UFO: అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి? ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ ‘ఏలియన్ స్పేష్ షిప్‌లు’ ఇప్పుడు ఏమయ్యాయి?

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, నికోలస్ బార్బర్
- హోదా, బీబీసీ కల్చర్
అది.. జోర్డాన్ పీలే కొత్త హారర్ ఫిల్మ్ నోప్ ట్రైలర్‌లో కొద్ది క్షణాల పాటే కనిపించింది. అయితే కచ్చితంగా అది దాంట్లో ఉండనే ఉంటుంది. అదే ఫ్లయింగ్ సాసర్. పీలే ఇంతకుముందు తీసిన గెట్ అవుట్, అజ్ సినిమాల్లోని ట్విస్టులు, మలుపులను గమనిస్తే ఆవి నిజమైనవా, నకిలీవా అని నిర్ణయించడం చాలా కష్టం.
అవి నేల నుంచి పైకి ఎగిరాయా, లేదంటే అంతరిక్షం నుంచి కిందికి వచ్చాయా అని చెప్పడం సాధ్యం కాదు. అయితే వాటి నుంచి వచ్చే వెండికాంతి మెరుపులు మాత్రం విభ్రాంతికి గురిచేశాయి.
బహుశా..ఔను బహుశా..నోప్ కూడా కచ్చితంగా ఫ్లయింగ్ సాసర్ మూవీయే కావచ్చు. జనరంజక సంస్కృతి (పాపులర్ కల్చర్) చరిత్రను పరిశీలిస్తే వెన్నులో వణుకు పుట్టంచే ఫ్లయింగ్ సాసర్ సినిమాలకు తగిన స్థానమే ఉంది.
ఫ్లయింగ్ సాసర్ ఆకృతుల రూపకల్పనకు సంబంధించిన చరిత్రా ఘనమైనదే. న్యూ కాజిల్ యూనివర్సిటీలో ఫిల్మ్ విభాగంలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆండ్రూ షెయిల్ దీనిపై మాట్లాడుతూ "1950 దశకం చివరినాటికి ఫ్లయింగ్ సాసర్ ఆకారంలో ఒక స్పష్టత వచ్చింది. ఇతర లోకాల నుంచి వచ్చే వ్యోమ నౌకల ఆకృతికి ఇదొక నమూనాగా మారింది. షార్ట్‌హాండ్‌లో రాసినంత తేలికగా దీన్ని స్వీకరించారు. విజువల్ ఆర్ట్స్‌లో పనిచేసినవారందరికీ ఇది అందుబాటులోకి వచ్చింది" అని వివరించారు.
కుజ గ్రహం, ఆపైన ఉన్న లోకాల నుంచి వచ్చే నిగూఢ పర్యాటకుల కోసం ఈ ఫ్లయింగ్ సాసర్ నమూనాలనే ఉపయోగించారు. లెక్కలేనన్ని సినిమాలు, టీవీ సీరియళ్లు, నవలలు, కామిక్స్, హిట్ రికార్డ్స్ ఉన్న అన్నింటిలోనూ దీన్నే వినియోగించారు.
ఎక్స్-ఫైల్స్ టీవీలో ప్రసారమైన ముల్డర్ నిర్మించిన ఐ వాంట్ టు బిలీవ్ సీరియల్‌లోని పోస్టర్, ప్రఖ్యాతి చెందిన పిల్లల పిక్చర్ బుక్ అయిన ఎలియన్స్ లవ్ అండర్‌పాంట్స్ లోనూ ఈ నమూనానే స్వీకరించారు.
ఈ ఫ్లయింగ్ సాసరే అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ఓ) మూల రూపానికి క్లాసిక్ డిజైన్‌గా గుర్తింపు పొందింది. నిజం చెప్పాలంటే 1950 వరకు దానికి అంతగా ప్రాచుర్యం లభించలేదు. ఆ తరువాతే ప్రపంచం ఫ్లయింగ్ సాసర్ క్రేజ్ లో మునిగిపోయింది.
అంతకు చాలా కాలం ముందే సైన్స్ ఫిక్షన్ చిత్రకారులు గుండ్రని ఆకారంలో ఉండే స్పేస్ క్రాఫ్ట్‌ను గీయడం ప్రారంభించారు. ఫ్లాష్ గార్డన్ 1934లో రూపొందించిన చిత్రంలో తిరుగుతూ కనిపించిన స్క్వాడ్రన్ ఆఫ్ డెడ్లీ స్పేస్-గైరోస్ దీనికి ప్రతిరూపమే.
