శ్రీలంక: అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మిలటరీ జెట్‌లో దేశం విడిచి పారిపోయారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మ్యాట్ మర్ఫీ
- హోదా, బీబీసీ న్యూస్
శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతోన్న వేళ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం నుంచి మిలిటరీ జెట్‌లో పారిపోయారు.
ఆయన మాల్దీవులు రాజధాని మాలెకు ఉదయం 3:30 గంటలకు (22:00 జీఎంటీ) చేరుకున్నట్లు తెలుస్తోంది.
73 ఏళ్ల గొటాబయ రాజపక్ష నిష్క్రమణతో దశాబ్దాల పాటు శ్రీలంకలో సాగిన కుటుంబ పాలన ముగిసినట్లు అయింది.
శనివారం ఆయన నివాసాన్ని నిరసనకారులు ముట్టడించే సమయానికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఆయన ఆచూకీ తెలియలేదు.
నిరసనల నేపథ్యంలో జూలై 13న తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన తొలుత హామీ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
గొటాబయ సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్ష కూడా దేశాన్ని విడిచి వెళ్లినట్లు, ఈవిషయంపై స్పష్టత ఉన్న వర్గాలు బీబీసీకి చెప్పాయి. ఆయన అమెరికా వెళ్లనున్నట్లు తెలిసింది.
అధ్యక్షుడు దేశం నుంచి వెళ్లిపోయారనే వార్తలు తెలియడంతో కొలంబోలో ప్రధానంగా నిరసనలు జరుగుతోన్న గాలె ఫేస్ గ్రీన్ ప్రదేశంలో సంబరాలు చేసుకున్నారు.
అధ్యక్షుడి రాజీనామా కోసం ఎదురుచూస్తూ మంగళవారం సాయంత్రం నాటికే వేలాదిమంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు.
రాజపక్ష కుటుంబం రెండు దశాబ్దాల పాటు శ్రీలంక రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించింది. సింహళ బౌద్దుల భారీ మద్దతుతో గొటాబయ రాజపక్ష 2019లో అధ్యక్షుడు అయ్యారు.
గొటాబయ నిష్క్రమణ… ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగం, జీవన వ్యయం పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి వీధుల్లోకి వచ్చిన ప్రజల అద్భుతమైన విజయంగా భావించవచ్చు.
దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు రాజపక్ష పాలనే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కొన్ని నెలలుగా రోజూవారీ విద్యుత్ కోతలు, చమురు, ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసర వస్తువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం తనను అరెస్ట్ చేసే అవకాశాలున్న నేపథ్యంలో, దాన్ని తప్పించుకోవడానికి అధ్యక్ష పదవికి రాజీనామా చేసేకంటే ముందే దేశాన్ని వదిలి పారిపోవాలని గొటాబయ రాజపక్ష నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు.
అధ్యక్షుని నిష్క్రమణతో శ్రీలంకలో రాజకీయ శూన్యత ఏర్పడింది. శ్రీలంకకు ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసే క్రియాశీల ప్రభుత్వం అవసరం.
అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటు గురించి ఇతర పార్టీల నేతలు మాట్లాడుతున్నారు. కానీ, దీనికి అందరూ ఒప్పుకునే సంకేతాలు ఇంకా కనిపించట్లేదు. వారు ముందుకు తెచ్చే ప్రతిపాదనలను ప్రజలు అంగీకరిస్తారా అనే దానిపై కూడా స్పష్టత లేదు.
అక్కడి రాజ్యాంగం ప్రకారం, ఒకవేళ అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఆయన స్థానంలో ప్రధాని రణిల్ విక్రమ సింఘే వ్యహరించాలి. పార్లమెంట్‌లో ప్రధానమంత్రిని అధ్యక్షునికి డిప్యూటీగా పరిగణిస్తారు.
కానీ, విక్రమసింఘేపై కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. శనివారం నిరసనకారులు ఆయన ప్రైవేటు నివాసానికి నిప్పు అంటించారు. అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా రాజీనామా చేస్తానని ప్రధాని ప్రకటించారు. కానీ, తేదీని మాత్రం వెల్లడించలేదు.
రాజ్యాంగ నిపుణుల ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష స్థానాన్ని పార్లమెంట్ స్పీకర్‌తో భర్తీ చేసే అవకాశమే ఎక్కువ.
కానీ, పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేవర్ధన, రాజపక్షలకు మిత్రుడు. దీంతో ప్రజలు ఆయనను అంగీకరిస్తారో లేదో అనేది స్పష్టంగా తెలియదు.
తాత్కాలిక అధ్యక్షునిగా నియమితులయ్యే వారికి, కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించడానికి 30 రోజుల సమయం ఉంటుంది. ఆ ఎన్నికల్లో గెలిచిన వారు 2024 చివర వరకు పదవిలో ఉంటారు.
అధ్యక్ష పదవిపై ఆసక్తి ఉన్నట్లు సోమవారం బీబీసీతో ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస చెప్పారు. కానీ, ఆయనపై కూడా ప్రజలకు విశ్వాసం లేదు.
ఇవి కూడా చదవండి:
- ముస్లింలు ఈ స్కూలు మీద ఒత్తిడి తెచ్చారా... విద్యార్థులు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థన చేయకూడదని చెప్పారా?
- గోదావరి వరదలు: ప్రమాద హెచ్చరికలు అంటే ఏంటి, ఎంత వరద వస్తే వీటిని జారీ చేస్తారు?
- ప్రపంచ జనాభా దినోత్సవం: 'భారత్ జనాభా 2023లో చైనాను మించిపోతుంది' - ఐక్యరాజ్యసమితి
- శ్రీలంక సంక్షోభం లాంటిదే పాకిస్తాన్, నేపాల్ దేశాలలోనూ వస్తే ఏమవుతుంది?
- ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని భారత జట్టులో ఉంచాలా? తీసేయాలా? - గొంతు విప్పుతున్న మాజీ క్రికెటర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












