శ్రీలంక: ప్రభుత్వం నిండా రాజపక్ష కుటుంబ సభ్యులే... రేపు వాళ్ల పరిస్థితి ఏంటి?

రాజపక్ష కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పవన్ సింగ్ అతుల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శ్రీలంకలో కుటుంబ రాజకీయాలు కొత్తేమీ కాదు. కానీ, రాజపక్ష కుటుంబం వీటిని ఎవరూ ఊహించని స్థాయికి తీసుకెళ్లింది.

ఒకప్పుడు శ్రీలంకలో బండారనాయకే కుటుంబం పేరు బాగా వినిపించేది.

బండారనాయకే కుటుంబానికి చెందిన సొలోమన్ బండారనాయకే మొదట ఆ కుటుంబం నుంచి ప్రధానమంత్రి అయ్యారు.

సొలోమన్‌ను 1959 సెప్టెంబరు 26న బౌద్ధ మిలిటెంట్లు కాల్చి చంపారు.

ఆ తర్వాత సొలోమన్ బండారనాయకే భార్య సిరిమావో బండారనాయకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1960 జులై 20న ఆమెను ప్రధానమంత్రిగా ప్రజలు ఎన్నుకొన్నారు. ఆమె ప్రపంచంలోనే తొలి మహిళా ప్రధానమంత్రి కావడం విశేషం.

ఆ తర్వాత సిరిమావో బండారనాయకే కుమార్తె చంద్రికా బండారనాయకే కుమారతుంగ దేశానికి అధ్యక్షురాలు అయ్యారు.

1994లో ఆమె శ్రీలంకలో అధ్యక్ష పదవి చేపట్టి, ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

అయితే, రాజపక్ష కుటుంబంలా బండారనాయకే కుటుంబం ఎప్పుడూ పూర్తిగా అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేదు.

రాజపక్ష కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహింద రాజపక్ష, గోటాబయ రాజపక్ష

అధికారం మొత్తంగా...

శ్రీలంకలో కుటుంబ రాజకీయాలపై కొలంబోకు చెందిన రాజకీయ విశ్లేషకుడు జయదేవ్ ఉయానగోడా బీబీసీతో మాట్లాడారు. ‘‘సేనానాయకే, జయవర్ధనే, బండారనాయకే లాంటి కుటుంబాలు గతంలోనూ శ్రీలంక రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాయి. కానీ, రాజపక్ష కుటుంబం దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది’’అని ఆయన అన్నారు.

గత 15ఏళ్లలో రాజపక్ష కుటుంబం చాలా ఎత్తుపల్లాలను చూసింది. కానీ, ప్రతిసారీ ఎలాగోలా అధికారంలోకి వస్తోంది. ఇక్కడి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.

ఈ కుటుంబ రాజకీయాలకు గట్టి పునాది వేసింది మహింద రాజపక్ష. కానీ, ఆయన తమ్ముడు గొటాబయ రాజపక్ష దీన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఉత్తర శ్రీలంక అంతర్యుద్ధంలో తమిళ వేర్పాటువాదులపై అరాచకాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతానికి గొటాబయ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, సంక్షోభం నడుమ రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. జూలై 13న రాజీనామా చేస్తానని చెప్పిన రాజపక్ష అదే రోజు మిలిటరీ జెట్‌లో మాల్దీవులకు పారిపోయారు..

ఇప్పటివరకు రాజపక్ష కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు శ్రీలంకలో కీలకమైన పదవుల్లో కొనసాగారు. వీరిలో నలుగురు సోదరులు కాగా.. అయిదో వ్యక్తి వీరిలో ఒకరి కుమారుడు.

అధ్యక్షుడిగా ఉన్న గొటాబయ రాజపక్ష.. రక్షణ మంత్రి పదవిని కూడా తన దగ్గర అట్టిపెట్టుకున్నారు. మరోవైపు మహింద రాజపక్ష ప్రధాన మంత్రిగా పనిచేశారు. చమాల్ రాజపక్ష నీరు పారుదల శాఖ మంత్రిగా, బాసిల్ రాజపక్ష ఆర్థిక మంత్రిగా, మహింద రాజపక్ష కుమారుడు నమల్ రాజపక్ష క్రీడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

‘‘ఇదివరకటి కుటుంబాలు కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించేవి. కానీ, రాజపక్ష కుటుంబం పూర్తి వ్యవస్థనే తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావించింది. చాలా మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆ కుటుంబం తన అధీనంలో ఉంచుకుంది. ఇది మొత్తంగా వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవడమే’’అని జయదేవ్ వ్యాఖ్యానించారు.

