బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి తొలి రౌండ్ ఓటింగ్‌లో భారత సంతతికి చెందిన రిషి సునక్ విజయం

ఫొటో సోర్స్, Reuters
బ్రిటన్‌లో బోరిస్ జాన్సన్ రాజీనామాతో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి, బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్ధిత్వానికి పోటీ మొదలైంది. భారత మూలాలున్న మాజీ ఛాన్సలర్ రిషి సునక్ ఎంపీల మొదటి రౌండ్ ఓటింగ్‌లో విజయం సాధించారు.
సునక్ 88 ఓట్లతో అగ్రస్థానంలో ఉండగా, వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్ 67 ఓట్లతో రెండవ స్థానంలో, 50 ఓట్లతో విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ మూడవ స్థానంలో నిలిచారు.
వీరితో పాటు మాజీ మంత్రి కెమీ బాడెనోచ్, టామ్ టుగెన్‌ధాట్, అటార్నీ జనరల్ సుయెల్లా బ్రవర్‌మాన్ కూడా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.
ఈ దశలో 30 కన్నా తక్కువ ఓట్లు వచ్చినవారు పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఛాన్సలర్ నదీమ్ జహావి, మాజీ ఆరోగ్య కార్యదర్శి జెరెమీ హంట్ పోటీ నుంచి వైదొలగనున్నారు.
గురువారం రెండవ రౌండ్ ఓటింగ్ జరుగుతుంది. మొదటి రౌండ్‌లో 30 ఓట్లు దాటిన ఆరుగురు అభ్యర్థులు రెండవ రౌండ్‌లో పోటీపడనున్నారు.
వచ్చేవారానికి ఈ పోటీలో ఇద్దరే మిగులుతారన్నది లెక్క. వారిలో ఒకరిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, ప్రధానమంత్రిగా ఎన్నుకునే బాధ్యత టోరీ సభ్యులపై ఉంటుంది. ఈ దశలో సుమారు 160,000 టోరీ సభ్యులు (కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు) తమ ప్రియతమ నాయకుడికి ఓటు వేస్తారు.
సెప్టెంబర్ 5న చివరి దశ ఫలితాలు వెల్లడిస్తారు.

ఫొటో సోర్స్, Reuters
తదుపరి దశ ఓటింగ్‌లో జహావి, హంట్‌ల మద్దతుదారులు కూడా ఇప్పుడు తమకు ఓటు వేస్తారని మిగిలిన ఆరుగురు అభ్యర్థులూ ఆశిస్తున్నారు.
ఇకపై ఈ పోటీలో సునక్‌కు మద్దతిస్తానని హంట్ బీబీసీకి తెలిపారు.
మొదటి రౌండ్ ఫలితాలు "గొప్పగా" ఉన్నాయని సునక్ బీబీసీకి చెప్పారు.
సునక్ గతవారం బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు.
రెండ స్థానంలో నిలిచిన మోర్డంట్ మాట్లాడుతూ," ఇది చాలా గౌరప్రదమని" అన్నారు.
మూడవ స్థానంలో నిలిచిన ట్రస్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, "పన్నులు తగ్గించే, మొదటి రోజు నుంచే ఆర్థికవ్యవస్థలో నిజమైన మార్పులు తీసుకురాగలిగే, యుక్రెయిన్‌లో పుతిన్ ఓటమికి హామీ ఇచ్చే అభ్యర్థిని ఎన్నుకునేందుకు సహోద్యోగులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
బ్రెగ్జిట్ ప్రయోజనాలను అందిస్తూ అర్థిక వ్యవస్థను అబివృద్ధి చేయగల సత్తా లిజ్‌కు ఉంది. శ్రామిక కుటుంబాలకు మద్దతిగా నిలుస్తారు" అని అన్నారు.
"ఈ ఫలితం అద్భుతం. ఈ దేశ స్థితుగతులను మార్చగలిగే తదుపరి రౌండ్ ఎన్నికలకు వెళ్లడం ఆనందంగా ఉంది. మన దేశానికి ఒక స్వచ్ఛమైన ప్రారంభం కావాలి" అని సీనియర్ ఎంపీ టుగెన్‌ధాట్ ట్వీట్ చేశారు.
పోటీలో చెడు వాతావరణం చోటు చేసుకుంటోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దీనిపై హంట్ మాట్లాడుతూ, "మిగిలిన అభ్యర్థులకు ఒక మనవి: వదంతులు, దాడులు స్వల్పకాలిక ప్రయోజనాలు చేకూర్చగలవు, కానీ దీర్ఘకాలంలో ఎదురుదెబ్బ తీస్తాయి" అని అన్నారు.
ఛాన్సలర్‌గా సునక్ వైదొలగిన తరువాత జహావి ఆ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తనకు తన విధి నిర్వహణ ముఖ్యమని, పోటీలో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని ఆయన అన్నారు.
బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై కొంతకాలంగా విమర్శలు రావడం, ప్రజలతో పాటు సహచరుల్లో విశ్వాసం కోల్పోవడంతో జాన్సన్ గతవారం ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
దాంతో, ప్రధాని పదవికి, కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి ఎన్నికలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసిందనే వదంతులు భారత్‌పై ఎందుకు వస్తున్నాయి
- ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- ఊరు బయట పొలాల్లో ఐపీఎల్ ఆడతారు, రష్యన్లతో బెట్టింగ్ చేసి లక్షల రూపాయలు కొట్టేస్తారు
- శ్రీలంక: ప్రభుత్వం నిండా రాజపక్ష కుటుంబ సభ్యులే... రేపు వాళ్ల పరిస్థితి ఏంటి?
- కాలంలో వెనక్కి వెళ్లిన జేమ్స్ వెబ్: కోట్ల సంవత్సరాల క్రితం గెలాక్సీని ఫొటో తీసిన సూపర్ టెలిస్కోప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