ఆ కాలంలో ఉన్న స్టార్లింగ్ స్టోరీస్, సూపర్ సైన్స్ స్టోరీస్ వంటి చౌక ధరల మ్యాగజైన్ల పేజీలు తిప్పుతుంటే..20వ శతాబ్దం అర్థభాగం వరకు గ్రహాంతర వాసులు జలాంతర్గాములు, ఎయిర్ షిప్‌ల ఆకారాల్లో కనిపించే వ్యోమ నౌకల్లోనే ప్రయాణించినట్టుగా చిత్రాలు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Universal Studios
పుస్తకాల్లో ఇలాంటి బొమ్మలు ఉండే పరిస్థితి 75 సంవత్సరాల క్రితమే పూర్తిగా మారిపోయింది. 1947 జూన్‌లో తొమ్మిది ఫ్లయింగ్ డిస్క్‌లను చూశానంటూ కమర్షియల్ పైలట్ కెన్నెత్ అర్నాల్డ్ చెప్పిన దగ్గర నుంచే ఆ మార్పు కనిపించింది. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో 1,200 ఎంపీహెచ్ వేగంతో అవి ఎగురుతుండడాన్ని చూశానంటూ ఆయన వెల్లడించారు.
ఆయన చెప్పిన మాటలను నమ్మి ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే ఈస్ట్ ఒరిగానియన్ పత్రిక సంపాదకుడు ఆ సమాచారాన్ని అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ సర్వీస్‌కు పంపించారు. అనంతరం హియర్స్ట్ ఇంటర్నేషనల్ సంస్థ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
విధివశాత్తూ ప్లయింగ్ సాసర్ అనే పదం దాంట్లో చోటు చేసుకుంది.
ఆ వార్తా కథనం ప్రపంచ వ్యాప్యంగా 1,200 ఎంపీహెచ్ కన్నా ఎక్కువ వేగంతోనే వ్యాప్తి చెందింది.
అనంతం ఇలాంటి కథనాలు వందలాదిగా వచ్చాయి. తాము ప్లయింగ్ సాసర్‌లను చూశామని కొందరు చెప్పారు. న్యూ మెక్సికోలోని రోజ్‌వెల్‌లో ఓ ప్లయింగ్ సాసర్ కూలిపోయిందని, దాని శకలాలను చూశామని ఇంకొందరు తెలిపారు.
వీటిలో చాలా వరకు కట్టుకథలే. వాహన చక్రానికి అమర్చే హబ్ క్యాప్, ప్లాస్టిక్ డిస్క్ అయిన ఫ్రిస్బీ, పిజ్జా వంటివి చేతిలో ఉన్నా వాటి సాయంతో ప్లయింగ్ సాసర్ అని భ్రమింపజేసే ఫొటోలు తీయడం పెద్ద కష్టమేమీ కాదు.
"ప్లయింగ్ సాసర్లు అని భ్రమపడినవి కొన్ని నిజానికి వాతావరణాన్ని గమనించే బెలూన్లు. మరికొన్ని జెప్పీలైన్ తరహా విమానాలు, కొన్నిసార్లు మేఘాల ఆకృతి కూడా ఆ విధంగా కనిపించింది. కోల్డ్‌వార్‌లో భాగంగా అమెరికా ఎయిర్ ఫోర్స్ అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక విమానాలు కూడా ఇందులో ఉన్నాయి" అని షెయిల్ వివరించారు.
ఓపెన్ మైండ్‌తో అలోచించాలని అనుకుంటే వాటిలో కొన్నింటిని కుజ గ్రహవాసులు పంపించినవని అనుకోవచ్చు. భూమి మీద జనసంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతంలో నివసించే వారి వినోదం కోసం పంపించి ఉంటారని కూడా భావించవచ్చు. ఒకటి మాత్రం నిజం.. ఇలాంటి ఊహలతో సాసర్ మానియా మొదలయిందన్నది వాస్తవం.
1953లో డొనాల్డ్ హెచ్ మెంజెల్.. ప్లయింగ్ సాసర్స్ పేరుతో రాసిన పుస్తకంలో ఈ హిస్టీరియాపై మూడు వివరణలు ఇచ్చారు.
"మొదటిది ప్లయింగ్ సాసర్స్ అసాధారణమైనవి. మనం సహజంగానే అసాధారణమైనవాటిని మిస్టరీగా భావిస్తుంటాం.
రెండోది మనం ధైర్యం కోల్పొయి నెర్వస్‌గా వ్యవహరిస్తాం. ఆకస్మికంగా ప్రతికూలంగా మారిన ప్రపంచంలో నివసిస్తున్నామని అనుకుంటాం. మనం నియంత్రించలేని బలీయమైన శక్తులు వచ్చేసినట్టు ఊహిస్తాం. మనల్ని నాశనం చేసే యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నామని భయపడుతాం.
మూడోది మరికొందరు ఈ భయాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఉద్వేగం కలిగించే సైన్స్ ఫిక్షన్‌లో ఒక భాగంగా ఉన్నామని భావిస్తుంటారు" అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్లయింగ్ సాసర్‌ల పాపులారిటీకి తెరవెనుక కారణాలు..
నెర్వస్‌గా ఉండడానికి గల పలు కారణాలను కూడా మెంజెల్ వివరించారు. అందులో ఒకటి.. అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపించే మొదటి సూపర్ పవర్ ఎవరు అనే విషయమై అమెరికా, యూఎస్ఎస్ఆర్‌లు పోటీ పడ్డాయి. 1957లో స్పుత్నిక్-1ను స్పేస్‌లో పంపించడం ద్వారా యూఎస్ఎస్ఆర్ ఆ పోటీలో విజయం సాధించింది. ఈ పోటీ ప్రజలపై ప్రభావం చూపించింది.