రాజపక్ష కుటుంబానికి చెందిన ప్రధాన నాయకులను ఇప్పుడు చూద్దాం.

మహింద రాజపక్ష

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మహింద రాజపక్ష
లైన్

మహింద రాజపక్ష

లైన్

1970లో 24ఏళ్ల వయసున్నప్పుడు తొలిసారిగా శ్రీలంక పార్లమెంటుకు మహింద రాజపక్ష ఎన్నికయ్యారు. అంత చిన్న వయసులో ఎంపీ అయిన తొలి వ్యక్తి ఆయనే. అయితే, రాజపక్ష కుటుంబంలో తొలి నాయకుడు మహింద రాజపక్ష కాదు. ఆయన తండ్రి డీఏ రాజపక్ష.. 1947 నుంచి 1965 మధ్య హంబన్‌టోటా నుంచి ఎంపీగా కొనసాగారు.

అయితే, మహింద రాజపక్ష వేగంగా ఎదిగారు. స్వల్ప కాలంలోనే శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్ఎల్‌ఎఫ్‌పీ)కి ఆయన నాయకుడు కాగలిగారు. 2004లో తొలిసారి ఆయన ప్రధాన మంత్రి అయ్యారు.

ఆ మరుసటి ఏడాదే శ్రీలంక అధ్యక్షుడి పదవిని చేపట్టారు. జనవరి 2010లో మాజీ సైన్యాధిపతి సనత్ ఫోన్సెకాను ఓడించి మరోసారి అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు.

మహింద రాజపక్ష హయాంలో చాలా విధ్వంసాలు, అరాచకాలు చోటుచేసుకున్నాయని, అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన వాటిని చూసీచూడనట్లుగా ముందుకు వెళ్లారని విమర్శకులు చెబుతుంటారు. అయితే, ఈ ఆరోపణలను మహింద రాజపక్ష ఖండించారు.

ముఖ్యంగా ఉత్తర శ్రీలంకలోని తమిళ వేర్పాటువాదులపై మానవ హక్కుల ఉల్లంఘనలను విమర్శకులు ఉదహరిస్తుంటారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, AFP

అయితే, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)కు చెందిన సాయుధులు.. సాధారణ పౌరులపైనా దాడులు చేశారని, అందుకే వారిపై చర్యలు తీసుకున్నామని మహింద రాజపక్ష చెప్పేవారు.

ఇటు తమిళ వేర్పాటువాదులు, అటు శ్రీలంక సైన్యం ఇద్దరూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

ఆయన రెండోసారి పదవీ కాలం కూడా విజయవంతంగా ముగుస్తున్న సమయంలోనే ఆర్థిక మందగమనం వచ్చి పడింది. దీంతో విపక్షాలన్నీ ఏకమై 2015 ఎన్నికల్లో ఆయన్ను ఓడించాయి.

అయితే, 2019నాటి ఈస్టర్ బాంబు దాడుల రూపంలో మహింద రాజపక్షకు మరో అవకాశం లభించింది.

తీవ్రవాదంపై మహింద రాజపక్ష మాత్రమే ఉక్కుపాదం మోపగలరని సింహళ ప్రజలు భావించారు.

ఆ బాంబు దాడుల తర్వాత జరిగిన ఎన్నికల్లో మహింద రాజపక్ష సోదరుడు గొటాబయ రాజపక్షను తమ పార్టీ అధ్యక్షుడిగా ముందుకు తీసుకొచ్చారు.

గోటాబయ రాజపక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోటాబయ రాజపక్ష
లైన్

గొటాబయ రాజపక్ష

లైన్

శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు నందసేన గొటాబయ రాజపక్ష. శ్రీలంక సైన్యంలో ఈయన లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేశారు. సైన్యం నుంచి పదవీ విరమణ తీసుకున్నాక, గొటాబయ 1998లో అమెరికా వెళ్లారు.

2005లో మళ్లీ తన అన్నయ్య మహింద రాజపక్షకు సాయం చేసేందుకు గొటాబయ శ్రీలంకకు వచ్చారు. ఆ ఎన్నికల్లో మహింద రాజపక్ష గెలిచారు. దీంతో గొటాబయకు రక్షణ మంత్రి పదవి దక్కింది.

