ప్రదేశాల్లో రాత్రివేళ పుట్టినరోజు వేడుకలపై నిషేధం విధించారు. ఈ నిర్ణయంతో గుజరాత్‌లో నిషేధిత అంశాల జాబితా పెరిగింది.
తాజా నిషేధం విషయమై సూరత్ పోలీసు కమిషనర్ ఇటీవల ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. "బహిరంగ ప్రదేశాల్లో రాత్రి వేళ పుట్టినరోజు వేడుకల నిర్వహణను నిషేధిస్తున్నాం. ఇతరుల ముఖంపై కేక్ పూయడం, ఫోమ్ స్ప్రే వాడటం లాంటివి చేయరాదు. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు" అని అందులో స్పష్టం చేశారు.
స్థానిక పౌరులు ఇచ్చిన ఫిర్యాదులు, వివిధ ఘటనల గురించి సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ నిషేధాన్ని విధిస్తున్నట్లు నోటిఫికేషన్ పేర్కొంది. పుట్టినరోజు వేడుకల సందర్భంగా కొందరు వ్యక్తులు ఇతరులపై దౌర్జన్యానికి దిగి కొట్టిన సందర్భాలు ఉన్నాయని ప్రస్తావించింది. ఇలాంటి అవాంఛిత ఘటనలతో ఎవరికైనా ప్రాణహాని కలగొచ్చని, అందువల్లే ముందు జాగ్రత్తగా ఈ నిషేధాన్ని విధిస్తున్నట్లు వివరించింది.
రాష్ట్రంలో ఇప్పటికే పబ్‌జీ గేమ్, హుక్కా బార్లు, కొన్ని సినిమాలు, నాటకాలు, కొన్ని పుస్తకాలపై నిషేధం అమలవుతోంది.
మద్యంపై నిషేధం విధించిన తొలి రాష్ట్రం గుజరాతే.

ఫొటో సోర్స్, Getty Images
బొంబాయి రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నప్పుడు 1948 నుంచి 1950 వరకు గుజరాత్‌లో తొలిసారిగా మద్యనిషేధం అమలైంది. తర్వాత నిషేధాన్ని తొలగించారు.
1958లో మద్యనిషేధం మళ్లీ అమల్లోకి వచ్చింది. ఇది నేటికీ అమలవుతోంది. మహారాష్ట్ర నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా గుజరాత్‌లో మధ్య నిషేధం కొనసాగుతూ వస్తోంది.
మద్యనిషేధాన్ని మరింత కఠినతరం చేయాలంటూ 2016-17లో ఆందోళనలు జరిగాయి. మరింత కఠినమైన నిబంధనలతో 2017 మార్చిలో గుజరాత్ మద్య నిషేధం (సవరణ) చట్టం, 2017ను ప్రభుత్వం తీసుకొచ్చింది.
సవరించిన నిబంధనల ప్రకారం- ఎవరైనా మద్యం తయారుచేసినా, అమ్మినా, కొన్నా, పంపిణీ చేసినా పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా నిబంధనను మార్చి శిక్షను పెంచారు.
మద్యంతో పట్టుబడితే బెయిలు కూడా లభించదు. అది బెయిలుకు వీల్లేని నేరం.
బిహార్, మిజోరాం, లక్షదీవులు, నాగాలాండ్ రాష్ట్రాలు కూడా మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నాయి.
ప్రాథమిక పాఠశాలల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ పబ్‌జీ గేమ్‌ను గుజరాత్ ప్రాథమిక విద్యాశాఖ నిషేధించింది. ఈ నిర్ణయాన్ని తొలుత తీసుకుంది గుజరాత్‌లోనే. ప్రాథమిక విద్యాశాఖ నిర్ణయానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలు స్పందించారు. బహిరంగ ప్రదేశాల్లో ఈ గేమ్ ఆడటాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్లు జారీచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బహిరంగంగా ఈ గేమ్ ఆడుతున్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు కూడా. అయితే ఈ నోటిఫికేషన్ గడువు ముగిసిన తర్వాత దీనిని తిరిగి జారీచేయలేదు.
