Draupadi Murmu: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎందుకు మద్దతు ప్రకటించారు?

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్ర రాష్ట్రంలో అరుదైన రాజకీయ దృశ్యం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి వైయస్సార్సీపీ, తెలుగు దేశం ఇద్దరూ మద్దతు ప్రకటించారు.
దీంతో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక్క వ్యతిరేక ఓటూ లేని అభ్యర్థిగా ద్రౌపది నిలవబోతున్నారు. అంతేకాదు, దాదాపు నాలుగేళ్ల తరువాత చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకులతో వేదిక పంచుకోగా, వైయస్సార్సీపీ సమావేశంలో ఎన్టీఆర్ పేరు చెప్పి మాట్లాడారు ద్రౌపది.
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం విజయవాడ వచ్చారు. ఆమె వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు.

జగన్ ఇంటికి..
ముందుగా ముఖ్యమంత్రి జగన్ ఇంటికి వెళ్లిన ద్రౌపది అక్కడ పండితుల ఆశీర్వాదం, ప్రసాదం తీసుకున్నారు. తరువాత వైయస్సార్సీపీ శాసన సభా పక్షం ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లారు.
ఆ సమావేశంలో వేదికపై జగన్, ద్రౌపది, కిషన్‌ల కోసం మూడే కుర్చీలు ఉండగా, ప్రత్యేకంగా మరో కుర్చీ వేయించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును కూర్చోబెట్టారు జగన్.
ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వం విషయం బీజేపీ బయటకు ప్రకటించకముందే, తమ పార్టీ నాయకత్వం వైయస్ జగన్‌తో చర్చించిందనీ, జగన్ సహా కొన్ని పార్టీల నాయకులతో చర్చించే ద్రౌపది పేరు ఖరారు చేసినట్టు స్వయంగా వేదికపై ప్రకటించారు కిషన్ రెడ్డి.
ఈ వ్యాఖ్యలు వైయస్ జగన్మోహన రెడ్డి బీజేపీ సాన్నిహిత్యాన్నీ, ఆయన పార్టీకి బీజేపీ ఇచ్చిన ప్రాధాన్యతను మరోసారి రుజువు చేశాయి.

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial
రామారావు పేరు..
తెలుగు వారిలో ప్రముఖుల పేర్లు ప్రస్తావించిన ద్రౌపది, వైయస్సార్సీపీ వేదికపై అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిలతో పాటూ ఎన్టీ రామారావు పేరు చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పలేదు.
ఎన్నిక జరిగే రోజున అందరూ విప్ పాటించి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని పార్టీ నాయకులను జగన్ ఆదేశించారు. మంత్రులు బాధ్యత తీసుకోవాలనీ, అదే రోజు మాక్ పోలింగ్ జరగాలని ఆదేశించారాయన.
వైయస్సార్సీపీతో సమావేశం ముగిసిన తరువాత తెలుగుదేశం సమావేశానికి వెళ్లారు ద్రౌపది, కిషన్, వీర్రాజులు.
2019 ఎన్నికలకు సుమారు ఏడాది ముందే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు చంద్రబాబు. దాదాపు నాలుగేళ్ల తరువాత బీజేపీ నాయకులతో ఆయన వేదిక పంచుకున్నారు.
తెలుగుదేశంతో ద్రౌపది సమావేశం అంటే వైయస్సార్సీపీ అభ్యంతరం చెప్పవచ్చనే ఉద్దేశంతో, ఈ సమావేశం గురించి చివరి నిమిషంలో ప్రకటించారనే చర్చ జరుగుతోంది విజయవాడలో. మొత్తానికి ఈ సమావేశంతో, ఆంధ్రలో ద్రౌపది ఎన్నిక వన్ సైడ్ కాబోతోంది.
ఎన్ని ఓట్లు ఉన్నాయి?
ఈ ఎన్నికల్లో మొత్తం దేశంలోని ఓట్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 4.2 శాతం ఓట్లు ఉన్నాయి. తెలుగుదేశానికి 0.6 శాతం ఓట్లు ఉన్నాయి.
మొత్తం కలిపి అంటే, ఆంధ్ర రాష్టంలోని 175 ఎమ్మెల్యేలు, 25 లోక్ సభ ఎంపీలు, 11 రాజ్య సభ ఎంపీల ఓట్లూ కేవలం ద్రౌపది ముర్ముకే పడనున్నాయి. ఆమె ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాకు, ఒక్క ఓటు కూడా రాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోంది. జనసేన నుంచి గెలిచిన వర ప్రసాద రావు వైయస్సార్సీపీతో ఉన్నారు.
ఆ విషయాన్ని వేదికపై స్వయంగా చంద్రబాబే చెప్పారు. మీకు ఈ రాష్ట్రం నుంచి మొత్తం ఓట్లన్నీ పడబోతున్నాయని వేదికపైనే ద్రౌపదితో చెప్పారు చంద్రబాబు.