అలా శ్రీలంక రాజకీయాల్లో అధికారం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం రాజపక్ష కుటుంబం మొదలుపెట్టింది. గొటాబయ నేతృత్వంలో తమిళ వేర్పాటువాదులపై శ్రీలంక సైన్యం పైచేయి సాధించింది.

అయితే, ఎల్‌టీటీఈపై తీసుకున్న సైనిక చర్యలన్నీ వివాదాల మయమే. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు శ్రీలంక ప్రభుత్వం పాల్పడిందని ఐక్యరాజ్యసమితి కూడా నివేదికల్లో వ్యాఖ్యానించింది.

ఈ వివాదాల నడుమ గొటాబయ ముందుకు వెళ్లారు. అయితే, 2015లో విపక్షాలన్నీ ఏకమై రాజపక్ష కుటుంబాన్ని గద్దె దించింది.

2018లో తమ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ విజయం సాధించారు. ఆ తర్వాత ఏడాది జరిగిన దేశ అధ్యక్ష ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో అధ్యక్ష పదవిని ఆయన కైవసం చేసుకున్నారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, SAJID NAZMI

పరిస్థితిని నియంత్రించడంలో విఫలం..

2019 అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ విజయం సాధించడంతో.. ఆ కుటుంబానికి చెందిన మరికొంత మంది సభ్యులు ప్రభుత్వంలోకి అడుగుపెట్టారు.

అయితే, ఏడాది తర్వాత కరోనావైరస్ రూపంలో శ్రీలంక ఆర్థిక వ్యవస్థపై చావు దెబ్బపడింది.

శ్రీలంకను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు చైనా, భారత్ పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. కానీ, 2021 చివరినాటికి పరిస్థితులు చేయిదాటిపోయాయి.

గొటాబయకు దేశంపై పూర్తి పట్టు ఉన్నప్పటికీ విదేశీ అప్పులు విపరీతంగా పెరిగాయి. సామాన్యులపై ఈ ప్రభావం పడింది.

శ్రీలంక

ఫొటో సోర్స్, Reuters

పన్ను మినహాయింపులు, సేంద్రీయ వ్యవసాయం దిశగా అడుగులు లాంటి చర్యలతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది.

ఈ ఏడాది మార్చి 31నాటికి దేశంలో నిరసనలు పెల్లుబికాయి. ఈ ప్రభుత్వం ఇంకెంతకాలమూ నిలబడదని సంకేతాలు అప్పుడే వచ్చాయి.

‘‘గొటా గో హోమ్’’ పేరుతో నిరసనలు జరిగేటప్పటికీ, వాటిని గొటాబయ పెద్దగా పట్టించుకోనేవారు కాదు.

నిరసనలు మరింత పెరగడంతో ప్రధాన మంత్రి పదవికి మహింద రాజపక్షతో గొటాబయ రాజీనామా చేయించారు. మరోవైపు బాసిల్ రాజపక్ష, చమాల్ రాజపక్షలతో కూడా రాజీనామా చేయించారు. కానీ, గొటాబయ రాజపక్ష మాత్రం రాజీనామా చేయలేదు.

బాసిల్ రాజపక్ష

ఫొటో సోర్స్, ISHARA S. KODIKARA/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బాసిల్ రాజపక్ష
లైన్

బాసిల్ రాజపక్ష

లైన్

మహింద, గొటాబయల తమ్ముడు బాసిల్ రాజపక్ష. మహింద రాజపక్ష ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాసిల్ కొనసాగారు.

రెండు నెలల క్రితం శ్రీలంకకు ఆర్థిక సాయం ఇవ్వాలని కోరేందుకు బాసిల్.. భారత్ కూడా వచ్చారు.

1977లోనే ఎంపీగా ఎన్నికల్లో బాసిల్ పోటీచేశారు. కానీ, అప్పుడు ఓటమి చవి చూశారు.

2005లో దేశ అధ్యక్షుడిగా మహింద రాజపక్ష ఎన్నికైన తర్వాత.. బాసిల్‌ను పార్లమెంటుకు నామినేట్ చేశారు. 2010లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బాసిల్ విజయం సాధించారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, Reuters

గత ఏడాది మరోసారి పార్లమెంటుకు బాసిల్‌ను నామినేట్ చేశారు. అప్పుడే ఆయన్ను ఆర్థిక మంత్రిగా నియమించారు. అయితే, అప్పుడే శ్రీలంక ఆర్థిక పరిస్థితి దారుణంగా పతనమైంది.