మోమో ఛాలెంజ్, బ్లూ వేల్ గేమ్స్ పైనా నిషేధం అమలైంది.
హుక్కా బార్లను గుజరాత్ 2016లో నిషేధించింది. పొగాకు నియంత్రణ చట్టం-2003ను సవరించి ఈ నిషేధాన్ని తీసుకొచ్చింది.
ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారెంట్ లేకుండానే అరెస్టు చేయొచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుట్కాపైన నిషేధం విధించారు.
అనేక సినిమాలు, నాటకాలపై నిషేధం
ఫనా, పద్మావత్ సహా అనేక సినిమాలపై గుజరాత్‌లో నిషేధం విధించారు. అవి ఎన్నడూ విడుదల కాలేదు.
2002 గుజరాత్ అల్లర్లు ప్రధానాంశంగా తెరకెక్కిన పర్జానియా, ఫిరాక్ చిత్రాలు కూడా విడుదలవలేదు.
చాలా నాటకాలపైనా రాష్ట్రంలో నిషేధం విధించారు. సామాజిక కార్యకర్త, థియేటర్ కళాకారుడు హిరేన్ గాంధీ స్పందిస్తూ- నాటకాలపై 'ప్రిసెన్షార్‌షిప్' అమలవుతోందని వ్యాఖ్యానించారు.
ప్రదర్శన కంటే ముందే నాటకం స్క్రిప్టుకు అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సెన్సార్ బోర్డు నుంచి అనుమతి, సర్టిఫికేట్ ఉంటేనే నాటక ప్రదర్శనకు వేదిక దొరుకుతుంది.
కొన్ని సినిమాల మాదిరే నాటకాలపైనా నేరుగా కాకుండా పరోక్షంగా నిషేధాన్ని అమలు చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్‌లో రెండు పుస్తకాలపైనా నిషేధం విధించారు.
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ రాసిన 'జిన్నా-ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్' పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2009లో నిషేధించింది. సర్దార్ పటేల్ గురించి చేసిన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో దీనిని నిషేధించారు.
జోసెఫ్ లెవీవెల్డ్ రాసిన 'గ్రేట్ సోల్: మహాత్మా గాంధీ అండ్ హిజ్ స్ట్రగుల్ విత్ ఇండియా' పుస్తకాన్ని 2011 మార్చిలో నిషేధించారు. గాంధీ 'బైసెక్సువల్' అనే ఆరోపణ ఈ పుస్తకంలో ఉంది.
నిషేధాన్ని గాంధీ మునిమనవడు వ్యతిరేకించారు.
లోగడ చంద్రకాంత బక్సి రాసిన సంక్షిప్త కథ 'కుట్టి'ని కూడా ప్రభుత్వం నిషేధించింది. అశ్లీలంగా ఉందనే ఆరోపణలో దీనిని నిషేధించారు.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
- అమెరికా: 'ఈ శిలువను బహిరంగ ప్రదేశం నుంచి తొలగించండి'
- ‘‘బీజేపీ, నరేంద్రమోదీల దగ్గర చాలా డబ్బు ఉంది.. మా దగ్గర నిజం ఉంది’’
- అమిత్ షా కోల్‌కతా రోడ్ షోలో ఘర్షణలకు బీజేపీ కార్యకర్త 'ప్రణాళిక' వెనుక నిజం
- భారత్, దక్షిణాసియా అమ్మాయిలపై ఆస్ట్రేలియాలో లైంగిక వేధింపులు
- మోదీ నిజంగానే మిరాజ్ విమానాలను మేఘాలతో పాక్ రాడార్ నుంచి కాపాడారా...
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- ‘‘వాటికన్ ఒక గే సంస్థ’’: క్రైస్తవ పూజారుల ‘రహస్య జీవితాలు బట్టబయలు చేసిన’ జర్నలిస్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








