‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్‌నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్

ఫొటో సోర్స్, WEDLOCK_PHOTOGRAPHY_ASSAM
ప్రేమజంటలు పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం, జీవితంలో తాము ఎలా ఉండాలో ఒకరికొకరు అంగీకారానికి రావడం మామూలు విషయమే. సర్వసాధారణంగా ఇలాంటి విషయాలు సీరియస్ అంశాల మీద ఉంటాయి.
కానీ, ఇటీవల ఇండియాలో జరిగిన ఓ పెళ్లిలో భార్యభర్తలు మధ్య జరిగిన ఓ ఒప్పందం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎందుకంటే ఇందులో ఉన్న కంటెంట్ చాలా భిన్నంగా ఉంది. అందుకే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కొత్త దంపతులు తాము చేయాల్సిన పనులు, చేయకూడని పనులను ఒక కాంట్రాక్ట్ రూపంలో స్నేహితులు వారి ముందు పెట్టారు. వారిద్దరూ సంతకాలు చేశారు. కాకపోతే, ఇది సరదాగా చేసుకున్న ఒప్పందం కాబట్టి దీనికి చట్ట బద్ధత లేదు.
పెళ్లి మరుసటి రోజు, అంటే జూన్ 22న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో అప్‌లోడ్ అయ్యింది. వధువు, వరుడు కాగితంపై సంతకం చేస్తున్న 16 సెకన్ల వీడియో 4.5 కోట్ల వ్యూస్ సంపాదించింది.
గతంలో కూడా వధూవరులు ఫ్రెండ్స్ ముందు ఒప్పందాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. కానీ, ఈ వీడియోను ప్రత్యేకంగా నిలబెడుతోంది మాత్రం అందులో రాసిన ఓ కండీషన్. "వధువు నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి" అన్నది ఆ కండీషన్లలో అందరినీ ఆకట్టుకుంటోంది.
వధూవరులు స్నేహితులు రూపొందించిన ఈ కండిషన్, 24 ఏళ్ల వధువు శాంతి ప్రసాద్ టార్గెట్ చేసుకుని పెట్టింది. ఆమెను స్నేహితులు పిజ్జాఫ్రీక్ (పిజ్జా పిచ్చిది) అని సరదాగా పిలుస్తుంటారు. ఆమె కాలేజ్ ఫ్రెండ్ పాతికేళ్ల మింటూ రాయ్ ఆమెను అస్సాంలోని గువాహటీలో ఒక సంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, WEDLOCK_PHOTOGRAPHY_ASSAM
ఈ జంట గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా పరిచయమయ్యారు.
కాలక్రమంలో వారి మధ్య ప్రేమ వికసించింది. 2018లో వారిద్దరూ మొదటిసారి ఒక రెస్టారెంట్ లో కలుసుకున్నారు. ''కాలేజీలో చివరి పీరియడ్ కు వెళ్లకుండా పిజ్జా అవుట్‌లెట్ కు వెళ్లాం. ఆమె అంతకు ముందు చాలాసార్లు పిజ్జా గురించి మాట్లాడింది. అందుకే ఆమెను పిజ్జా రెస్టారెంట్ కు తీసుకెళ్లా'' అని మింటూ రాయ్ వెల్లడించారు.
"నాకు పిజ్జాలు అంటే చాలా ఇష్టం. మొదదటిసారి బయటకు వెళ్లినప్పుడు పిజ్జా తిందాం అని చెబుతుండేదానిని'' అని శాంతి ప్రసాద్ అన్నారు.
''మింటూ కు కూడా పిజ్జాలు ఇష్టమే. కానీ, ప్రతి రోజూ తినలేనని చెప్పారు'' అన్నారు శాంతి ప్రసాద్.
''ఇంకా ఎన్ని పిజ్జాలు తింటావు, మరేదైనా తీసుకుందామా అని ఆ రోజు మింటూ అడిగారు'' అని ఆమె వెల్లడించారు.
అయితే, ఈ జంట తాము ఫుడ్ విషయంలో ఎప్పుడూ గొడవ పడలేదని చెప్పారు. అయితే, తన పిజ్జా ప్రియత్వం కారణంగా తాను కూడా ప్రతిసారి మింటూ పిజ్జా తినాల్సి వచ్చేది. ఆ విషయంలో మింటూ చిరాకు పడేవాడు. మా స్నేహితులకు నా మీద కంప్లైంట్ చేసేవాడు. మా ఫ్రెండ్స్ మా మీద జోకులేసేవారు'' అన్నారు శాంతి ప్రసాద్.