బాసిల్‌కు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. ఆయనను శ్రీలంక పార్లమెంటు సభ్యుడిగా, మంత్రిగా చేసేందుకు వీలుగా రాజ్యాంగంలోనూ మార్పులు చేశారు.

ఆర్థిక సంక్షోభం నడుమ పార్లమెంటుకు బాసిల్ ముఖం చాటేశారు. మరోవైపు ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి.

2015 ఏప్రిల్‌లో ఓ అవినీతి కేసులో ఆయన అరెస్టు కూడా అయ్యారు. ఇలాంటి అవినీతి ఆరోపణలే ఆయన సోదరులు మహింద, గొటాబయల మీద కూడా వచ్చాయి.

రాజపక్ష కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజపక్ష సోదరులు
లైన్

చమాల్ రాజపక్ష

లైన్

రాజకీయాల్లోకి వచ్చిన రాజపక్ష సోదరుల్లో చమల్ మూడో వారు. సోదరుల ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులను చమాల్‌కు కట్టబెట్టారు.

1989 నుంచి వరుసగా పార్లమెంటు సభ్యుడిగా చమాల్ కొనసాగుతున్నారు. నౌకాయానం, విమానయానం లాంటి కీలక మంత్రి పదవులు ఈయనకు అప్పగించారు.

2010 నుంచి 2015 మధ్య పార్లమెంటుకు స్పీకర్‌గానూ చమాల్ పనిచేశారు. నిజానికి రాజపక్ష సోదరుల్లో చమాల్ పెద్దవారు. మహింద రాజపక్ష ప్రధాన మంత్రిగా కొనసాగినప్పుడు రక్షణ మంత్రి పదవిని చమాల్‌కు అప్పగించారు.

నలుగురు రాజపక్ష సోదరుల తర్వాత ఆ కుటుంబానికి చెందిన ఇతరులు కూడా శ్రీలంక రాజకీయాల్లో వేలు పెట్టేవారు. ఇందులో మహింద రాజపక్ష కుమారుడు నమల్ గురించి చెప్పుకోవాలి. ఆయన శ్రీలంక క్రీడా మంత్రిగా పనిచేశారు.

సంక్షోభం నడుమ నమల్ భార్య లిమినీ తన బిడ్డను పట్టుకుని పారిస్‌కు వెళ్లిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: నిరసనకారుల వశమైన ప్రెసిడెంట్ ప్యాలస్.. అధ్యక్ష భవనానికి పోటెత్తిన జనం

ఈ కుటుంబం భవిష్యత్ ఏమిటి?

కొద్దిరోజుల ముందువరకు రాజపక్ష కుటుంబానికి చెందిన 18 మంది శ్రీలంక రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే, గత వారం నుంచీ తీవ్రమైన నిరసనలు వీరిపై ప్రభావం చూపిస్తున్నాయి.

వీరిలో ఎవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. సురక్షిత ప్రాంతాల్లో వీరు తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తమిళ వేర్పాటువాదులపై విజయం సాధించడంతో సింహళ ప్రజల దృష్టిలో మహింద రాజపక్ష హీరోగా మారారు. ప్రస్తుతం ఆయన్ను ప్రజలు విలన్‌గా చూస్తున్నారు.

గతంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ రాజపక్ష కుటుంబ నాయకులు ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు. కానీ, ఈ సారి వారి మధ్యలో విభేదాలు వచ్చినట్లు కనిపిస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్ష భవనంలో నిరసనకారులు ఏం చేస్తున్నారంటే..

మహింద రాజపక్షను రాజీనామా చేయాలని గొటాబయ సూచించడంతో ఈ విభేదాలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

శ్రీలంక రాజకీయాల్లో ఏళ్లపాటు రాజపక్ష కుటుంబం చక్రం తిప్పిందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో ఈ కుటుంబం పూర్తిగా విఫలమైంది.

ఆర్థిక సంక్షోభం వల్ల ప్రజల ఆగ్రహం మొత్తం రాజపక్ష కుటుంబంవైపు మళ్లింది. ఈ కుటుంబం రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఊహించడం కూడా కష్టమే.

కానీ, రాజకీయాలంటేనే ఊహించని పరిణామాలకు పెట్టింది పేరు. రేపు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)