SriLanka Crisis: ఈ ఆర్థిక, రాజకీయ సుడిగుండం నుంచి శ్రీలంక ఇప్పటికిప్పుడు బయటపడగలదా, ఏం చేయాలి?

శ్రీలంక సంక్షోభం

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

    • రచయిత, ఫైసల్ మొహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత కొన్ని నెలలుగా శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఇప్పుడు రాజకీయ రూపాన్ని సంతరించుకుంది. రాష్ట్రపతి గొటాబయ రాజపక్ష దేశం విడిచి పారిపోయారు. ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తాత్కాలిక రాష్ట్రపతిగా నియమితులయ్యారు.

ఈ రాజకీయ అస్థిరత కారణంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తో చర్చలు నిలిచిపోయాయి. ఐఎంఎఫ్ సహాయం ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించగలదని ఆశించారు.

1948లో బ్రిటిష్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత శ్రీలంక ఎదుర్కుంటున్న అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఇదే. విదేశీ మారక ద్రవ్యం విలువ తీవ్రంగా పడిపోయింది. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి ఆ దేశానికి కనీసం 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 31,938 కోట్లు) కావాలి. ఇందుకోసం ఐఎంఎఫ్‌తో చర్చలు ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ బృందం జూన్ 20 నుంచి 30 వరకు కొలొంబోలో పర్యటించింది. ప్రభుత్వ రుణం మోయలేనంత భారంగా మారిందని అంచనా వేసింది. ఆర్థిక సహాయం పొందాలంటే శ్రీలంక తన రుణదాతలతో వడ్డీ, చెల్లింపు నిబంధనలను చర్చించవలసి ఉంటుంది. వాటిలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అయితే, రాజకీయ సంక్షోభం తలెత్తడంతో ఈ చర్చలు ఆగిపోయాయి. ప్రస్తుతం పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్ తెలిపింది.

నిత్యావసర వస్తువుల కోసం క్యూలు కడుతున్న ప్రజలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, నిత్యావసర వస్తువుల కోసం క్యూలు కడుతున్న ప్రజలు

చక్రవ్యూహం లాంటి పరిస్థితిలో చిక్కుకున్న శ్రీలంక

శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితి అయిదు బిందువుల చక్ర వ్యూహంలా ఉందని పబ్లిక్ పాలసీ థింక్-ట్యాంక్ అడ్వకేట్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ధననాథ్ ఫెర్నాండో పేర్కొన్నారు.

"శ్రీలంకలో విదేశీ మారకపు నిధుల (డాలర్లు) కొరత ఉంది, దీని కారణంగా బయటి నుంచి అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోలేరు. పాత రుణాలకు వడ్డీలు సకాలంలో చెల్లించలేకపోయారు. దాంతో కొత్త రుణాలు పుట్టడం కష్టమైపోయింది. పాత రుణాల లావాదేవీలపై చర్చలు జరిపి, బ్యాంకుల్లో నిర్మాణాత్మక మార్పులు తీసుకు రావాలని రుణాలు ఇచ్చే సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. డాలర్ల కొరత కారణంగా పెట్రోలు, డీజిల్, మందులు మొదలైన నిత్యావసర వస్తువుల దిగుమతి ఆగిపోయింది. ఈ వస్తువుల కొరత ప్రజల్లో ఆగ్రహాన్ని ప్రేరేపించింది. రాజకీయ అస్థిరతకు దారితీసింది" అని ఆయన వివరించారు.

నిత్యావసర వస్తువుల తీవ్ర కొరత వల్ల ప్రజలు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు. దాంతో, సామాజిక అస్థిరత కూడా చోటుచేసుకుందని ధననాథ్ అన్నారు.

రాష్ట్రపతి రాజపక్ష దేశం విడిచి పారిపోయారు. రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు.

ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సహాయ ప్యాకేజీని నిర్ధారించే ప్రణాళికను ఆగస్టు నాటికి సమర్పించనున్నట్లు విక్రమసింఘే ఈ నెల ప్రారంభంలో పార్లమెంటుకు తెలిపారు.

