రవీష్ కుమార్‌కు రామన్ మెగసెసె అవార్డు

ఫొటో సోర్స్, NDTV
ఎన్డీటీవీ సీనియర్ జర్నలిస్ట్ రవీష్ కుమార్‌కు 2019 రామన్ మెగసెసె పురస్కారం లభించింది. ఆసియాలోని సాహసికులకు, పరివర్తనను తెచ్చే నేతృత్వానికి ఈ పురస్కారం ప్రకటిస్తారు.
రామన్ మెగసెసె అవార్డు విజేతలుగా ప్రకటించిన ఐదుగురిలో రవీష్ కుమార్ ఒకరుగా నిలిచారు.
రవీష్ కుమార్ జర్నలిజం ద్వారా తన గళాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చారని అవార్డు ప్రకటించిన రామన్ మెగసెసె ఫౌండేషన్ చెప్పింది. ప్రజల గొంతుక అయినప్పుడే మీరు పాత్రికేయులు అవుతారని రామన్ మెగసెసె సంస్థ చెబుతుంది.
హిందీ న్యూస్ చానల్ ఎన్డీటీవీ ఇండియాలో రవీష్ కుమార్ ప్రముఖ యాంకర్. రవీష్‌తోపాటు మయన్మార్‌కు చెందిన కో స్వే విన్, థాయిలాండ్‌లోని అంగ్‌ఖానా నీలాపాయిజిత్, ఫిలిప్పీన్స్‌లోని రెముండో పుజాంతే, దక్షిణాఫ్రికాకు చెందిన కిమ్ జోంగ్-కికు 2019 ఈ అవార్డు ప్రకటించారు.

ఫొటో సోర్స్, @MAGSAYSAYAWARD
నిజాయతీ జర్నలిజానికి గౌరవం
రవీష్ కుమార్ జర్నలిజం ఉన్నతస్థాయి, సత్యనిష్ట, నిజాయితీ, నిష్పక్షపాతంతో ఉంటుందని రామన్ మెగసెసె అవార్డు ఫౌండేషన్ ప్రశంసించింది. ఆయన ప్రజల గొంతుకగా నిలిచారని చెప్పింది.
ఇంతకు ముందు మెరుగైన జర్నలిజంలో పి. సాయినాథ్‌కు కూడా మెగసెసె అవార్డు లభించింది. వీరితోపాటు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అరుణా రాయ్, సంజీవ్ చతుర్వేది సహా ఎంతో మంది భారతీయులు ఈ పురస్కారం అందుకున్నారు.
రామన్ మెగసెసె పురస్కారాన్ని ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సమ్మతితో న్యూయార్క్‌లోని రాకీఫెల్లెర్ బ్రదర్స్ ఫండ్ ట్రస్టీలు 1957 ఏప్రిల్‌లో ప్రారంభించారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వతంత్రం సాధించిన ఫిలిప్పీన్స్‌కు అధ్యక్షుడైన రామన్ మెగసెసె పేరును ఈ పురస్కారానికి పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
రామన్ మెగసెసె ఎవరు?
రామన్ డెల్ ఫియెర్రో మెగసెసె ఒక ఫిలిప్పినో రాజకీయవేత్త, ఆయన 1953 డిసెంబర్ 30 నుంచి విమాన ప్రమాదంలో మరణించేవరకూ ఫిలిప్పీన్స్ ఏడో అధ్యక్షుడుగా పనిచేశారు.
కమ్యునిస్టుల హుక్బలహాప్(హెచ్‌యుకే) ఉద్యమాన్ని ఓడించడంలో ఆయన విజయం సాధించారని అందరూ చెప్పుకుంటారు.
ఒక శిల్పి కొడుకైన మెగసెసె, లూజాన్ ద్వీపంలోని ఇబా పట్టణంలో స్కూల్ టీచరుగా పనిచేశారు. ఫిలిప్పీన్ రాజకీయ నాయకుల్లో ఎక్కువమంది స్పానిష్ సంతతివారైతే, మెగసెసె మాత్రం ఆ దేశంలో సామాన్యుల్లాగే ఒక మలై.
