Godavari Floods: వరద తగ్గుతున్నా, ఇంకా భయం భయం... ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి?

భద్రాచలం ఆలయం
ఫొటో క్యాప్షన్, భద్రాచలం ఆలయం
    • రచయిత, బళ్ల సతీశ్, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ న్యూస్

తెలుగు రాష్ట్రాలలోని గోదావరి నది పరిసర ప్రాంతాలు వరద ప్రభావం నుంచి పూర్తిగా బయటపడ లేదు.

తెలంగాణలో వరద తగ్గినచోట ప్రజలు ఇళ్లకు చేరుకుని బురదను ఎత్తివేసే పనుల్లో ఉండగా, ఏపీలో ఏటి గట్లకు ఇంకా ప్రమాదం ఉండటంతో ప్రజలు , అధికారులు వాటిని రక్షించే పనిలో ఉన్నారు.

రెండు రాష్ట్రాలలో ఆదివారం ఉదయానికి పరిస్థితి ఇలా ఉంది:

తెలంగాణలో...

ప్రస్తుతం భద్రాచలం గ్రామంలో వరద కొనసాగుతున్నా, ప్రవాహం మాత్రం తగ్గింది. గ్రామంలో ముంపు పూర్తిగా తగ్గనప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది.

భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం నిన్నటితో పోలిస్తే దాదాపు ఐదు అడుగులు తగ్గింది.

శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు 69.9 అడుగుల మట్టం, 23 లక్షల 70 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, ఆదివారం ఉదయం ఏడు గంటలకు 64.4 అడుగుల మట్టం, 20 లక్షల 25 వేల క్యూసెక్కుల ప్రవాహానికి తగ్గింది. గంట గంటకూ ప్రవాహం తగ్గుతూ వస్తోంది.

ప్రస్తుతం భద్రాచలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో మారుమూల గ్రామాల్లో కొంత వరకూ ముంపు తగ్గుతూ వస్తోంది.

భద్రాచలంలో ముంపు పూర్తిగా తగ్గడానికి మరో 24 గంటలు పట్టే అవకాశం ఉంది. శనివారం రాత్రి భద్రాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో మళ్లీ నీరు చేరింది.

భద్రాచలం రామాలయం చుట్టూ కూడా నీరు చేరింది. అక్కడ ఏర్పాటు చేసిన మోటార్లు పనిచేయకపోవడంతో స్థానికులు ఆందోళన చేశారు.

భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న గోదావరి కరకట్టను పటిష్టం చేసి, పొడిగించాలనీ అప్పుడే భద్రాచలానికి శాశ్వత వరద నివారణ అవుతుందని స్థానికులు నిన్న ఆందోళన చేశారు. ఆర్డీవో హామీతో ఆందోళన విరమించారు.

భద్రాచలంలో ఆందోళన చేస్తున్న బాధితులు
ఫొటో క్యాప్షన్, భద్రాచలంలో ఆందోళన చేస్తున్న బాధితులు

అటు బూర్గంపాడు మండలంలో కూడా వరద ఉధ్రుతి అలానే ఉంది. ఇంకా నీరు వెనక్కు వెళ్లలేదు. ఆ ప్రాంతానికి వెళ్లడానికి రోడ్డు మార్గాలు మూసుకుపోయాయి. భద్రాచలం పట్టణ‌ంలో అయినా కొంత ప్రాంతం మెరుగ్గా ఉండడంతో సహాయ చర్యలు, పునరావాసం వేగంగా జరుగుతున్నాయి.

కానీ, బూర్గంపాడు మండలంలోని గ్రామాలకు అసలు దారి కూడా లేకపోవడంతో అక్కడ ప్రజల పరిస్థితి బయటి ప్రపంచానికి తెలియడం లేదు.

మరోవైపు ఎగువన వరద వెలిసిన తరువాత ఇతర కష్టాలు మొదలయ్యాయి. మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో జనం ఇళ్లను శుభ్రపరిచే పనిలో పడ్డారు. ఇంటిలో వాడే చాలా వస్తువులు పనిచేయకుండా పోయాయి.

వీడియో క్యాప్షన్, తెలంగాణ వరదల్లో బాహుబలి సీన్

వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. కుటుంబాల పరంగా పూడ్చలేనంత ఆస్తి నష్టం జరిగింది. పూరిళ్లు, రేకుల షెడ్లు, మట్టి గోడల ఇళ్లు బాగా ధ్వంసం అయ్యాయి.

పక్కా ఇంట్లో నివసించే మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా ఉన్న ఇల్లు, ఒంటి మీద బట్టలు తప్ప అన్నీ కోల్పోయారు.

తాగునీరు, కరెంటు ఇంకా చాలా చోట్ల అందుబాటులో లేదు.

ఇక వ్యవసాయ నష్టం అంచనా వేయడం ఇంకా అధికారికంగా ప్రారం‌భం కాలేదు. కొత్తగా విత్తిన పత్తి, సోయా పంటలు దాదాపు నాశనం అయినట్టే. ముఖ్యంగా పొలాల్లో ఇసుక, రాళ్లు, మట్టి మేటలు వేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగాయి. ఆస్తి న‌ష్టం, పంట నష్టాల పరిహారం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.

వరంగల్ లో సీఎం కేసీఆర్ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు
ఫొటో క్యాప్షన్, వరంగల్ లో సీఎం కేసీఆర్ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు

సీఎం ఏరియల్ సర్వే రద్దు...

ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం పర్యటన ఆలస్యంగా సాగుతోంది. ముందుగా అనుకున్నట్టుగా హెలికాప్టర్ లో కాకుండా రోడ్డు మార్గంలో బస్సులో కేసీఆర్ ప్రయాణిస్తున్నారు. వరంగల్ నుంచి ఉదయాన్నే హెలికాప్టర్లో భద్రాచలం చేరుకుని, ఆ తరువాత అదే హెలికాప్టర్లో ఏటూరు నాగారం వెళ్లాల్సి ఉంది.

అయితే వర్షం కురుస్తూండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణంతో పాటూ, భద్రాచలంలో చేయాల్సిన ఏరియల్ సర్వేను కూడా అధికారులు రద్దు చేశారు. దీంతో సీఎం రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తున్నారు.

వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో ఏటూరునాగారం, ములుగుల్లో పర్యటిస్తూ అక్కడి వరద ప్రభావాన్ని తెలుసుకుంటున్నారు. అక్కడి నుంచి భద్రాచలం వైపు వస్తారు. భద్రాచలంలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు.

రాజమండ్రి వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది
ఫొటో క్యాప్షన్, రాజమండ్రి వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది

ఆంధ్రప్రదేశ్‌లో...

ఏపీలో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గుతున్నా దిగువన ధవళేశ్వరం మాత్రం నిలకడగా కనిపిస్తోంది.

కాటన్ బ్యారేజ్ నుంచి ఆదివారం ఉదయం 7గంటల సమయానికి 21.8 అడుగుల వద్ద ప్రవాహం సాగుతోంది. దాంతో దాదాపు 26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పాలకొల్లు, నరసాపురం మండలాల్లో రెండు చోట్ల గండ్లు పడే ప్రమాదం ఉండడంతో రక్షణ చర్యలకు పూనుకున్నారు. దాంతో పాటుగా కోనసీమ జిల్లాల్లోని పలు చోట్ల ఏటిగట్లపై నుంచి నీరు పారుతోంది.

రాజోలు మండలం బాడవ వద్ద పొంగిపొర్లుతున్న నదికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మామిడికుదురు మండలం పాశర్లపూడి వద్ద కూడా అదే రీతిలో కనిపిస్తోంది.

వరద రాకుండా ఇసుక బస్తాలను అడ్డుగా వేస్తున్నారు
ఫొటో క్యాప్షన్, వరద రాకుండా ఇసుక బస్తాలను అడ్డుగా వేస్తున్నారు

పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద నిన్నటి నుంచి ఏటిగట్టు ఊటలు వేయడంతో భారీగా ఇసుక బస్తాలు వేసి పరిరక్షణ ప్రయత్నాలు సాగుతున్నాయి.

శనివారం రాత్రంతా అధికారులు, కొందరు స్థానికులు పహారా కాశారు. ఏటిగట్టు పరిరక్షణ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటి వరకూ ముప్పు నుంచి గట్టెక్కడంతో మరికొన్ని గంటలు గడిస్తే గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలోని 6 జిల్లాలకు చెందిన 640 గ్రామాలు ఇప్పటికీ వరద నీటిలో ఉన్నాయి. లక్షల మంది వరద బారిన పడ్డారు. వేల ఇళ్లు ఖాళీ చేశారు. దాదాపు 70 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు వరద బాధితులకు సహాయక చర్యల్లో భాగంగా నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోందని చెబుతోంది.

గోదావరి

పోలవరం వద్ద పరిస్థితి

పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద మరింత పటిష్ట పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏటిగట్టు పైకి మట్టి తరలించే పనులు సాగుతున్నాయి. పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్థానికులు అంటున్నారు.

ప్రభుత్వ సహాయక చర్యలు కూడా చేపట్టకపోవడంతో కొండలపై తలదాచుకున్న వారికి ఆహారం, మంచినీరు కూడా అందడం లేదని గిరిజన సంఘం నాయకులు చెబుతున్నారు.

దాదాపు 80 గ్రామాలకు చెందిన గిరిజనుల తమ సమీప కొండలపై తలదాచుకుంటున్నారని చెబుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు ఎగుడ కాఫర్ డ్యామ్‌ను పటిష్టపరిచే చర్యలు చేపట్టారు
ఫొటో క్యాప్షన్, పోలవరం ప్రాజెక్టు ఎగుడ కాఫర్ డ్యామ్‌ను పటిష్టపరిచే చర్యలు చేపట్టారు

వరదలు తగ్గుముఖం పట్టగానే వారందరినీ ఆదుకుంటామని, ప్రస్తుతం వారికోసం హెలికాప్టర్ సహాయంతో ఆహార పొట్లాలు అందిస్తున్నామని వరద ప్రత్యేక అధికారి కాటంనేని భాస్కర్ మీడియాకు తెలిపారు.

ఆదివారం ఉదయానికి భద్రాచలం వద్ద 64.4 అడుగులకు వరద నీరు తగ్గింది. ఈ సాయంత్రానికి పోలవరం స్పిల్ వే, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా వరద తాకిడి తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.

రేపు కూడా వరద ప్రవాహం కొనసాగే ప్రమాదం ఉన్నందున ఏటిగట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలతో పాటుగా, లంక వాసులంతా అప్రమత్తంగానే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ఉప్పొంగిన గోదావరి.. ‘వందేళ్లలో ఎప్పుడూ చూడనంత వరద’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)