"అదే సమయంలో ఫ్లయింగ్ సాసర్లపై కూడా అమితాసక్తి పెరిగింది. మానవులు అంతరిక్షంలోకి వెళ్లగలరన్న నమ్మకం కలిగింది" అని కాథరిన్ కాల్డ్రియాన్ చెప్పారు. అతి భయంకరమైన ఫ్లయింగ్ సాసర్ సినిమా ప్లాన్ 9 ఫ్రం అవుటర్ స్పేస్‌కు ఆమె కథ రాశారు. మిట్ నైట్ మూవీస్ మోనాగ్రాఫ్‌ల కథలకు ఇదొక గైడ్ లాంటింది.
"స్పేస్ రేస్‌లాంటి తీవ్రమైన అంశాలను గమనించినప్పుడు మానవుల ఆలోచనలు పలు దిశల్లో తిరుగుతుంటాయి. ప్రస్తుతం వాతావరణ మార్పుల విషయంలోనూ అలాంటి పరిస్థితే ఉంది. మన జీవజాతులు అంతరిస్తాయన్న భావనలు అన్ని రకాల కళల సృష్టకర్తల్లో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే తమ తమ కళలను సృష్టిస్తున్నారు. కనీసం ఫిక్షన్ విభాగంలో ఇది నిజం. అలాంటి భావజాల తరంగాలకు ప్రాధాన్యం పెరగడాన్ని మనం చూస్తున్నాం" అని వివరించారు.
అప్పట్లో అమెరికన్లకు మరికొన్ని భయాలు కూడా ఉండేవి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సోవియట్ యూనియన్ దాడి చేస్తుందన్న భావన ఆందోళన కలిగించేవి. ముఖ్యంగా 1945లో హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబులు వేసినట్టుగా తమ సొంత నగరాల మీదా బాంబులు వేసి ధ్వంసం చేస్తుందన్న అనుమానం ఉండేది.
ఈ భయాల నుంచి బయటపడడానికే ఫ్లయింగ్ సాసర్‌లపై దృష్టి కేంద్రీకరించారని సైన్స్ ఫిక్షన్ రచనల్లో అవార్డులు పొందిన జాక్ వోమాక్ బీబీసీ కల్చర్ కు చెప్పారు.
"ఫ్లయింగ్ సాసర్‌లు మిస్టరీతో కూడినవే కావు, ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించేవి కూడా. అయితే అణు యుద్ధం మాదిరిగా ప్రమాదకరమైనవైతే కాదు" అని అన్నారు.
పాపులర్ కల్చర్‌లో ఫ్లయింగ్ సాసర్‌లు..
ఫ్లయింగ్ సాసర్‌లను చూశామని చెప్పిన వారంతా వాటిని నిజమని నమ్మి తమ జ్ఞాపకాల పేరిట వాటిని అక్షరబద్ధం చేశారు. ఈ రచనల సంకలనాన్ని ఫ్లయింగ్ సాసర్స్ ఆర్ రియల్ పేరుతో వోమెక్ ఓ పుస్తకాన్ని వెలువరించారు.
దోజ్ సెక్సీ సాసర్ పీపుల్, ఫ్లయింగ్ సాసర్స్ అండ్ స్క్రిప్చర్స్, రౌండ్ ట్రిప్ టు హెల్ ఇన్ ఎ ఫ్లయింగ్ సాసర్ వంటి రచనల్లోని భాగాలు ఇందులో ఉన్నాయి.
ఉదాహరణకు 1952లో జార్జ్ డబ్ల్యు వాన్ టాస్సెల్ రాసిన రోడ్ ఇన్ ఫ్లయింగ్ సాసర్ అనే పుస్తకంలోని భాగాలు ఇందులో ఉన్నాయి.
దీనిపై వోమక్ తన అభిప్రాయాన్ని చెబుతూ "తాను నిజంగా ఫ్లయింగ్ సాసర్‌లో ప్రయాణించలేదని ఆయన నిజాయితీగానే అంగీకరించారు. అయితే పుస్తకానికి మంచి మార్కెటబుల్ టైటిల్‌ను ఇచ్చారని అంతరిక్ష విషయాలపై ఆసక్తి ఉన్న స్పేస్ బ్రదర్స్ అందరూ ఏకీభవించారు" అని వివరించారు.
హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే కొన్ని నాన్ ఫిక్షన్ పుస్తకాలకు కూడా ఇలాంటి పేర్లే ఉన్నాయి. శాస్త్రవేత్తలు రాసిన కొన్ని థీసిస్‌లకు కూడా ఇలాంటి పేర్లు ఉండం గమనార్హం.