''ఆమెకు పిజ్జా మీద ప్రేమ ఉన్నా, అది మింటూ తర్వాతనే. కాకపోతే, ఆమె తాను ఖాళీగా ఉన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా పిజ్జా గురించే ఆలోచిస్తుందని అనుకుంటున్నాను'' అని ఆ జంటకు క్లాస్‌మేట్ అయిన రాఘవ్ ఠాకూర్ అన్నారు. వీరిద్దరి మధ్య పెళ్లి అగ్రిమెంట్ ఐడియా ఆయనదే.
"మేమంతా 2017లో కాలేజీలో కలుసుకున్నాం. చాలాకాలం కలిసి తిరిగాం. వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారికి గుర్తుండిపోయేలా ఏదైనా చేద్దామనుకున్నాం'' అని రాఘవ్ బీబీసీతో అన్నారు.
" వారిద్దరి గురించి మా గ్రూపంతా కలిసి ఎనిమిది పాయింట్లు తయారు చేశాం. శాంతికి పిజ్జా పిచ్చి ఉంది కాబట్టి దాన్ని మొదటి కండీషన్‌గా పెట్టాం'' అన్నారాయన.
పెళ్లికి వారం ముందు తయారు చేసిన ఈ అగ్రిమెంట్ లో పలు కండీషన్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, COURTESY: SHANTI RAI
అగ్రిమెంట్‌లోని కొన్ని కండీషన్లు
- మింటూ వీకెండ్స్‌లో టిఫిన్ వండాలి.
- ప్రతి 15 రోజులకు ఆమెను షాపింగ్‌కు తీసుకెళ్లాలి
- భార్యతో మాత్రమే అతను మిడ్ నైట్ పార్టీలకు వెళ్లాలి
- శాంతి పిజ్జాలు తినడం తగ్గించడంతోపాటు ప్రతిరోజూ జిమ్‌కెళ్లాలి.
- చీరలో అందంగా ఉంటావని మింటూ చెప్పాడు కాబట్టి, శాంతి రోజూ చీర కట్టుకోవాలి.
ఇలాంటి షరతులు ఈ పెళ్లి అగ్రిమెంట్ లో ఉన్నాయని రాఘవ్ చెప్పారు.
''మా ఫ్రెండ్స్ మాకోసం ఇది సిద్ధం చేస్తున్నారని మాకు తెలియదు. కానీ, వాళ్లకు మా గురించి బాగా తెలుసు'' అన్నారు శాంతి.
ఈ వీడియో ఫ్రెండ్స్ మధ్య సరదాగా షేర్ కాగా, తర్వాత సోషల్ మీడియాలో తుపాన్ సృష్టించింది.
ఫొటోషూట్ చేసిన ఇనిస్టిట్యూట్ దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయగానే అది వైరల్‌గా మారింది. లక్షల వ్యూస్, లైక్స్ సంపాదించింది.

ఫొటో సోర్స్, Getty Images
"మేం పెళ్లి వేడుకలో బిజీగా ఉన్నాము. ఇది వైరల్ అయిన విషయం మాకు మూడు, నాలుగు రోజుల తర్వాతే తెలిసింది'' అన్నారు శాంతి.
"ఇది ఇంత దూరం వెళుతుందని మేం అనుకోలేదు. చాలామంది ఈ వీడియో గురించి నన్ను అడుగుతున్నారు. వాళ్లు దాని గురించి అడిగినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది'' అన్నారు మింటూ.
ఈ కాంట్రాక్టును ఫ్రేమ్ కట్టి దంపతులకు ఇచ్చారు వారి స్నేహితులు. వాళ్లు దాన్ని గోడకు తగిలించుకోవచ్చు.
కానీ, శాంతి ఈ షరతులకు కట్టుబడి ఉంటుందన్న ఆశ తనకు లేదని రాఘవ్ అంటున్నారు.
"ఆమె దానిని ఒక జోక్‌గా తీసుకుంటుంది. గత కొన్నేళ్లుగా తను 3-4 కిలోల బరువు పెరిగానని చెబుతూనే ఉంది. కానీ, ఆమె పిజ్జా తినడం ఆపేస్తుందని నేను అనుకోను'' అన్నారు రాఘవ్ నవ్వుతూ.
''నిజమే. మాకు పెళ్లయి రెండు వారాలే అయ్యింది. ఇప్పటికే రెండు పిజ్జాలు తిన్నాం'' అన్నారు శాంతి ప్రసాద్.
ఇవి కూడా చదవండి:
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- గోదావరి వరదలు: ఏటిగట్లకు 12 చోట్ల పొంచి ఉన్న ప్రమాదం.. భయాందోళనల్లో కోనసీమ గ్రామాలు
- శ్రీలంక: సేంద్రీయ వ్యవసాయ విధానమే ఈ సంక్షోభానికి కారణమా?
- అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన 18 మందిని జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