అయితే, జూలై 9న నాటకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వేలాది మంది ప్రజలు నిరసనలు తెలుపుతూ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష, రణిల్ విక్రమసింఘే ఇళ్లల్లోకి ప్రవేశించారు.

దీని తరువాత, జూలై 13న రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయగా, రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు విక్రమసింఘే ప్రకటించారు.

శ్రీలంకలో పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసిన మొట్టమొదటి అధ్యక్షుడు రాజపక్ష. అంతకుముందు, 1953లో అప్పటి ప్రధాని డుడ్లీ సేనానాయకే ప్రజల నిరసనలతో పదవికి రాజీనామా చేశారు.

శ్రీలంక రాజ్యాంగం ప్రకారం, ఇప్పుడు పార్లమెంటు స్పీకర్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని తరువాత, నెలలోపే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం విడిచి ఎలా పారిపోయారు

ఐఎంఎఫ్ నుంచి సహాయం

ఈ సంక్షోభం నుంచి శ్రీలంకను బయటపడేసే మార్గాలేవి, ఈ చిక్కుల వలయం నుంచి ఆ దేశం ఎలా బయటపడుతుంది అన్నవి మన ముందున్న ప్రశ్నలు.

శ్రీలంకను ఐఎంఎఫ్ రక్షించగలదని ధననాథ్ ఫెర్నాండో అభిప్రాయపడ్డారు.

పర్యటకం, విదేశాల్లో స్థిరపడిన శ్రీలంక పౌరులు స్వదేశానికి డబ్బు పంపేట్లు ప్రోత్సహించడం వల్ల సమీప భవిష్యత్తులో విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని చాలా వరకు అధిగమించవచ్చని కొలంబో యూనివర్సిటీలో ఎకనామిక్స్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న గణేశ్ మూర్తి ఎం. అభిప్రాయపడ్డారు.

పర్యటకం, విదేశాల నుంచి పంపే నిధులు

ఇటీవలి సంవత్సరాలలో విదేశాలో స్థిరపడిన శ్రీలంక పౌరుల నుంచి వచ్చే నిధులు బాగా తగ్గాయని గణేశ్ మూర్తి చెప్పారు.

గత సంవత్సరం కేవలం 5.49 బిలియన్ డాలర్ల నిధులు చేరాయని, 10 సంవత్సరాలలో ఇదే కనిష్టమని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. 2012లో అత్యధికంగా విదేశీ నిధులు వచ్చాయి.

విదేశాల్లో నివసిస్తున్న శ్రీలంకన్లు స్వదేశానికి పంపే డబ్బు తగ్గిపోవడానికి లేదా బ్యాంకు ద్వారా పంపకపోవడానికి ప్రధాన కారణం శ్రీలంక సెంట్రల్ బ్యాంకు నిర్ణయించిన డాలర్ ధర అని విశ్లేషకులు అంటున్నారు.

సెంట్రల్ బ్యాంకు ఒక డాలరుకు 200 నుంచి 203 శ్రీలంక రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. కానీ, బయట హవాలా మార్కెట్లో డాలరు ధర 250 రూపాయలు పలుకుతోంది.

ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దగలిగితే విదేశీ ద్రవ్యం వచ్చి చేరుతుందని, దానితో నిత్యావార వస్తువుల దిగుమతి సులభం అవుతుందని గణేశ్ మూర్తి అంటున్నారు.

అయితే, శ్రీలంకలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పర్యటకులు అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడరని, పర్యటక రంగం వృద్ధి చెందడం అంత సులువు కాదని ధననాథ్ ఫెర్నాండో అభిప్రాయపడ్డారు.

శ్రీలంకలో పర్యటకం ఇప్పటికే ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి పోటీ ఎదుర్కొంటోంది. ఎందుకంటే, ఆ దేశాలు తక్కువ రేట్లకే మెరుగైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నాయి.

మరోవైపు, కోవిడ్ అంతం కాలేదు. ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు నడుస్తోంది.