ఈ పేర్ల వ్యవహారాన్ని స్విస్ సైక్రియాట్రిస్ట్ కార్ల్ జంగ్ 1959లో ఫ్లయింగ్ సాసర్స్; ఎ మోడ్రన్ మిథ్ ఆఫ్ థింగ్స్ సీన్ ఇన్ స్కై పేరుతో ప్రచురించిన పుస్తకంలో ప్రస్తావించారు.
ఈ సమయంలో పాపులర్ కల్చర్ ద్వారా ఫ్లయింగ్ సాసర్లు అన్ని వైపులకూ ఎగిరాయి. అందువల్ల ఈ అంశాలతో కామిక్స్ రచనలు, చిత్రాలు నిండిపోవడం ఆశ్చర్యం కలిగించదు.
1954లో ఈసీ కామిక్స్ సంస్థ వియర్డ్ సైన్స్- ఫాంటసీ పేరుతో వెలువరించిన ప్రత్యేక సంచిక వీటి గురించి చాలా బడాయిగా ప్రచారం చేసుకొంది.
"ఈ సచిత్ర, వాస్తవ ఫ్లయింగ్ సాసర్ నివేదికతో అమెరికా ఎయిర్ ఫోర్స్‌ను ఈసీ సవాలు చేస్తోంది" అంటూ ప్రకటన ఇచ్చింది.
యానిమేషన్ ప్రపంచంలో ఫ్లయింగ్ సాసర్లు రాజ్యమేలాయి.
1948లో చక్ జోన్స్ రూపొందించిన బగ్స్ బన్నీ కార్టూన్ షోలోని హేర్ డెవిల్ హేర్ అనే ఎపిసోడ్‌లో మార్విన్ ద మార్టియన్ అనే పాత్రను సృష్టించారు. బక్ రోజర్స్ తరహా రాకెట్ షిప్‌ను ఉపయోగించినట్టు అందులో ఉంది.
1952లో తీసిన ద హేస్టీ హేర్ ఎపిసోడ్ లో మార్విన్ భూమిపైన ఉన్న బగ్స్ వద్దకు ఫ్లయింగ్ సాసర్‌లో వచ్చినట్టు తీశారు.

ఫొటో సోర్స్, Alamy
టు లిటిల్ మెన్ ఇన్ ఎ ఫ్లయింగ్ సాసర్ పేరుతో ఆర్థర్ పిట్, ఎలైనే వైజ్ రాసిన పాటలోని జాజ్ నెంబర్‌ను 1951లో ఎల్లా ఫిట్జ్‌గెరాల్డ్ రికార్డు చేశారు. మనుషుల్లో ఉన్న అవాంఛనీయ అలవాట్లను ఎత్తిచూపుతూ వ్యంగ్యంగా సాగిన రచన ఇది. లిటిల్ గ్రీన్ మెన్ పాడిన పాటలో వీటిని ప్రస్తావించారు. ఇందులో ఫ్లయింగ్ సాసర్‌లో ప్రయాణానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి.
"డ్యూరింగ్ దెయిర్ మిషన్/ హియర్డ్ ఎ పోలిటీషియన్/ మేకింగ్ స్పీచెస్ ఏజ్ దే ట్రావెల్డ్ బై/ బట్ దే డిపార్టెడ్/ ఫాస్టర్ దేన్ దే స్టార్టెడ్/ బికాజ్ ద హాట్ ఎయిర్ బ్ల్యూ దెమ్ స్కై హై " వంటి లైన్లు ఉన్నాయి. (అనంతరం ఈ పాటను సింప్లిఫై చేసి నర్సరీ స్కూళ్లలో పాడుకొనే కౌంటింగ్ సాంగ్‌గా మార్చారు).
ఎన్ని మాధ్యమాలు ఉన్నప్పటికీ ఫ్లయింగ్ సాసర్లు అంటే పడిచచ్చే వాటిలో సినిమా రంగాన్ని మించిది లేదు.
ఫ్లయింగ్ సాసర్‌లపై తొలిసారిగా 1950లో సినిమా విడుదలయింది. ద ఫ్లయింగ్ సాసర్ పేరుతో తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు. ఇది ఇండిపెండెంట్ థ్రిల్లర్ సినిమా. దీని రచయిత, దర్శకుడు, నిర్మాత మైకెల్ కొనార్డ్. హీరో కూడా ఆయనే.
ఫ్లయింగ్ సాసర్‌లు నిజమే అన్నంత రీతిలో ప్రచారం చేసి, మార్కెటింగ్ చేశారు.
పోస్టర్లలో ముద్రించిన స్లోగన్లలో "అవి ఏమిటి?’’ "అవి ఎక్కడి నుంచి వచ్చాయి?", "ఎగిరే పళ్లేలను మీరెప్పుడైనా చూశారా?" అన్నవి ఉన్నాయి.
ఆ మరుసటి సంవత్సరం 1951లో మంచి ఉద్దేశాలతో తీసిన రెండు సాసర్ క్లాసిక్‌లను హాలీవుడ్ విడుదల చేసింది.
