Indian Rupee: డాలరుతో రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి రూ. 80 కి పతనం... కారణాలు ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫైజల్ మొహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రూపాయి విలువ పడిపోతూనే ఉంది. గత వారాంతంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 79.79కి పడిపోయింది. మంగళవారం నాడు చరిత్రలో తొలిసారిగా 80 రూపాయలు దాటి దిగజారింది.
డాలరుతో రూపాయి మారకం విలువ పతనం అవుతుండటంతో ప్రతిపక్షాలు, ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు నిరంతరం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశ్నలు సంధించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ట్విటర్‌లో ఒక గ్రాఫ్‌ను షేర్ చేస్తూ, ప్రధాని గతంలో చేసిన ఒక ప్రకటనను రాహుల్ గాంధీ గుర్తు చేశారు. నరేంద్ర మోదీ, గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రకటన చేశారు.
''దేశం నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది'' అనే వ్యాఖ్యను జోడించిన రాహుల్ గాంధీ, ఇది మీరు మాట్లాడిన మాటే కదా ప్రధానమంత్రి జీ అని అన్నారు. ఆ కాలంలో మీరెంతో హడావిడి చేసేవారు. ఇప్పుడు రూపాయి ఇంతగా క్షీణిస్తున్నప్పటికీ మీరు నిశ్శబ్ధంగా ఉన్నారు అని రాహుల్ గాంధీ విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆ సమయంలో నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాంగ్రెస్ అధికార పరతినిధి సుప్రియా శ్రీనెత్ కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ''రూపాయి బలహీనపడటానికి అతిపెద్ద కారణం ఆర్థిక వ్యవస్థ పతనం, అదుపులేని ద్రవ్యోల్బణం అనే అంశాలను మీరు అంగీకరించాలి'' అని ఆమె అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ప్రభుత్వం కూడా రూపాయి పరిస్థితిని గమనిస్తున్నట్లే ఉంది. రెండు వారాల క్రితం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ''రూపాయిపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించిందని, మారకం రేటు విషయంలో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకుతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, ఇలా ఎందుకు జరుగుతోంది? డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? రూపాయి రేటును ఏ అంశాలు నిర్ధారిస్తాయి?
ఇప్పుడు మీకు ఒక డాలర్‌ను కొనాలనుకుంటే బదులుగా మీరు 80 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో ఎక్స్‌చేంజ్ రేట్ (మార్పిడి రేటు) అంటారు.
రూపీ-డాలర్ మాత్రమే కాకుండా ఇతర కరెన్సీల మధ్య కూడా ఇలాంటి క్రయవిక్రయాలు జరుగుతుంటాయి.
ప్రపంచంలోని వివిధ దేశాలకు వారి సొంత కరెన్సీ ఉంటుంది. బ్రిటన్ కరెన్సీని పౌండ్ అని, మలేసియా కరెన్సీని రింగిట్ అని ఇలా కరెన్సీలను వివిధ పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు ఎవరైనా బ్రిటన్ నుంచి ఏదైనా కొనాలనుకున్నా లేదా వ్యాపారం చేయాలనుకున్నా లేదా అక్కడికి ప్రయాణం చేయాలన్నా వారికి బ్రిటన్ కరెన్సీ పౌండ్లు అవసరం. కాబట్టి వారు పౌండ్లు కొనుగోలు చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
కరెన్సీ విలువను ఎలా నిర్ణయిస్తారు?
కరెన్సీ క్రయవిక్రయాలు జరిగే చోటును ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ లేదా మనీ మార్కెట్ అంటారు.
ఎక్స్‌చేంజ్ రేట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది మారుతూ ఉంటుంది. ఇది తక్కువ కావొచ్చు లేదా ఎక్కువ కావొచ్చు. కరెన్సీ డిమాండ్, సరఫరాపై ఇది ఆధారపడి ఉంటుంది.
కరెన్సీకి ఎంత ఎక్కువ డిమాండ్ ఉంటే, దాని విలువ అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలోని అధిక భాగం వ్యాపారం కోసం అమెరికన్ కరెన్సీ 'డాలర్'ను ఉపయోగిస్తున్నందున, మనీ మార్కెట్‌లో డాలర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
రిజర్వ్ బ్యాంకు దగ్గర ప్రత్యామ్నాయాలు?
ఉదాహరణకు ఒక వ్యక్తి న్యూయార్క్ (అమెరికా) నుంచి దిల్లీ వచ్చారు. ఆ వ్యక్తి డాలర్లను అమ్మాలని అనుకుంటే, బ్యాంకుకు వెళ్లి డాలర్లను రూపాయలుగా మార్చుకుంటారు.