ఫొటో సోర్స్, facebook/TDP.Official
ఆసక్తికర వ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్, తెలుగు దేశం – ఈ రెండు వేదికల మీదా ద్రౌపది ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆమె ఎంతో వినయపూర్వకంగా ఆ మాట అన్నప్పటికీ, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.
‘‘నేను అడగకముందే మీరు నాకు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు’’అని అన్నారు ద్రౌపది.
ఈ వ్యాఖ్యల వెనుక ఆవిడ ఉద్దేశం నామీద ఎంతో అభిమానంతో అడగక ముందే మద్దతిచ్చారనే కావచ్చు. కానీ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో రెండు పెద్ద పార్టీలకూ బీజేపీ అంటే ఉన్న భయాన్ని ఇది గుర్తు చేస్తుందంటున్నారు విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్టు యుగంధర రెడ్డి.
‘‘జగన్, బాబు ఇద్దరికీ బీజేపీ-కేసుల భయం ఉంది. అందుకే ఏ షరతూ లేకుండా ద్రౌపదికి మద్దతిచ్చారు.’’ అన్నారు యుగంధర రెడ్డి.
పార్టీలు తమ సొంత రాజకీయ ప్రయోజనాలు కూడా దాటి, వాటి అధ్యక్షులు తమ సొంత వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ ఎన్నికల్లో ద్రౌపదికి మద్దతిచ్చినట్టు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘వైయస్ జగన్‌పై కేసులు ఉన్నాయి. ఆయన అన్ని విషయాల్లో బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఇక ఇవాళ కొత్త పరిణామం తెలుగుదేశం కూడా మద్దతివ్వడం, వేదిక పంచుకోవడం. గత ఎన్నికల ముందు బీజేపీకి దూరం అయినందుకు తెలుగుదేశం బాధ పడుతోంది. భయపడుతోంది. అందుకే మూడేళ్లుగా కేంద్రంలో ఏ బిల్లు విషయంలోనూ బీజేపీకి వ్యతిరేకంగా చేయలేదు తెలుగుదేశం. బీజేపీ, జగన్‌ల బంధం సాలిడ్ అవకుండా చూసుకోవడం కూడా చంద్రబాబు లక్ష్యం. ఆమె ఎలానూ గెలవబోతోంది. అయినా మద్దతిచ్చేది అందుకే. భయమే ఈ ఇద్దరూ ద్రౌపదికి మద్దతిచ్చేలా చేసింది’’ అన్నారు యుగంధర్.
రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా చర్చకు రాకపోవడాన్ని గుర్తు చేశారాయన. నిజానికి గత ఎన్నికల ముందు బీజేపీ – తెలుగుదేశం బంధం తెగిపోయిందే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు. జగన్ గెలుపు నినాదాల్లో ప్రత్యేక హోదా ఒకటి. కానీ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఈ రెండు పార్టీలూ ప్రత్యేక హోదా షరతు విధించలేదు.
‘‘జగన్ – బాబు, ఇద్దరికీ వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు కాదు. అందుకే కనీసం ప్రత్యేక హోదా ఇస్తే ఆమెకు మద్దతిస్తాం అనలేకపోయారు. వారి భయం, స్వార్థం కోసం ఆంధ్రులని మోసం చేస్తున్నారు. ఆ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టు, ఆంధ్రలో ఏ పార్టీ గెలిచినా, బీజేపీ గెలిచినట్టే అనేది నిజం!’’ అన్నారు సీనియర్ జర్నలిస్ట్ యుగంధర్.
ఇవి కూడా చదవండి:
- మోదీ పార్లమెంటు కొత్త భవనంపై మూడు సింహాల విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజ్యాంగ విరుద్ధమా?
- అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు
- Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
- గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