అందులో ఒకటి రాబర్ట్ వైజ్ తీసిన ద డే ద ఎర్త్ స్టుడ్ స్టిల్ అనే సినిమా. ఇందులో ఇతర గ్రహ రాయబారి క్లాటూ (మైకెల్ రెన్నీ) మానవ జాతికి చేసిన హెచ్చరిక ఆసక్తికరంగా ఉంటుంది.
"ప్రశాంతంగా జీవించండి. ఇప్పటి విధానాన్నే కొనసాగించారంటే కనుమరుగయిపోతారు" అని హెచ్చరించడం ఆ సినిమా విశిష్టతను తెలిజేస్తోంది.
ఆయన చాలా స్మూత్‌గా పయనించే కిటికీలు లేని ఫ్లయింగ్ సాసర్‌లో వచ్చాడు. ఈ అంతర్ గ్రహవాసి కనీస జీవన శైలిని అనుసరించాడు. అందులో సాసర్ అనే మాట చాలా ఆఖర్న వినబడుతుంది.
1951లో వచ్చిన మరో క్లాసిక్ హోవర్డ్ హాక్ తీసిన ద థింగ్ ఫ్రం అనదర్ వరల్డ్. ఆర్కిటిక్ మంచు ఖండంలో గ్రహాంతర వ్యోమనౌకను స్వాధీనం చేసుకోవడం ఈ కథ సారాంశం.
జాన్ డబ్య్లూ కేంప్‌బెల్ రాసిన కథ దీనికి ఆధారం. ఈ కథలో స్పేస్ షిప్.. సబ్‌మెరైన్ ఆకారంలో ఉంటుంది. అది 280 అడుగుల పొడవు, 45 అడుగుల వ్యాసంలో ఉంటుంది.
సినిమాలో మాత్రం ఈ వ్యోమ నౌక సాసర్‌లాగానే ఉంటుంది. ఇందులో నుంచి సజీవంగా దొరికిన సిబ్బంది ఒకరు భయంకర మాంసాహారి.
ఈ కథనాంశాల వెనుక ఉన్న కారణాలను ఏలియన్ ఇన్వేషన్స్!- ద హిస్టరీ ఆఫ్ ఏలియన్స్ ఇన్ పాప్ కల్చర్ అనే పుస్తకంలో మైఖెల్ స్టెయిన్ వివరించారు.
ఆయన అభిప్రాయం ప్రకారం "ఒక విధంగా అమెరికా సమాజంలో అంతర్గతంగా ఉన్న మృత్యు భయాన్ని ప్రతి సినిమాలోనూ జొప్పించారు. ఒక సినిమాలో భయంకరమైన దాడులపై ఉన్న భయాలను, మరో దాంట్లో ప్రపంచ విధ్వంసం గురించి ఉన్న పీడకలలను వివరించారు" అని పేర్కొన్నారు.
భూగోళంపై కనిపించే ఉగ్రవాదానికి మారుగా ఫ్లయింగ్ సాసర్ ల వల్ల కలిగే భయాలను తరచూ చూపించడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Alamy
నోప్ సినిమాలోనూ అలాంటి ఆసక్తికరమైన విశేషాలు ఉండే అవకాశం ఉంది.
ఇంతవరకు పీలే చేసే హారర్ సినిమాలన్నీ ఉదార స్వభావంతో ఉన్నవే. సామాజిక రుగ్మతలపై వ్యాఖ్యానాలు లాంటివి. ప్రధానంగా బ్లాక్ అమెరికన్స్ ఎదుర్కొంటున్న జాతి వివక్షఫై దృష్టి కేంద్రీకరించినవే.
నోప్ సినిమాలోనూ ఇదే వైఖరి కొనసాగుతుందా? దీనిపై రౌట్‌లెడ్జ్ ఫిల్మ్ గైడ్ బుక్ టు సైన్స్ ఫిక్షన్ అనే పుస్తక రచయిత మార్క్ బౌల్డ్ స్పందిస్తూ "యూఎఫ్‌వోపై సినిమా తీయాలని పీలే అనుకోవడం ఆశ్చర్యకరం కలిగించలేదు. ఎందుకంటే ప్లయింగ్ సాసర్ కథల్లో ఎల్లప్పుడూ జాతికి సంబంధించిన అంశాలు ఉంటాయి. గ్రహాంతరవాసులు వచ్చి అపహరించుకొని తీసుకుపోవడాలు వంటి సంఘటనలు ఉంటాయి. 1940 చివరి సంవత్సరాల్లో అతిశయోక్తులతో గ్రహాంతరవాసులను అధికంగా శ్వేత జాతీయులుగానే చూపించారు.
ఆఫ్రికన్ అమెరికన్లను అపహరణకు గురయినవారి సంతతిగా పేర్కొన్నారు. శ్వేత గ్రహాంతరవాసుల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి వారు బాధితులుగా మిగిలారు. ఎంతో దూరం నుంచి ఆకస్మికంగా వచ్చి వారిని ఎత్తుకొని పోవడాన్ని చూపించారు. ఈ చారిత్రక ఘర్షణలను ఆఫ్రికన్-అమెరికన్ సైన్స్ ఫిక్షన్, ఆఫ్రోఫ్యూచరిజం కథాంశాలు తరచూ చూపిస్తుంటాయి. ఈ భావనలతో తల్లిపేగు వంటి సంబంధం కలిగి ఉందనేందుకు నోప్ కూడా తాజా ఉదాహరణ కావచ్చు" అని వివరించారు.