అంటే బ్యాంక్ అనేది ఒక చిన్న మనీ మార్కెట్ యూనిట్. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బ్యాంకులు ఉన్నాయి. దీనితో పాటు కరెన్సీని అమ్మడానికి, కొనుగోలు చేయడానికి ట్రేడర్లకు ప్రభుత్వం లైసెన్స్‌లు జారీ చేస్తుంది. వీరంతా మనీ మార్కెట్‌లో భాగమే.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వంటి కేంద్ర బ్యాంకులు, తమ వద్ద విదేశీ మారక నిల్వలను ఉంచుకుంటాయి.
అయితే, 1993 నుంచి మనీ మార్కెట్, ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు వచ్చింది. మార్కెట్‌లోని డిమాండ్-సరఫరాపై కరెన్సీ విలువ ఆధారపడి ఉంటుంది. కానీ, కేంద్ర బ్యాంకులు తరచుగా మనీ మార్కెట్‌లో జోక్యం చేసుకుంటాయి.
ఒకవేళ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్‌లో డాలర్ ఖరీదు బాగా పెరిగితే, ఆర్‌బీఐ మనీ మార్కెట్‌లో డాలర్లను అమ్మడం ద్వారా అవసరమైతే కొనుగోలు చేయడం ద్వారా రూపాయి విలువను సమతుల్యం చేస్తుంది.
ప్రభావం
భారత్ లాంటి దేశాల్లో క్రూడాయిల్, గ్యాస్ వంటి నిత్యావసర వస్తువులు భారీ స్థాయిలో విదేశాల నుంచి దిగుమతి అవుతాయి.
ఇవే కాకుండా ఎలక్ట్రానిక్స్, మిలిటరీ ఉపకరణాల ఒప్పందాలు కూడా ఎక్కువగా అమెరికన్ కరెన్సీలో జరుగుతాయి. కాబట్టి, భారత్‌కు డాలర్ల అవసరం ఎప్పుడూ ఉంటుంది.
ఈ వస్తువులకు డిమాండ్ మరింత పెరిగితే, అంతర్జాతీయ మార్కెట్‌లో వాటి విలువ పెరుగుతుంది. వాటి దిగుమతి కోసం భారత్ మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. దీని కారణంగానే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. పరిశ్రమల్లో ఖరీదైన చమురు, గ్యాస్‌లను వాడతారు.

ఫొటో సోర్స్, NOAH SEELAM/GETTY IMAGES
డాలర్ ఖరీదు ఎందుకు పెరుగుతుంది?
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చాలా బలహీనపడిందనే మాట గత కొంతకాలంగా నిరంతరం వినిపిస్తూనే ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా ఎకానమీ మందగించిన తర్వాత రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. పశ్చిమ దేశఆలు, రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. చాలా దేశాలు, రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం ఆపేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది అమెరికా, యూరప్‌లను కూడా ప్రభావితం చేసింది.
యుద్ధం కారణంగా ఆహార పదార్థాలు, వంటనూనె తదితర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అమెరికా, యూరప్‌లు అత్యధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఫొటో సోర్స్, DEBARCHAN CHATTERJEE/NURPHOTO VIA GETTY IMAGES
ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి సాధారణ పౌరులను రక్షించేందుకు, దాని ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్, వడ్డీ రేట్లను పెంచింది. దీంతో అక్కడి ప్రభుత్వ బాండ్లపై వడ్డీ మరింత పెరిగింది. వడ్డీ రేటు పెరగడం వల్ల వ్యాపారం, పరిశ్రమల కోసం తీసుకున్న అప్పుకు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
భారత్‌లో కూడా ద్రవ్యోల్బణం పెరిగింది. ఫలితంగా విదేశీ పెట్టుబడిదారులు, ముఖ్యంగా విదేశీ కంపెనీలు, వ్యక్తులు భారత్‌లోని పెట్టుబడులను వెనక్కి తీసుకొని వాటిని అమెరికాకు తరలిస్తున్నారు. అమెరికాలో తమ డబ్బు మరింత సురక్షితంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.
గత కొన్ని నెలల కాలంలోనే భారత్ నుంచి మిలియన్ల డాలర్ల పెట్టబడులను ఉపసంహరించుకున్నారు. దీని కారణంగానే మనీ మార్కెట్‌లో డాలర్ల సరఫరా కొరత ఏర్పడింది.
రాబోయే రోజుల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్, వడ్డీ రేట్లను మరింతగా పెంచుతుందని చెబుతున్నారు. అంటే, మీరు ఒక డాలరుకు ఇప్పుడు చెల్లించే దాని కంటే ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి రావొచ్చు.
ఇవి కూడా చదవండి:
- నుస్రత్ మీర్జా మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని ఎలా కలిశారు, బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు?
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- వరద తగ్గుతున్నా, ఇంకా భయం భయం... ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి?
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- ‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














