దిల్లీలో అమెరికన్ యువతి కిడ్నాప్ డ్రామా.. వీడియోకాల్‌కు వాడిన వైఫైను ట్రాక్ చేసి పట్టుకున్న పోలీసులు

ఇండియా గేట్

ఫొటో సోర్స్, Getty Images

కిడ్నాప్ పేరుతో పోలీసులను తప్పు దారి పట్టించిన అమెరికా అమ్మాయిని అరెస్టు చేశారు.

భారత్‌లో ఉన్న ఓ 27 ఏళ్ల అమెరికా అమ్మాయి, డబ్బుల కోసం తల్లిదండ్రులను కిడ్నాప్ నాటకంతో బ్లాక్‌మెయిల్ చేసిందని దిల్లీ పోలీసులు తెలిపారు.

స్థానిక మీడియా, పోలీసుల కథనాల ప్రకారం...

అమెరికాకు చెందిన ఆ అమ్మాయి మే నెల 3వ తేదీన భారత్‌కు వచ్చింది. ఆ తరువాత జులై 7న తల్లికి ఫోన్ చేసిన, తనను ఎవరో కిడ్నాప్ చేసి కొడుతున్నారని చెప్పింది.

అంతేకాకుండా తాను అసురక్షితమైన ప్రాంతంలో ఉన్నానని, శారీరకంగా మానసికంగా వేధింపులు ఎదుర్కొంటున్నానని తల్లిదండ్రులకు ఇ-మెయిల్ కూడా పంపించింది.

దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు దిల్లీలోని అమెరికా ఎంబసీని సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును దిల్లీ పోలీసులకు పంపించింది ఎంబసీ.

తాడుతో కట్టేసిన అమ్మాయి చేతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆ అమ్మాయి డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తేలిందని దిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు

ఆ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. ఇ-మెయిల్ పంపిన ఐపీ అడ్రెస్‌ను వారు ట్రాక్ చేశారు. అలాగే జులై 10న తల్లికి ఆ అమ్మాయి వీడియో కాల్ చేసినట్లు గుర్తించారు.

ఇ-మెయిల్ పంపిన ఐపీ అడ్రెస్‌కు సంబంధించిన చిరునామా నకిలీదని పోలీసుల విచారణలో తేలింది. ఆ తరువాత వీడియో కాల్ చేయడానికి ఆ అమ్మాయి వినియోగించిన వైఫై, మొబైల్ నెంబర్ మీద వారు నిఘా పెట్టారు.

ఇలా 31 ఏళ్ల నైజీరియా పౌరున్ని గురుగ్రామ్‌లో అరెస్టు చేశారు. నోయిడాలోని ఒక అపార్ట్‌మెంటులో ఆ అమ్మాయి ఉంటున్నట్లు పోలీసుల విచారణలో నైజీరియా వ్యక్తి చెప్పాడు.

అక్కడకు వెళ్లి ఆ అమ్మాయిని పోలీసులు రెస్క్యూ చేశారు. ఆ తరువాత జరిపిన విచారణలో ఆ అమ్మాయి డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తేలిందని దిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అమృత గుగ్లోత్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు.

అమెరికాకు చెందిన ఆ అమ్మాయికి, నైజీరియాకు చెందిన ఆ అబ్బాయికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఉంది. ఇండియాకు వచ్చిన నాటి నుంచి ఆ అమ్మాయి, నైజీరియా అబ్బాయితో ఉంటోంది.

తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో ఇలా కిడ్నాప్ డ్రామా ఆడారు.

వారి ఇద్దరి పాస్‌పోర్టుల కాలపరిమితి ముగిసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు.

వీడియో క్యాప్షన్, బ్రిటన్‌లో ఎర్ర ఉడతల మనుగడ కోసం గ్రే ఉడతలకు గర్భనిరోధక ప్రణాళిక...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)