ఫ్లయింగ్ సాసర్ మానియాకు ముగింపు
మళ్లీ 1950 దశకానికి వెళ్తే... ఫ్లయింగ్ సాసర్ సినిమాలన్నీ సాంఘిక-రాజకీయ అంశాలపై లోతైన అవగాహనతో తీసినవి కావు. ఉదాహరణకు డెవిల్ గర్ల్ ఫ్రం మార్స్ (1954), దిస్ ఐలాండ్ ఎర్త్ (1955), ఫర్బిడెన్ ప్లానెట్ (1956), ఇన్‌వేజన్ ఆఫ్ సాసర్ మెన్ (1957), ద అటామిక్ సబ్‌మెరైన్ (1959) వంటి సినిమాలు ఇలాంటివే.
రే హారీహౌసెన్ రూపొందించిన విలక్షణ అద్భుత స్టాప్ మోషన్ యానిమేషన్ చిత్రం రే హారీహౌసెన్ తీసిన ఎర్త్ వర్సెస్ ఫ్లయింగ్ సాసర్స్ (1956) ఇలాంటిదే. ఇదొక గొప్ప సినిమాగా గుర్తింపు పొందింది.
ఇంతలా కాకపోయినా ప్లాన్ 9 ఫ్రం అవుటర్ స్పేస్ (1957) కూడా మంచి సినిమాయే.

ఫొటో సోర్స్, Alamy
ఈ సినిమాల్లో కామన్ గా ఉన్నది ఏమిటంటే.. అదే సాసర్. సినీ నిర్మాతల దృష్టి కోణంలో చూస్తే ఈ ఐకానిక్ స్పేస్ క్రాఫ్ట్ దేవుడు పంపించిన వాహనం లాంటిది. దీన్ని సులువుగా నిర్మించగలగడం, చిత్రీకరించడానికి అనువుగా ఉండడమే ఇందుకు కారణం.
సంప్రదాయ రాకెట్ల మాదిరిగా కాకుండా ఇది ఎటువైపు అయినా తిరుగుతుంది. ఇది దిశను మార్చుకుంటున్నట్టు ప్రత్యేకంగా చూపించాల్సిన పనిలేదు. ఇది అత్యద్భుతంగా కనిపిస్తుంది కూడా.
దీనిపై బీబీసీ కల్చర్‌తో బౌల్డ్ మాట్లాడుతూ "ఫ్లయింగ్ సాసర్ డిజైన్ లోని గొప్పతనం ఏమిటంటే అది చాలా సింపుల్‌గా ప్రస్తుతం ఉన్న రూపాలకు అతీతంగా ఉంటుంది. దాని సౌష్టవం, స్వరూపాన్ని చూస్తే నిత్యం కనిపించేదిగా ఉండదు. విమానంలో ఉండే రెక్కలు, ఇంజిన్లు వంటివి లేవు.
ఇది సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన మానవ నిర్మిత యంత్రమే కాదు.. అద్భుతమైన అత్యాధునిక పరిజ్ఞానం కలిగినది కూడా. అభ్యుదయం అనే విషయమై రూపొందిన పాశ్చాత్య పౌరాణిక గాధల్లాంటి కథనాల్లో వీటికి అత్యంత ఉన్నతమైన స్థానం ఉంటుంది" అని వివరించారు.
సాసర్లు సంపూర్ణంగా మరో ప్రపంచానికి సంబంధించినవేమీ కాదు. వంపుగా ఉంటూ మెరిసిపోయే దాని ఉపరితలం, దాని కింద కనిపించకుండా ఉండే సంక్షిష్టంగా ఉండే అన్ని రకాల వైర్లు, వాల్వులు రెండో ప్రపంచ యుద్ధం అనంతరం తయారు చేసిన చాలా ఉపకరణాల మాదిరిగా ఉన్నట్టు అనిపించాయి. చాలా ఫ్యాషన్‌గా ఉండే కార్లు, ఓవెన్‌లు, వాషింగ్ మిషన్లలోని భాగాల మాదిరిగా ఉండేవి.
ఆటం బాంబులతో పాటు సైనిక అవసరాల కోసం ఇతర రహస్య పరికరాలను రూపొందించిన కాలంలోనే ఫ్లయింగ్ సాసర్‌లు కూడా వచ్చాయి. ఇంట్లో ఉపయోగించే వస్తువుల తయారీలోనూ సాంకేతిక పరిజ్ఞానం వెల్లువలా వచ్చింది. ఆ వినియోగ వస్తువుల్లోని అంతర్గత సాంకేతిక పరిజ్ఞానం, వాటి పనివిధానం సాధారణ గృహస్తులకు మిస్టరీగానే ఉండిపోయింది. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ఫ్లయింగ్ సాసర్లు రహస్యం, అత్యాధునికత అనే రెండు లక్షణాలును కలిగి ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకే అవి అమెరికా ఆకాశాన్ని ఏలాయి" అని బౌల్డ్ బీబీసీ కల్చర్‌కు వివరించారు.