నిరసనలతో వీధుల్లోకి వచ్చిన ప్రజలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నిరసనలతో వీధుల్లోకి వచ్చిన ప్రజలు

టీ, రబ్బరు, వస్త్రాలు, రత్నాల ఎగుమతి

ఈ నేపథ్యంలో శ్రీలంక ఎగుమతుల గురించి కూడా చర్చిస్తున్నారు.

టీ ఉత్పత్తుల్లో శ్రీలంకకు భారత్, కెన్యా వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని, వస్త్రాల ఎగుమతి కూడా అత్యధిక స్థాయికి చేరుకుందని, అందులో వృద్ధికి అవకాశం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

టీ, రబ్బర్ రంగాల్లో శ్రీలంక చేజేతులా ప్రత్యర్థులను తయారుచేసుకుందని ధననాథ్ ఫెర్నాండో అభిప్రాయపడ్డారు.

1970లలో, దేశంలోని తేయాకు, రబ్బరు తోటలను ప్రయివేటు రంగం నుంచి ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. దాని కారణంగా ఉత్పత్తి తగ్గింది. ప్రభుత్వం కొత్త పెట్టుబడులు పెట్టలేకపోయింది.

తేయాకు తోటలు కోల్పోయినవారు కొత్త జాగాలు వెతుకున్నారు. ఆఫ్రికా దేశాలైనా కెన్యా, ఇథియోపియా వంటి దేశాల్లో తేయాకు తోటలు అభివృద్ధి చేశారు. ఫలితంగా శ్రీలంక అందించేవాటి కన్నా మెరుగైన ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. శ్రీలంకకు పోటీ పెరిగిపోయింది.

వస్త్రాల ఎగుమతిలో బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా శ్రీలంకతో పోటీపడుతున్నాయి.

ఈమధ్య కాలంలో రాజపక్ష ప్రభుత్వం వ్యవసాయంలో ఎరువుల వాడకాన్ని నిషేధించింది. దాంతో, పంట దిగుబడి తగ్గింది. ఈ పరిస్థితి నుంచి బయటపడి, మళ్లీ వృద్ధి సాధించడానికి సంవత్సరాలు పడుతుంది.

శ్రీలంక సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

కొత్త రంగాలు వెతుక్కోవడం అవసరం

శ్రీలంక ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి కనీసం అయిదారేళ్లు పడుతుందని ధననాథ్ ఫెర్నాండో అంచనా వేస్తున్నారు. అది కూడా సరైన ఆర్థిక సంస్కరణలు చేపట్టగలిగితేనే.

ప్రభుత్వ రుణాలకు సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించడం, ప్రభుత్వ సంస్థల్లో సంస్కరణలు, కార్మిక చట్టాలు, పన్ను రేట్లలో గణనీయమైన మార్పులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

పెట్టుబడులు పెరుగుతాయని, మారెట్లో వస్తువుల డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం పన్ను రేట్లు తగ్గించింది. అలా జరగకపోగా, ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిందని గణేశ్ మూర్తి వివరించారు.

మరోవైపు ప్రభుత్వ ఖర్చులు తగ్గలేదు. 15 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు జీతాలు చెల్లిస్తూనే ఉంది. ప్రభుత్వ వ్యయాన్ని నెట్టుకొచ్చేందుకు బ్యాంకులు నోట్లను ముద్రిస్తూనే ఉన్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం వేగంగా పెరిగింది.

ఇటీవల సంవత్సరాలలో శ్రీలంకలో ద్రవ్యోల్బణం రేటు 50 శాతానికి చేరుకుందని నిపుణులు అంచనా వేశారు. ఇది 75 శాతానికి పెరగవచ్చని సెంట్రల్ బ్యాంకు అంచనా వేసింది.

శ్రీలంక ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే ఎలక్ట్రానిక్స్ నుంచి డిఫెన్స్, వాహనాల తయారీ వరకు ఉండే వాల్యూ-చైన్, ఉత్పత్తి నెట్‌వర్క్‌లో భాగం కావాలని వ్యాపార, పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

వీడియో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్షుడి అధికారిక నివాసంలో నిరసనకారులు, స్విమ్మింగ్ పూల్లో స్నానాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)