టీచరుగా పనిచేస్తూనే ఆయన 1933లో డిగ్రీ చేశారు. మనీలా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో లూజాన్ గెరిల్లా నేతగా పనిచేసిన తర్వాత, అమెరికా ఫిలిప్పీన్స్‌ను తిరిగి ఆక్రమించిన సమయంలో ఆయన్ను తన సొంత ప్రావిన్సు జాంబలీస్‌కు మిలటరీ గవర్నర్‌గా నియమించారు.
హుక్స్ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోడానికి అధ్యక్షుడు ఎల్పిడో క్విరినో మెగెసెసెను రక్షణ మంత్రిగా చేశారు. తర్వాత మెగసెసె 1953 వరకూ ఆధునిక చరిత్రలో అత్యంత విజయవంతమైన గెరిల్లా వ్యతిరేక ఆపరేషన్లలో ఒకటిగా నిలిచిపోయిన చర్యలను చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
గెరిల్లా ఆపరేషన్లపై విజయం
హుక్స్‌కు సాయం చేయకుండా రైతులకు భూములు, వ్యవసాయ పరికరాలు ఇచ్చిన మెగసెసె ప్రజలను తమవైపు తిప్పుకుని, ప్రభుత్వ పక్షాన నిలిచేలా చేశారు. సైన్యం ప్రజలను గౌరవించేలా చేశారు.
ఆర్మీలో అవినీతి, అసమర్థ అధికారులను తొలగించి, గెరిల్లాలపై ఆపరేషన్లలో వేగాన్ని పెంచి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 1953 నాటికి హుక్స్ వల్ల ఏ ప్రమాదం లేదనే పరిస్థితిని తీసుకొచ్చారు. కానీ మెగసెసె విప్లవాత్మక చర్యలు ప్రభుత్వంలోనే అతడికి చాలా మందిని శత్రువులయ్యేలా చేశాయి. క్విరినో పాలనపై అవినీతి, అసమర్థ ఆరోపణలు చేసినప్పుడు, ఆయన తన పదవికి బలవంతంగా రాజీనామా చేయాల్సివచ్చింది.
1953 అధ్యక్ష ఎన్నికల్లో క్విరినోకు పోటీగా నేసినాలిస్టా పార్టీ మద్దతు పొందిన మెగసెసె, మూడో పార్టీ ఏర్పాటు చేసిన కార్లోస్ పి.రొములో మద్దతు కూడా గెలుచుకున్నారు.
ఫిలిప్పీన్ ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలలో సంస్కరణలు తీసుకొస్తానని మెగెసెసె హామీ ఇచ్చారు. కానీ కన్జర్వేటివ్ కాంగ్రెస్ సంపన్నులకు అనుకూలంగా ఉండండతో ఆయన విసిగిపోయారు. కాంగ్రెస్‌లో భూసంస్కరణ బిల్లును పాస్ చేయించలేకపోయారు. హుక్స్‌కు వ్యతిరేకంగా ప్రజల మద్దతు పొందేందుకు ఆయన హామీ ఇచ్చిన పనుల్లో ఎక్కువ నెరవేర్చలేకపోయారు. అయినా చివరి వరకూ నిజాయితీగా నిలిచిన ఒక ప్రముఖ నేతగా నిలిచిపోయారు.
మెగసెసె విదేశాంగ విధానంలో అమెరికాకు సన్నిహిత మిత్రుడుగా నిలిచారు. కోల్డ్ వార్ సమయంలో కమ్యూనిజానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 1954 సెప్టెంబర్ 8న మనీలాలో ఏర్పాటైన ఆగ్నేయాసియా ఒప్పంద సంస్థలో ఫిలిప్పీన్స్‌ను సభ్య దేశంగా చేర్చారు. అధ్యక్షుడుగా తన పదవీకాలం పూర్తికాకముందే ఒక విమాన ప్రమాదంలో మరణించారు.
ఇవి కూడా చదవండి:
- రబ్బర్ పరిశ్రమ... భయంకర రక్తచరిత్ర
- చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
- కార్గిల్ యుద్ధం: "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"
- కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్లోని ఫొటోల్లో నిజమెంత
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- ఆపరేషన్ కమల్: కర్ణాటకలో ముగిసింది, తర్వాత టార్గెట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