ఫొటో సోర్స్, Alamy
ఫ్లయింగ్ సాసర్ల ప్రయాణం ఎంతో కాలం సాగలేదు. 1950ల దశకం ముగిసే సమయానికే సాసర్-మానియా తగ్గిపోయింది. వాటిని చూశామని చెప్పే వారి సంఖ్య పడిపోయింది. వెండి తెరపైనా కనిపించడం తగ్గింది.
రేషనల్ ఫియర్స్ - అమెరికన్ హారర్ జెనర్ ఇన్ ద 1950స్ అనే పుస్తకాన్ని రాసిన మార్క్ జంకోవిక్ దీనిపై మాట్లాడుతూ "ఫ్లయింగ్ సాసర్ సినిమాల విషయానికి వస్తే సీరియస్ ఫిల్మ్‌ల కన్నా హారర్ సినిమాలు బాగా ఆడాయి. హారర్ సినిమాలను చాలా తక్కువ ఖర్చుతోనే తీయవచ్చు. సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాలను చీప్, లో బడ్జెట్ సినిమాలుగా మార్కెట్‌లో గుర్తింపు పొందాయి. 1950 ప్రాంతాల్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో భారీ హిట్ సాధించినవి గ్రహాంతరవాసుల దాడికి సంబంధించిన మూవీలు కావని స్టుడియోలు కూడా గుర్తించాయి. డిస్నీకి చెందిన 20,000 లీగ్స్ అండర్ ద సీ అనే సినిమా ఆ ఘనతను సాధించింది.
అనంతరం కూడా ఈ విజయ పరంపర కొనసాగడాన్ని మీరు గమనించవచ్చు. ద టైం మెషీన్, ద కర్స్ ఆఫ్ ఫ్రాంకెన్‌స్టెయిన్, ద లాస్ట్ వరల్డ్ (దాంట్లో క్లాటూ అంటే మైఖెల్ రెన్నీ నటించారు) వంటివి ఉన్నాయి.
విక్టోరియన్ కాలపు సెట్టింగ్‌లతో నిర్మించిన గోథిక్ హారర్ సినిమాలు గౌరవప్రదమైనవని గుర్తింపు పొందాయి. 1950ల్లో ఫ్లయింగ్ సాసర్ సినిమాల మార్కెట్ దిగజారడం ప్రారంభమయింది" అని వివరించారు.
21 ఏళ్లపాటు సాగిన అమెరికా అధ్యయనంలో ఏం తేలింది?
ఇక వాస్తవ ప్రపంచంలోకి వస్తే 1961లో యూరీ గగారిన్ భూ కక్ష్యలోకి వెళ్లారు. అప్పుడే అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ ప్రకటన చేస్తూ "చంద్రునిపై మనిషి కాలు పెట్టడం.. అక్కడి నుంచి అతడు క్షేమంగా భూమిపైకి తిరిగి రావడమే లక్ష్యం" అని ప్రకటించారు.
కళ్లముందు జరిగిన అంతరిక్ష ప్రయాణం చాలా ఆశ్చర్యం కలిగించింది. దానితో పోల్చితే ఫ్లయింగ్ సాసర్లు చాలా తమాషాగా కనిపించాయి.
ఫ్లయింగ్ సాసర్లు కనిపించాయన్న సంఘటనలపై ఎట్టకేలకు 1969లో యూఎస్ ఎయిర్ ఫోర్స్ తాను చేపట్టిన సర్వేకు స్వస్తి పలికింది. ప్రాజెక్టు బ్లూ బుక్ పేరుతో చేపట్టిన ఈ అధ్యయనాన్ని ముగించింది. ఎ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ పేరుతో ప్రచురణను వెలువరించింది.
దీనికి ఆశ్చర్యకరమైన ముగింపు ఇచ్చింది. "21 ఏళ్లపాటు యూఎఫ్వోలపై చేసిన అధ్యయనంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించే సమాచారమేదీ లభించలేదు" అని పేర్కొంది.
1960 తరువాత కూడా యూఎఫ్‌వోలను చూశామంటూ చాలా మంది చెబుతునే వచ్చారు.
అంతెందుకు, ఇటీవల మే నెలలోనూ దీనిపై అమెరికన్ కాంగ్రెస్ బహిరంగంగా విచారణ జరిపింది.
వీటిని ప్రస్తుతం యూఏపీ- అన్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఏరియల్ ఫినామినాగా వ్యవహరిస్తున్నారు.
భూమితో సంబంధం లేని వస్తువేదీ ఇతర ప్రాంతాల నుంచి రావడాన్ని మిలటరీ గుర్తించలేదని నావల్ నిఘా విభాగం డిప్యూటీ డైరెక్టర్ స్కాట్ బ్రే ఆ కమిటీ ఎదుట సాక్ష్యం ఇచ్చారు.
నిజానికి పాపులర్ కల్చర్ సినిమాలోనూ ఫ్లయింగ్ సాసర్లు ఎక్కడికో ఎగిరి వెళ్లినట్టు ఎప్పుడూ చూపించలేదు కదా అని మీరు వాదించవచ్చు.
ఇండిపెండెన్స్ డే, డిస్ట్రిక్ట్స్ 9 సినిమాల్లో సూపర్ సైజ్ ఫ్లయింగ్ సాసర్, మదర్‌షిప్‌లను మీరు చూడవచ్చు.
దాన్ని కొంచం తిప్పి పరిశీలిస్తే అరైవల్ సినిమాలో అస్పష్టంగా గోచరించే ఏక శిల ఉంటుంది.
స్టార్ వార్స్‌లో మిలీనియమ్ ఫాల్కన్ అనే ఫ్లయింగ్ సాసర్ కనిపిస్తుంది. ముందుకు కొన్ని అదనపు కొనల్లాంటి భాగాలు ఉండడం దీని ప్రత్యేకత.
స్టార్ ట్రెక్ సినిమా కోసం యూఎస్ఎస్ ఎంటర్‌ప్రైజ్ మరో తరహా ఫ్లయింగ్ సాసర్‌ను రూపొందించింది. దాని వెనుకభాగంలో కాళ్లు ఉండడం విశేషం.
అయితే పాత పద్ధతుల్లో మాదిరిగా ఎలాంటి అలంకారాలు లేని ఫ్లయింగ్ సాసర్లు కనిపించడం అరుదయిపోయింది. అది సినిమాల్లో అయనా, ఆకాశంలో అయినా.
"ఇలాంటి వేలం వెర్రి విధానాలు ఎలా మాసిపోతాయో ఫ్లయింగ్ సాసర్‌లు కూడా ఇప్పుడు వాటి ఒరిజనల్ విధానంలో లేవు. వాటి నుంచి చాలా దూరం జరిగాయి" అని వోమక్ చెప్పారు.
ఇప్పుడు ఫ్లయింగ్ సాసర్లు 1950 కాలం నాటి అమెరికాకు చెందిన విశిష్ట వస్తువులుగానే మిగిలిపోయింది. రోడ్డు పక్కన ఉండే హోటళ్ల లో ఉండే అందమైన ఫ్లోరింగ్ రూపంలో దర్శనమిస్తున్నాయి. వాహనాలకు ఉండే గ్యాస్- గజ్లింగ్ కన్వర్టబుల్ లకు టెయిల్ ఫిన్‌లుగా మారిపోయాయి.
ప్రస్తుతం నిర్మిస్తున్న బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనూ వాటిని ఇంకా ఉపయోగిస్తున్నారంటే వాటికి ఉన్న ప్రాచీనతే ఒక కారణం. మెన్ ఇన్ బ్లాక్, టిమ్ బర్టన్ నిర్మించిన మార్స్ అటాక్స్‌లో దీనిని ఉపయోగించారు.
అందువల్లనే జోర్డన్ పీలే కూడా వాటిని ఉపయోగించి ఉంటారు. అమెరికాలో జరిగిన అన్యాయాలపై ఆయన సెన్సిటివ్‌గా ఉంటారు మరి. ఒకప్పడు ఫ్లయింగ్ సాసర్లు అంటే భవిష్యత్తుపై భయం కలిగించేవి. ఇప్పుడు మాత్రం సాంత్వన కలిగించిన గత కాలానికి ఒక అవశేషంగా మిగిలిపోయింది.
నోప్ జులై 22న యూఎస్‌లో, ఆగస్టు 12 యూకేలో విడుదలవుతుంది.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- ద్వారక: సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరం కోసం అన్వేషణ. దొరికిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల బరువైన అతిపెద్ద బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- రాణి రుద్రమ దేవి వారసుడు ఈయనేనా, ఇన్నాళ్లూ ఎక్కడున్నారు
- ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- క్యాన్సర్ ఉన్నట్లు గోళ్ల మీద కనిపించే రంగులు, మచ్చలు కూడా చెప్పగలవా, నిపుణులు ఏమంటున్నారు?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
- దిల్లీలో అమెరికన్ యువతి కిడ్నాప్ డ్రామా.. వీడియోకాల్‌కు వాడిన వైఫైను ట్రాక్ చేసి పట్టుకున్న పోలీసులు
- ఈ ఇస్లామిక్ రిపబ్లిక్లో మహిళలు హిజాబ్‌ను నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కుతున్నారు, వీడియో తీసి ఆన్లైన్లో పెడుతున్నారు
- ‘ప్రభుత్వ కార్యక్రమంలో హిందూమత పూజలు ఎందుకు చేయిస్తున్నారు? పూజారి ఉంటే.. ఫాదర్, ఇమామ్ ఎక్కడ?’ - భూమి పూజను ఆపించిన డీఎంకే ఎంపీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















